వేదాంత పరిభాష







: వర్ణ సమామ్నాయంలో ఇది మొట్టమొదటి వర్ణం. ఒక శబ్దానికి ముందు చేరితే ఇది దాని వ్యతిరేకార్థాన్ని చెబుతుంది. అది లేకపోవటమైనా కావచ్చు. 

కాకపోవటమైనా కావచ్చు. అవివేకమంటే వివేకం లేకపోవటం, అవిచారమంటే విచారం లేకపోవటం. 

అలాగే అకాయ మవ్రణమంటే కాయం కానిదని, వ్రణం కానిదని అర్థం. అంటే స్థూలసూక్ష్మశరీరాలు రెండూ కాని ఆత్మచైతన్యం. 

అ అనేది ఓంకారంలో మొదటి అక్షరం కూడా. అక్కడ అది స్థూల శరీరానికీ, జాగ్రదవస్థకూ, విశ్వుడనే జీవుడికీ సంకేతం. త్రిమూర్తులలో బ్రహ్మకు కూడా ఇది సంకేతమే. పోతే ప్రత్యభిజ్ఞా దర్శనంలో అకారం ప్రకాశ రూపమైన శివ తత్త్వానికైతే హకారం విమర్శరూపమైన శక్తితత్త్వానికి ప్రతీక. రెండూ బిందువు ద్వారా ఏకమైతే అహమ్‌ అనే జీవభావమేర్పడిందని వారి మాట.


అక : కమ్మంటే సుఖం. దానికి ముందు అ చేరింది కాబట్టి అకమంటే సుఖం కానిది, దుఃఖమని అర్థం. న+అక. అకం కూడా కానిది నాకమంటే. మరలా దుఃఖం కానిది సుఖమనే భావం. అది ధర్మపురుషార్థంలో స్వర్గమైతే బ్రహ్మ పురుషార్థంలో మోక్షం.


అకల : కల కళ అంటే భాగం అంశ Part అని అర్థం. ప్రాణం దగ్గరినుంచి నామం వరకు పదహారు కళలను వర్ణించాయి ఉపనిషత్తులు. వీటికే షోడశకళలని పేరు. పూర్ణమైన ఆత్మచైతన్యం వస్తుతః నిరవయవ Indivisible మైనా ఈ షోడశ కళలతో అది సావయవంగా Divisible భాసిస్తున్నది. అప్పుడది సకలం. అదే మనకు జ్ఞానోదయమై ఇవి ఆ పురుష చైతన్యంలో కలిసిపోతే దానికప్పుడు అకలమని పేరు. ఏ కళలూ అవయవాలూ Parts లేని శుద్ధమైన నిరాకారమైన చైతన్యమని తాత్పర్యం.


అకర్మ : లౌకిక శాస్త్రీయ కర్మలేవీ లేకపోవటం. ఏ పనీ పెట్టుకోకపోవటం. నిష్కర్మ అని కూడా అనవచ్చు. కర్మ అంటే చలనం. సర్వవ్యాపకమూ నిరాకారమైన ఆత్మచైతన్యం చలించదు గనుక అకర్మ అంటే చైతన్యమని, జ్ఞానమని కూడా అర్థమే. అనాత్మ అంతా కర్మ అయితే దానికి భిన్నమైన జ్ఞాన మకర్మ. కర్మణ్య కర్మ యః పశ్యేత్‌.


అకామ : కామమంటే ఒకటి పొందాలనే వాంఛ-కోరిక. అది నాకు విజాతీయ మొకటి ఉందని భావించినప్పుడే ఏర్పడుతుంది. అంతా ఆత్మస్వరూపమే నని గుర్తించి నప్పుడు కామ్యమైన పదార్థమే లేదు గనుక అకామమే. ఆత్మకు అకామమని పేరు. నిష్కామమన్నా అదే అర్థం.


అకాల : కాలం గాని కాలం. అనుచితమైన కాలమని అర్థం. కాలాని కతీతమైనది కూడా అకాలమే.


అకార్య : కార్యం కానిది. తయారైనది కాదు. స్వతస్సిద్ధమైనదని భావం. అది జ్ఞానస్వరూపమైన ఆత్మ తప్ప మరేదీ కాదు.


