భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 95 వ జన్మదినోత్సవం సందర్భం గా భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా సచ్చరిత్ర మన అందరికీ.....


 

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా సచ్చరిత్ర

ప్రార్దించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులు మిన్న.


భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, బాబా వారి జీవిత విశేషాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. 

భక్తులు ఆర్తిగా పిలుచుకునే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. 

                            ఎవరు ఈ సత్య సాయిబాబా? దివ్యాకర్షణతో విరాజిల్లే ఈ స్వామి భగవంతుడా? ఈయన అవతార పురుషుడా? మన తత్వమే మనకు తెలియదు. మనకు అత్యంత ఆప్తులైన వారి గురించే మనకు తెలియదు. అటువంటిది అవతార పురుషుని తత్వము మనం ఎలా గుర్తింపగలము? చంద్రుణ్ణి చూడటానికి చంద్రుని నుంచి వెలువడే వెన్నెలే మనకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వేరే ఏ దీపము వల్లా ప్రయోజనము లేదు. ఆ విదంగానే సాయినాధుణ్ణి గురించి తెలిసికొనటానికి స్వయంగా సాయినాధుడు చూపిన దృష్టాంతములు, చెప్పిన అమృతవాక్కులే మనకు పరమ ప్రమాణములు.

                           


పూర్వము త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఉండేవారు.ఆయనకు వేదములంటే  ప్రాణం. అందువల్ల భరద్వాజుడు నిండు నూరేండ్లు వేదాద్యయనం చేశాడు.అయినా అవి పూర్తి కాలేదు. అప్పుడు దేవేంద్రుడు "వేదములను సమగ్రంగా అద్యయనం చేయటం నీతరం కాదు. నీవా ప్రయత్నం మానుకుని దానికి మారుగా సవిత్రా అనే యాగం చేయి, సమగ్ర వేదాద్యయన ఫలితాన్ని అది నీకు ప్రసాదిస్తుంది" అని ఉపదేశించాడు.ఆ యాగాన్ని చేయడానికి భరద్వాజుడు నిశ్చయించుకున్నాడు. యాగం పూర్తి అయింది.శివ శక్తిలిద్దరూ ఆ ఋషి కి దర్శనమిచ్చి ఆశీర్వదించారు.శివుడు మహర్షి తో "భరద్వాజా! మేమిద్దరం భవిష్యత్తులో నీ గోత్రం లో మూడు మార్లు మానవ రూపంలో అవతరిస్తాము! మొదట నా శివాంశ తో సాయిబాబా గా షిరిడి లోను,తరువాత మా శివశక్త్యంశలతో సత్యసాయి బాబా గాను,అటు తరువాత శక్తి అంశ తో ప్రేమ సాయి గాను అవతరిస్తాము." అని తెలియజేశారు.


 శివ శక్తి స్వరూపుడు బాబా అవతరణము


ఎందరో సాధువులు,సత్పురుషులు,జ్ఞానులు భగవంతుని అవతరణము కై చేసిన ప్రార్ధనలు ఫలించబోతున్నాయి.భూదేవి ఆవేదన కరుణామయుడైన జగత్ప్రభువును కదిలించి వేసింది.దేవకీదేవికి అష్టమ గర్భంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు అవతరించినట్లు ఈశ్వరమ్మకు అష్టమ గర్భంలో ఆ పరమాత్ముడు,పరంధాముడు,పరాత్పరుడు అవతరించబోతున్నాడు. ఆశ్చర్యకరంగా రాత్రి పూట కొండమరాజు గారి యింటిలోని తంబుర,మద్దెలలు వాటంతటవే మ్రోగసాగాయి.ఆ ద్వనులకు అందరూ ఆశ్చర్యానందాలు పొందసాగారు. పెద వెంకమరాజు జ్యోతిర్వేత్తలను సంప్రదించారు. వారు ప్రాచీన గ్రంధాలను పరిశీలించి "మీ యింట్లో ఎవరైనా స్త్రీ గర్భవతిగా వున్నదా?" అని అడిగారు. "అవునని" ఆయన చెప్పగా "ఆ గర్భస్థ శిశువును ఆనంద పరచటం కోసం దేవతలు సంగీతం వినిపిస్తున్నారు! అవతార పురుషులు ఆవిర్భించేటప్పుడు ఇలా జరుగుతుంది." అని శాస్త్ర ప్రమాణాలను చూపించారు.


