ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు..! 

రేపే ఆలయ సాకారం...

అయోధ్యలో రామాలయం భూమి పూజ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన...

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి

నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు...

శంకుస్థాపనకు పుణ్య నదుల నుంచి జలాలు

తొలి ఆహ్వానం ముస్లిం ప్రముఖుడికి.. బాబ్రీ కేసు కక్షిదారు అన్సారీకి అందజేత

రాముడి కోరిక కావచ్చు.. అందుకే అందుకున్నా: అన్సారీ

అతిథుల కుదింపు.. వేదికపై మోదీ సహా ఐదుగురే! 

ఆన్‌లైన్‌లో , జోషీ హాజరు.. పటిష్ఠ ఏర్పాట్లు

ఆహ్వాన పత్రిక ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతి

బృహత్తర రామాలయానికి అయోధ్యలో భూమిపూజ

ఆడ్వాణీ రథయాత్రతో ఉద్యమానికి రాజకీయ రూపు తర్వాత రెండేళ్లకే బాబ్రీ విధ్వంసం

30 ఏళ్లుగా రాముడి చుట్టూనే రాజకీయం

70 ఏళ్లుగా కోర్టుల్లో నలిగిన కేసు

అంతిమంగా తెరదించిన సుప్రీంకోర్టు

శ్రీరాముడికి అనుకూలంగా తీర్పు

అయోధ్యలో రామాలయం కొలువు తీరాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరబోతోంది. 

బృహత్తర ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. 

ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరగనుంది. 

అయోధ్యలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలు తీసుకుంటూనే.. 

ముందుజాగ్రత్త చర్యగా అతిథుల జాబితాను ఆలయ నిర్మాణ ట్రస్టు కుదించి వేసింది. 

సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, ఆయన సహచరులు తరలిరానుండగా..

 రామ జన్మభూమి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

శతాబ్దాల కల...  దశాబ్దాల ఉద్యమ ఫలితం...

విశ్వవ్యాప్తంగా హిందువులు వేచి చూస్తున్న తరుణం...

రానే వచ్చింది.. 

శ్రీరామ చంద్రుడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరుగనుంది.

 వేద పఠనం, మంత్రోచ్చారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా.. 

గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. 

ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

భూమి పూజకు ముందస్తుగా సోమవారం నుంచే పూజాదికాలు మొదలయ్యాయి. 

మూడ్రోజులు సాగే ఈ క్రతువు బుధవారం నాడు భూమిపూజతో పరిసమాప్తమై..

 అనంతరం నిర్మాణ మహాయజ్ఞం ప్రారంభమవుతుంది.

అది సరయూనది.. ఒడ్డునే 

అయోధ్య నగరం.. కోసల రాజ్య రాజధాని. 

త్రేతాయుగం నుంచి ఇది శ్రీరామ చంద్రుడి జన్మస్థానమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. 

ఇక్కడి ఆలయాన్ని మొగల్‌ పాలకుడు బాబర్‌ హయాంలో అతడి సేనాపతి మీర్‌ బాకీ 1528 లో ద్వంసం చేసి.. 

రామాలయ శిథిలాల పై బాబరు పేరిట బాబ్రీ మసీదు నిర్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతారు.

 నాటి నుంచే అక్కడ రామాలయ పునర్నిర్మాణానికి డిమాండ్‌ మొదలైంది. 

మరో ఎనిమిదేళ్లలో ఈ డిమాండ్‌కు ఐదు శతాబ్దాలు పూర్తవుతాయన్న మాట. 

1855 లో ఆలయ నిర్మాణం కోసం ఘర్షణలు జరిగాయి. 

నాటి నుంచి క్రమక్రమంగా హిందువుల గళం పెరుగుతూ వచ్చింది. 

1980ల్లో ఉద్యమ రూపం దాల్చింది. 

రాజకీయ రంగు పులుముకుంది. 

న్యాయస్థానాల్లోనూ పోరాటం జరిగింది. 

దరిదాపుగా 70 ఏళ్లు కోర్టుల్లో నలిగిన ఈ కేసుకు నిరుడు తెరపడింది. 

వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని గత ఏడాది నవంబరు 9వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. 

తదనుగుణంగా ఇప్పుడు ఆలయ నిర్మాణం మొదలుకాబోతోంది..

కోర్టు తీర్పులు...

రామాలయ నిర్మాణానికి ఇటు న్యాయపోరాటం కూడా సాగింది. 

ఆ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా చేయాలంటూ 2010 సెప్టెంబరు 30న అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. 

మధ్యవర్తులను నియమించినా ఫలితం లేకపోయింది. 

తుదకు నాటి చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరిపింది. 

నిరుడు నవంబరు 9న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.

ఆలయం ఉన్నట్లు తేల్చింది ఓ ముస్లిం అధికారి !

అయోధ్యలో బాబ్రీ మసీదు అడుగున భారీ ఆలయ శిథిలాలు ఉన్నాయని భారత పురావస్తు విభాగం ( ఏఎస్‌ఐ ) రెండు సార్లు ( 1976-77, 2003 ల్లో ) జరిపిన తవ్వకాల వల్ల తెలిసింది. 

1976-77 లో జరిగిన మొదటి తవ్వకాలు నాటి ఏఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ బీబీ లాల్‌ సారథ్యంలో జరిగాయి. 

ఆ బృందంలో సీనియర్‌ ఆర్కియాలజిస్ట్‌ కె.కె.ముహమ్మద్‌ కూడా సభ్యుడు. 

మసీదు కింద పెద్ద ఆలయ నిర్మాణం ఉందని తేల్చింది ఆయనే. 

సుప్రీం తీర్పును తొలుత స్వాగతించింది కూడా ఆయనే. 

ముస్లింలు మనస్ఫూర్తిగా దీనిని స్వాగతించాలని.. 

సయోధ్య, సామరస్యంతో హిందువులతో  సహజీవనం చేయడానికి అందివచ్చిన ఈ అవకాశాన్ని జారవిడవొద్దని పిలుపిచ్చారు. 

అలాగే హిందువులు కూడా పెద్ద మనసుతో ఫైజాబాద్‌లో గానీ లఖ్‌నవూలో గానీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని ప్రతిపాదించారు. 

భవిష్యత్‌ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అయోధ్యలో మాత్రం భూమి కేటాయించవద్దన్నారు.

ప్రపంచం నలుమూలలా...

భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యనదుల జలాలను తెప్పిస్తున్నారు. 

అయోధ్య ఆలయ నిర్మాణం జరిగే హనుమాన్‌గఢీ పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఏడు వేల దేవాలయాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. 

ఐదో తేదీన ఈ ఆలయాల్లో దీపాలు వెలిగించి వేడుకల్లో పాల్గొంటారు. 

అమెరికా, కెనడా, కరేబియన్‌ దీవులు సహా పలు విదేశాల్లోని భారతీయులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. 

అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను శంకుస్థాపనకు ఆహ్వానించారు.

మార్చిలోనే నిర్మాణ తొలిదశకు శ్రీకారం..

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ ఏడాది మార్చిలోనే ఆలయ నిర్మాణ తొలిదశకు శ్రీకారం చుట్టింది. 

అయితే కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ ఆంక్షలతో పనులు పెద్దగా ముందుకు సాగలేదు. 

మార్చి 25న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహాన్ని తాత్కాలిక ఆవాసంలోకి మార్చారు. 

ఆలయ నిర్మాణానికి ఎలాంటి అవరోధాలు కలగకుండా వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా విజయ మహామంత్ర జప అనుష్టానాన్ని ( శ్రీరామ నామ జపం ) నిర్వహించింది.

ఆలయ స్వరూపమిదీ...

వాస్తు శాస్త్రం ప్రకారం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం. 

దిగువ అంతస్తులోనే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ. 

ఐదు మండపాలు.. నృత్య మండపం, సింహద్వార్‌, పూజామండపం, రంగ్‌ మండపం, గర్భగృహం.. ఉంటాయి. 

