శంకా సంకుచితాంతరంగులు కురుక్షేత్రంలో రాణించగలరా?
మూడు శతాబ్దుల ముందు వరకు యావత్ప్రపంచానికి కావలసిన అన్ని వస్తువులను తయారుచేసి ఇచ్చిన భారతదేశం ఈనాడు తమ ప్రజలకు అవసరమైన వస్తువులు తయారుచేసుకోలేదా ? నిజంగానే భారత జాతి స్థితి ఇంతగా దిగజారిందా?
నేడు సగటు భారతీయుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టిన అర్జునుడులా ఉన్నాడు.
తన రక్తంలో, తన సంప్రదాయంలో, తన దేశపు కళలలో, తనదైన సాహిత్యంలో ఏమి ఉన్నదో అది స్ఫురించటంలేదు.
మనం తీసుకొనే చర్యలకు పాపం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల వాళ్ళేమైపోతారో అని బాధపడిపోతున్నాడు.
చైనా వాళ్ళెక్కడ రెచ్చిపోతారో అని భయపడి పోతున్నాడు.
మన దగ్గర ముడిసరుకులు వట్టిపోలేదు.
పంటలు పండించే చేవ తగ్గిపోలేదు.
రకరకాల వస్తువుల ఉత్పాదన చేసే సామర్థ్యం నశించిపోలేదు.
అయినా ఎందుకు అయోమయ స్థితి?
కొన్ని దశాబ్దాలుగా విదేశీ వస్తువులు మేలైనవని,
దిగుమతి అయిన వస్తువులు వాడటం ద్వారా గొప్పతనం ప్రదర్శించుకోవచ్చునని మనకు నాటి మన పాలకులు మప్పినారు.
గాంధీ వారసుల మని ప్రకటించటం కోసమే ఖద్దరు, అంతకుమించి ఖద్దరు, చేనేత వస్త్రాలపై ప్రేమలేదు.
మన దేశంలోని కోట్లాది ప్రజలకు భుక్తి సమకూర్చే మార్గమన్న స్పృహలేదు.
అన్ని వస్తువుల విషయంలోనూ వారికి ఏవిధమైన స్పృహా లేదు.
ఉన్నదల్లా ఏమేరకు కమీషన్లు లభించగలవనే లెక్కలే !
దశాబ్దాలుగా సైన్యానికి ఆయుధాలు ఇవ్వలేదు.
తూటాలు ఇవ్వలేదు.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదు.
రోడ్లు వేయలేదు,
వాహనాలు సమకూర్చలేదు.
ప్రజలకు నేర్పినది ఒక్కటే..
ఎవడు ఎక్కువ పైసలిస్తాడో,
ఎవడు వాగ్దానాల పంచరత్నాలు గుప్పిస్తాడో,
ఎవడు త్రాగబోస్తాడో వాడికి వోటువేయటం.
ఆంగ్లమాధ్యమం ఇంజినీరింగ్ చదువుల ద్వారా గొప్ప సర్టిఫికెట్ లు చేతికివచ్చాయి.
కౌశలాలు, నైపుణ్యాలు నేర్పవలసిన తీరులో నేర్పలేదు.
నాటకాలు సాగిపోయాయి.
కాలేజీ పెట్టటమంటే భవనాలు మాత్రమేనా?
రీ ఇంబర్స్ మెంట్ ఉంటే సరిపోయిందా?
పాఠాలుచెప్పి నైపుణ్యాల నలవరిచే ఉపాధ్యాయులు, ఆచార్యులూ ఉండనక్కరలేదా?
ఇన్ స్పెక్ షన్ వేళకు ఎక్కడినుండో తెచ్చిన వారిని నిలబెడతారు.
ఈ తీరున ప్రతిచోటా నాటకాలే నడిచాయి.
వీటిలోంచి తయారై వచ్చిన వారికి మన దేశాన్ని మనం రక్షించుకోగలమని,
మన ప్రజలను మనం పోషించుకోగలమని,
మనం ఎవరినీ ప్రాధేయపడ నక్కరలేదనీ విశ్వాసం కల్పించగలమా?
ఇదే నేటి సమస్య.
విశ్వాసాన్ని - ఆత్మవిశ్వాసాన్ని మేల్కల్పటం,
సంకల్పాన్ని దృఢతరం చేయటం,
మన సామర్థ్యాలను గుర్తు తెచ్చుకొని కర్తవ్యోన్ముఖులం కావటం,
విదేశీ ఏజెంట్లు అలవాటు చేసిన తేనె పూసిన విష పదార్థాలను ఏమాత్రం మోమోటమి లేకుండా తిరస్కరించటం
ఇదే ఇప్పుడు చేయవలసిన పని ,
అనుసరించవలసిన నీతి.
ఈ సందిగ్ధ వాతావరణంలో వందేళ్ళక్రితం గురుదేవ రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పినమాట గుర్తువస్తున్నది.
భారతదేశంలో అక్షరాస్యులు ఇరవై శాతమేకాగా నూరుశాతం విద్యావంతులే!
అదెలాగా? ఇక్కడి ప్రజలందరికీ తాము మాట్లాడే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషలేగాక మరో భాషకూడా తెలుసు.
అది రామాయణ మహాభారతాల భాష.
అది సందేహాలను తీరుస్తుంది విశ్వాసాన్ని అందిస్తుంది,
కర్తవ్యం తెలియజేస్తుంది.
ప్రతి భారతీయుడూ వ్యాసమహర్షి రచించిన మహాభారతం నుండి అందులోని ప్రముఖ పాత్రలైన శ్రీ కృష్ణార్జునులనుండి ప్రేరణ పొందగల అవకాశం ఉంది.
మహాభారతం ఒక నవల మాత్రమేకాదు.
జీవితంలో ఎలా పోరాడుతూ ముందుకు సాగాలో,
విజయాన్ని ఎలా కైవసం చేసికోవాలో,
తన మార్గంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పే అనుభవాల సమాహారం.
శ్రీ కృష్ణుని మార్గదర్శనంలో ముందడుగువేసిన విజయునిలా నేడు మనకు లభిస్తున్న సందేశాన్ని గ్రహించుకొని ధనుర్ధారులమై విజయపథంలో ముందుకు సాగుదాం.
వీర భారతభూమి నావిర్భవించి పౌరుషము లేని బానిస బ్రతుకు లేల ?
ఈ అయోమయ శృంఖలా లింకనైన త్రెంచుకొని బయల్పడి విజృంభించరేల ?
- స్వస్తీ...