అది 1926 వ సంవత్సరము.నవంబరు 23 వ తేది. అక్షయనామ సంవత్సరము, కార్తీక బహుళ తదియ సోమవారము,ఆర్ధ్రా నక్షత్రము, పరమ శివునకు ప్రీతికరమైన కార్తీక సోమవారము.ఆ తెల్లవారుజాము సమయాన నాలుగు గంటల నుంచి ఈశ్వరమ్మ అత్తగారు పురోహితులు వారింట జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో నిమగ్నమై ఉన్నది. కోడలు ప్రసవించే సమయం దగ్గర పడుతున్నదని అనేక పర్యాయములు కబురు చేసినా లక్ష్మమ్మ గారు సత్యనారాయణ స్వామి పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని తప్ప యింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నది. ఆవిదంగానే ఆమె కోడలికి ప్రసాదం తెచ్చి ఇచ్చింది. తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిముషములయింది.మలయమారుతం చల్లగా మెల్లగా వీస్తున్నది. ఆ పరమ పవిత్రమైన శుభసమయములో శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి అవతారపురుషుడు అవతరించాడు! చెక్కిట చిన్న పుట్టుమచ్చ తో ఆ దివ్య బాలుని ముఖము చంద్రబింబము వలె వుంది. అత్తగారు లక్ష్మమ్మ గారు ఆ బాలున్ని పురిటి గది లో ఒక మూల తాటాకుల పై పక్క వేసి పడుకొనబెట్టింది. కొంతసేపటికి పక్క అటూ ఇటూ కదలసాగింది. తీరా ఆ బాలున్ని ఎత్తుకుని పక్క తీసి చూస్తే అడుగున చుట్ట చుట్టుకుని వున్నా సర్పం! పడక గదిలో పాము శయ్య వలే అమరి వుండటం అసాధారనమైన విషయం. తరువాత వెదికితే ఆ సర్పం యింట్లో యెక్కడా కనిపించలేదు. ఇది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్య గా ఎర్పడటనికి ఆదిశేషుడు రావడం తప్ప మరొకటి కాదు. ఇది ఈ అవతారమూర్తి మొదటి అద్భుత చర్య!


 ప్రసవము కాదు - ప్రవేశము


మహా భాగవతంలో శ్రీమన్నారాయణుడు భూమిపై శ్రీ కృష్ణుడుగా అవతరింపదలచి దేవకి గర్బంలో "ప్రవేశించాడు" అని ఉన్నది. ఆనాటి కృష్ణుడు స్వామియే అని చెప్పుటకు ఇది ఒక ఉదాహరణ. శాస్త్రాలు,పురాణాలు చదువుకున్న వెంకటగిరి ఆస్థాన పండితుడు రామశర్మ ఒకసారి సాయినాధుడు మందిరంలో కుర్చుని ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తున్న సమయంలో "స్వామీ, మీ జననము ప్రసవము వల్ల కలిగినదా? లేదా ప్రవేశము వల్ల కలిగిందా? " అని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ ఆశ్చర్య పడ్డారు.అప్పుడు స్వామి మొదట వరుసలో కుర్చున్న మాతృదేవత ఈశ్వరమ్మగారి వైపు తిరిగి "ఆనాడు నూతి దగ్గర నీళ్ళు తోడుతున్నప్పుడు ఏమి జరిగిందో రామశర్మ కి చెప్పు" అన్నారు.

        అప్పుడు ఈశ్వరమ్మ తానొకసారి దొడ్లో నీళ్ళు తోడుతుండగా ఆకాశం నుంచి ఒక వినీలమైన గోళం గిరగిరమని తిరుగుతూ వచ్చి తన ఉదరంలో ప్రవేశించినదనీ, తరువాత తాను మూర్చపోతే అత్తగారు వచ్చి సేద తీర్చి విషయమడిగి తెలుసుకుని "ఈ విషయము ఎవ్వరితోనూ అనవద్దు. విన్నవారు ఏవేవో అపార్దాలు తీస్తారు" అని అన్నదని చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా రామశర్మ వైపు తిరిగి "రామశర్మా అర్దమయిందా? నా జననము ప్రవేశము వల్ల కలిగిందే గాని ప్రసవము వల్ల కాదు" అన్నారు.