27 నక్షత్ర వాటికలను ఏర్పాటుచేస్తారు. 

భక్తులు తమ జన్మదినాన ఇక్కడి చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. 

భూమిపూజ అనంతరం రామ్‌లల్లాను ఆలయ సముదాయంలోని శేషావతార్‌ ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్ఠిస్తారు. 

ఆలయ సముదాయంలో ప్రార్థనా మందిరం, ఉపన్యాస వేదిక, వేద పాఠశాల, సంత్‌ నివాస్‌, యాత్రి నివాస్‌లను నిర్మిస్తారు. 

ఆలయ నిర్మాణ పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేపడుతోంది. 

మూడున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని అంచనా.

ఆలయం పొడవు, వెడల్పు, ఎత్తు

అయోధ్య రామ మందిరాన్ని ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నాగర శైలి’లో నిర్మించనున్నారు. 

ఇక.. రామాలయ నిర్మాణ ప్రధాన స్థపతి చంద్రకాంత్‌ సోంపుర ( ఆయన తాత ప్రభాకర్‌జీ సోంపుర సోమనాథ్‌ ఆలయ నమూనా రూపకర్త ). 

ఆలయ నిర్మాణానికి ఈయన 1983లో ప్రాథమిక డిజైన్‌ రూపొందించారు. 

తర్వాత 1998 లో పూర్తిస్థాయి నమూనాను తయారుచేశారు. 

ఇప్పుడీ డిజైన్‌ను ఈయన కుమారులు నిఖిల్‌ సోంపుర, ఆశిష్‌ సోంపుర నవీకరించారు. 

ఆలయం వెడల్పు 140 అడుగులు, పొడవు 268 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉండాలని చంద్రకాంత్‌ ప్రతిపాదించగా... ఆయన కుమారులు ఎత్తు 161 అడుగులు, పొడవు 300 అడుగులు, వెడల్పు 268-280 అడుగులకు మార్చారు. 

పాత నమూనాలో 212 స్తంభాలు ఉపయోగించాలని భావించగా.. ఎత్తు, పొడవు, ఎత్తు పెరిగినందున సమతుల్యత కోసం 360 స్తంభాలు అమర్చాలని నిర్ణయించారు. 

15అడుగుల లోతున పునాదులు నిర్మిస్తారు.

ఇదీ చరిత్ర...

1528 నుంచి 1822 వరకు ఆలయం కోసం డిమాండ్‌ ఉన్నా.. మత ఘర్షణలు జరగలేదు. 

రామాలయం పై మసీదు నిర్మించారని 1822 లో ఫైజాబాద్‌ కోర్టు అధికారి ఒకరు పేర్కొనడం హిందువులకు ఆసరా అయింది. 

దీని ఆధారంగా.. మసీదున్న ప్రదేశం తమదేనని.. దానిని గుడికట్టేందుకు తమకివ్వాలని నిర్మోహి అఖాడా వాదన అందుకుంది. 

ఈ విషయమై 1855 లో పెద్ద ఎత్తున హిందూ - ముస్లిం ఘర్షణలు జరిగాయి. 

మున్ముందు ఇలాంటివి జరగకుండా.. 1859 లో మసీదు ఆవరణలో బ్రిటిష్‌ పాలకులు రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. 

1949 వరకూ ఎలాంటి గొడవలు లేకుండా నడిచింది. 

1949 లో హిందూ మహాసభ కార్యకర్తలు కొందరు మసీదు ప్రాంగణంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

దీంతో పెద్ద దుమారమే రేగింది. 

వ్యవహారం కోర్టుకెక్కింది. 

దీనిని వివాదాస్పద కట్టడంగా ప్రకటించారు. 

మసీదు తలుపులకు తాళం వేశారు. 

అదే సమయంలో రామజన్మభూమి ఉద్యమం మొదలైంది.

 1980లో విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ) రంగప్రవేశం చేసింది. 

వివాదాస్పద ప్రదేశంలో రామాలయం నిర్మించాలని ఉద్యమం ప్రారంభించింది. 

1986 లో ఫైజాబాద్‌ జిల్లా జడ్జి.. 

