ప్రకృతి ఎవ్వలికి కీడు చెయ్యదు..

 ఎందుకంటే.. మనమంతా ప్రకృతి పిల్లలమే

మనల్ని తనలో దాచుకొని కాపాడుకుంటది..

కానీ.. మనం ఏం జేశినమ్?


తల దాసుకోమని జాగ ఇచ్చిన ప్రకృతికి..

పానాల మీదికి తెచ్చినం..


చెరువు ఆటలాడుకునే..

అలుగును ఆక్రమించుకొని.. ఇల్లు కట్టుకున్నం


మరి చెరువు కడుపు నిండినప్పుడు.. 

అది ఆడుకోనీకె జాగేది?

దాని జాగలకు అది వస్తే.. 

ఇంట్లకు నీళ్లొచ్చినయంటరేంది?


చెరువు ఇంట్లనే మీరు గూడు కట్టుకున్నరు గదా!

అప్పుడప్పుడు...

ఇల్లు ఖాళీ చేయమని నోటీసులిచ్చింది..

కానీ మీరు పట్టించుకున్నరా..? 

పారుగోడలు పెట్టుకున్నరు..

ఇప్పుడేమయింది? 

పారాడి..పారాడి.. 

పారుగోడను కూలగొట్టుకోని.. 

దాని జాగల అది..సుడులు తిరుగుకుంట.. 

ప్రకృతి రాగానికి.. శృతి పలుకుతున్నది

ఆక్రమించుకున్నది మీరు.. 

ఆగం జేశిందన్న బదునాం శెరువుకెందుకు?


ప్రకృతెప్పుడూ.. పచ్చని చెట్టే..

ప్రకృతి పగ బట్టిందని.. 

ఎందుకు సాపన పెడుతరు..?

ప్రకృతిని పాడు జేశింది మీరు గాదా..? మనం గాదా?


ఇప్పుడు ప్రకృతి తనను తాను.. 

బాగు జేసుకుంటున్నది!

తన గాయాలకు.. 

మందు పూసుకుంటున్నది!

నరుడా.. 

నాటకమాపు అని హెచ్చరిస్తున్నది..

గెరువిచ్చిందని.. 

పాలప్యాకెట్లు, కూరగాయలు.. 

ఎచ్చెచ్చగా ఉండనీకె..

ఇంత మందు..సలికి టైమ్ పాస్ గానీకె.. 

బజ్జీలు ఏస్కోనీకె.. 

శెన్గపిండి తెచ్చుకునుడు గాదు..


హెచ్చరికను... 

ప్రమాదమోలె.. 

ఉపద్రవమోలె కాదు..

మన తప్పిదమని స్వీకరించాలె..

తప్పైందని ఒప్పుకోవాలె..

తప్పును దిద్దుకోవాలె..

మన జాగల మనముండాలె...

చెరువు జాగల చెరువుండాలె..

అందరం మంచిగుండాలె..

పచ్చని శెట్టుకు జై.. 

ప్రకృతి మాతకు జై..

అర్థం చేసుకుని.. 

బతికుంటే.. 

ధమాక్ ఉన్న మనిషికి జై !




- స్వస్తీ...