 ఆర్దృ హృదయుడు


సత్యం ఎన్నడూ తనకి తినటానికి ఫలనాది కావాలని కాని, ధరించటానికి ఫలానా బట్టలు కావాలని కాని అడిగేవాడు కాదు. హిందూ పురం నుంచి కాని, అనంతపురం నుంచి కాని బట్టలు తెస్తే పిల్లలంతా ఎవరికి కావల్సినవి వారు తీసుకోగా, చివరగా మిగిలిన దాన్ని తాను తీసుకునేవాడు.తనకు ఒక ప్రత్యేకమైన కోరికగాని, ఆసక్తిగాని ఉన్నట్లు ఎప్పుడూ కనిపించేదికాదు. కాని ఇతర పిల్లల సంతోషం చూసి సత్యం ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండేది. "మీ ఆనందమే నాకు ఆహారం" అంటే ఇదే కాబోలు!

        సత్యం ఆర్ద్రా నక్షత్రంలో జన్మిచటం వల్ల కాబోలు ఆర్దృ హృదయుడుగా ఉండేవాడు. ఎవరైనా ఆకలితో ఇంటిముందుకు వచ్చినిలబడితే సత్యం హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్ళి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవాడు.ఎవరైనా చలికి వణుకిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకొనటానికి ఏదైనా వస్త్రం ఇచ్చి వారిని ఆనందపరిచేవాడు.


 కుర్చీ వృత్తాంతము


ఒకనాడు స్కూలులో కొండప్ప మాష్టారు నోట్సు చెప్తుంటే విధ్యార్దులంతా వ్రాసుకుంటున్నారు.సత్యం ఒక్కడే వ్రాయటం లేదు, అది ఆయన ఆగ్రహానికి కారణమైంది.సత్యం వ్రాయనవసరం లేకుండానే సమస్తము గ్రహించగలడని, ఆ బాలుడు సర్వజ్ఞుడని ఆయన గ్రహించలేదు.ఆయన సత్యాన్ని బెంచిపై నిలబడమని శాసించాడు.సత్యం బెంచి ఎక్కి నిలబడ్డాడు, కొంతసేపటికి గంట కొట్టారు.కొండప్ప మాష్టారు కుర్చిలోనుంచి లేద్దామని ఎంత ప్రయత్నిచినా ఆయన లేవలేకపోయాడు. కుర్చీ ఆయనకు అతుక్కుపోయింది. అదే సమయంలో అటువచ్చిన మహబూబ్ ఖాన్ అనే మరొక టీచరు ఈ పరిస్థితిని చూసి అర్దం చేసుకుని లోపలికి వచ్చి సత్యన్ని కూర్చోమన్నాడు.    అప్పుడు మాత్రమే కొండప్ప మాష్టారు కుర్చీలోనుండి లేవ గలిగారు. తాను సామాన్య బాలుణ్ణి కాదని తెలియబరచటానికి సత్యంలో నుంచి ఒక లీల ఆవిధంగా ఆనాడు బహిర్గతమయ్యింది. అవతార పురుషుడు మనం భావించే పరిధులకు లోబడి ఉండడని ఈ సన్నివేశము ఋజువుచేస్తుంది. తరువాత కొండప్ప మాష్టారు సత్యం దివ్యత్వాన్ని గుర్తించి సత్యంపై పధ్యాలు వ్రాసి ప్రచురించారు కూడా.


