మనిషికి బాహ్య రూపం శరీరం.
అంతర్ముఖం సంస్కారం.
శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు.
అంతర్ముఖమైన సంస్కారాన్ని గురువు మాత్రమే ఇవ్వగలడు.
మన తలరాత రాసేవాడు బ్రహ్మ, నడిపించే వాడు శివకేశవులైతే..
ఈ మూడిటిని మార్చుకోగల వ్యక్తిత్వాన్ని, తెలివితేటలను ఇవ్వగల పరమాత్మ గురువు.
అందుకే గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు.
గురు సాక్షాత్ పరబ్రహ్మగా పూజిస్తారు.
విద్య వికాసానికి మూలం.
తమస్సు తొలగించి,
జీవనాన ఉషస్సు కలిగించి,
శాశ్వతమైన తేజస్సు అందించేది విద్య.
మాయ, అవిద్యలు మనిషిని ఆవరించి ఉంటాయి.
వాటివల్ల జన్మ మృత్యు జరా వ్యాధులు ఏర్పడతాయి.
చిత్త భ్రమ, విభ్రాంతులు సంభవిస్తాయి.
అలాంటి వాటిని తన జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు.
అజ్ఞానాంధకారాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాల్ని శుద్ధిచేసే మహితాత్మ స్వరూపం గురువు.
జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే త్రిమూర్తుల ఆకృతి గురువు.
అందువల్లే గురువుని పూజించాలని పెద్దలు చెప్తారు.
గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే
గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా,
పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం.
సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది.
పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు.
ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.
ఈ రోజున గురువులను పూజించి, గౌరవిస్తారు.
గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది.
ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’
గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది.
యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం.
ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి.
అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తప:స్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది.
గురుపూజ శ్రేష్ఠమైంది.
దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.
ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా,
వ్యాస పూర్ణిమగా ఆచరిస్తాం.
వేదాలను ఏర్చి కూర్చి..
ఋక్, సామ, యజుర్, అథర్వ వేదాలుగా విభజించి
సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి,
వేదాలకి ఓ స్వరూపాన్నిచ్చిన
మహానుభావుడు వేద వ్యాసుడి ఆవిర్భావ దినోత్సవాన్ని
గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు.
నావలో (ద్వైపాయనం ) జన్మించాడు,
నలుపు (కృష్ణ వర్ణం) రంగులో ఉంటాడు.
కాబట్టి వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు.
18 పురాణాలను,
18 ఉప పురాణాలను,
మహాభారతాన్ని,
బ్రహ్మ సూత్రాలను,
ఆధ్యాత్మ రామాయణమును రచించి…
కలియుగ మానవ జాతికి దారి చూపిన ఆది గురువు వ్యాసుడు.
ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలతోనే మానవ వికాసం ఉందని వ్యాస మహర్షి బోధించాడు .
ఈ ప్రేరణతోనే షిర్డీ సాయి జీవితమంతా గురు సేవ చేశారు.
ఆ సంప్రదాయాన్ని తన శిష్యులు కూడా గురుసేవ పాటించాలని షిర్డీ లో బాబా తన భక్తులను ఆదేశించారు.
అందుకు వ్యాస పూర్ణిమను మించిన రోజు లేదని బాబానే నిర్ణయించారు.
అందుకే గురు పౌర్ణమి సాయిబాబా ఆలయాల్లో వైభవంగా జరుగుతోంది.
వ్యాసుడెవరు?
సప్త ఋషుల్లో ప్రధముడు వశిష్ఠుని కుమారుడు శక్తి,
శక్తి కుమారుడు పరాశరుడు,
పరాశరుడి కుమారుడు వ్యాసుడు.
వ్యాసుడి కుమారుడు శుక మహర్షి.
యుగ గురువుల వంశోద్భవుడు వ్యాసుడు.
పుట్టుకతోనే ఏమీ రావు.
అమ్మ ఒడి తొలి బడి కాబట్టి అమ్మే తొలి గురువు.
నడక నేర్పే నాన్నే రెండో గురువు.
ప్రత్యక్ష దైవాలు వారిద్దరూ గురుతుల్యులు.
మాతృదేవో భవ, పితృదేవో భవ.. అంటారందుకే.
మరి గురువంటే..?
అవిద్యా హృదయగ్రంధి బంధమోక్షో భావేద్యతః
తమేవ గురు రిత్యాహు ర్గురుశబ్దార్ధ వేదినః
అంటే… ఆజ్ఞాన అంధకారాలను తొలగించి,
అవిద్య నుంచి విముక్తి కలిగించే వాడే గురువు అని అర్థం.
గుశబ్దస్త్వంధకారః స్యాత్ రు శబ్దస్తన్నిరోధకః
అంధకార నిరోధిత్వాద్గురురిత్యభిధీయతే
అంటే… గు అనే శబ్దానికి అంధకారమని అర్థం.
