పెద్ద పెద్ద కలలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ?
◆ ఈ ప్రపంచములోని అభివృద్ధి మొత్తానికి కారకులు కొంతమంది కలలు కనే శాస్త్రవేత్తలు.
ఈ వ్యక్తులు తమకు తెలియని వస్తువులను, పరిస్థితులను, పద్దతులను ఊహించుకొని వాటిని గురించి కలలు కని వాటిని నిజ జీవితములోకి ఆవిష్కరించారు.
అంటే కలలు కనటము అనేది ఈ ప్రపంచ విజ్ఞానానికి మూల కారణం.
◆ కలలు కని వాటిని సాధించే కృషిలో ఆయా వ్యక్తులు, వ్యాపారవేతలు, శాస్త్రజ్ఞులు వారికి వారు ఒక్క ప్రత్యేక స్థానాన్ని సమాజములో సాధించుకొంటారు.
ఆ ప్రక్రియలో సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడే మంచి మార్గాలను, వస్తువులను, పద్దతులను అందిస్తారు.
ప్రతీ మనిషి ఈ విధమైన జిజ్ఞాసను పెంచుకోగలడు.
అలా చేయగలిగినపుడు అందరూ ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయగలుగుతారు.
◆ గొప్ప గొప్ప విషయాలు సాధించిన వ్యక్తులు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, కష్టాలకు ఓర్చుకొని, తమ పరిస్తితులతో పోరాడి తాము అనుకున్న కలలను నిజము చేసి ప్రజలను ఆచ్చర్యచకితులను చేశారు.
అలా పని చేసే మహోన్నత వ్యక్తులు అభివృద్ది చెంది చరిత్రలో తమ పేరును శాశ్వతం చేసుకొన్నారు.
◆ కలలు కని గొప్ప పనులు చెయ్యాలనే ఆకాంక్ష ఉన్నవారికి వారి స్వచ్చమైన శక్తి నుండి వచ్చే ప్రకంపనాలు వారి మనస్సుని, బుద్ధిని, మాటలను, అలవాట్లను, చేతలను విపరీతముగా ప్రభావము చేసి వారు రాత్రి పగలు తథేక ధ్యాన మనుష్కులై ఉండే విధముగా చేసి తమ మానసిక మట్టముపై నిరంతరము కొత్త ఆవిష్కరణలను ఊహించుకొంటూ ఆ క్రమములో ఈ ప్రపంచ గతిని మార్చేటటువంటి అనేక సమస్యలకు సమాధానం చెప్పే విషయాలు కనిపెడతారు.
◆ మన చరిత్రలో చూస్తే గొప్ప గొప్ప శాశ్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, విజ్ఞానవేత్తలు తాము పుట్టిన, పెరిగిన పరిస్థితులతో సంబంధము లేకుండా విజయాలు సాధించిన విషయాలు తెలుస్తాయి.
వారిని ముందుకు నడిపినది కేవలం వారిలో అంతర్గతంగా దాగి ఉన్న నిరంతర జిజ్ఞాస, కలలు కనే తత్వము, వాటిని సాకారం చేసుకొనే పట్టుదల మాత్రమే.
◆ చాలా మంది తాము గొప్పవారు కావాలని, ఎన్నో సాధించాలని కలలు కంటారు.
కాని కొంతమంది మాత్రమే చివరకు సాధించ గలుగుతారు.
అందుకు గల కారణము వారిలోని పట్టుదల.
అందరూ వారు చేసిన ప్రయత్నములలో సఫలము కారు.
కొంతమంది మాత్రమే తమ ఓటమిని అంగీకరించక మరల మరల ప్రయత్నం చేస్తారు.
అలా ప్రయత్నము చేసిన వారే తమ కలలను సాధిస్తారు.
◆ ఈ విధముగా కలలను సాధించిన వ్యక్తులను పరిశీలిస్తే వారు నాలుగు ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉన్నారు.
1. తమకు తెలియని విషయాలను ఊహించి వాటిని గురించి కలలు కనటము.