  పుష్పగిరి తిరునాళ్ళు 


సత్యం కమలాపురం ఉన్నత పాఠశాలలో చేరిన కున్నాళ్ళకు పుష్పగిరి తిరునాళ్ళు వచ్చాయి. అక్కడి డ్రిల్ మాస్టరే పిల్లల స్కౌట్ బృందాన్ని ఒకటి తయారు చేశాడు. సమాజానికి సేవ చేయడానికి స్కౌట్ బాగా ఉపయోగపడుతుందని భావించి సత్యం కూడా స్కౌట్ లో చేరాడు.తన దగ్గర చాలినన్ని డబ్బులు లేని కారణంగా స్కౌట్ బృందంతో కలవకుండగా సత్యం విడిగా తానొక్కడే బయలుదేరి కాలినడకన పుష్పగిరి చేరుకున్నాడు.అక్కడ బోజనం చేయడానికి డబ్బులు లేకపోతే ఉపవాసం ఉంటూ ఆ సంగతి మిత్రులతోకాని,మాస్టారుతోకాని చెప్పకుండగా చిరునవ్వులు చిందిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గున్నాడు. ఎవరైనా "బోజనం చేశావా?" అని అడిగితే సత్యం తన అరచేయి చూపించేవాడు. ఆ చేతినుండి పిండివంటల సువాసనలు వచ్చేవి. బంధువుల ఇంట చక్కని భోజనం చేసి వచ్చాడని భావించి ఆ మాస్టారు అందరిపిల్లలతో పాటే సుకుమారుడైన సత్యం చేత కుడా పనులు చేయించేవారు.


 నేను సాయిబాబాను!


అది 1940వ సంవత్సరం, మే నెల 23వ తేదీ, సత్యం పుట్టపర్తి గ్రామంలో అరుగుమీద చేరిన వారందరికీ పటిక బెల్లం,పుష్పాలు మొదలైన వాటిని శృష్టించి ఇస్తున్నాడు. ఆ సమయములో కొందరు పెదవెంకమరాజును ఆనందప్రదమైన ఆ దృశ్యాన్ని చూడటానికి రమ్మని పిలిచారు.తన కుమారుడు చూపే మాయమర్మాలని భరించలేకపోయాడు ఆ తండ్రి. వెంటనే ఒక కర్ర చేత్తో పట్టుకుని వచ్చి " నీ వెవరవు? దేవుడివా? దెయ్యానివా? నిజం చెప్పు" అని గద్దించాడు. సత్యం తండ్రి వైపు చూసి పరమ ప్రశాంతంగా "నేను సాయిబాబాను! ఆపస్తంబ సూత్రుణ్ణి,భరద్వాజస గోత్రుణ్ణి,భయందోళనలలో ఉన్న మిమ్మల్ని అందర్నీ రక్షించటానికి వచ్చాను." అని చెప్పాడు. అయితే ఈ "సాయిబాబా" ఎవరో ఎవరికీ అర్ధం కాలేదు.


ఆ రోజులలోనే పెనుకొండకి ఒక ప్రభుత్వ అధికారి బదిలీ అయి వచ్చాడని, ఆయన సాయిబాబా అనే ఫకీరుని నిత్యం పూజిస్తాడని పెద వెంకమరాజు తెలుసుకుని ఒక రోజున సత్యాన్ని తీసుకుని వెళ్లి ఆయనకు చూపించాడు. అతడు సత్యాన్ని చుసి ఇది మెదడు చెడిన వ్యాది హాస్ఫటలులో చేర్చి మంచి వైధ్యము చేయించడమే దీనికి తగిన మందు అని చెప్పాడు. ఆ మాటలు విని సత్యం "మెదడు చిదిగినది నీకా? నాకా? నిత్యం పూజించే ఈ సాయినే గుర్తించలేని మెదడు లేని వాడవు నీవు" అని చెయ్యి పట్టమని హస్త చాలనంతో కుప్పలు కుప్పలు గా విభూతి ని శ్రుష్టించగా అతడు భయపడి దూరంగా వెళ్లిపోయాడు. సత్యం ఆ విభూతిని గది నిండా చల్లి వచ్చాడు.ఒక గురువారం రోజున ఒకరు " నీవు నిజంగా సాయిబాబావైతే మాకు నిదర్శనం ఏమిటి? అని అడిగారు. "నిదర్శనము కావాలా?" అంటూ సత్యం కొన్ని మల్లి పూలను తెప్పించి వాటిని నేలపై విసిరివేశాడు. అవి "సాయిబాబా" అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.


