🌐 రెవెన్యూ భాష ..!

Ⓜ రెవెన్యూ భాష లో ప్రతీ పదానికి ఓ లెక్క


💠 కొన్ని మొఘల్‌ చక్రవర్తుల నాటివి

⇒మరికొన్ని నైజాం ఫర్మానా  లోవి

⇒ఇప్పటికీ వాడుకలో అవే పదాలు


♻ రెవెన్యూ భాషంటే...  గిర్ధావర్‌.. తహసీల్దార్లు మాట్లాడే పదాలు  మాత్రమే కాదు.  

ఈ పదాలు వినగానే అన్నీ తెలిసిన పదాల మాదిరిగానే ఉంటాయి. 

అయితే వాటికి అర్థం మాత్రం చాలా మందికి తెలియదు. 

ముఖ్యంగా తహసీల్దారు కార్యాలయం లో రోజువారీగా ఉపయోగించే పుస్తకాల్లో ఈ భాషే ఎక్కువగా ఉంటుంది.

ప్రసుతం మిగతా ప్రభుత్వ శాఖలు దాదాపు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ మార్పుచెందినా కీలకమైన రెవెన్యూ శాఖ మాత్రం అధికారికంగా ఆ   పదాలే ఇప్పటికీ వాడుతోంది. 

ఎందుకంటే రెవెన్యూ శాఖలో భూముల రికార్డులకు సంబంధించి ‘కాస్రా’ పహాణీ వంటివి   శాఖకు ఒక గ్రంథం లాంటిది. 

దీంట్లో ఈ భాషలోనే పదాలు ఉంటాయి. 

అందుకే ఈ పదాలు నేర్చుకోక తప్పదు. 

ఈ పదాల్లో కొన్ని మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉన్నవి కాగా... 

ఎక్కువ మాత్రం    నిజాం కాలం నాటివి. 

రెవెన్యూ రికార్డుల్లో ఉండే పదాలు... 

దానికి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం....


అడంగల్‌/పహాణీ..

గ్రామంలోసాగు భూమి వివరాలను నమోదు చేసే రిజిస్టర్‌. 

దీనిని ఆంధ్రా ప్రాంతంలో అడంగల్, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. 

ఈ రిజిస్టర్‌నే గ్రామ లెక్కల నంబర్‌–3 రిజిస్టర్‌ అని కూడా అంటారు. 

ఈ రిజిస్టర్‌లో గ్రామంలోని అన్ని భూముల వివరాలు ప్రతి సంవత్సరం నమోదుచేస్తారు.


పంచరాయి...

గ్రామంలో పశువుల మేతకోసం కేటాయించబడిన ప్రబుత్వ భూమిని పంచరాయి అంటారు. 

గ్రామానికి  దూరంగా అందరి పశువులకు మేతకోసం ఉపయోగించుకుంటారు. 

ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి దీనిపై ఎవరికీ అధికారాలు ఉండవు.


 హోమ్‌స్టడ్‌...

హోమ్‌స్టడ్‌ అంటే గ్రామంలోకానీ, పట్టణంలోకానీ భూమిలేని కూలీలు, వృత్తిపనుల వారు... 

ఇతరులకు సంబంధించిన భూములపై 14–08–1975 నాటకి నివాసం ఏర్పచుకున్న స్థలాన్ని హోమ్‌స్టడ్‌ అంటారు. 

అలాంటి భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులు ఇస్తారు.


 భూమిలేని నిరుపేద..

రెండున్నర ఎకరాల పల్లం లేదా ఐదెకరాల మెట్టభూమి కంటే తక్కువ భూమి ఉండి, సంవత్సర ఆదాయం రూ.11వేలకన్నా తక్కువగా ఉన్నవారు భూమిలేని నిరుపేదలు. 

వీరు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు.


బందోబస్తు..

వ్యవసాయ భూముల సర్వే, వర్గీ కరణ.


బంజరు భూమి :

ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వం భూమి.


 బీఘా..:

బీఘా అంటే 30గంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం..


బిల్‌ మక్తా.. : 

సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, లేదా గ్రామాన్ని బిల్‌ మక్తా అంటారు.


 చలానా..

ఇర్సాలు నామా అంటే గ్రామం లెక్క నంబర్‌–7. దీనినే చలానా అంటారు. దీనిద్వారా ప్రభుత్వానికి చెల్లించిన భూమి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.


ఎండార్స్‌మెంట్‌ :

గ్రామంలో ప్రజలు....ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియ చేసేవిధానం.


 ఇజారా :

ప్రభుత్వానికి చెందిన భంజరు భూములను వ్యవసాయానికి కానీ, నివాసం ఉండటానికానీ కొంత నిర్థిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ‘ఇజారా’అంటారు.


 ఫసలీ : 

ప్రతి సంవత్సరం జులై,1 తరువాత నుంచి తరవాత సంవత్సరం జూన్‌30 వరకు ఉన్న 12నెల్ల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు.  

ఈ పదం మొఘళ్ల్ల  కాలం నుంచి వాడుకలో ఉంది.


ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ :

ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. 

గ్రామంలోని అన్ని సర్వే నెంబర్ల పటాలు ఇందులో ఉంటాయి. 

వాటి కొలతలు కూడా ఉంటాయి.


 చల్కా..

మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్నది. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంట లు పండిస్తుంటారు.


బోర్డు స్టాండింగ్‌ అర్డర్లు...