అకాయ : కాయమంటే శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏదైనా కావచ్చు. కాని ఈశావాస్యంలో అకాయమవ్రణమనే చోట అకాయమంటే సూక్ష్మ శరీరమని అర్థం చెప్పారు కాయ శబ్దానికి. ఇంతకూ అకాయమంటే లింగ శరీర వర్జితమైన ఆత్మ అని అర్థం.


అకుతోభయ : దేనివల్లనూ భయం లేకుండా బ్రతకటం. తనకు భిన్నమైనది ఎదురైతేనే భయం. ఆత్మ తప్ప అనాత్మే లేదని సిద్ధాంతం కాబట్టి ఆత్మజ్ఞాని అకుతోభయుడు.


అకృత : కృతమంటే తయారైనది. జ్ఞేయమైన పదార్థాలన్నీ లోకంలో తయారయ్యేవే. పోతే వాటికి సాక్షి అయిన చైతన్యమలా తయారయ్యే పదార్థం కాదు. కాబట్టి దాని కకృతమని పేరు. నిత్యసిద్ధం - స్వతస్సిద్ధమని భావం.


అకృతాభ్యాగమ : మనమొక కర్మ అది సుకృతం కానీ దుష్కృతం కానీ ఎప్పుడూ చేయకపోయినా దాని ఫలితం వచ్చి నెత్తిన పడితే దానికి అకృతాభ్యాగమ మని పేరు. కారణం లేకుండా కార్యమేర్పడటమని భావం. అది అశాస్త్రీయం. హేతు వాదానికి నిలవదు. కనుకనే సుఖమో, దుఃఖమో ఇప్పుడు జీవుడు అనుభవిస్తున్నాడంటే పూర్వమెప్పుడో దానికి దోహదమైన కర్మ వాడు చేసి ఉంటాడని వేదాంత సిద్ధాంతం.


అకృతకర్తృ : అసిద్ధమైన దానిని సిద్ధం చేసేది. అంతకుముందు లేనిదానిని సాధించేది శాస్త్రం. అంతకుముందే ఉంటే సాధించనక్కరలేదు. అప్పుడు శాస్త్ర మనువాద (ఉన్న దానిని చెప్పేది) మవుతుందేగాని విధానం (క్రొత్తగా విధించేది) కాదు. కాకుంటే ప్రామాణ్యం Authority లేదు దానికి.


అక్రతు : క్రతువు లేనిది. క్రతువంటే యాగం కాదిక్కడ. సంకల్పం అధ్యవసాయం లేదా నిశ్చయమని అర్థం. క్రతుమయః పురుషః మానవుడంటే వాడి నిశ్చయమే Conviction. అది లేని పక్షంలో అక్రతు. క్రతువంటే కామం, కోరిక అని కూడా ఒక అర్థం. తమ క్రతుః పశ్యతి. ఏ కామమూ లేని నిష్కామమైన మానవుడి బుద్ధికే గోచరిస్తుంది ఆత్మ స్వరూపమని భావం.


అక్రమ : ప్రపంచ సృష్టి విషయంలో ఆకాశం నుంచి మొదలయిందా, తేజస్సు నుంచి మొదలయిందా అని క్రమం పాటించనక్కరలేదు. అసలు సృష్టే జరగలేదు. ఆభాస అని సిద్ధాంతమయినప్పుడు ఒక క్రమమేముంది? అక్రమమైనా క్రమమే నన్నారు అద్వైతులు.


అఖండ : ఖండం కానిది. ఖండమంటే శకలం. తునక. విభాగం. అలాటి విభాగం లేని అవిభక్తమైన పూర్ణమైన పదార్ధం. అది నిరాకారమూ వ్యాపకమైన ఆత్మతత్త్వమొక్కటే. అది ఎలా ఉందో అలాగే మనసులో వృత్తి లేదా ఆలోచన ఏర్పడితే దానికి అఖండాకార వృత్తి అని పేరు.


అఖ్యాతి : ఖ్యాతి అంటే బయటపడి కనిపించటం. అలా బయట పడకుంటే అఖ్యాతి. ఒక దానిమీద మన భ్రాంతి మూలంగా మరొకటి అధ్యాస అయినప్పుడు ఆ మొదటిది బయట పడకపోతే అలాంటి దానికి అఖ్యాతి Unapparehension అని సంజ్ఞ. మీమాంసకులది అఖ్యాతి వాదం.