  అవతార ప్రకటన


ఆనాడు 1940వ సంవత్సరము అక్టోబరు 20వ తేది, సోమవారము ఉరవకొండలో సత్యం యింటి నుంచి పాఠశాళకు బయలుదేరినవాడల్లా వెనక్కు, తిరిగివచ్చి పుస్తకాలు విసిరేసి "నేను మీ వాడను కాను నాకు మాయ వదిలింది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు." అని పెద్దగా పలికాడు. ఆమాటలు విని వదినగారు వంటింటి కిటికీలోంచి బయటకి చూసింది.సత్యం శిరస్సు చుట్టూ దివ్య కాంతి వలయం వెలిగిపోతుంది." నేను వెళుతున్నాను. నేను సంకల్పించుకుని వచ్చిన కార్యం ప్రారంభవించ వలసి ఉంది." అంటూ బయలుదేరే సమయలో అన్న శేషమరాజు, పొరుగింటి నారాయణ శాస్త్రి అక్కడకు వచ్చారు. ఆ దివ్య ప్రకాశం చూసి నారాయణ శాస్త్రి సత్యం పాదపద్మాలపై పడ్డాడు. శేషమరాజు నిశ్చేష్టుడై నిలిచిపోయాడు.

               

దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న సత్యం వెళ్లి ఏక్సైజ్ ఇనస్పెటర్ ఆంజనేయులుగారి పెద్ద తోటలో రాతిపై కూర్చున్నాడు. అక్కడ భక్తులు బాల బాబా చుట్టూ ఆసీనులయ్యారు. అప్పుడు భగవాన్ బాబా ఈనాడు ప్రపంచమంతా మారుమ్రోగిపోతున్న భజన సంప్రదాయానికి తొలి గీతమైన "మానస భజరే గురు చరణం.." పాడసాగారు. భక్తులు తన్మయత్వంతో పాడుతూ భజన చేయసాగారు. కొందరు భక్తులు అగరు ధూపాలు వెలిగించారు.కొందరు సత్యానికి పుష్పహారాలు వేశారు. అప్పుడొక ఫోటొగ్రాఫర్ వచ్చి భగవాన్ బాబాను ఫోటో తీయబోతూ అక్కడ బాబా ఎదుట అడ్డంగా ఉన్న చిన్న రాతిని తీసివేయమని చెప్పాడు. "అది అలాగే ఉంటుంది. ఫోటో తీయ" మన్నాడు సత్యం. ఆ ఫోటోలో ఆ రాయి షిరిడి సాయిబాబా రూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


 భగవాన్ బాబా గురించి ప్రాచీన గ్రంధాలలో


భారత జ్యొతిష పరిశోధన మండలి, సభ్యుడు డా.ఇ వి వి శాస్త్రి గారు కొన్ని వేల సంవత్సరముల క్రితం ఋషుల చేత రచింపబడిన కొన్ని నాడీ గ్రంధాలని పరిశీలించి వాటిల్లో భగవాన్ సత్య సాయి బాబా గురించి చెప్పబడిన అద్భుతమైన విషయాలను ప్రకటించారు.

            అగస్త్య నాడీ గ్రంధంలో "సత్య సాయి బాబా విద్యుత్ వేగంతో రోగ నివారణ చేస్తారు. సంకల్ప మాత్రం చేతనే ఆరోగ్యం ప్రసాదిస్తారు. అనేక విధ్యా సంస్థలను స్తాపిస్తారు. ధార్మిక జీవితం గురించిన గ్రంధాలెన్నో ప్రచురిస్తారు. మానవులలో ఆధ్యాత్మికతత్వాన్ని పెంపోదింపచేస్తారు. ధర్మోద్దరణ, ధర్మసంస్తాపన వారి ప్రధానమైన జీవీత ధ్యేయాలు. పూర్వ జన్మలో ఆయన షిరిడి సాయి బాబా! ఆయన మూర్తీభవించిన అనుభవము! ఆయన జగత్పిత!" అని పేర్కొనబడినది.

        బుధ నాడిలో "బాబా నిరంతరము తన్మయత్వంలో నిమగ్నులై ఉంటారు!" అని ఉన్నది.

        శుక్రనాడి గ్రంధంలో "ఆయన నివసించే మందిరానికి ప్రశాంతి నిలయమని పేరు ఉంటుంది. ఆయన సత్య ధర్మ ప్రేమ శాంతి మార్గాలలో శాశ్వతానందాన్ని లోకంలో స్థాపించి వ్యాపింప చేస్తారు. ఆయన మానవులకు సేవచేయటంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆయన అవతార పురుషుడు!" అని వ్రాయబడి ఉంది.