రెవెన్యూ పాలనలో విధివిధానాలు సూచిస్తూ అప్పటిæ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ జారీ చేసిన ఉత్తర్వులు. అయితే ఇప్పటికీ అవే అమల్లో ఉన్నాయి.


గట్‌ నంబర్‌ :

సాగుభూమిని నిరుపయోగంగా వదిలేయడాన్ని గట్‌ నంబర్‌ అంటారు. దీనిని బీడు భూమి అనికూడా అంటారు*.


జమాబందీ :

జమా బందీ అం టే ప్రభుత్వానికి రావాల్సిన భూ మి పన్నులు, నీటి పన్ను, ఇతరబకాయిలు, సక్రమంగా లెక్కకట్టుట. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకురాబడినవా లేదా అని నిర్ధారించుకుటకు గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తని ఖీలను జమాబందీ అంటారు.


గిరిజనులకు ఏజన్సీ

గిరిజనులు నివసించే ప్రాతాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 

ప్రస్తుతం షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా పిలువబడే ప్రాంతాలను ఏజన్సీ ప్రాంతాలు అంటారు.


ఎకరం..

ఎకరం అన్నది భూమి విస్తీర్ణానికి కొలమానం. ఒక ఎకరం అంటే 4,840 చదరపు జగముల స్థలం. 

లేదా 100 సెంట్లు లేదా 40గంటలు.


గుంట(కుంట).. :

కుంట అంటే 121 చదరపు గజాల స్థలం. 

40 కుంటలు కలిస్తే ఒక ఎకరం.


అగ్రహారం..

బ్రాహ్మణులకు శిస్తు లేకుండా, తక్కువ శిస్తుతో గ్రాంటుగా ఇచ్చిన గ్రామం.. లేదా గ్రామంలోని కొంత భాగం.


ఆజమాయిషీ..

సరిగా ఉన్నది లేనిది తెలియజేయడం. 

భూమికి సంబందించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కల ను తనిఖీ చేయడాన్ని ఆజమాయిషీ అంటారు. 

ఎంఆర్‌ ఐ, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలు సంబంధిత తహసీల్దార్, డీటీ తనిఖీ చేయాలి. 

అలా తనిఖీ చేసి వివరాలు గ్రామ లెక్కల నెంబర్‌–3 లో నమోదు చేయాల్సి ఉంటుంది. 

ఈ విధానంగా ఆజమాయిషీ ప్రతి సంవత్సరం నిర్వహించాలి.


బీ–మెమో :

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు.


చిట్టా..

చిట్టా అంటే రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్‌. దీనినే గ్రామ లెక్క నెంబర్‌–6అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటిపన్ను, భూమిశిస్తు వగైరా సామి వారీగా వసూలు చేసి ఈ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.


చౌపస్లా..

ఇది పట్టాదారులకు ఉన్న భూము ల వివరాలు తెలిపే రిజిస్టర్‌ . 

ఇందులో భూమి వర్గీకరణ, విస్తీర్ణం, 

పట్టాదారు పేరు తదితర వివరాలు ఉంటాయి.


దస్తావేజు :

భూమికి సంబంధించి కొనుగోలు, అమ్మకాలు, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. 

భూ బదలాయింపు జరిగి నప్పు డు ఈ దస్తా వేజులను చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.


డైగ్లాట్‌ :

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సర్వే సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలు పూర్తి చేసి ప్రతి గ్రా మంలో భూముల వివరాలు నమో దు చేస్తారు. 

ఇందులో అన్ని రకాల భూముల సర్వే నెంబర్లు ,విస్తీర్ణం, అవి సర్కారా, ఇనాం భూములా, మాగా ణియా, మెట్టా, వాటి వర్గాకరణ, శిస్తు, మొదలగు వివరాలు ఉం టాయి. 

ఈ రిజిస్టర్‌ను ఇంగ్లిష్‌లో, తెలుగులో రాస్తారు. 

అందకే దీనికి ‘డైగ్లాట్‌’ అంటారు. 

దీనినే శాశ్వత ‘ఏ’ రిజిస్టర్‌గా పరిగణిస్తారు.

 ఈ రిజిస్టర్‌ మిగతా గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలస్తంభం లాంటిది.


అబ్సెంటీ ల్యాండ్‌ లార్డు..

పరోక్ష భూస్వామిని అబ్సెంటీ ల్యాండ్‌ లార్డు అంటారు. 

ఒక గ్రామంలో భూమి ఉండి.. వేరొక గ్రామంలో నివాసం ఉంటూ .. 

ఆ భూమిని సొంతంగా సాగు చేయని భూ జయమానిని అబ్సెంటీ ల్యాండ్‌ లార్డు అంటారు.


అసామి షిక్మీ...

భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని చేసుకుంటున్న వ్యక్తి.


అసైన్డ్‌ భూమి...

భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్‌ భూమి అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు.


ఏడబ్ల్యూడీ భూములు...

శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములు. 

లేదా అసైన్డ్‌ వేస్ట్‌ ల్యాండ్‌ అంటారు. 

ఏడబ్ల్యూడీ భూములు మెట్టభూములైతే ఢ్రై ల్యాండ్స్‌ అంటారు. 

వీటిని భూమిలేని నిరుపేదలకు అసైన్డ్‌ చేయవచ్చు.


ఆబాదీ/గ్రామ కంఠం...

గ్రామంలో ప్రజలు నివసించడానికి నిర్ధేశించిన భూమిని గ్రామకంఠం అంటారు. 

ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. 

ఇక్కడ ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

◆ ◆ ◆


ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...


ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...



- స్వస్తీ...