తెలివితేటలలో నాణ్యతను ఎలా పెంచుకోవాలి?ఎలా ఉపయోగపడాలి?
◆ శరీర బలం కన్నా బుద్ధి బలం గొప్పది .
బుద్ధి బలం తో మనిషి అనేక అద్భుతాలను సృష్టించగలడు.
దేశాన్ని అనేక సమస్యలనుండి రక్షించడానికి బుద్ధి బలం కల నిస్వార్ధ యువత కావాలి.
తమ తెలివి తేటలతో, చాకచక్యంగా, చతురతతో సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలి.
అది అందరూ సాధించ గలిగినదే.
దాని కొరకు చేయాలనే కోరిక నిరంతర పరిశ్రమ, సాధన అవసరము.
అవి అలవాటు చేసుకొన్న ప్రతి ఒక్కరికి బుద్ధిబలం అందుబాటు లోకి వస్తుంది.
అటువంటి వ్యక్తులతో ఈ దేశం నిండాలి.
◆ ఆలోచించే విధానము, జ్ఞాపకము ఉంచుకునే శక్తి, మాట్లాడే పధ్ధతి, విశ్లేషణ చేసే దృక్పథము మరియు విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక వీటన్నింటిని నిరంతరమూ మెరుగు పరచుకుంటూ నడిచే మనిషి తను తలపెట్టిన ప్రతి పనిని అత్యంత సామర్ధ్యం తో నిర్వహిస్తాడు.
◆ మనిషికున్న ఈ ప్రకృతి వరాలను దైవ దత్తమైన శక్తులను తెలుసుకుని పెంపొందించుకుంటూ జీవించే మనుషులు తమ మీద తాము అమితమైన విశ్వాసముతో క్లిష్టమైన కార్యాలను సాధించగలుగుతారు.
వారు ఈ సమాజ స్థితిగతులను మార్చగలరు.
వీరు చరిత్రను సృష్టించగలరు.
వారు అపరిష్కృత సమస్యలకు అందమైన సమాధానాలను చూపగలరు.
◆ మనిషికున్న ఆలోచనా శక్తి వాడే కొద్ది పెరుగుతుంది.
మనవి కాని సమస్యలను కూడా మనము అలోచించి పరిష్కారాన్ని చూపవచ్చును.
జీవితాన్ని మెరుగుపరచే మనుషులను తయారు చేసే వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే ఆలోచనలు, ప్రయోగాలు ఈ దేశానికి చాల అవసరము.
అటువంటి విధానాలు బుద్ధి బలమున్న నవ యువకులకే సాధ్యము.
◆ బుద్ధి బలమున్న తెలివి తేటలున్న వ్యక్తులు తాము పుట్టిన పరిస్థితులతో సంబంధం లేకుండా నిరంతరమూ ఉత్తెజితులు అవుతూ తమ సామర్ధ్యాన్ని వాడుతూ గొప్ప గొప్ప విషయాలను సాధిస్తూ ఎవరూ చూడని నడవని కొత్త బాటలలో నడిచి వినూత్న ఫలితాలను సాధిస్తారు.
◆ విన్నుత్నముగా ఆలోచించడము, ఎల్లప్పుడు సమస్యలకు పరిష్కారం వైపు చిత్త శుద్ధి తో ఆలోచించడము, నిస్పక్షపాతం గా వ్యవహరించడం, తను చేయబోయే కార్యక్రమము పై చెరిగి పోని నమ్మకము మనిషిని అజేయునిగా, బుద్ధి బలము ఉపయోగించుకునేట్లు చేస్తాయి.
◆ ప్రజలు వారు సాధించిన విజయాలను చూస్తారు.
కానీ, అ విజయం వెనుక వారు చేసిన సాధన, కృషి, నిరంతర శ్రమ వారికి కానరావు. తెలివి తేటలు సక్రమంగా ఉపయోగించుకునే దారిలో వారు తమను తాము ముందుకు నడుపుకొంటారు.
ప్రోత్సహించుకొంటారు.
◆ మన ఎదురుగా ఉన్న సమస్యకు నూతన విధానములో పరిష్కారము వెదుకుట ద్వారా మన ఆలోచనా సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చును.
