మనం చుట్టూ చూసే ప్రపంచం వాస్తవం. 

అది అతి సుందరమైనది అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. 

ప్రపంచంలో కనిపించే ప్రతి ఆకృతి కూడా భగవంతుడిదే. 

భగవంతుడే సర్వస్వం అయినప్పుడు, ఆ భగవంతుడు మన వాడు అయినప్పుడు మనకు తగనిది అంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో. 

లోకంలో మంచివి చెడ్డవి అని ఉండవు. 

కొన్ని మనకు అనుకూలం, కొన్ని అననుకూలం అనేది కూడా ఎప్పుడు ఉండదు. 

హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి బాగా చదువుతున్నావని తెలుస్తుంది, ఏమి చదివావు చెప్పు అని అడిగాడు. 

ఏమి చెప్పమంటావు నాన్నా అని అడిగాడు. 

మనం పరిపాలకులం కదా మనకు మిత్రువులు శత్రువులు ఎవరు, వారితో ఎట్లా ప్రవర్తించాలో చెప్పు అని అడిగాడు హిరణ్యకశపుడు. 

అదేం ప్రశ్న, మీరు వేసిన ప్రశ్న తప్పు అని అన్నాడు ప్రహ్లాదుడు. 

నేను చదువుకున్న వేదాల్లో భగవంతుడు "సర్వభూతాత్మకే జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే"  అని ఉంది, అప్పుడు "మిత్ర అమిత్ర కథాకుతః తాతా" తగినవారు తగనివారు ఉంటారా, అని ప్రశ్న తప్పు అని  సమాధానం ఇచ్చాడు. 

భగవంతుడు "సర్వభూతాత్మకే" కనిపించే సత్తాకల వస్తువులన్నింటినీ, అంటే ఒక దేహాన్ని ధరించి సత్తా కలిగిన వస్తువులని భూతములు అంటారు, అట్లాంటి భూతములలో వ్యాపించి ఉంటాడు. 

ఇది భగవంతుడిలోని ఒక లక్షణం. 

అట్లా వ్యాపించడమే కాక "జగన్నాథే" ఈ జగత్తు అంతా నా సొత్తు అని అనుకోగల వాడు. 

ఎక్కడో ఒక చోట ఉండి లోకాన్ని నియమించడు, "జగన్మయే" జగత్తు అంతా తానే అయ్యి ఉంటాడు. 

అలా ఉండి ఏం చేస్తాడు ?

 "పరమాత్మని" అందరిలో ఉండి నడిపించ జాలినవాడు.

 ఏ వస్తువు అయినా ఆయా ఆకారంలో ఉంది అంటే ఆయన అందులో ఉన్నాడు కనుక.

 అయితే అంత గొప్పవాడు మనకు అందడేమో అనే సందేహం లేదు, కనుక "గోవిందే" నీ మాటలతో నీకు వీలైనట్టు పలికితే అందగలడు. 

అందుకే పరమాత్మకు "శబ్దతిగః శబ్దసహః" అని పేర్లు, శబ్దాలకు అందని వాడు. 

శబ్దాలకు అందేవాడు. 

అంటే నేను అన్ని శాస్త్రములను చదువుకున్నాను అని అనుకొనే బ్రహ్మాది దేవతలు భగవంతుడు ఇంత అని చెప్పలేరు.

 ఆయన గురించి ఎంత చెప్పినా సముద్రపు నీటి బొట్టు అంత మాత్రమే. 

అయితే ఇంతటి వాణ్ణి మనం ఏం చెప్పగలం అని అనుకోకుండా, అతి సామాన్యులు ఏ శబ్దంతో పిలిచినా దాన్ని తనది చేసుకొని రాగలిగినవాడు ఆయన. 

ఏనుగు ఒకనాడు అరచింది, ఆయన రక్షించాడు అని చరిత్ర చెబుతుంది. 

ఏనుగు ఏమని పిలవగలదు, నన్ను రక్షించ గలిగినవాడేవడో రక్షించాలి అని ఘీంకరించి ఉంటుంది. 

ఆ శబ్దానికి కూడా లోంగి కాపాడ గలిగినవాడు. 

ధ్రౌపతి పిలిస్తే రక్షించలేదా, విశ్వాసంతో పిలిచిన వాడి పిలుపు శాస్త్రీయంగా ఉందాలేదా అని చూడడు. 

అట్లా భగవంతుడు ఎంత గొప్పవాడో అంత సులభుడు కూడా. అట్లాంటి భగవంతుడు అంతటా ఉండగా "మిత్ర అమిత్ర కథాకుతః" పరస్పర విరుద్ద ధర్మాలు కల వస్తువులు ఒక వద్ద ఉండి సహకరించుకోవడం కొత్త విషయం కాదు. 

అతి కటినమైన ధంతముల మధ్య అతి సున్నితమైన నాలుక సహ జీవనం సాగించడం లేదా ? 

అన్నింటిని నియంత్రించేది ఒకడే అయినప్పుడు, లోకంలో కొందరిని మిత్రులని కొందరు శత్రువులని భావించడం తప్పు, మీరు వేసిన ప్రశ్నే తప్పు అని ప్రహ్లాదుడు చెప్పాడు.



          భగవత్ సృష్టిలో చేరిన ప్రతి వస్తువు మంచిదే.

 ఏ వస్తువు ఏ స్థానంలో ఉండాలో ఆ క్రమంలో ఉంటే ఎట్లాంటి తప్పు లేదు. 

అంతకు మించిన సుందరమైనది లేదు. 

ప్రపంచం అతి సుందరమైనది. 