        శ్రీ చిన్నదురై బ్రహ్మనాడిని పరిశీలించి చెప్పిన అంశాలు సత్య సాయి నాధునికి అక్షరాలా సరిపోతాయి.- "ఆయన జీవితంలో గురువారములు పవిత్ర దినములు. ఆయన మానవ మాత్రుని వలె, పుట్టపర్తి నివాసి వలె బ్రాంతి కలిగిస్తుంటారు. ఆయన నారాయణుడను పేరు కలిగి ఉంటాడు. ఆయన శివశక్తి అంశమున ఉద్భవించిన అవతారము. షిరిడి సాయి పునరవతారము. చిత్రావతి తీరంలో, ప్రశాంత వాతావరణంలో ఆవిర్భవించిన ఆయన పరమ శాంతమూర్తి!" అని గ్రంధాలలో ఉంది.

        పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బద్రపరచబడిన నాడి గ్రంధంలో "తమిళ కేరల కర్నాటక దేశముల మద్య గల ఆంధ్రదేశంలో, చిత్రావతి నది తీరంలో భగవంతుడు అవతరిస్తాడు. ఆయన నామధేయము సత్యనారాయణ! ఆయన యోగీశ్వరుడు! పరమ యోగి, ఆయన నిద్రించడు" అని ఉంది.

        పరాశర మహర్శి రచించిన పద్మ పురాణంలో "పర్తి అనే గ్రామంలో సత్యం అని పేరుతో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు. ఆయన 5 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటాడు. ఆయన యావత్తు ప్రపంచాన్ని ఆకర్శించే శక్తివంతమైన అయస్కాంతమువలె విలసిల్లుతాడు." అని ఉన్నదని ఆ పురాణాన్ని విల్సన్ అనే ఆంగ్లేయుడు ఇంగ్లీషులోనికి అనువాదము చేశాడని భగవాన్ బాబా తెలిపారు. జైమినీ భారతం సమగ్ర గ్రంధం హిమాలయాలలోని కొందరు విశిష్ట వ్యక్తుల దగ్గర ఉన్నదని, అందులో సత్య సాయి గురించి స్పష్టంగా ఉన్నదని కూడా ఉన్నదని భగవన్ బాబా తెలిపారు.

        అరవింద మహర్శి మహా యోగి,మహా ఋషి, ఆయన పుదుచ్చేరిలోని తన ఆశ్రమంలో 1923 నుంది 1926 వరకు తీవ్ర తపస్సాధనలో నిమగ్నులై ఉన్నారు. మానవోద్దారణ కోసం భగవంతుడు మానవలోకంలో అవతరించాలని ఆయన ప్రాధిస్థున్నారు. 1926వ సంవత్సరము నవంబరు 24వ తేదీన ఆయన తపస్సమాధి లోనుండి బయటకి వచ్చి "నిన్నటి రోజున భగవంతుడు భూమి మీద అవతరించాడు! ఆయన తన అనంత దివ్య శక్తితో మానుష భావాలను ఊర్ధ్వముఖంగా మళ్ళించి దివ్య జ్యోతిని ప్రతి హృదయంలోను వెలిగిస్తాడు.అతని దివ్యవాణిని ప్రపంచములోని అశేష జనావళి వినగలదు." అని ప్రకటించారు. అరవింద మహర్శి ఉద్దేశించినది శ్రీ సత్య సాయి భగవానుణ్ణే అనేది ఆయన చెప్పిన జన్మ తిధిని బట్టి విశదమవుతున్నది.

