వదాన్యతే వరమైతే...




మిగిలితే ఇవ్వడం వేరు, 
మిగిల్చి ఇవ్వడం వేరు. 

మొదటిది బిచ్చం. 
రెండోది దానం.
 
‘ఆదరమలరంగా ఇడుట లెస్స అడిగిన మాత్రన్‌’ అంది భారతం.

 ‘దానమున గల్గు పుణ్యము, దానముననె కీర్తి నిలుచు, దానమునకు అధికమైన ధర్మము గలదే’ అని ప్రశ్నించింది - మత్స్యపురాణం. 

దానగుణాన్ని ‘ఈవి’ అంటారు. 

ఈవి గలవారిని దాత, ఉదారుడు, వదాన్యుడంటూ మూడు రకాలుగా వర్గీకరించారు పెద్దలు. 

సాయంకోరి వస్తే కాదనకుండా వెంటనే తృణమో పణమో ఇచ్చి పంపేవాడు- దాత! 

అడిగినవారి అవసరాన్ని పసిగట్టి అడిగిన దానికన్నా కాస్త ఎక్కువే ముట్టజెప్పేవాణ్ని ఉదారుడు అంటారు. 

వదాన్యుడి స్వభావం అంతకన్నా గొప్పది. 

అవతలి వాడికి అవసరం వచ్చిందనో, ఆపద వాటిల్లిందనో తెలియగానే, అడిగేదాకా చూడకుండా గుట్టుగా చేతనైనంతా సహాయం చేసేవాడు వదాన్యుడు.


 ‘ధాత్రికిం కానలు కావు, 

శైలములు కావు, 

పయోధులు కావు భారముల్‌...’

 అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు భూమికి భారం కావట... 

‘దానకళా కలాప సముదంచిత సార వివేక సంపదన్‌...’

 ‘సమాజంలో మంచి స్థానాల్లో ఉండీ, దానధర్మాదుల విలువ బాగా తెలిసీ, పిల్లికి బిచ్చం పెట్టనివారే భూమికి బరువు’ అన్నాడు శృంగార నైషధకర్త శ్రీనాథుడు. 

‘పది కలిగిన ఒకటీవలె! పదిపదులు గడించెనేని పది ఇయ్యదగున్‌’ అని శేషధర్మం నిర్దేశించింది. 

అదీ అడగ్గానే ఇవ్వాలి గాని, ‘కాల విలంబమును ఆచరించి, పిమ్మట తత్‌ అభీప్సిత అర్థమున్‌ సమర్పణ సేయుట పాడి కాదిలన్‌...

 పదిసార్లు తిప్పించుకొని చివరకు చిరాగ్గా కొంత విదల్చడం దానమే కాదు సుమా!’ అంది.

కడుపులు కొట్టి దోచిన ధనానికి, కట్టెలు కొట్టి దాచిన దానికి స్వభావంలో చాలా తేడా ఉంటుంది. 

దానానికి శీలం ఉండాలంది భారతం. 

‘అన్యాయార్జితమైన విత్తమున చేయంబూను దానంబు మూర్ఖ న్యాయంబు’ అని అరణ్యపర్వం స్పష్టం చేసింది. 

అంతేకాదు, కొండంత సంపన్నుడు గోరంత విదిల్చి ‘ఏదో ఉడుత సాయమిది’ అనడం చాలా తప్ఫు

 వానరులు లంకకు వారధి నిర్మిస్తుంటే ఉడుత తనవంతుగా నేలమీద పొర్లి ఒంటికి ఇసుక అంటించుకొని సముద్రంలో దులపరించడం సామాన్యమైన సాయం కాదు, దాని జీవిత సర్వస్వం. 

ఆ అల్పప్రాణి తన అణువణువునూ రామకార్యానికి అంకితం చేసి, తన జాతి మొత్తానికి శ్రీరాముడి చేతి చారల సౌభాగ్యాన్ని వారసత్వంగా ఇచ్చింది. 

అది సాధారణ భోగం కాదు. 

ఎంతటి మహా భక్తులకూ దక్కని మహాయోగమది. 

కాబట్టి ఆ పోలిక ఉడుతకే కాదు, వదాన్యతకే కళంకం. 

దోషం. 

సంపన్నులు చేసే భారీ దానాలకన్నా శ్రమజీవుల చిరు త్యాగాలకు లోకం ఎంతో విలువను ఆపాదిస్తుంది. 

అది న్యాయం. 

ఆకలి అంటే బాగా తెలిసినవాడు అన్నం పెడితే, దాని రుచే వేరు.

 మదురైకి చెందిన నేత్ర తాజాగా నిరూపించిన సత్యమది.

 ఉన్నప్పుడు గంజి తాగి, లేనప్పుడు పస్తులుండి కూడబెట్టిన మొత్తాన్ని 

కరోనా నిర్బంధంలో ఆకలితో అలమటిస్తున్న ఆర్తుల కోసం ఆనందంగా ఖర్చు పెట్టేసింది.

 నిత్యం అన్నదానం చేసింది. 

దాచిన సొమ్ము చెల్లిపోతే తల్లి ఒంటి మీద నగలను సైతం అమ్మేసింది.

 ఉడుత సాయమంటే అది!

 పుస్తెలమ్మి మరీ పస్తులు తీర్చిన ఆ కుటుంబం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

 ‘దానేన భోగీ భవతి’ అనే ఆర్యోక్తి ని నిజం చేస్తూ 

ఐక్యరాజ్య సమితి నేత్రను ‘గుడ్‌విల్‌ అంబాసడర్‌’ గా జెనీవాకు ఆహ్వానించింది.

 వదాన్యుడు ‘సురలోకంబున నుండును తరుణీసుత బంధుమిత్ర దాయాదులతోన్‌’ అన్నమాట అన్నివేళలా చెల్లుబాటయ్యే దైవశాసనం అనిపిస్తోంది!




- స్వస్తీ...


- రామ్ కర్రి
8096339900