🎤 అమర గాయకుని అమరలోక యాత్ర 🎻


ఇంద్రుడు శుక్రవారం స్వర్గంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు...

ఊహించని అతిధి వస్తున్నారని... అలసిపోయిన ఆ గొంతుకు... ఇక్కడ అమృతం ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి గౌరవ సూచకంగా  గానా బజానా ఏర్పాటు చేయాలని  ఇంద్రుడు సహచరులకు ఆదేశాలు జారీ చేశారు...


ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు...  

కరెక్ట్ గా 1 గంట 4 నిమిషాలకు పుష్పక విమానం ఇంద్రలోకం వచ్చింది. 

అందులో నుంచి ఓ వ్యక్తి మైకు, పుస్తకం చేతపట్టుకొని కిందకు దిగడం కనిపించింది. తెలుగుదనం ఉట్టి పడేలా ఎప్పుడు నిండుగా కనిపించే ఆ వ్యక్తి 40 రోజులుగా ఆసుపత్రిలో బక్కచిక్కి పోవడంతో చాలామంది పోల్చుకోలేక పోయా రు. 


అయితే అప్పటికే సభలో ఉన్న  మ్యూజిక్ డైరెక్టర్లు, సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు, కోదండపాణి గాన గంధర్వుడు ఘంటసాల, గేయ రచయితలు, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీ వేటూరి వంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యంను గుర్తుపట్టారు. ఆప్యాయంగా పలకరించి 50 ఏళ్లు నాటి గతాలను గుర్తు చేసుకున్నారు. 


మమ్మల్ని కలవడానికి ఇన్నాళ్లకు నీకు తీరిక అయ్యిందా. అంటూ ఆట పట్టించారు. ఇది  ఇలా ఉండగా... 

సభలో తెలుగు మాటలు వినబడడంతో... సేదతీరుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, శ్రీదేవి వంటి అందాల నటులు వచ్చారు. 

ముందుగా ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, తెలుగు ప్రజలు ఏమంటున్నారు, అంటూ ఎన్టీఆర్ ఆలింగనం చేసుకున్నారు. ఏం బాలసుబ్రమణ్యం ఏమయింది, ఇలా వచ్చారు అంటూ అక్కినేని పలకరించారు. ఇది ఇలా ఉండగా సభలోకి సర్దార్ పాపారాయుడు దాసరి నారాయణరావు వచ్చారు. ఏం బాలు గారు మీరు వచ్చారా, అక్కడ తెలుగు పాటకు రిపేర్ ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు. 


మధ్యాహ్నం మూడు గంటల  సమయంలో బాలుని కలవడానికి కేంద్రం నుంచి కొంతమంది వస్తున్నారని ఇంద్రుడు కు కబురు వచ్చింది. దీంతో ద్వారపాలకులు  భద్రతను కట్టుదిట్టం చేశారు. 

సుమారు 5 గంటల కు మాజీ  రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ, వాజ్పేయిలను బాలుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బాలు తాను కేంద్రం నుంచి మీ చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు  అందుకున్నానని గతాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బాలు తన డిక్షనరీలో నుంచి  కొన్ని పాటలు పాడి వినిపించారు. బాలు గొంతు  ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులా ఉండడంతో ఇంద్రుడు తో పాటు కొలువుదీరిన వారు ఆశ్చర్య పోయారు. 


ఇక సభలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్వరాభిషేకం, పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు ఉంటాయని దేవేంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. 


మొత్తం మీద బాలు మొదటిరోజు స్వర్గ యాత్ర బిజీబిజీగా సాగింది. 




- స్వస్తీ...