        మహమ్మదు ప్రవక్త ప్రసంగాలు ఆయన జీవిత కాలం తరువాత 700ల సంవత్సరాలకు "ది ఓషన్ ఆఫ్ లైట్" అనే 25 సంపుటాలుగా వెలువడినాయి. అందులో రాబోయే జగత్ప్రభువును గుర్తు పట్టదగిన అంశాలు ఇలా పేర్కొనబడి ఉన్నాయి. - "ఆయన శిరోజములు దట్టముగా ఉంటాయి. నుదురు విశాలంగా ఉంటుంది. బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుంది.గడ్డము ఎప్పుడూ గీయబడి ఉంటుంది.ఆయన రెండు వస్త్రము ధరిస్తారు.ఆయన వస్త్రము అగ్నిజ్వాల వలె ఉంటుంది. ఆయన ముఖ కాంతి ఒకప్పుడూ రాగి రంగులో, ఒకప్పుడు బంగారు రంగులో, ఒకప్పుడు శ్యామల వర్ణంలో,ఒకప్పుడు చంద్రబింబం వలె ఉంటుంది. ఆయన ఆకృతి చిన్నదిగా ఉంటుంది. ఆయన పాదాలు స్త్రీ పాదాల వలె సుకుమారంగా ఉంటాయి. పుట్టుక నుంచి ప్రపంచములోని సర్వ మతములు,సర్వ బోధలు ఆయన హృదయములో ఉంటాయి. ప్రపంచములోని సర్వ విజ్ఞానాలు ఆయన తలలో ఉంటాయి. నీవు భగవంతుని వేడుకునే సర్వ పదార్దాలు ఆయన ప్రసాదించగలడు. ప్రపంచములోని నిధి,నిక్షేపాలన్ని ఆయన పాదాలక్రింద ఉంటాయి. ఆయన భక్తుల మధ్యకు వెల్లి తన చేతితో వాళ్ళ శిరస్సును సృశిస్తారు. ఆయనను చుచిన ప్రతి వారు ఆనందం అనుభవిస్తారు. ఆయన ఒక కొండ మీద నివసిస్తారు."


  మహాగణపతిగా


అరుణాచలం నుంచి రమణమహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారిని దర్శించుకోడానికై పుట్టపర్తి కి వచ్చారు. స్వామి అమృతానంద దగ్గరకి వచ్చి ప్రేమగా 'అమృతం' అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం రమణమహర్శి తనను ఆప్యాయతతో,అనురాగంతో ఎలా సంభోదించేవారో సరిగ్గా అలాగే ఉన్నది సాయినాధుని పిలుపు!. అది ఆయనకు విశిష్టమైన లీలగా అనిపించింది. 85 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ "నీవు 7వ యేట 41రోజుల గణపతి హోమం చేశావు గదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీ గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు వెయ్యి సార్లు జపిస్తూ అగ్నికుండంలో ఆహుతులను వ్రేల్చావు గదా. ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తునదని శాస్త్రాలలో చెప్పబడినది? శాస్త్రోత్తంగా ఆ హోమం పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమకుండములోనుండి సువర్ణ చాయతో,గజవదనంతో వెలువడి,దివ్య దర్శనం ప్రసాదించి పరమానందాన్ని కలిగిస్తాడని శాస్త్రాలలో ఉన్నది కదా అటువంటి దర్శనం నీకెప్పుడైనా కలిగినదా?" అని అడిగారు.

                    అప్పుడు అమృతానంద "స్వామి! నేను అప్పుడు యేడు సంవత్సరముల బాలుణ్ణి కదా. కేవలం హోమం చేత, ఆహుతుల సంఖ్య చేత మహగణపతి దర్శనం సాధ్యమవుతుందా?" అన్నారు. ఆ మాట విని సాయినాధుడు " ఆ జప హోమాదుల ప్రభావంచేతనే నీవీవయస్సులో ఇక్కడికి రాగలిగావు. ఇదిగో ఆ హోమఫలం నీకిప్పుడు లభింపబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడు వ్యర్ధంకావు" అంటూ అమృతానందను తనవైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి పరమాత్ముని స్థానంలో సువర్ణ కాంతులతో మిరిమిట్లు గొలిపే శ్రీ మహాగణపతిని అమృతానంద దర్శించి దివ్యానుభూతిని పొందారు.