మన మెదడు ఆలోచించేకొద్ది దానిని అలవాటుగా మార్చుకుని సృజనాత్మకత తో ముందుకు నడుస్తుంది.
ఆశ్చర్యకరమైన సూచనలు చేస్తుంది.
◆ తెలివి తేటలు, బుద్ధి బలము పెరగటానికి మానసిక ప్రశాంతత అవసరము.
తన గురించే కాక తన తోటి వారి గురించి ఆలోచించే విశాల దృక్పధము అవసరము.
దీని కొరకు ధ్యానము ఉపయోగపడుతుంది.
సరి అయిన ఆసనములో కదలకుండా కూర్చుని మన శ్వాస మీద ధ్యాస తో 15 నిముషాలు కూర్చున్నప్పుడు మన మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
◆ ఒక సమస్యకు అనేక రకాల పరిష్కారాలు ఉంటాయి.
సమస్యను మనము మనసులోకి తీసుకుని ఏకాగ్రతతో విశ్లేషణ చేసినపుడు తప్పని సరిగా పరిష్కారము లభిస్తుంది.
ఆ ప్రయాణములో మన బుద్ది బలము వికసిస్తుంది.
పెద్ద పెద్ద పనులను పూర్తి చేసే సామర్ధ్యము పొందుతాము.
మన మెదడును విలాసాలతో, అనాసక్తితో ఖాలీగా ఉంచినపుడు అది తన శక్తి ని కోల్పోతుంది.
అప్పుడు ఆలోచించడం అనేదే మర్చిపోయి గుడ్డిగా జీవితాన్ని గడుపుతాము.
ప్రతి విషయాన్ని దీర్ఘకాలిక ఫలితాలను దృష్టి లో ఉంచుకుని విశాలదృష్టి తో, సంపూర్ణ విశ్వాసంతో నిరంతర శోధన తో అనుక్షణము వినూత్న విధానాలతో చూసే, ప్రవర్తించే, నడిచే వ్యక్తి తన తెలివి తేటలను దిన దిన ప్రవర్ధమానం గా పెంచుకుని అవకాశాలు సృష్టించగలడు.
గొప్ప నాయకునిగా ఎదగ గలుగుతాడు.
మార్పు తీసుకు రాగలుగుతాడు.
జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా ?
◆ మనుషులందరికీ ఒకే నాణ్యత ఉన్న ఒకే రకమైన శక్తి సామర్ధ్యాలు ఉన్న మెదడు ఉంది.
కాని దానిని వాడుకునే విధానము తెలిసిన వారికి అనంతమైన జ్ఞాపకశక్తి అందుబాటులోకి వస్తుంది.
దానికి కొన్ని విధానాలు అలవాట్లు పాటించాలి.
◆ నాకు చాల మంచి జ్ఞాపక శక్తి ఉంది అని మీరు నమ్మాలి.
అలా కాకుండా నాకు జ్ఞాపక శక్తి లేదు అని మీరు భావిస్తే క్రమక్రమముగా మీరు ఆ శక్తిని కోల్పోతారు.
మీరు అనుక్షణము మీ జ్ఞాపక శక్తిని పెంచుకునే దృక్పధము తో అనేక విషయాలను చదివి గుర్తుంచుకోడానికి ప్రయత్నించాలి.
◆ మనము గుర్తు పెట్టుకోవలసిన నంబర్లకు, పేర్లకు, సంఘటనలకు ఎదైన ప్రసిద్ధి పొందిన పేరును గాని, కుదించిన అక్షరాలను కానీ, మరేదైనా కలిపి గుర్తు పెట్టుకున్నప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఉదాహరణకి "క్విట్ ఇండియా ఉద్యమము ఆగష్ట్, 1942 న గాంధీజీ ముంబాయి లో, గోవలియ టాంకు మైదాన్ లో పిలుపునిచ్చారు.
" పై వాక్యము గుర్తు పెట్టుకోవాలంటే "క్వి 8/42 గాంధీజీ ముంగోటమై" అనే పదాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా మనము చాల క్లిష్టమైన వాక్యాలను, సంఘటనలను గుర్తు పెట్టుకోవచ్చు.