2. ప్రపంచము ఆ విషయాన్ని నమ్మకపోయినా తాము బలంగా నమ్మి ప్రయోగాలు చేయటం.
3. వ్యతిరేక ఫలితాలు వచ్చినా వాటిని అంగీకరించకుండా నిరంతరమూ ముందుకు సాగటము.
4. ప్రతీ క్షణము తమ కలలను సాకారము చేసేటటువంటి విభిన్న మార్గాలను అన్వేషించి విరామంలేని పోరాటం చేయటము.
◆ చాలా మంది కష్టపడి పనిచేసే తత్వము లేని వారు తమ అదృష్టాన్ని నమ్ముతారు.
దాని కొరకు దేవుణ్ణి మొక్కుతారు, పూజలు చేస్తారు.
కాని నిజమైన శక్తి మన మనస్సులో ఉందని మన మెదడు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానితో మనము అద్భుతాలు సృస్టించగలమని గుర్తించరు.
అటువంటి గొప్ప వ్యక్తులు తమ అదృష్టావశాత్తు అలా విజయం సాధించారని భావిస్తారు.
ప్రతీ విజయము సాధించిన వ్యక్తి పడ్డటువంటి కష్టనష్టాలు వారు గుర్తించరు.
◆ మనము ఎదుర్కొనే ప్రతీ సమస్యకు ఏదో ఒక పరిష్కారముంది.
ఆ పరిష్కారాన్ని మనము తీవ్ర అన్వేషణ ద్వారా ఆవిష్కరించగలము.
మనము ఎప్పుడైతే ఒక సమస్యకు పరిష్కారము అందించే దిశలో తీవ్రముగా ప్రయత్నము చేస్తామో మన మెదడుకు అనేక విధాలుగా సహకరించి కొత్త పద్దతులను విధానాలను అందిస్తుంది.
అందుకే ఎవరైతే ఏకాగ్రతతో ఒకవైపు, ఒక సమాధానం వైపు ప్రయాణం చేస్తారో, కలలు కంటారో వారికి కొత్త మార్గాలు ఈ సృష్టిలో అందుతాయి.
◆ ప్రతీ మనిషి ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించగలడు, ప్రతీ వ్యక్తి కొత్తవిషయాలను కనిపెట్టగలడు, ప్రతీ వ్యక్తి తన మెదడును ఒక పరిష్కార యంత్రములాగా వాడగలడు.
కాని అనవసరమైన కార్యకలాపాలతో, సోమరితనంతో, నాకెందుకులే అనే తత్వముతో, స్వార్థపూరిత ఆలోచనలతో, మనిషిని నిర్వీర్య పరచే ప్రవర్తనతో, తాత్కాలిక ప్రలోభాలతో, శారీరక బానిసత్వముతో, మానసిక బలహీనతలతో తనలో దాగి ఉన్న ఈ శాస్త్రవేత్తను అనుక్షణం చంపివేస్తూ సాగుతుంటారు.
ఎవరైతే విజేతలుగా నిలిచారో, ఎవరైతే ఈ సమాజానికి మార్గదర్శిగా నిలిచారో వారు తమలోని శక్తి యుక్తులని వాడుకొని వాటిని సమర్థవంతముగా ఉపయోగించి పెద్ద కలలు కని వాటిని సాధించి మానవ కళ్యాణానికి పాటుపడ్డారు, తమ అభివృద్దికి దోహదము చేసుకొన్నారు.
నీవు ఎంచుకున్న వృత్తిలో అద్వితీయంగా ఎదుగుట ఎలా ?
◆ ఈ ప్రపంచంలో అనేకరకాల వృత్తివ్యాపారాలు చలామణిలో వున్నాయి.
ఎవొక్కటీ గొప్పది లేదా తక్కువది అని చెప్పలేము.
ప్రతి వృత్తిలో మనము ఉన్నత స్థానానికి వెళ్ళగలము.