రు అంటే నాశనం అని అర్థం.
చీకట్లను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే శబ్దమే గురు.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాశిష్ఠాయ నమో నమః’
విష్ణుస్వరూపుడు, వశిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునిని గురువుగా తలచి పూజిస్తున్నాం.
అదే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి.
అసలు గురువు ఎలా ఉండాలంటే…!!!
చదువు చెప్పేవాడు మాత్రమే కాదు. శిష్యుల మంచి, చెడులు గ్రహించగలిగి వారిలో వ్యక్తిత్వాన్ని పెంచాలి.
వారి ప్రతిభను గుర్తించ గలిగేవాడు కావాలి.
ఎంత మంది గురువులో… !!!
సూచక గురువులు :
లౌకిక పద్ధతుల గురించి బోధించి.. ఫలితాలు వివరిస్తారు.
భక్తి, జ్ఞాన, వైరాగ్య బోధనలు చేసి భక్తులను తయారు చేస్తారు..
రామకృష్ణ పరమ హంసలా…
వేద గురువులు :
వేదాలు, పురాణ, ఇతిహాసాలు నేర్పేవారు.
నిషిద్ద గురువులు :
యంత్ర–తంత్రములు ఉపాసనలు చేయించే వారు.
వీరు క్షుద్రం నేర్పిస్తారు కాబట్టి..
అవి సమాజ విరుద్ధం కాబట్టి…
వీరు శిష్యరికం నిషిద్ధమని ఆనాడే నిర్ధారించారు.
కామ్యక గురువులు :
త్యాగమూర్తులై ఉంటారు.
భక్తి భావాన్ని బోధిస్తారు.
ఆధ్మాత్మిక గురువులంతా ఈ కోవలోకే వస్తారు.
బోధక గురువులు :
వేదాంతాన్ని బోధిస్తారు.
ఫిలాసాఫికల్ థాట్ నేర్పించేవారు.
వివేకానందునిలా.
నాద గురువులు :
వీరి స్వరం శిష్యునికి చేరాలి.
అప్పుడే అతడు జ్ఞాన వంతుడుగా మారతాడు .
మాటతోనే విద్య నేర్పగల విజ్ఞులు.
వేదం నేర్పేది ఈ పద్ధతిలోనే.
ఛాయానిది గురువులు :
ఛాయ అంటే నీడ.
గురువు అనుగ్రహం ప్రసరిస్తే చాలు వారు జ్ఞానవంతులవుతారు.
కాళిదాసు ఈ రకంగానే అమ్మవారి అనుగ్రహం పొంది మహా కవి అయ్యాడు.
పరమ గురువులు :
దివ్య స్పర్శతో విద్యను పంచగల మహానుభావులు.
కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖర సరస్వతి స్వామి లాంటి మహానుభావులు ఈ కోవలోకి వస్తారు.
చందన గురువులు :
వీరు పాఠం చెప్తే గంధం చెట్టు సువాసనలా ఎంత మందికైనా చేరుతుందట.
ఎంత గొప్ప గురువో కదా..
క్రౌంచక గురువులు :
ఎక్కడున్నా గుడ్లను పొదిగే శక్తి క్రౌంచక పక్షికి ఉంటుందంటారు.
అలాగే… దూరాన ఉన్నా శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించగలర క్రౌంచక గురువులు.
ద్రోణుడు–ఏకలవ్యుడి కథ ఇలాంటిదే.
వాచక గురువులు :
ఉపదేశాలు భోధించి,
తత్వ బోధనతో గమ్యం చేరుస్తారు.
తత్వ వేత్తలు.
కారణ గురువులు :
ఆసనాలు, ప్రాణయామాలు చేయించే యోగ గురువులు ఈ కోవలోకి వస్తారు.
సద్గురువులు :
జ్ఞానం తెలుసుకోగల్గితే గురువు - శిష్యుడు ఒక్కటే అని
తెలియచెప్పే గొప్ప గురువులు.
రామకృష్ణ పరమ హంస - వివేకానందుల సిద్ధాంతమిదే.
ఒక గురువు తలుచుకుంటే… రాముడు లోక నాయకుడయ్యాడు,
అర్జునుడు మహా వీరుడయ్యాడు,
మట్టి లాంటి చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు,
శివాజీ ఛత్రపతి అయ్యాడు,
ఒక నరేంద్రుడు ప్రపంచానికి భారత దేశ గొప్పదనాన్ని వివరించిన వివేకానందుడయ్యాడు.
బండరాయి శిల్పంగా మారినట్టు,
రక్త మాంసాల ఒట్టి ఈ శరీరాన్ని ప్రపంచానికి పనికొచ్చే విజ్ఞానంగా మార్చే శిల్పి గురువు.
జ్ఞాన సాధనకి గురుసేవని మించిన తపస్సు మరొకటి లేదు.
శ్రీ గురుభ్యో నమః
- రామ్ కర్రి
8096339900
- స్వస్తీ...
........