◆ మీరు గుర్తు పెట్టుకోవలసిన వస్తువులు, విషయాలతో కలిపి ఒక చిన్న కథను మీ సొంత పదాలతో అల్లినప్పుడు కూడా అ విషయాలను మనము గుర్తు పెట్టుకోవటము సులభతరము.
◆ మనము తెలుసుకొన్న విషయాన్ని నిజజీవితంలో, జరిగే విధానము అక్కడ ఉండే పరిస్తితులు, మీరు ప్రత్యక్షం గా వీక్షించ గలిగే చిత్రాలు కలిపి ఉహించుకుని చూడగలిగినప్పుడు కూడా మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఎందుకంటే మనం చూసిన దానిని ఎక్కువగా గుర్తుంచుకోగలము.
మన మెదడుకు చిత్రాలను గుర్తుంచుకునే శక్తి ఉంది. అనేక వస్తువులు, అనేక అంకెలున్న నంబరు మొదలైనవి గుర్తుపెట్టుకోవాలంటే వాటిని చిన్న చిన్న అర్ధవంతమైన విభాగాలుగా విభజించినపుడు అందులో ఉన్న వస్తువులను గుర్తు పెట్టుకోవటము తేలిక .
మనము విభజించే విధానము మన జ్ఞాపక శక్తి కి అనుకూలంగా ఉండాలి.
◆ నీవు గుర్తుంచు కోవలసిన విషయాన్ని మరల మరల గుర్తు చేసుకోవడం, రోజుకోసారి, వారానికోసారి, నెలకొకసారి అలా కాల పట్టిక ప్రకారం నిర్ణయించుకుని గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ఆ విధం గా చేసినపుడు నీకు సహజం గా ఆ ప్రతిభ పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
◆ మనము గుర్తుంచుకోవలసిన విషయాలను ఆకట్టు కునే పదాలు, అర్ధము వచ్చే పదాలు, చూడగానే అంతా గుర్తుకు వచ్చే విధమైన పదాలు వ్రాసుకుని చిన్న చిన్న కార్డులపై ఉంచుకుని వాటిని చదివి మిగతా విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి.
అప్పుడు మనము మన మెదడు యొక్క పనితనాన్ని పెంచ గలుగుతాము.
◆ మనము పరీక్షలో వ్రాయవలసిన పాఠ్య అంశాలను ముందుగా ఒక ప్రణాళిక ప్రకారము చదువుకోవాలి.
మన మెదడు కు విషయాలను అర్ధం చేసుకుని నిలవ ఉంచుకోవటానికి కావలసిన సమయాన్ని ఇవ్వాలి.
పరిక్షల ముందు హడావిడి గా చదివితే కొత్త విషయాలను మన మెదడు గుర్తుంచుకోలేదు.
ఒక ప్రణాళిక ప్రకారము ముందుకు కదలాలి.
◆ మనకు సంబంధించిన ప్రతి వస్తువును ఒక నిర్దిష్టమైన ప్రదేశం లో ఉంచి వాడిన తర్వాత దానిని తిరిగి అదే ప్రదేశం లో ఉంచడము మన పుస్తకాలు, పేపర్లు, ఇంటిలో ఉండే అన్ని రకాల వస్తువులను ఒక పధ్ధతి ప్రకారము ఒక స్థలము లో క్రమబద్ధం గా ఉంచినపుడు మనకు అవి అందుబాటు లో ఉంటాయి.
ఏ వస్తువును మనం మరచిపోము.
మనకు అది ఒక అలవాటు గా మారుతుంది.
సరి అయిన సమయమునకు అవసరమైనవి అందుబాటు లో ఉంటాయి.
మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
◆ మనము ఏ విషయాన్నైనా చదివేటప్పుడు, నిదానముగా లోతుగా ప్రాణాయామాన్ని చేసినపుడు మన ఏకాగ్రత పెరుగుతుంది.
ఉపిరి తిత్తుల నిండా గాలిని పీల్చి అక్సిజనును బాగా ఆస్వాదించాలి.
మన మెదడుకు సామర్ధ్యాన్ని పెంచే పజిల్సు, ఆటలు, మెదడుకు మేత, సామెతలు, పొడుపు కథలు ప్రయత్నించాలి.