మనము మనకు అనుకూలమైన మనకు ఆనందాన్ని కలిగించే వృత్తిని వ్యాపకాన్ని ఎంచుకోవాలి.
అపుడే మనము దానిలో ఉన్నతస్థానాన్ని చేరుకోగలుగుతాము.
మనస్పూర్తిగా ఆనందంగా చేయగలుగుతాము.
◆ వృత్తిని ఎంచుకునేటప్పుడు చాలామంది సమాజంలో బాగా డబ్బు వస్తున్న, తమకు తెలిసినవారు చెప్పిన వాటిని ఎంచుకుంటారు.
కాని, అది మన ప్రవృత్తికి సరిపడనప్పుడు, దానిపై మనకు సంపూర్ణ విశ్వాసము లేనపుడు మనము దానిలో రాణించలేము.
గొప్ప స్థానానికి చేరలేము.
అందుకే మనమనసుకు నచ్చేటటువంటి వృత్తిని ఎంచుకోవాలి. దానిలో ఉన్నతికి కృషిచేయాలి.
◆ అందరూ నడిచినబాటలో నడవటం చాలా తేలిక.
మనము మన ఆలోచనలను ఎక్కువగా ఉపయోగించవలసిన అవసరం లేదు.
కానీ, అదే బాటలో మనం నడిచినప్పుడు క్రొత్త అనుభవాలు విజయాలు సాధించలేము.
అందుకే మనము మన సొంత ఆలోచనలను పద్ధతులను ఉపయోగించటం అలవాటుచేసుకోవాలి.
ఒకసారి అలవాటు అయిన తరువాత అదే తేలిక అని అర్ధమౌతుంది.
◆ నీవు తీసుకున్న వృత్తి లేదా వ్యాపారంలో అభివృద్ధిని ఆశించి నీవు నిరంతరము నీసొంత ఆలోచనలతో ముందుకు సాగినపుడు, ఆశ్చర్యకరమైన రీతిలో నీకు క్రొత్త దారులు ఏర్పడతాయి.
నీవు ఊహించని విధంగా ఈ ప్రపంచం నీకోసం సహకరిస్తుంది.
నీవు అనుకోని విజయాలు నిన్ను వరిస్తాయి.
ఎవరైతే తన వృత్తిని సంపూర్ణ విశ్వాసంతో, నిబద్ధతతో, అంకితభావంతో క్రోత్తదనంతో చేస్తారో, వారే ఆ విభాగంలో నాయకులుగా ఎదుగుతారు.
◆ మనము బ్రతకటానికి ఎంచుకున్న వృత్తి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సాగకూడదు.
మనం బ్రతుకుతూ, మనచుట్టూ వున్న సమాజాన్ని అభివృద్ధి చేయాలి.
మన పనులు సమాజ నిర్మాణానికి తోడ్పడాలి కాని వినాశము వైపు పోరాదు.
అలా యితరులకు నష్టము కలుగచేసే వృత్తి కాలక్రమములో నాశనము కాకతప్పదు.
నీవు ఈ సమాజంలో అంతర్భాగము.
యితరులకు నష్టము జరిగితే నీకు జరిగినట్లే.
నీకు కూడా ఆ నష్టము కాలక్రమములో సంక్రమిస్తుంది.
◆ నీవు నీ వృత్తిలో చేసిన పనులు నీ తోటి వారికి ఆదర్శంగా నిలవాలి.
నీవు విలువలతో కూడిన విధానాలను ప్రచారంచేసి వాటిని పాటించి చూపాలి.
నిరంతరము నీవు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించి నూతన అభివృద్ధి సాధించే దిశలో నీ వలన నీ వృత్తి వ్యాపార వర్గములో క్రొత్త విధానాలకు తెరతీయబడాలి.
◆ మనము ఎంచుకున్న వృత్తిలో ఇప్పటికే గొప్పస్థాయిలో వున్న వ్యక్తుల జీవితాలను పరిశీలించాలి.