ఆ కట్టడం తలుపులు తెరిచి హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతించారు. 

దీనిని కేంద్రంలో నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం సమర్థించింది. 

షాబానో కేసులో ఆయన ప్రభుత్వ తీరుతో హిందువులు కాంగ్రె్‌సకు దూరమయ్యారు. 

తిరిగి వారికి చేరువయ్యేందుకు జిల్లా కోర్టు నిర్ణయానికి రాజీవ్‌ మద్దతు పలికారు. 

అయితే రెండు వర్గాల ఓట్లు దూరమై 1989లో ఆయన అధికారం కోల్పోయారు. 

లోక్‌సభ లో బీజేపీ బలం పుంజుకుంది. 

దాని సీట్లు 2 నుంచి 88కి పెరిగాయి. 

ఆ పార్టీ మద్దతుతో వీపీ సింగ్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. 

తర్వాత కొద్దికాలానికి బీజేపీ పూర్తిస్థాయిలో రామజన్మభూమి ఉద్యమంలోకి దిగడమే కాకుండా.. 

దానిని సంపూర్ణ రాజకీయ ఉద్యమంగా మార్చేసింది. 

దీనిని ఎల్‌కే ఆడ్వాణీ మరింత ఉర్రూతలూగించారు. 

సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్య వరకు రామ రథయాత్ర ప్రారంభించారు. 

హిందువుల ఓట్లను మరింత సంఘటితం చేయడమే ఈ యాత్ర ప్రధానోద్దేశం. 

1990 సెప్టెంబరు 25న సోమ్‌నాథ్‌లో ఆడ్వాణీ మొదలుపెట్టిన ఈ యాత్ర వందల గ్రామాలు, నగరాల గుండా సాగింది. 

దీనివల్ల ఉత్తర భారతంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. 

నాటి బిహార్‌ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌.. 

రథయాత్ర సమస్తిపూర్‌ చేరుకోగానే సరిహద్దులోనే ఆడ్వాణీని అక్టోబరు 23న అరెస్టు చేయించారు. 

దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన సంఘటన ఇదే. 

లక్షన్నర మంది కర సేవకులను యూపీలోని ములాయంసింగ్‌ యాదవ్‌ సర్కారు అరెస్టు చేసింది. 

అయినప్పటికీ వేల మంది కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. 

మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. 

పోలీసు కాల్పుల్లో 20 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. 

ఆగ్రహించిన బీజేపీ.. వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. 

కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధాని అయ్యారు. 

1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. 

బీజేపీ తన బలాన్ని  120 స్థానాలకు పెంచుకుంది. 

1996 ఎన్నికలనాటికి బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీ (161 స్థానాలు)గా ఎదిగింది. 

వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

కానీ లౌకికవాద పార్టీలేవీ మద్దతివ్వకపోవడంతో 13 రోజులకే రాజీనామా చేశారు. 

1998 ఎన్నికల్లో అన్నా డీఎంకే మద్దతుతో వాజపేయి సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 

కానీ ఏడాది గడవకముందే ఒకే ఓటు తేడాతో ఓడిపోయింది. 

1999 ఎన్నికల్లో మళ్లీ వాజపేయి ప్రభుత్వం ఏర్పడింది. 

ఆలయానికి అనుకూలంగా చట్టం తేవాలని సంఘ్‌ పరివార్‌ డిమాండ్‌ చేసినా... 

ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు అందుకు సుముఖంగా లేకపోవడంతో వాజపేయి సాహసించలేదు. 

కొన్నాళ్లకు ఉత్తరభారతంలో ఓటర్లు మళ్లీ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు. 

ఫలితంగా 2004-14 మధ్య పదేళ్లు ఆ పార్టీ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం నడిచింది. 

కానీ నిష్ర్కియాపరత్వం కారణంగా పరాజయం పాలైంది. 

2014, 19ల్లో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 

రాముడికి అనుకూలంగా వచ్చిన సుప్రీం తీర్పుతో ఇప్పుడు రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది.





- స్వస్తీ...