అఖిల : ఖిలమన్నా ఖిల్యమన్నా ఒక కరడుగట్టిన ముద్ద. పిండం. ఒక శకలం. అది కానిది అఖిలం. అవిభక్తం, పరిపూర్ణమని భావం. అకలమంటే ఏమిటో అదే అఖిలమన్నా Indivisible whole.


అగతి : అనన్యప్రోక్తే గతి రత్ర నాస్తి. గతి అంటే ఇక్కడ జ్ఞానం. ఆత్మజ్ఞానం. అపరోక్షంగా బ్రహ్మతత్త్వాన్ని అనుభవించే ఆచార్యుడు బోధ చేస్తే అగతి లేదు. అంటే ఆత్మజ్ఞానం కలగకుండా పోదని తాత్పర్యం.


అగతిక : గతి అంటే ఇక్కడ మార్గం. మరొక మార్గం లేదు. గత్యంతరం Alternative లేదని భావం.


అగమ్య : గమ్యం కానిది. గమ్యమంటే చేరగలిగినది. పొందగలిగినది. పొంద లేనిది అగమ్యం. ఆత్మచైతన్యం. అది మన స్వరూపమే గనుక మనకు గమ్యంకాదు.


అగ్ర : కొస-చివఱ. అంతేకాదు. కర్మఫలమని అర్థం చెప్పారు భాష్యకారులు. సమగ్రం ప్రవిలీయతే-అగ్రంతో సహా అంటే ఫలంతో సహా లయమవుతుందట కర్మ. కర్మకు చివరి దశ ఫలానుభవమే గదా. కనుక అగ్రమంటే ఫలమని చెప్పారు.


అగ్య్ర : అగ్రమంటే మొన - బాగా మొనదేరినది Sharpened అని భావం. దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా - ఆత్మతత్వమెంత అగోచరమైనా బాగా పదునెక్కిన బుద్ధితో దర్శించవచ్చునట. అగ్య్రమంటే పదునైన అని అక్కడ అర్థం.


అగ్రహణ : గ్రహణమంటే పట్టుకోవటం. పట్టుకోలేకపోతే అగ్రహణం. సుషుప్తిలో ఉన్నది అగ్రహణం. మన స్వరూపమక్కడ గుర్తులేదు.


అగ్రాహ్య : గ్రాహ్యం కానిది. అనగా ఏ ఇంద్రియంతోనూ పట్టుకోరానిది. Incomprehensible ఆత్మతత్వం. యత్త దద్రేశ్య మగ్రాహ్యమ్‌.


అగోచర : గోచరం కానిది. గో అంటే ఇంద్రియం లేదా జ్ఞానం. దాని పరిధిలో ఉంటే అది గోచరం Object to Impurity. అలా కాకుంటే అగోచరం. ఇంద్రియాతీత మని భావం.


అగోత్ర : గోత్రం లేనిది ఆత్మతత్త్వం. గోత్రమంటే ఇక్కడ అన్వయమన్నారు. అన్వయమంటే మరి ఒక పదార్థంతో సంబంధం. ఆత్మకన్నా భిన్నమైన పదార్థమే లేదన్నప్పుడిక సంబంధమనే ప్రశ్నేముంది. ఎప్పుడూ అది అనన్వయమే. అగోత్రమే.


అఘ : పాపమని ఒక అర్థం. దోషం, కళంకమని ఒక అర్థం. మాలిన్యమని, లోపమని మరి ఒక అర్థం. sin defect Impurity. అవిద్యా కామకర్మలే పాపాలు. అవే అఘం. 'తే త్వఘం భుంజతే పాపాః' అవి వదలకుండా భుజిస్తే ఆ భుజించేది వారు అన్నం కాదు. పాపమేనట.

Page 1

అద్వైత వేదాంత పరిభాష



అఘాయు : అఘాయు రింద్రియారామః, పాప జీవనం, పాపపు బ్రతుకు బ్రతికే మానవుడని అర్థం.


అఘోర : ఘోరమంటే దారుణం. కర్కశం. కర్కశం కానిది అఘాెరం మృదువైనది. పంచభూతాలలో పృథివి కఠినమైతే జలం మృదువైనది. కనుక అఘాెరమనే మాట పంచ భూతాలలో జలానికి సంకేతం. ఈశ్వరుడు పంచముఖుడు. ఆ ముఖాలేవో కావు. పంచభూతాలే. అందులో తత్పురుషమాకాశం. ఈశానం వాయువు. వామదేవం తేజుస్సు. అఘాెరం జలం, సద్యోజాతం పృథివి. ఆకాశాది భూతపంచకమే ఈశ్వరుని ముఖపంచకం. తన్ముఖంగా చరాచర సృష్టి చేస్తున్నాడని అంతరార్థం.