వారి విజయాల వెనుక రహశ్యాలను గుర్తించాలి.
వాటిని విశ్లేషించి వాటిని స్పూర్తిగా తీసుకొని మనము క్రొత్త విధానాల ద్వారా అపరిష్కృత సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి.
అపుడు ఆ దారిలో మనకు ఊహించని విజయాలు నిస్సందేహంగా లభిస్తాయి.
◆ మనము చేసేపని యితరులకు ఎలా ఉపయోగపడుతుంది?
అది వారి జీవితాలను ఎలా సులభతరం చేస్తుంది?
వారికి యింకా మెరుగైనసేవలు ఎలా అందించాలి ?
వారికి తక్కువ ఖర్చుతో విలువైన సేవలు ఎలా అందించాలి - అనే విషయాలలో నిరంతరము మమేకమైనపుడు అది ఒక ధ్యానముగా మారి మనము దానిలో సంపూర్ణ శక్తివంతులముగా మారి మన జీవితము విలువైనదిగా కనబడుతుంది.
◆ మనము చేసే పనిమీద అమితమైన ప్రేమ గౌరవము పెంచుకోవాలి.
మన పనిని మనము దైవముగా భావించాలి.
నిజాయితి, నిబద్ధత అంకితభావములతో ప్రతిరోజు దానిలోకొంత నూతన అభివృద్ధి సాధించే దిశగా పనిచేయాలి.
అలా మనము చేస్తున్నపుడు మనపని మనకు ఒకధ్యానములాగా, ఆనందకరమైన ఆటలాగ, ఒక అందమైన చిత్రలేఖనములాగా మనము ఒక పరిణితిచెందిన కళాకారునిలా మారిపోతాము.
మన జీవితము మనకు సంతృప్తిని, ఆనందాన్ని, ఆశక్తిని పరిపూర్ణతను అందిస్తుంది.
అపుడే మనజీవితం సార్ధకముతుంది.
◆ అందుకే మనము ఆత్మపరిశీలనము చేసుకోవాలి.
నీకు నీజీవితము నుండి ఏమి కావాలి అనేది నిశితముగా ఆలోచించాలి.
నీవు ఏపనిలో ఆనందాన్ని బాగా పొందుతావు?
ఏవృత్తి నీకు మానశికంగా దగ్గరగా వుంటుంది - అనే విషయాలను విశ్లేషించి తెలుసుకోవాలి.
అపుడు దానిని నీవృత్తిగా వ్యాపకంగా స్వీకరించు.
అపుడు నీకు తెలిసిన వ్యక్తులు ఆవృత్తిలో వున్నవారందరికంటే ఉన్నతమైన విజ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరము కృషిచేయి.
దానిలోవున్న అపరిష్కృత సమస్యలకు సమాధానాలు అన్వేషించు.
నీవ్రుత్తిని ప్రాణ సమానంగా ప్రేమించు.
అలా ప్రయత్నాన్ని విశ్లేషణ ద్వారా చేస్తూనేవుండు.
అపుడు నిన్ను ఈ ప్రపంచము శాశ్వతంగా గుర్తుంచుకునే స్థానం తప్పక చేరుతావు.
మన లక్ష్య సాధనలో పాటించవలసిన నియమాలు ఏమిటి ?
◆ మనము నమ్మిన లక్ష్యాల వైపు నిరంతరము ప్రయాణము చేస్తూ కదిలినపుడు మనము సత్యము కొరకు, పరిపూర్ణత కొరకు ప్రయత్నము చేస్తున్నపుడు, మనకు తెలియకుండానే గొప్ప కార్యాలను సాధించగలుగుతాము.
అందుకే ఎపుడూ మన లక్ష్యంపై నమ్మకము చేదరిపోకూడదు. నిరంతర ప్రయాణము సాగాలి.
◆ నీవు నీజీవితములో ఆధిపత్యము కోసము చేసే ప్రయాణములో నీకు అనేక గాయాలుకావచ్చును.