మనకు కావల్సింది అట్లా దర్శించ గలిగిన కన్నులు.

అట్లా దర్శించే రీతిలో దర్శిస్తే దాన్ని సుందరమైన నేత్రము అని అంటారు. 

భగవంతుడు మనకు మంచి నేత్రములిచ్చాడు, కానీ దాన్ని వాడుకోగలిగే అలవాటు కావాలి. 

అయితే వాడటం నేర్పే మహనీయులు కావాలి. 

అట్లా నేర్పడం కోసం అవతరించిన మహనీయులే భగవద్రామానుజులు. 

చాలా మందికి ఆ వస్తువులని ఎట్లా చూడాలో చేతకాలేదు. 

ఈ ప్రపంచంలో అన్నీ వ్యావహారికములే తప్ప పారమార్దికంగా ఏమి ఉండవు అని చెప్పారు.

 కొన్ని పనికి వస్తాయి కొన్ని పనికి రావు అని భావించారు. 

ఏం చేస్తాం కొందరికి అట్లా అనిపించింది. 

కానీ భగవద్రామానుజులవారు ప్రపంచంలో ప్రతి వస్తువు సుందరమైనది, కారణం అన్నింటా ఉన్నది ఆయనే అయితే, అన్నీ ఆయనవే అయినప్పుడు తగనివి అంటూ ఏమి ఉండవు అని చెప్పారు.


          ఒక వ్యక్తి మీద ప్రేమ కలిగితే, ఆ వ్యక్తి యొక్క ఒక భాగాన్నే ప్రేమిస్తామా ? 

వ్యక్తిని సమగ్రంగానే ప్రేమిస్తాం.

 తెలియక ధనుర్దాసు అనే వ్యక్తి తన భార్య నేత్రాలను ప్రేమించేవాడు. 

రామానుజుల వారి కాలంలో ధనుర్దాసు అనే మల్ల యోధుడు ఉండేవాడు. 

ఆయనకి తన భార్య అంటే వల్లమానిన ప్రేమ.

 శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందులో అక వ్యక్తి తనతో పాటు నడిచే ఒక స్త్రీకి గొడుగు పట్టుకొని నడుస్తున్నాడు. 

అది చూసి అందరూ ఆక్షేపించుకుంటున్నారు. 

రామానుజులవారు అది చూసారు. 

రామానుజులవారు ఆ ధనుర్దాసుని తన వద్దకు పిలిపించుకున్నారు. 

అందరు ఆక్షేపిస్తున్నారు, ఎందుకలా చేస్తున్నావు అని అడిగారు రామానుజులవారు. 

అందుకు ఆయన నేను ప్రేమిస్తున్న వ్యక్తి కోసం ఎవ్వరు ఏమి అనుకుంటున్నా నేను లెక్క చేయను అని చెప్పారు. 

అయితే ఆమెను ఏమి చూసి ప్రేమిస్తున్నావు అని అడిగారు. 

నా భార్య నేత్ర సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఈ లోకంలో లేదు, అందుకే ఎండ పడకుండా కాపాడుకుంటున్నాను అని చెప్పాడు.  

లోకంలో ప్రేమలు ప్రదర్శించేవారు చాలామంది ఉంటారు, అది కేవలం మాటల వరకే పరిమితం కాక, చేతల వరకు తటస్తిస్తుందా ఎక్కడైన ? 

ఒక పోప్ గారికి అనారోగ్యం ఏర్పడిందట, వారి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. 

అయితే ఊర్లో వారందరూ మేం పోప్ గారికి మూత్రపిండాలను ఇస్తాం అంటూ వచ్చారట. 

అయితే పోప్ గారు అందరినీ తృప్తి పరచలేరు, ఎవరో ఒక్కరివి చాలు. 

అందుకే అక్కడే భవనం పై నుండి ఒక ఈకను విసిరారట, అది ఎవరిపై పడితే వారి మూత్రపిండాలను తీసుకుందాం అని.

ఆ విసిరిన ఈక తమపై పడుతుందేమోనని అందరూ ఊదడం మొదలు పెట్టారట. 

చివరికి వచ్చే సరికి అట్లా ఉంటాయి మనం లోకంలో చూసే ప్రేమలు. 

రామచంద్రుడు తిరిగి రావడంలేదు అని తెలిసిన ఉత్తర క్షణంలో ధశరథులవారు ప్రాణం విడిచారు. 

అసలు ప్రేమ అంటే అట్లా ఉండాలి, సూర్యుడికి ఎండకు ఉన్న సంబంధం వలె. 

తను ప్రేమించినదానికి సర్వాత్మనా అంకితమై ఉండగలగడం గొప్ప విషయం కదా. 

రామానుజుల వారికి చాలా సంతోషం అయ్యింది. 

అయితే రేపు ఒకరి నేత్రాలను చూపిస్తాను రమ్మని చెప్పి పంపారు రామానుజులవారు. 

మరునాడు శ్రీరంగనాథుని నేత్రాలను ధనుర్దాసుకి చూపించారు రామానుజులవారు. 

రంగనాథుని నేత్రాలను ఒక్క సారి దర్శించిన ధనుర్దాసుకి లోకంలో అంతకు మించిన సౌందర్యం మరొకటి లేదు అని గుర్తించి, సదా ధనుర్దాసు దంపతులు రంగనాథుని సేవలో జీవితాన్ని సుకృతం చేసుకోగలిగారు. 

అట్లా దర్శింపజేయగలిగిన మహనీయులు మన భగవద్రామానుజులు. 

వారి అనుగ్రహం మనపై పడింది అంటే మనం తరించామనే లెక్క.





- స్వస్తీ..