జబ్బు ఒకటి ఉంది దానికి మందు ఒకటి వుంది. 

ఇది ఎంతోమంది మాట్లాడుతున్నారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జబ్బు వున్నది, మందు వున్నది అని చెబుతున్నవారు పెక్కుమంది  ఆ జబ్బుతో తామే బాధపడుతున్నారు గాని ఆ మందు మింగటం లేదు. 

జబ్బు తగ్గాలి అంటే వైద్యుని దగ్గరకు వెళ్ళాలి, వైద్యుడు సూచించిన మందును వైద్యుడు సూచించిన పథ్యంతో వేసుకోవాలి. 

అప్పుడు జబ్బు తప్పకుండా తగ్గుతుంది.


భవరోగం అనే జబ్బు వున్నది. 

పథ్యాన్ని ఆచరిస్తూ ఇదిగో ఈ మందు వేసుకుంటే నయమౌతుంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఆ మందును పథ్యంతో సహా తామే వేసుకోకుండా ఆ జబ్బుతో బాధపడుతున్నారు. 

మందు పేరును పదేపదే మాట్లాడుతున్నంతమాత్రాన గాని, ఆ మందును అరచేతిలో పెట్టుకొని ఇదిగో ఇదిగో అంటూ అందరికీ చెబుతున్నంత మాత్రాన గాని, పథ్యాన్ని ఎలా పాటించాలో, మందు ఎలా మింగాలో తెలిసినంత మాత్రాన గాని జబ్బు తగ్గదుగదా! 

ఐతే ఈ రోజున అనేకమంది తాము స్వీకరించాకుండానే మందును గురించి ప్రచారం చేస్తున్నారు. 

ఇది చూసి మిగిలిన వాళ్ళందరూ ఒక అయోమయ స్థితికి గురౌతున్నారు. 

ఐతే ఆ జబ్బును పోగొట్టుకున్నవాళ్ళు సూచించిన విధంగా పథ్యం ఆచరిస్తూ మందును స్వీకరించినట్లైతే జబ్బు తప్పకుండా నయమై తీరుతుంది.


మనం దుఃఖంలో ఉన్నాము. 

భవరోగం వల్లనే దుఃఖం ప్రాప్తిస్తున్నది. 

దుఃఖాన్ని గుర్తించటం ఒక ముఖ్యమైన విషయం. 

విషాదం వుంది. 

అది గుర్తించకుండా నాకే జబ్బూ లేదు అనుకుంటూ జబ్బును ముదర బెట్టుకున్నప్పుడు మందు వల్ల ఏ ప్రయోజనమూ చేకూరదు. 

భవరోగానికి జ్ఞానమనే మందును మహర్షులు సూచించారు. 

ఈ మందును పథ్యంతో స్వీకరించటానికి ఎవరూ ముందుకు రావటంలేదు. 

మాకు దుఃఖం లేదు, దుఃఖం లేదు అంటూనే దుఃఖం కన్పించిన ప్రతిసారీ పోగొట్టుకోవటానికి తమకు తోచిన అనేక విధాలైన ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. 

దీనికి కారణం జబ్బు పట్ల సరైన అవగాహన లేకపోవటము, మహర్షుల మాటపై తగినంత విశ్వాసం లేకపోవటము, భయ భక్తులు లేకపోవటము.  

చిన్నతనం నుండి తల్లిదండ్రులు గాని, ఉపాద్యాయులు గాని, మరే ఇతరులు గాని ఈ జబ్బును గురించి సరైన అవగాహన కల్పించక పోవటం. 

దీనివల్ల మనిషి తన జన్మకు గల ప్రాముఖ్యతను గుర్తించలేకపోతున్నాడు.


తాను సంసారంలో ఉన్నాడనీ, అంటే జననం - మరణం - జననం - మరణం అనే ఉధృతమైన ప్రవాహంలో ఉన్నాడనీ, 

పశు, పక్షి, క్రిమి, కీటకాది జన్మలను పొందుతున్నప్పుడు జీవి దుర్భరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడనీ, 

జన్మిస్తున్న ప్రతిసారీ జన్మించే ముందు తల్లి గర్భంలో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడనీ, 

జన్మిస్తున్న సమయంలో భయంకరమైన బాధను అనుభవిస్తున్నాడనీ, 

జన్మించిన క్షణం నుండి మరణించే క్షణం వరకు అనేక సమయాల్లో బాధ, అలజడి, ఆంధోళన, భయము, దుఃఖము అనుభవిస్తూనే ఉన్నాడనీ, 