కానీ వాటిని నీ అనుభావాలుగా నీవు సాధించబోయే విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలి.
నీవు ఎపుడైతే నీకెదురైన యిబ్బందులను మనస్పూర్తిగా అంగీకరించ గలుగుతావో అపుడు అవి నీకు ఉపయోగపడే నిన్ను గోప్ప పనులు చేయడానికి ప్రోత్సహించే ప్రేరణలా పనిచేస్తాయి.
◆ నీవు జీవితంలో కనబడే ఆకర్షణలు శారీరక ఆనందాలు అనుభవించడము తప్పుకాదు.
కానీ అవి దీర్ఘ కాలంలో చెడు చేసేవి కాకూడదు.
నిన్ను జబ్బుల పాలు, అవమానాల పాలు చేసి నీకు చెడ్డపేరు తెచ్చేవిగా ఉండరాదు.
నీవు ప్రాపంచిక సుఖాలలో బందీగా మిగలరాదు.
వాటిని నీవు ఆనందించాలి గాని అవి నిన్ను నియంత్రించ రాదు.
నీవు నీజీవిత లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చి నీలో దాగిన అనంతశక్తిని బయటకుతీసే ప్రయత్నంలో ఎక్కువ కాలము గడపాలి.
నీ స్వార్థములో శారీరక సుఖాలలో బందీకావడము కన్నా నీ స్వార్థాన్ని మించి ఎదిగి ఈ ప్రపంచానికి నీ బహుమతి యివ్వటం ఎక్కువ ఆనందాన్ని యిస్తుంది.
విజయము కంటే సంతృప్తికరమైన జీవితం ముఖ్యము.
◆ మనకు జీవితంలో కనిపించే ప్రతిసమస్యా అనుకున్నంత తీవ్రంగా ఉండదు.
మనకు ఎదురయ్యే ప్రతికూల సంఘటనలనుండి మనము బలంగా ఎదుగుతాము.
మనశక్తి పెరుగుతుంది.
క్రమముగా ప్రయత్నించినపుడు సమస్య మనకు లొంగిపోతుంది.
మనలో సమస్యలపై పెల్లుబికే వ్యతిరేక భావాలను సాలోచనతో అనుకూలంగా మార్చుకొని మనమీద మనము నమ్మకాన్ని పెంచుకొని జయించగలము అనే నమ్మకంతో సాగిపోవటం అవసరం.
◆ మన పరిశీలనాశక్తి పెరిగేకొలది మనలో మనము మార్పుకోసము ప్రయత్నము చేసేకొలది మనకు యింతకుముందు అర్ధంకాని సంక్లిష్ట విషయాలు అర్ధంకావటం మొదలుపెడతాయి.
మనిషి సహజ లక్షణము తన యిష్ట ప్రకారము సంఘటనలు జరగాలనుకోవటం.
కానీ జీవితం అలావుండదు.
మనకు తెలియని ఈ ప్రకృతి శక్తి మనకు ఏది అవసరమో అది అందిస్తుంది.
ఈ నమ్మకము పెరిగినపుడు విజయ సాధన సులభం.
◆ మనలో చాలా మందిమి ఆస్తులు సంపాదించడానికి, సెలవలు గడపడానికి, సినిమాలు చూడడానికి ప్రణాళిక వేసుకుంటాము.
కానీ మన జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి వాటిని సాధించడానికి మనము ప్రణాళిక వేసుకుంటున్నామా?
దీని కోసము మనము వేసుకోవలసిన ప్రశ్నలు -
● నీవు జీవితాన్ని ఎలా వుండాలనుకుంటున్నావు?
● నీజీవితంలోని ఎటువంటి విషయాలు నీకు నచ్చడంలేదు?
●నీవు ఎటువంటి విలువలను ప్రమాణాలను పాటించాలనుకుంటున్నావు ?
●నీకు దైవమిచ్చిన అనంతశక్తిని ఎలా వెలికితీయాలనుకుంటున్నావు ?
