నాగలి లేనిదే పని జరగదు.
రైతు లేనిదే పూట గడవదు.
అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి.
“ ఏరువాక సాగారో రన్నో చిన్ననా...
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...”
ఈ పాట తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు, కానీ ఈ పాటలో “ ఏరువాక” అనే పదానికి అర్ధం చాల మందికి తెలియకపోవచ్చు...
“ఏరు” అంటే... ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి.
“ ఏరువాక”... అంటే దుక్కి దున్నుట ప్రారంభం.
అంటే వ్యవసాయ ప్రారంభం.
పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది.
ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానదేశం.
అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు.. ఇక్కడి రైతాంగం.
దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి, భూమాత.
అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కి దున్నడం రైతన్నకి బాధాకరమైన విషయమే అయినా ,
బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా!
అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు, భూపూజ చేసి, ఆ తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండగే
ఈ “ఏరువాక పున్నమి ” పండుగ....
తొలిసారిగా భూక్షేత్రం లో నాగలిని కదల్చడానికి ముందు భూ పూజ చేయాలనీ ఋగ్వేదం వివరిస్తుంది.
ఆ భూపూజ కూడా, " జ్యేష్ట పౌర్ణమి" నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం.
వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి.
ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు.
భూమి మెత్తబడకా మానదు.
అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట.
అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు.
అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం.
ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు.
ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి.
సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు...
ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు.
అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి.
నిజానికీ పండుగ రైతన్నల పండుగే అయినా,
అందరి ఆకలి తీర్చే పండుగ కనుక
“ ఏరువాక పున్నమి “ అందరికీ పండుగే.
కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా...
ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు.
వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు.
ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు.
వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు.
కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు.
పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు.
ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు.
వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు.
“ ఏరువాక పున్నమి” నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సర మంతా పంటలు సమృద్దిగా పండుతాయని కర్షకుల నమ్మకం.
మరి కొన్ని ప్రాంతాలలో, ఊరు బయట, గోగునారతో చేసిన “ తోరం “ కడతారు.
రైతులందరూ అక్కడికి చేరి “ చెర్నాకోల “ తో ఆ “ తోరాన్ని “ కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకు వెళ్లి ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలోను కడతారు.
ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని రైతుల విశ్వాసం.
ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది.
అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది.
మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది.
కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు.
సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞమనీ, కన్నడలో కారుణిపబ్బ అనీ...
ఇలా రకరకాల పేర్లతో ఈ పండుగను ఆచరిస్తారు.
వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది.
కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కేవగా ఉండేది కాబట్టి, ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు.
నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకి జరిగినా... వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు!
‘‘ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ
ఏళ్లు నదులు పొంగి వెంబడొచ్చాయి
నల్ల మేఘాలలో నాట్యమాడింది కొండ గుట్టల మీద కులుకు లాడింది
ఇసక నదిలో బుసలు కొట్టింది
పాడుతూ కోయిలా పరుగు లెట్టింది
ఆడుతూ నెమలి అలసిపోయింది
నవ్వుతూ మా అయ్య బువ్వ తిన్నాడు
ఆకాశమున మబ్బులవతరించాయి
ఉరుమొక్కటావేళ ఉరిమిపోయింది
కాపు పిల్లల మనసు కదిలిపోయింది
అటకమీద గంప అందుకోవయ్య
విత్తనాలు దీసి విరజిమ్మవయ్య
మృగశిరా కార్తిలో ముంచెత్తు వాన
కలపరా అబ్బాయి కొత్త దూడల్ని
కట్టరా అబ్బాయి కొత్త నాగళ్లు
దున్నరా ఓ అయ్య దుక్కుల్లు మీరు
ఒకగింజ కోటియై వర్థిల్లు మీకు
ఏరువాక సాగి ముసురుకోవాలి
కొత్త పంటలు మనకు కోరుకోవాలి’’...
ఎండలు తగ్గి వానలు పడ్డాక ఏర్లూ నదులూ నీళ్లతో కళకళలాడుతున్న వేళ- ఇంకెందుకాలస్యం దుక్కులు మొదలెట్టేయమంటూ అన్నదాతలకు శ్రీకారం పలికే పాట ఇది.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
కర్షకుల కష్టాన్ని పంచుకునే వాటిలో ఎడ్లతో పాటు నాగలిదీ ప్రధానపాత్రే. అందుకే ఏరువాక పున్నమి రోజు
మంగళహారతులూ పాడతారు.
అలాంటిదే ఓ పాట...
‘‘మంగళమమ్మా మా పూజలు గైకొమ్మా
మంగళమమ్మా మా నాగలి నీకు
కష్టమనక భూమి దున్ని
కరవు మాపి, కడుపు నింపి
సకల జీవ రాశిని, నీ
చాలున పోషింతువమ్మా
కర్షకులను, కరుణతోడ
కాపాడుచు, నెల్లప్పుడు
కామితార్థముల నొసంగు
కల్పవల్లివమ్మ నీకు మంగళమమ్మా’’!
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ఏరువాకమ్మకు ఏమి కావాలి?
పండగ ఏదైనా పాటకు పెద్దపీట వేయడమే పల్లె ప్రత్యేకత.
ఏరువాక పదాలూ అలా పుట్టుకొచ్చినవే.
ఇక్కడ చూడండి... ఏరువాక పున్నమిని ఎలా జరుపుకోవాలో చెబుతోందో పదం...
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ఎర్ర ఎర్రని పూలమాల కావాలి
ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి
ఏరువాకమ్మకీ ఏమి కావాలి!
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయ వడపప్పు తెచ్చి పెట్టాలి
ముత్తైదులందరూ పాట పాడాలి
పాట పాడుతు తల్లి పాదాలు మొక్కాలి
ఏరువాకమ్మనూ ఏమి కోరాలి
ఎడతెేగని సిరులివ్వ వేడుకోవాలి
పాడి పంటలు కోరి పరవశించాలి
వానలు తెరపిచ్చి ‘ఎరుపు తెలుపుల’ ఎండ పరచుకున్న ఓ మంచిరోజును ఎంచుకోవాలి.
ఏరుకు పూలమాలలు కట్టాలి.
నేలతల్లికి కొబ్బరికాయ, వడపప్పు నైవేద్యం పెట్టాలి.
ఇక్కడ ఏరువాకమ్మ అంటే భూమాతే.
నాగలి పోట్లను భరించి పంట ఇచ్చేది ఆ తల్లే కదా.
అందుకే, పాట పాడుతూ ఆమె పాదాలకు మొక్కాలి అంటున్నారు జానపదులు.
అంటే... ఆ చేలోని మట్టిని తాకి వేడుకోవాలని! ధాన్యసంపదలను అనుగ్రహించమంటూ ఆ భూమితల్లికి దండంపెట్టుకునే కదా ఏ రైతైనా దుక్కిదున్నేది!
ఇలా ఎన్నో పదాలు, అన్నీ రైతు గుండెల్లోంచి పొంగుకొచ్చినవే.
- రాంకర్రి జ్ఞాన కేంద్ర
8096339900
- స్వస్తీ...