మెదడు శక్తిని వాడకపోతే క్రమ క్రమం గా అది ఆ శక్తి ని కోల్పోతుంది.
సృజనాత్మకత ను పెంచుకోవడం ఎలా ?
◆ సృజనాత్మకత అంటే ఇంతకూ ముందు అందుబాటులో లేని వస్తువును, పద్ధతిని, కొత్త విషయాన్ని, విధానాన్ని కనుగొనటం.
దానిని పది మందికి అందుబాటులోనికి తేవటం.
ఈ ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా సృజనాత్మకత ఉన్న వ్యక్తుల వలెనే సాధ్యము.
అందరికి ఈ సృజనాత్మకత ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే దానిని వినియోగించి గొప్ప విషయాలు సాధిస్తున్నారు.
కొన్ని ప్రయత్నాలు చేస్తే అందరు సృజనాత్మకత ను సాధించవచ్చును.
◆ సృజనాత్మకత అనేది మనకు మనము చేసుకోవలసిన అలవాటు, దృక్పథము, భావన, ప్రయత్నము, ఆలోచన.
అంటే ముందు మనము సృజనాత్మకంగా ఉండాలి అని నిర్ణయించుకోవాలి.
మనము చేసే ప్రతి పనిని అదే భావన తో చేయాలి.
అదే ఉద్దేశంతో అభివృద్ధి చేసే కోణం లో ఆలోచించాలి.
మనకు కనపడిన ప్రతి సమస్యకు సమాధానాన్ని సాధించాలి.
◆ మనము చూస్తున్న ప్రతి వస్తువు, పధ్ధతి, దారి, విధానము ఇంకా మెరుగైన పధ్ధతిలో చేయవచ్చని, అటువంటి అవకాశం ఉందని మనము ప్రయత్నము చేసినపుడు ఫలితము లభిస్తుందని భావించాలి.
ఆ దిశగా మన మెదడును ప్రశ్నించాలి.
ఇతరులతో సంభాషించాలి.
◆ మనము ఏదైనా నిర్ణయము తీసుకునే ముందు లేదా ఏ విషయాన్నైనా మెరుగు పరచాలని భావించినపుడు దాని కొరకు మనముందున్న అనేక మార్గాలను తెలుసుకోవాలి.
వాటిని విశ్లేషించాలి.
వాటి ఫలితాలను అంచనా వేయాలి.
ఆ విధంగా ఆలోచించినపుడు మనకు తెలియకుండానే మెరుగైన పద్ధతిని కనిపెట్టవచును.
ఉదాహరణకు అన్న హజారే, రాలే గావ్ సిద్ధి అనే తన ఊరిలో నీరు లేక ప్రజలు వలస పోవటాన్ని గమనించి చెక్ డాముల ద్వారా నీటి నిల్వను పెంచవచ్చని గుర్తించి ప్రయోగము చేసి అ గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చాడు.
అంతకు ముందు అసాధ్యం అనుకొన్న దానిని చేసి నిరూపించాడు.
◆ మనము మన మెదడును నిశితంగా ప్రశ్నించినపుడు అది స్పందించి సృజనాత్మకమైన సలహాలను ఇస్తుంది.
కాల క్రమములో అది ఒక అలవాటుగా మారుతుంది.
మన వ్యక్తిగత, సామాజిక సమస్యలను దీని ద్వారా పరిష్కరించవచ్చును.
◆ మనము సృజనాత్మకత ను పెంచుకోవటానికి తర్కమును పెంచుకోవాలి.
ఒక విషయానికి ఇంకొక విషయాన్ని కలిపి ఆలోచించడం పెంచుకోవాలి.
అది అలానే ఎందుకు జరిగింది, ఇంకొక పధ్ధతి లో జరిగే విధానము ఏమైనా ఉందా, దానిని ఎలా అర్ధము చేసుకోవాలి, ఇతర పరిస్థితులలో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి ప్రశ్నలతో మన మెదడు ను ప్రశ్నించినపుడు అనుకోని వినూత్న సమాధానాలు మనకు లభిస్తాయి.
◆ మనము అలోచించి కొత్త ఉపాయాలను వెలికి తీయటము ప్రారంభించినపుడు, మనము ప్రతిపాదించిన చిన్న విషయాలలో మనము విజయము సాధించినపుడు మనకు అది ఒక అలవాటుగా మారుతుంది.