ఈ ప్రశ్నలతో మన ప్రణాళిక నిర్మించుకొని దానికి కట్టుబడి వుండాలి.
◆ మనిషికి వుండేటటువంటి సహజ గుణం పదిమందిని అనుసరించడము.
యితరులు ఏమిచేస్తే దానిని మనం గుడ్డిగా నమ్ముతాము.
కానీ మన కలలు, మన భావాలు, మనం నమ్మిన సిద్ధాంతాలు పాటించి వాటిని ఆచరించి పరీక్షించినపుడు గాని మనకు మనపై విశ్వాసము, సంతృప్తి కలుగవు.
అలా కాకుండా పదిమందిని అనుసరించి మన జీవితం గడిపితే చివరకు సరియైన ఫలితాలు సంతృప్తి రాక మనం చింతించవలసి వస్తుంది.
అందుకే మన ఆత్మ ప్రబోధను ఎపుడూ అనుసరించాలి.
◆ మన జీవితంలో జరిగిన చేదు సంఘటనలు నష్టము కలిగించిన పరిస్థితులు మనలను నిర్వీర్యము చేయరాదు.
మనము వాటిని తలచుకొని కృంగిపోరాదు. వాటి నుండి మనము భయాన్ని, ద్వేషాన్ని, ఆందోళనను, పగను కోపాన్ని దిగుమతి చేసుకోరాదు.
మన గత అనుభవాల చేదు ఊబిలో మనము కూరుకుపోతే జీవితంలో ముందడుగు వేయలేము.
అందుకని వాటిని పాఠాలుగా, ప్రోత్సాహకాలుగా, ప్రేరణగా మార్చుకొని సానుకూల దృష్టితో ముందుకు సాగాలి.
◆ ప్రపంచములోని గొప్ప విషయాలను సాధించిన వ్యక్తులందరూ పాటించిన నియమము తమ సొంత ఆలోచనలను మొండిగా అనుసరించడము.
వారిని పదిమంది ఎగతాళి చేస్తారు.
తప్పుచేస్తున్నారని నిరుత్సాహపరుస్తారు.
వారు అసాధారణముగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబడతారు.
కానీ అటువంటి వ్యక్తులే అభివృద్ధికి మార్పుకు కారకులు.
కాబట్టి మనము ఎపుడూ సొంత ఆలోచనాధోరణిని అలవాటుచేసుకోవాలి.
◆ సమశ్యలను ఎదుర్కోవడమే జీవితం.
మనము సమస్యలను ఎదుర్కొనేటప్పుడు చాలా ఉత్సాహంగా వుండగలుగుతాము.
సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మనము బలపడతాము.
అందుకే మనము సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి.
పెద్ద సమస్యలతోనే వాటిని నెరవేర్చడముతోనే గొప్ప జీవితము గొప్ప విజయాలు సాధించగలము.
మనము ఇంతకుముందు చేయని పనులు చేసేటపుడు మన మానసిక శక్తులు వికసిస్తాయి.
తద్వారా బలంగా తయారవుతాము.
పెద్ద లక్ష్యాలను సాధించగలుగుతాము.
మన లక్ష్యసాధనలో మనము లీనమైనపుడు జరిగే ప్రక్రియలేమిటి ?
అవి ఎలా మనలను విజేతలుగా చేస్తాయి?
◆ మనము మన ఆహారము డబ్బు సంపాదించడము కోసమే జీవిస్తున్నాము అని భావిస్తే మన జీవితము ఆనంద రహితము అర్ధరహితముగా మారుతుంది.
మానవత్వ విలువలను ఈ ప్రపంచానికి అందించడము, నీవు అందరికీ ఉపయోగపడే పనులు చేయడము ఈ జీవిత రహశ్యమని గుర్తించినపుడు నీలో దైవిక శక్తి పెరిగి రోజురోజుకీ అర్ధవంతమైన, సంతృప్తి కరమైన జీవితాన్ని సాధిస్తావు.