అఘటిత ఘటనా : ఒకటి కుదరకపోయినా కుదర్చటం. చెల్లకున్నా చెల్లేలాగా చేయటం.


అజ్ఞ అజ్ఞాన : జ్ఞానం లేనివాడజ్ఞుడు. Ignorant. జ్ఞానమంటే ఆత్మజ్ఞానమే. అనాత్మ జ్ఞానం జ్ఞానం కాదు. అజ్ఞానమే నంటారు వేదాంతులు. ఎందుకంటే అది విశేష జ్ఞానం. Knowledge of particulars. అందులో పరిపూర్ణత లేదు. పరిష్కారం లేదు. కనుక ఆయా విషయాలకు చెందిన మానవుడి జ్ఞానమంతా అజ్ఞానమే. ఇలాంటి అజ్ఞానమున్నంతవరకూ వాడజ్ఞుడే.


అజ్ఞేయ : జ్ఞేయం కానిది. జ్ఞానానికి గోచరించనిది ఆత్మ. అది అనాత్మలాగా గోచరం కాదు జ్ఞానానికి. కారణం అది జ్ఞాన స్వరూపమే.


అజ్ఞాత జ్ఞాపక : తెలియని విషయాన్ని తెలిపేది.గుర్తు చేసేది. శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్షానుమానాలకు గోచరం కాని బ్రహ్మతత్త్వాన్ని మనకు గుర్తు చేసేది అధ్యాత్మ శాస్త్రమే.


అజ్ఞాత చర్యా : ఎవరికీ అంతు పట్టకుండా తిరుగుతూ ఉండటం. ఆత్మజ్ఞాని ఎప్పుడూ అలాగే జీవిస్తాడు. లోకులతో వ్యవహరిస్తున్నా అతని బాహ్యమైన చేష్టలే గాని వాటినన్నింటినీ వ్యాపించి ఉన్న అతని స్వరూప జ్ఞానమెవరికీ ఇదమిత్ధమని గుర్తు చిక్కదు. అలా గూఢంగా చరించినప్పుడే వాడు జ్ఞాని. నేను జ్ఞానినని ప్రకటించు కొన్నప్పుడు కాదు.


అచర : చరం కానిది. చరమంటే చరించేది. కదిలేది. కదలనిదేదో అది అచరం. Static. స్థావరమని అర్థం.


అచల : చలించనిది. కదలనిది. స్థిరమైనది. ఆత్మతత్త్వం. అచలోయం సనాతనః


అచింత్య : చింతించటానికి లేదా మనసుతో ఊహించటానికి శక్యమైతే చింత్యం. ఊహ కతీతమైతే అచింత్యం. Unthinkable.


అచిత్‌ : చిత్‌ అంటే చైతన్యం. Consciousness. అది లేకున్నా కాకున్నా దాని కచిత్తని Insenscient or Unconscious అని పేరు. జడమని అర్థం.


అచీర్ణవ్రత : చీర్ణమంటే చరించిన ఆచరించిన. అచీర్ణ అలా ఆచరించని వ్రతం కలవాడు. వ్రతం పాటించనివాడు శ్రవణానికర్హుడు కాడు.


అచ్యుత : చ్యుతమంటే జాఱిపడినది. జాఱి పడకుంటే అది అచ్యుతం Unfallen ఆత్మ. అది తన స్వరూపస్థితి నుంచి ఎప్పుడూ చలించదు. పడదు. అది కూటస్థం Immovable.


అచేతన : చేతనమంటే జ్ఞానమున్న పదార్థం. జ్ఞానంలేని దచేతనం. Insenscient. జడమని అర్థం.


అచోద్య : చోద్యమంటే ప్రశ్నించదగినది. Questionable. అలా కానిది అచోద్యం. ప్రశ్నించే అవకాశం లేనిది. చోద్యమంటే ఒక పనికి పురమాయించటం కూడా. అలా పురమాయించరానిదేదో అది కూడా అచోద్యమే.


