ధనం - దానం





దానం చెయ్యండి. 

ఎందుకంటే మనుష్యుడెప్పుడూ లోభ బుద్ధితో ఉంటాడు. 

ఎంత డబ్బు సంపాదించినా చాలదు. 

ఇంకా సంపాదించాలి, 

ఇంకా సంపాదించాలి. 

ఖర్చు చెయ్యాలంటే మాత్రం ఇష్టముండదు. 

ఖర్చు చేస్తే ఉన్న డబ్బు తరిగిపోతుంది అని ఖర్చు చెయ్యడు. 


ఈ విషయంలో నీలకంఠ దీక్షితులు మంచి ఉదాహరణ చెబుతారు.


మనుష్యులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి ఉంది. 

వీరు ఒకరికి అప్పు ఇవ్వాలి అంటే,

అతనితో నోటు రాయించుకొని వేలకొలది డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. 


అదే ఒక ధర్మకార్యానికి డబ్బు ఇవ్వండి అంటే, 
“ఐదువందలు సరిపోతుందా, వెయ్యి సరిపోతుందా” అని అక్కడ లెక్క వేస్తారు.  
ఇది ఎంతటి మూర్ఖత్వం.

 

నోటు రాయించుకొని వెయ్యి ఇస్తే అది తరువాత రెండువేలు అవుతుంది. 

ధర్మ కార్యానికి ఇస్తే నాకు ఏమి వస్తుంది?

ఒక వెయ్యి తగ్గడం తప్ప.

అందుకనే నేను అక్కడ ఇస్తాను.

మరి ఇది మూర్ఖత్వం ఎలా అవుతుంది ? 


ధర్మానికి నువ్వు ధనం వినియోగిస్తే, 

దానికి పదింతలు నీకు తిరిగి లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. 


శాస్త్రం చెప్పిన మాటను నువ్వు నమ్మడం లేదు. 

కేవలం అతను రాసిచ్చిన నోటును నమ్ముతున్నావు. 

ఆ నోటుకెంత విలువ!!



వెనకటికి రూపాయికి విలువున్న కాలంలో ఒకడు వంద రూపాయలు అప్పుగా కావాలి అని అడిగాడంట.

ఇతనేమో నేనిప్పుడు నీకు వంద రూపాయలిస్తాను వచ్చేనెల నువ్వు నాకు పది రూపాయలు చేర్చి నాకివ్వాలి, కనుక ఇప్పుడు నేను నీకు పది రూపాయలు తగ్గించి తొంబై రూపాయలు ఇస్తాను అన్నాడు. 

ఇప్పుడు నేను ఇచ్చేది తొంబై.

వచ్చేనెల నువ్వు నాకివ్వాల్సింది నూటపది రూపాయలు అన్నాడు.

అవతలి వాడి అవసరం అలాగే అన్నాడు.

ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

మూడవవాడు ఇద్దరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని విడిగా అడిగితే, 

డబ్బిచ్చిన వాడేమో ఒక్కక్షణంలో ఇరవై రూపాయలు సంపాదించాను కనుక సంతోషమే కదా అన్నాడు.

తీసుకున్నవాడేమో నేను తొంబై రూపాయలు సంపాదించాను అందుకే సంతోషం అన్నాడు.

అదెలా మరలా ఇవ్వలి కదా అంటే,

ఎవడిస్తాడు ? 

నేనిస్తానా ? 

నేను ఇవ్వను అని అన్నాడు.


కనుక నీకు నోటుపైన కంటే శాస్త్రం పైన ఎక్కువ నమ్మకం ఉంటే ధర్మం కోసం ధారాళంగా ఖర్చు చెయ్యాలి.


కాని మనుష్యునికి ఆ బుద్ధి లేదు.


అంతటి ఔదార్యమూ లేదు.




- స్వస్తీ...