శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి 

విరచిత ‘గరుడ గమన తవ’ కృతి



‘‘ఓ గరుడ వాహనా, నీ పాదపద్మాలు నా మనస్సునందు నిత్యమూ ఉద్దీపనం చేయి. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.


ఓ పద్మ నేత్రా.. బ్రహ్మేంద్రాది విబుధ గణాలచే వినతులు పొందు పాదపద్మాలు కలవాడా నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.


ఓ ఆదిశేష తల్పశయనా.. మన్మథుడి తండ్రీ.. నా జనన, మరణ భయాల్ని తీర్చేవాడా.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.


ఓ శంఖ చక్రధరా.. దుష్టరాక్షసులను దునుమాడి సర్వలోకాలనూ రక్షించేవాడా.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.


లెక్కించలేనన్ని సుగుణాలు కలవాడా.. దీనులకు దిక్కైనవాడా.. దేవతల శత్రువులను దునుమాడేవాడా.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి. నీ భక్తుడైన ఈ భారతీ తీర్థుని మహాకరుణతో రక్షించు.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి’’ అనే అర్థం గల పాట ఇది.


----------------------





గరుడ గమన తవ చరణ కమల మిహ 

గరుడ గమన తవ చరణకమల మిహ


మనసి లసతు మమ నిత్యమ్ 

మనసి లసతు మమ నిత్యమ్ ॥ 


మమ తాపమపాకురు దేవ

మమ పాపమపాకురు దేవ ॥



1. జలజనయన విధినముచిహరణముఖ-

విబుధవినుత-పదపద్మ -2

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥



2. భుజగశయన భవ మదనజనక మమ

జననమరణ-భయహారీ -2

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥



3. శఙ్ఖచక్రధర దుష్టదైత్యహర

సర్వలోక-శరణ -2

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥



4. అగణిత-గుణగణ అశరణశరణద-

విదలిత-సురరిపుజాల -2

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥



5. భక్తవర్యమిహ భూరికరుణయా

పాహి భారతీతీర్థమ్-2

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


------------ ----------------


ఈ పాటలో ముఖ్యంగా ఉన్నది - రెండు విషయాలు- మొదటి పంక్లిలో భగవంతుని గుణవిశేషణాలతో సంబోధన. 

రెండవ అంశం- అటువంటి గుణవిశేషాలు కలిగిన తండ్రికి ప్రార్థన.. ఇది పునరావృతమవుతుంటుంది.


-------------- --------------


గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి లసతు మమ నిత్యమ్ ॥

గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి మమ నిత్యమ్ లసతు ॥


గరుడ-గమన, = ఓ గరుడుని వాహనంగా కలిగినవాడా, గరుడునిపై విహరించేవాడా

తవ చరణకమలమ్ = నీ పాదాలనే కమలాలు

ఇహ మమ మనసి = ఇక్కడ నా మనసులో

నిత్యం లసతు = ఎల్లప్పుడూ విలసిల్లుగాక

మమ తాపమ్ అపాకురు దేవ = నా పాపాన్ని హరించు. 

మమ పాపమ్ అపాకురు దేవ = నా తాపాన్ని హరించు.


(ఇదే పంక్తి ప్రతి చరణంలో పునరావృతమవుతుంది.) 


ఇక చరణాలు-



1. జలజ-నయన, విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ

జలజ-నయన = ఓ కమలముల వంటి కన్నులు కలిగినవాడా

విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ ==

విధి- = బ్రహ్మ

నముచి-హరణ- = ఇంద్ర (నముచి అనే రాక్షసుని సంహరించినవాడు)

ముఖ- = ముఖ్యంగా కలిగిన

విబుధ-వినుత- = విబుధజనులచేత స్తుతింపబడే

పద-పద్మ = పాదపద్మాలు కలిగినవాడా

అంటే ఎవరి చరణాలనే పద్మాలను బ్రహ్మాదులు స్మరిస్తారో, (స్తుతిస్తారో) అటువంటివాడు.

నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు. 



2. భుజగ-శయన, భవ-మదన-జనక, మమ జనన-మరణ-భయ-హారీ ॥

భుజగ-శయన = పాము శయ్యపై పడుకుని ఉండేవాడా

భవ-మదన-జనక = సంసారానికి, మన్మథుడికి తండ్రి అయినవాడా

మమ జనన-మరణ-భయ-హారీ = నా జన్మ, మరణం అనే భయాన్ని పోగొట్టేవాడా

నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు. .



3. శఙ్ఖ-చక్ర-ధర దుష్ట-దైత్య-హర సర్వ-లోక-శరణ ॥

శఙ్ఖ-చక్ర-ధర = శంఖాన్ని చక్రాన్ని ధరించినవాడా

దుష్ట-దైత్య-హర = దుష్టులైన రాక్షసులను సంహరించేవాడా

సర్వ-లోక-శరణ = అన్ని లోకాలకు శరణు అయినవాడా

నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు. 



4. అగణిత-గుణగణ అశరణ-శరణద విదలిత-సుర-రిపు-జాల ॥

అగణిత-గుణగణ = లెక్కపెట్టలేనన్ని గుణాల గణాలు (గుంపులు) కలిగినవాడా

అశరణ-శరణద = శరణులేనివారికి శరణు ఇచ్చేవాడా

విదలిత-సుర-రిపు-జాల == 

విదలిత- = చీల్చినవాడా

సుర- = సురులు అంటే దేవతల యొక్క

రిపు- = రిపులు అంటే రాక్షసులను

జాల = జాలాలను, (దళాలను)

నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.



5. భక్తవర్యమ్ ఇహ భూరి కరుణయా పాహి భారతీ-తీర్థమ్ ॥

ఇహ భక్తవర్యమ్ భారతీ-తీర్థమ్ భూరి కరుణయా పాహి ॥

భక్తవర్యమ్ = భక్తులలో అగ్రగణ్యుడిని

భారతీ-తీర్థమ్ = భారతీ-తీర్థుని (రచయిత మహాస్వామి) 

ఇహ = ఇక, ఇక్కడ

భూరి కరుణయా = చాలా కరుణతో

పాహి = రక్షించు

నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.





◆ ◆ ◆


ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...


ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...







- స్వస్తీ...