◆ మన మెదడు చాలా గొప్ప సేవకుడు మరియు నియంత ధోరణి వున్న యజమాని.
ఈ ప్రకృతి మనకు యిచ్చిన అద్భుత వరం మెదడు.
కానీ దానిని మనము సరిగా ఉపయోగించనపుడు ఒక శాపముగా మారుతుంది.
అటువంటి మెదడును మన స్వాధీనములోనికి తీసుకోవడము అనేది మనలను మన లక్ష్యములో లీనమయ్యేటట్లు చేస్తుంది.
◆ జీవిత కాలాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.
ప్రతిరోజును సంతృప్తి కరముగా గడపాలి.
మనము పోయిన తరవాత కూడా మనము అందించిన విషయాలు, వస్తువులు, పద్ధతులు ఈ భూమిపై నిలిచివుండేలా జీవించాలి.
ఎపుడైతే అంత లీనమై మన జీవితం సాగిస్తామో, నీకు ఈ ప్రకృతినుండి అదృశ్యశక్తులు వచ్చి చేరుతాయి.
అపుడు మనము మన జీవితము ద్వారా సాధించవలసిన అద్భుత విజయాలను గుర్తించే ప్రయత్నము మొదలు పెడతాము.
◆ హృదయాన్ని లీనముచేసి, భావాలను పునీతముచేసి మనము మన లక్ష్యమువైపు ప్రయాణము చేస్తుంటే ప్రతిక్షణమూ మనకు ఆనందాన్ని యిస్తుంది.
మనము గెలిచామా లేదా అనే దానికంటే మనము గడుపుతున్న జీవితము మనకు అద్వితీయమైన సంతృప్తిని యిస్తుంది.
అంటే మనము పూర్తిగా మన లక్ష్యాన్ని జీవిత గమ్యంగా భావించటము అనేది యిక్కడ అవసరము.
◆ మనము చేసే ప్రతిపనినీ మనము అత్యున్నతముగా చేయడానికి ప్రయత్నం చేయాలి.
మనము నెరవేర్చవలసిన ప్రతి బాధ్యతనూ మనస్పూర్తిగా చేయాలి.
అలా చేసినపుడు నీతో నీవు కలిసి నీ ఆత్మశక్తులను నీవు అందుకోగలుగుతావు.
నీజీవితం ప్రతిక్షణం ఆనందభరితముగా, ఉత్సాహంగా ఉన్నతంగా కనిపిస్తుంది.
నీవు నీ ప్రయత్నంలో క్రొత్త క్రొత్త ఆనందతీరాలకు చేరతావు.
నీ లక్ష్యాలు నీకు ఏవిధమైన కష్టమూ తెలియకుండానే వాటంతట అవే నెరవేరతాయి.
◆ ఈ ప్రపంచము అత్యంత శక్తివంతమైన ప్రకృతి నియమాలతో నిర్మింపబడింది.
జీవితమనే ఆట అందంగా ఆడటానికి మనం ఆ నియమాలు తెలుసుకోవాలి.
ప్రకృతికి అనుకూలమైన నియమాలను పాటించడం అనేది మనలను గొప్ప జీవితంలోకి నడిపిస్తుంది.
నేవు చేసే ప్రతి పని ప్రకృతికి అనుకూలమైన పని అయితే అది నీ జీవితాన్ని ఉత్తేజితం చేస్తుంది.
అంటే మనము ఎదుర్కొనే సమస్యలను మనం ప్రకృతి నియమ ఉల్లంఘన ద్వారా తెచ్చుకుంటున్నాము.
ఇతరులకు సహాయం చేయడం, అసాధారణమైన నిజాయితీ, వర్తమానంలో జీవించడము, దయ, జాలి కలిగి ఉండటము, చేసే పని మీద అమిత శ్రద్ధ చూపటము అనే నియమాలు పాటించినపుడు మనము అనుకొన్న గొప్ప లక్ష్యాలు సాధించగలుగుతాము.