మన మెదడు కొత్త కొత్త ఉపయోగాలను అందించే ఉపాయాలను అందిస్తుంది.
◆ సమస్య మన వ్యక్తిగతము కాకపోయినా మనకు వీలు కుదిరినపుడు మనకు ఎదురయ్యే అన్ని రకాల క్లిష్ట విషయాలను స్వీకరించి విశ్లేషించటం మొదలు పెట్టాలి.
పది మందితో కలిసి సాంఘిక పరిష్కారము కొరకు చర్చలు జరపాలి.
ఇతరుల వద్దనుండి వచ్చే ఉపాయాలలోని మంచి విషయాలను మన ఉపాయం లో కలిపి చూడాలి.
ఆ ప్రయత్నము లో అనేక మంది నుండి వచ్చిన ఇతర విషయాల తో కలిసి ఎవరూ ఉహించని గొప్ప విధానాలను వెలికి తీసే అవకాశం ఉంది.
◆ మెదడు యొక్క ఆరోగ్యము, ఆనందము కూడా సృజనాత్మకతకు అవసరము.
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయాలు, అపోహలున్న మెదడు సృజనాత్మకత తో ఉండజాలదు.
దాని కొరకు మెదడు ఆరోగ్య అభివృద్ధి, సంగీతము, నృత్యము, కవిత్వము, లలిత కళలు, ప్రాణాయామము, ధ్యానము తోడ్పడతాయి.
అటువంటి అలవాట్ల వలన మెదడు పనితీరు, సృజనాత్మకత పెరుగుతుంది.
◆ సృజనాత్మకత ఒక్క రోజులో అర్ధమయ్యే సాధించే నైపుణ్యము కాదు.
దానికి సరి అయిన అవకాశము, ఆలోచన, అనుభవము కావాలి.
మనిషి మెదడు సాధన చేసే కొద్ది పదును ఎక్కి క్రమంగా అందుబాటులోనికి వచ్చి మంచి నాణ్యతను పొందుతుంది.
సృజనాత్మకతను పట్టించుకోకుండా ఇతరులను అనుసరించి జీవించే అవకాశం ఉంది.
అదే సుఖమని చాలా మంది భావిస్తారు.
అలా ఆలోచించడము కష్టమని భావిస్తారు.
కాని సృజనాత్మకత మనకు మెరుగైన జీవితాన్ని, మన భావనలలో మెరుగైన చురుకుదనాన్ని పదిమందిలో గుర్తింపును, మన చుట్టూ ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది.
అందువలన దీనిని అందరు పాటించడము అవసరము.
ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం ఎలా ?
◆ మన మీద మన బలము పైన మనము సాదించగల పనులపైన మనకు ఉండే విశ్వాసాన్ని ఆత్మ విశ్వాసం అంటారు..
నేను చేయగలను నేను సాదిస్తాను నేను ముందుకు వెళతాను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అనే మాటలు ఆత్మ విశ్వాసమున్న వ్యక్తి వద్ద నుండి వస్తాయి.
అది లేని వ్యక్తి తను చేయలేనని నమ్ముతాడు..
మన నమ్మకాలే మన నిజ జీవితం లో ప్రతిబింబిస్తాయి.
అందువలన మనము ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం అత్యంత ఆవశ్యకం.
◆ అటువంటి ఉన్నతమైన లక్షణాన్ని సాధించటం అందరికీ ఆవశ్యకము ప్రయత్నిస్తే అందరికి సాద్యము..
మొదటి అడుగు గా మనము దేని గురించి భయపడుతున్నాము అనేది గుర్తించాలి
మనము లేవని బావించే మనలో మనకు తక్కువ అనిపించే లక్షణాలను గుర్తించి వాటిని నేర్చుకోవాలనే కోరికను లేదా సరిదిద్దుకోవాలనే ఆలోచనను పెంచుకోవాలి
అవి మనలో ఎందుకు తగ్గాయి అవి నిజంగానే మన బలహీనతలా లేక మనమే అనవసర ఆలోచనలతో సతమత మౌతున్నామా అన్న విషయాన్ని విశ్లేషించి గుర్తించాలి.