సుబ్రహ్మణ్య స్వామిగా


మైసూర్ లో నివసించే భట్ కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1943లో భట్ భార్యకు కేన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. భట్ గారి తల్లి అందుకు అంగీకరించక "సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు" అన్నది కొడుకుతో. అచంచల విశ్వాశంతో ఆరు మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారు. భట్ భార్య క్రమంగా నీరసించిపోతుంది. ఒక రాత్రి భట్ భార్యకు స్వప్నంలో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్ర లేపింది. లైటూ వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరల కొంతసేపటికి స్వప్నంలో ఆ మహా సర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె చాతి మీద త్రిశూలంతో గుచ్చి ఆమెను యెక్కడికో తీసుకువెళ్తున్నట్లు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమెను ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాలపై పడగా, అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి "ఆమెతో ఇక్కడ ఉంటావా? తిరిగి వెళ్తావా? అని అడిగినట్ళు, ఆమె తన భర్తను,పిల్లలను తలుచుకుని "ఇంటీకి వెళ్తాను అన్నట్లు" అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి "నీ వ్యాది నయమైంది వెళ్ళు. ఎప్పుడూ నిన్ను కాపాడుతూనేఉంటాను" అని సన్నని అందమైన మెట్లపైనుండి ఈలోకానికి పంపినట్లు అనుభవం కలిగింది. ఆనాటీ నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడ సాగింది. ఆమె పూజలుతో పాటు చేతనైనంత దీనులు సేవ చేస్తూ ఉన్నది.

        ఈ సన్నివేశo జరిగిన 20సంవత్సరాల తరువాత భట్ దంపతులు పుట్టపర్తికి వచ్చి మొదటిసారిగా సత్యసాయి పరమాత్ముని దర్శించుకున్నారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో "నేను నీతో 20యేళ్ళా క్రితం మాట్లాడాను" అన్నారు. ఆమె ఆశ్చర్యంతో "లేదు స్వామి, ఇదే ప్రధమ దర్శనం" అన్నది. అప్పుడు స్వామి "కాదు, మీరు మైసూర్ లో ఉండగా వచ్చాను" అని ఆమెకు కేన్సర్ వచినప్పుడు ఏ వీదిలో ఉండెవారో ఆ వీధి పేరు చెప్పారు బాబా.


  సిమ్లాలో సన్నివేశము


సత్య సాయి పరమాత్ముని అతిలోక మహనీయమైన దివ్య శక్తికి ఒక ఉదాహరణమిది.

ఒకసారి సత్యసాయినాధుడు కొద్దిమంది భక్తులతో కలసి సిమ్లా వెళ్ళారు.ఆ బృందంలో కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. ఆ పర్యటనలో ఒక అత్యధ్భుతం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారంతా సిమ్లా చేరుకున్నారు. సాయంత్రం సుమారు 6.30 గంటలకు సిమ్లా లోనే వేరొకచోట ఒకరింట్లో రెండు సంవత్సరాల పసిబాలుడు మరణించాడు. ఆ తల్లిదండ్రులు ఆందోళనతో దు:ఖంతో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో వారి బాధను చూసి ఒక మిత్రుడు "సత్యసాయి బాబా వారు సిమ్లా వచ్చారు. మీరు ఈ బాలుణ్ణి ఎత్తుకుని వెళ్ళి స్వామి పాదాలపై ఉంచి శరణు వేడండి" అని సలహా ఇచ్చాడు. సరేనని ఆ తల్లిదండ్రులు గబగబా ఆ పసివాడి శరీరాన్ని ఒక వస్త్రంలో చుట్టుకుని స్వామి విడిది దిగిన చోటుకు చేరుకున్నారు. ఆ తల్లి స్వామిని చూసి పొంగిపొరలిన దు:ఖంతో చెంత చేరి,ప్రాణం లేని ఆ పసివాడి శరీరాన్ని స్వామి ఎదుట ఉంచి "స్వామి ఈ పసివాణ్ణి బ్రతికించు స్వామీ! బ్రతికించు" అంటూ రోదించింది. కరుణాంతరంగుడైన సత్యసాయినాధుడు తన క్రుపాకటాక్షాన్ని ఆ బాలునిపై ప్రసరింపజేశారు" అంతే. ఆ బాలునికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి ఏడ్వసాగాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. వారి దు:ఖబాష్పాలన్నీ ఆనందబాష్పాలుగా మారిపోయాయి. ఆ ఆనందబాష్పాలతో వారు స్వామి పాదపద్మాలను తడిపి వేశారు. ఈ దృష్యం చూసిన భక్తులు చలించిపోయి పరమానందంతో జయ జయ నినాదాలు చేశారు.




.



- స్వస్తీ...