◆ తాను గొప్పవాడిని కాగలను అనే నమ్మకం తో మనిషి జీవించినపుడు అతనికి ఆత్మ గౌరవం పెరుగుతుంది.
అంతేకాక ఇతరులపై, జంతుజాలము పై, ప్రకృతి పై, జీవితం పై, అపార విశ్వాసం నెలకొంటుంది.
ఆ ప్రయాణం లో సృజనాత్మక మరియు ఉహాత్మక విప్లవము సంభవించి మనిషి లో శక్తి సామర్ధ్యాలు వినియోగంలోకి వచ్చి అద్భుత కార్యక్రమాలు నెరవేరటం మొదలు పెడతాయి.
ఈ ప్రపంచాన్ని సృష్టించిన అద్భుత శక్తి మనలను ప్రోత్సహించడం ప్రారంభిస్తుంది.
నీవు సరి అయిన దారిలో ప్రయనిస్తున్నావు అని నీకు కొన్ని శక్తులు తెలియజెప్తూ నడిపిస్తాయి.
నీ సమస్యలకు సమాధానాలు నీకు ఎదురువస్తాయి.
నీవు అనుకొన్నది జరుగుతుంది.
అవకాశాలు నీకు ఎదురు వస్తాయి.
నీ గమ్యం నీకు ఎదురవుతుంది.
◆ మన కల నిజం చేసుకోవాలంటే కొన్ని సక్రమమైన పనులు చేయాలి.
నీవు సాధించ తలచిన కార్యముల కొరకు కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి.
క్రమశిక్షణతో ఉండి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి.
మనకు ప్రకృతి ఇచ్చిన శక్తి సామర్ధ్యాలు సక్రమంగా ఉపయోగపడాలంటే వాటిని సరి అయిన మార్గములో నిరంతర ప్రయత్నం ద్వారా ఆచరణలో ఉంచాలి.
అపుడే విజయం సాధ్యం.
◆ వోడిపోతామనే భయం, తెలియని విషయాల గురించి భయం, మనలను అంగికరించరనే భయం, మనం వేరేదారిలో నడుస్తున్నాము అనే భయం, నాణ్యముగా చేయలేము అనే భయం, ఇలాంటి భయాలు మనలను ముందుకు నడవనివ్వవు. ముందు వాటిని జయించాలి.
◆ మనిషి గా మనం చేయవలసిన దానిని ప్రయత్నలోపం లేకుండా మన ముందున్న లక్ష్యం వైపు ప్రయత్నించాలి.
మన శక్తి వంచన లేకుండా ముందుకు కదలాలి.
ఆ తరువాత వచ్చే ఫలితాల గురించి మనం ఆందోళన చెందరాదు.
బాధ్యతాయుతంగా నీవు ప్రయత్నము చేసినపుడు నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నము చేసినపుడు తరువాత ప్రకృతి శక్తి నీకు మార్గం చూపిస్తుంది.
నీ జీవిత గమ్యానికి నిన్ను అదృశ్య శక్తులు నడిపిస్తాయి.
దాని కొరకు నిరంతరం ఓర్పుతో మెలగాలి.
- రామ్ కర్రి8096339900
స్వస్తీ...
__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___ ___
ఓం
మీ యొక్క విరాళం ధర్మ కార్యానికి శ్రీకారంమీ యొక్క అమూల్యమైన విరాళాలను Google Pay, Phone Pay, Amazon, Paytm ద్వారా 8096339900 కి పంపించండీ.
మీ యొక్క అమూల్య మైన విరాళాన్ని అందించడం ద్వారా ఈ ధర్మ కార్యం మధ్యలో ఆగకుండా చూడండీ...
విరాళం అందించాలనే సమయంలో ఏవయినా సమస్యలు తలెత్తితే ఈ నెంబర్ 8096339900 పైన నొక్కి వాట్సాప్ కి సందేశం పంపండీ...
__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___ ___