◆ మనము బాధ పడుతున్న విషయాలను చేయలేమని భావిస్తున్న విషయాల గురించి మీ స్నేహితులతో అనుభవమున్న పెద్దలతో నీ మంచి కోరే వారితో చర్చించి వాటిని ఆదిగమించటానికి వారి సలహాలను తీసుకోవాలి.
మనలను మనము ప్రేమించటం అలవాటు చేసుకోవాలి
మనము మార్చలేని విషయాల గురించి అనవసరమైన ఆందోళన ను తొలగించుకోవాలి
మనము సాదించాలి అనుకొంటున్న పనులను ఇంతకూ ముందు సాదించిన వారిని కలిసి వారు ఎలా సాదిన్చారో తెలుసుకోవాలి..
వారు సాదించినపుడు మనము కూడా సాదించ గలము అని నమ్మాలి ఆ దిశగా ప్రయత్నము చేయాలి.
◆ ఎవరూ పుడుతూనే గొప్ప వారిగా జన్మించరు.
గొప్ప గొప్ప విషయాలను సాదించిన వారు కూడా నిరంతర ప్రయత్నము ఎన్నో వోటమిల అనంతరము విజయాలు పొందారని గుర్తించాలి.
ఎవరూ ఏ పనినైనా మొదలు పెట్టిన వెంటనే పూర్తి చేయలేక పోవచ్చు కానీ ఏకాగ్రతతో చేయాలనే తపనతో చేస్తే సాదించగలరు అనే నమ్మకాన్ని బలంగా మనలో నింపుకొని మనకు ఎదురయ్యే ఓటమిని విశ్లేషిస్తూ కొత్త పదకాలతో ముందు నడిచే యోచనను అనుక్షణము ఆచరించాలి.
◆ ప్రతి మనిషి లోను కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి.
నీలో అటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అని విశ్లేషించి తెలుసుకోవాలి.
నీవు ఇష్ట పడేవి ఏమిటి, నీవు బాగా చేయ గలిగేవి ఏమిటి అనేవి తెలుసుకొని వాటిని ఇంకా అబివృద్ది చేసుకొని వాటి ద్వారా నీకు మంచి గుర్తింపు వచ్చే దారిలో ప్రయత్నము చేయాలి వాటిని నిరంతరము అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాలి..
అలా చేసినప్పుడు అంతర్గతముగా నీపై నీకు విశ్వాసము పెరిగి కొత్త పనులు చేయటానికి కావలసిన మానసిక సంసిద్దత పెరుతుంది.
కార్య దీక్ష పెరుగుతుంది.
◆ నీ మీద నీవు జాలి పడటము, నీవు చేయలేని వాటిగురించి భయపడుతూ వాటికి దూరంగా పారిపోవటం, నీవు బలహీనుడవని నీవే ఇతరులకు చెప్పటం, నీ మీద ఇతరులు జాలి పడాలని నీకు అందరూ సహాయము చేయాలని ఎవరు నిన్ను కాపాడతారా అని ఎదురు చూడటము, అకస్మాత్తు గా సిరి సంపదలు పొందాలని ఆశించటం, కనపడిన దేవుల్లందరికి మొక్కుకోవటం జాతకాలు వాస్తు అదృష్ట రేఖలు మొదలైన వాటిని గుడ్డిగా నమ్మి వాటి గురించి అనేక రకాల పనులతో సమయాన్ని వాటితో గడపటం అనే అలవాట్ల నుండి బయటపడాలి.
◆ నీవు బయపడే పనులను మరల మరలా చేయటం ద్వారా నీలో కొంచెము కొంచెముగా భయము పోయి దైర్యము పెరుగుతుంది.
ఎప్పుడు ఆనందముగా ఉండటానికి, నీగురించి నీవు సంతృప్తిగా ఉండటానికి ప్రాదాన్యత ఇవ్వాలి.
అద్దము ముందు నిలబడి నీలో ఉన్న గొప్ప గుణాలను నెమరు వేసుకోవాలి.
నీవు తలపెట్టి చిత్తశుద్ది తో చేస్తే ఎటువంటి పనినైనా చేయగలవు అనే విషయాన్ని నీకు పదే పదే చెప్పుకోవాలి.