మరణ సమయంలోనూ దుర్భరమైన బాధను అనుభవిస్తున్నాడనీ, 

ఈ బాధనుండీ, ఈ అలజడి నుండీ, ఈ ఆంధోళన నుండీ, ఈ భయాన్నుండీ, ఈ దుఃఖాన్నుండీ బయట పడాలంటే, ఉధృతంగా ప్రవహిస్తున్న జనన మరణ రూపమైన సంసారం నుండి ముక్తుడై శాశ్వతమైన తన ఆనంద స్థితిని పొందాలనీ, 

అందుకు కావలసిన ప్రయత్నం చేయటం మనిషిగా జన్మించినప్పుడు మాత్రమే వివేకాన్ని ఉపయోగించటం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది తప్ప మరే ఇతర జన్మలలోనూ అసలు సాధ్యపడదనీ, 

84 లక్షల జీవరాసుల్లో ఉత్కృష్టమైన మానవ జన్మ లభించినప్పుడు అది కేవలము ఈ జన్మ పరంపర నుండి బయట పడటానికి లభించిన మహత్తరమైన అవకాశంగా భావించి తీవ్రమైన ప్రయత్నంతో సద్వినియోగం చేసుకోవాలనీ, 

అలాటి ప్రయత్నమేదీ చేయకుండా ఈ జన్మను కూడా ఇతర జీవుల్లానే అశాశ్వతమైన దేహమే తానని భావిస్తూ, 

దేహ పోషణ కోసమూ, దేహ సంబంధీకుల కోసమూ, దేహియైన తనకు ఉపయోగపడని సంపదల కోసమూ అమూల్యమైన తన సమయాన్నీ, శక్తినీ వృధా చేస్తే, 

దుఃఖ భూయిష్టమైన పశు, పక్షి, క్రిమి, కీటకాది వేలకొలది జన్మలు తనకై ఎదురు చూస్తుంటాయని చిన్నప్పటి నుండి ఎవ్వరూ నూరిపోసే వాళ్ళు లేకపోవటం వలన ఏర్పడిన దుస్థితి వల్ల మనిషి ఈనాడు అజ్ఞానంతో, అలసత్వంతో, నిర్లక్ష్యంతో అత్యంత విలువైన తన జన్మను వ్యర్థ పరచుకుంటున్నాడు.


 అనుభవజ్ఞులైన మహర్షులు మనకోసం ఎంతో ముందు చూపుతో ఉపనయనం, విద్యాభ్యాసం అనే సంప్రదాయాలను ఏర్పరచారు. 

అక్షరాభ్యాసం అనే మహత్తరమైన ప్రక్రియను మనకందించారు. 

ఐతే ఈనాడు మనం నేర్చుకుంటున్నది, అభ్యసిస్తున్నది అక్షర విద్య కాదు. 

నాశనమయ్యే దేహాలకు ఉపయోగపడేదే తప్ప మన కోసం ఉపయోగపడే శాశ్వతమైన విద్య కాదు. 

నిజంగా చిన్నప్పుడే అక్షరాభ్యాసం చేసినట్లైతే, అంటే క్షరం కానట్టి నీ గురించి నీకు తెలియజేసేదీ, 

శాశ్వతమైన నీ గురించి ఆలోచింపజేసేదీ ఐన విద్యను అభ్యసింపజేసినట్లైతే తప్పకుండా మానవ జన్మ సఫలం కావటానికి దోహదపడేది.


కాని ఈరోజున మనం నేర్చుకుంటున్నది క్షరాభ్యాసమే.

నాశనమయ్యే దేహం కోసం, దేహ సంబంధమైన విషయాల కోసం, వ్యక్తుల కోసం, విడిచిపెట్టి పోయే సంపదల కోసం మాత్రమే ఉపయోగపడే విషయాలను నేర్చుకుంటున్నాము.

 అన్నది నిష్టుర సత్యం. 

దీని పర్యవసానం మనిషి కర్మలలో బంధీ అవుతున్నాడని శ్రీ మద్భగవద్గీత సూచిస్తున్నది.


రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవమ్ !

తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ !                    14వ అ/7


అజ్ఞానం వల్ల దేహమే తాననుకోవటమే అహంకారం. అహంకారంతో ఉన్నప్పుడు దేహసంబంధమైన వ్యక్తుల/వస్తువుల/విషయాల పట్ల రాగము/ద్వేషము ఏర్పడుతుంది.  

ఈ రాగము/ద్వేషము సంగమం వల్ల ఉధృతమైనప్పుడు రజోగుణం ఉత్పన్నమై  దేహిని కర్మలలో బంధిస్తుంది.


నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః !

ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్త్వదర్శిభి: !                        2వ అ/16


తత్వాన్ని తెలుసుకోవాలనుకొనే వారు ఈ రెండు విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 1) లేనిది లేనే లేదు. 2) ఉన్నది లేకపోవటం లేదు.


శాస్త్రం ఏమి చెప్తున్నది అంటే ఆత్మ ఒక్కటే సత్యము. మిగిలినదంతా అశాశ్వతము, అసత్యము. దుఃఖము నుండి బయట పడాలంటే సత్యమేదో తెలుసుకొని సత్యదృష్టి ఏర్పరచుకోవాలి. 

అశాశ్వతమైన దాన్ని పట్టుకొని దాని కోసమే కోరికలు కోరుకుంటూ, దేవుళ్ళను ఏర్పరచుకుంటూ, మ్రొక్కులు మ్రోక్కుకుంటూ దానికోసమే శ్రమిస్తున్నప్పుడు దుఃఖం పోనేపోదు. 

సత్యాన్ని తెలుసుకోవటానికి పెద్దగా మేధస్సు అవసరంలేదు. విషయం చిన్న పిల్లలకు కూడా స్పష్టంగా అర్థమౌతుంది.


అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమింపజేస్తూ, సర్వవిధమైన ఆలోచనలూ, ప్రయత్నాలూ కేవలం అందుకోసమే వినియోగింపజేస్తున్న ఈ లోకంలో అందరూ అహంకార, మమకారాలతో ఒకర్ని మించి ఒకరు, ఒకర్ని చూసి ఒకరు దేహము, దేహ సంబంధమైన వారికోసం కోరికలు కోరుకుంటూ, ఆ కోరికలు తీర్చుకోవటానికి కర్మలు చేస్తూ, సానుకూల ఫలితం వచ్చినప్పుడు సంతోషపడుతూ, వ్యతిరేక ఫలం వచ్చినప్పుడు దుఃఖపడుతూ, క్రోధంతో, ఈర్ష్యతో, అసూయతో, లోభంతో, మోహంతో, మందబుద్ధితో, కామంతో కర్మలు చేస్తూ ఆయా ఫలాలను అనుభవించటానికి మరల మరల జన్మలు తీసుకొంటూ జనన మరణ చక్రంలో పడి నలుగుతూ దుర్భరమైన దుఃఖాన్ని పొందుతున్నారు.


స్థిమితంగా కూర్చుని ఆలోచించినప్పుడు అర్థమౌతుంది, ఈ దేహం అశాశ్వతమనీ, గోచరమౌతున్నదంతా మారేదీ పోయేదీ ననీ, దుఃఖానికి కారణం అజ్ఞానమేననీను.  

ఈ మారేవీ, విడిచిపెట్టి పోవలసినటువంటివీ ఐన విషయాలకూ, సంఘటనలకూ, సన్నివేశాలకూ ఏపాటి విలువనివ్వాలో గ్రహించి వాటి పట్ల ఆసక్తిని విడిచి ఉదాసీనంగా ఉంటూ దుఃఖాన్ని పోగొట్టుకొనే ప్రయత్నం చేయాలి. 

శాశ్వతమైన నిన్ను నీవు గుర్తించి, నిరంతరమూ నిన్ను నీవు చూసుకుంటూ, నిన్ను నీవు తలచుకుంటూ, ఈ దేహం ముందుకు వచ్చిన క్రియలలొ దేహం ప్రవర్తిస్తున్నప్పుడు నీవు సంగమం లేకుండా నిరాసక్తతతో ఉదాసీనంగా ఉండటమే నీకు శ్రేయస్కరము.


శాశ్వతమైన నిన్ను నీవు గుర్తించటమే జ్ఞానము. 

జ్ఞానమే భవ రోగానికి ఔషధము.

నిరంతరమూ జ్ఞానదృష్టితో ( నీ ఎరుకలో నీవు) ఉండటమే పథ్యము. 



సర్వేషాంస్వస్తిర్భవతు ! అందరికీశుభమేజరుగుగాక !

సర్వేషాంశాంతిర్భవతు ! అందరూసుఖశాంతులతోఉండుగాక !

సర్వేషాంపూర్ణంభవతు ! అందరిజీవితమూసమృద్ధిగాఉండుగాక !

సర్వేషాంమంగళంభవతు ! అందరిజీవితమూమంగళకరంగాఉండుగాక !

లోకాః సమస్తాః సుఖినోభవంతు !!

ఓంశాంతి: శాంతి: శాంతి:  !!!




◆ ◆ ◆


ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...


ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...



- స్వస్తీ...