నీవు చేయాలను కొన్న పనిని చేస్తున్నట్లు దానిలో సంపూర్ణ విజయం సాదించినట్లు మానసికముగా ఊహించుకోవాలి.
అప్పుడు మనకు ఆ పని చేయటానికి కావలసిన శక్తి వస్తుంది.
◆ నీవు నిజము అని భావించిన మాటలు మాట్లాడము,
నీవు నమ్మే సిద్దాంతాలు పాటించటం ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా నీవు మనస్పూర్తిగా నమ్మిన బాటలో నడవటము, దానికొరకు కఠోర నియమాలు పాటించటము అనే అలవాట్లు నీలోని వ్యక్తిత్వాన్ని పెంచి పరిపూర్ణమైన విశ్వాసాన్ని అందిస్తాయి.
నీవు లోపల ఒకటి నమ్మి, బయట ప్రజలకోసం మరొకటి చేయటం నీలో అంతర్గత సంఘర్షణకు కారణమై నీలోని శక్తిని తగ్గిస్తుంది.
◆ ఇతరులకు నీవు చేయగలిగిన సహాయము చేయాలి..
నీవు చేసే ఆ చిన్న సహాయాలు, అవి పొందిన వారు నీపై చూపే కృతజ్ఞతలు నీలోని శక్తి సామర్ద్యాలను పెంపొందిస్తాయి.
ఎందుకంటే తన గురించి తాను విశ్వాసంతో ఉండగలిగిన వ్యక్తి మాత్రమే ఇతరులకు సహాయము చేయగలడు.
నీలోని భావాలు బలోపేతమై ఇతరుల నుండి నీవు సహాయము ఆశించటం అనేది తగ్గి నీవు ఇంకా ఎక్కువ సహాయము ఎలా చేయగలవు అనే ఆలోచనలు పెరుగుతాయి.
నీకు తీసుకోవటం కంటే ఇవ్వటమే గొప్పతనము అని అర్దమై ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
కొత్త పనులు చేయగల దైర్యము పెరుగుతుంది.
◆ మొదటి రోజే పనిని సంపూర్ణ నైపుణ్యము తో చేయాలి అని మనపై మనము ఒత్తిడి పెంచుకోరాదు.
ఏ పనైనా మనము చేసే కొద్ది మనకు అనుభవము పెరిగి మనకు నైపుణ్యము వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి.
ఆ పని చేయాటానికి కావలసిన మెలుకవలను సానుకూల దృక్పదంతో ఆసక్తిగా గమనించి రోజు రోజుకూ కొద్ది కొద్దిగా విజయాలను పొందుతూ ముందుకు కదలాలి.
మనము చేసిన పొరపాట్లను విశ్లేషించి వాటిని రాబోయే కాలములో ఆపటానికి కావలసిన మార్గాలను గుర్తించి పాటించి సాదించాలి..
అంతే కాని మొదటి ప్రయత్నము లోనే పూర్తి నాణ్యత రావాలని రాకపోతే అపజయము పొందామని భావించరాదు..
మన ఆలోచనా విదానమే మన విశ్వాసము, మన శక్తి, మన కదలిక, మన జీవిత సాఫల్యము..
ఈ సిద్దాంతాలు పాటిస్తే ఆత్మ విశ్వాసం నిరంతరం మన వెంటే ఉంటుంది.
- రామ్ కర్రి
8096339900
- స్వస్తీ...
__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___ ___
ఓం
మీ యొక్క విరాళం ధర్మ కార్యానికి శ్రీకారంమీ యొక్క అమూల్యమైన విరాళాలను Google Pay, Phone Pay, Amazon, Paytm ద్వారా 8096339900 కి పంపించండీ.
మీ యొక్క అమూల్య మైన విరాళాన్ని అందించడం ద్వారా ఈ ధర్మ కార్యం మధ్యలో ఆగకుండా చూడండీ...
విరాళం అందించాలనే సమయంలో ఏవయినా సమస్యలు తలెత్తితే ఈ నెంబర్ 8096339900 పైన నొక్కి వాట్సాప్ కి సందేశం పంపండీ...
__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___ ___