అజ : జ. జన్మించేది - అజ జన్మించలేనిది. Unborn. ఆత్మ. కారణముంటే దేనికైనా జన్మ. ఆత్మకు కారణం లేదు. అదే అన్నిటికీ కారణం. కనుక అది అజం.


అజరామర : జరా మరణములు లేనిది. జరామరణాలు స్థూల శరీర లక్షణాలు. అవి లేవంటే ఆత్మ స్థూల శరీరం కాదు. అశరీరం. అస్థూల మనణ్వహ్రస్వమని శాస్త్రవాక్యం.


అజగర వృత్తి : కదలకుండా పడిఉండే కొండచిలువ కజగరమని పేరు. అది నోరు తెఱచుకొని ఏది దగ్గరకు వస్తే దాన్ని తిని కడుపు నింపుకొంటుంది. అలా అప్రయత్నంగా లభించిన దానితో జీవనం గడుపుకొనే జ్ఞానికూడా అజగర వృత్తే - యదృచ్ఛాలాభ సంతుష్టుడని అర్థం.


అజహల్లక్షణ : ఒక మాటకు ముఖ్యార్థం చెల్లకపోతే లక్షణావృత్తిలో అర్థం చెప్పవలసి ఉంటుంది. Secondary sense. అది రెండు విధాలు. ఒకటి జహత్‌ అంటే ముఖ్యార్థాన్ని పూర్తిగా వదులుకోవటం-ఊరంతా పగలబడి నవ్వింది. ఇక్కడ ఊరికి బదులు ఊరిలో ఉన్న జనులని అర్థం చెప్పాలి. అలాకాక ఆ తెల్లది పరుగెడుతున్నదన్నప్పుడు తెల్లని గుఱ్ఱమది. అందులో తెలుపును వదిలేయకూడదు. దానితో సహా గుఱ్ఱమని అర్థం. ఇందులో మొదటిది జహత్తయితే రెండవది అజహత్తు.


అజా : జన్మలేనిది. అజ పుల్లింగమైతే ఇది స్త్రీ లింగం. ప్రకృతి అని అర్థం. ఈశ్వరుడెలా అజుడో ఈశ్వర ప్రకృతి కూడా అజమే. చైతన్యాన్ని ఆశ్రయించిన శక్తే గదా ప్రకృతి. కనుక శక్తి శక్తిమత్తత్త్వాలు రెండూ అజమే. నిత్యసిద్ధమే. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం. ఈ శక్తి త్రిగుణాత్మకం. రజస్సత్త్వ తమస్సులే త్రిగుణాలు. అవి వరసగా ఎఱుపు తెలుపు నలుపు వర్ణాలు. అద్వైతులీ మూడూ వర్ణాలని గాక అలాంటి వర్ణాలుగల తేజో-బన్నభూత సూక్ష్మాలని వర్ణిస్తారు. గుణాలని భావించరు. మొత్తంమీద ప్రకృతి, మాయ, శక్తి అని సారాంశం.


అజాతవాద : ఏదీ జన్మించలేదనే సిద్ధాంతం. దీనినిబట్టి జీవ జగదీశ్వరులు ముగ్గురూ లేరు. లేకుంటే అవి ఎలా భాసిస్తున్నాయని అడిగితే అది వస్తువుకాదు. కేవల మాభాసే Appearance నంటారు వేదాంతులు. వస్తువే అలా భాసిస్తున్నది గనుక ఆభాసకు జన్మలేదు. వస్తువు స్వతస్సిద్ధం గనుక దానికీ జన్మలేదు. కాబట్టి ఆత్మానాత్మలు రెండూ అజాతమే. ఈ అజాత వాదానికి ప్రవర్తకుడు గౌడపాదులు. అద్వైత వాదానికిది మారు పేరు.


అజాయమాన : అజాయమానో బహుధా విజాయతే - జన్మించకుండానే అని అర్థం. జన్మించకుండానే అనేక రూపాలలో భాసిస్తున్నది అదే ఆత్మతత్త్వం.


అజావిపాల : అజ-మేక అని, గొఱ్ఱె అని అర్థం. మేకలను, గొఱ్ఱెలను కాచే వాడి కజావిపాలుడని పేరు. ఇది ఈ శబ్దానికి వాచ్యార్థమైతే కేవలం పామరుడు తెలివి తక్కువవాడని లక్ష్యార్థం. అసలైన ఆత్మ ఏదో గుర్తించక మహాపండితులమని భావించే వారందరూ అజావిపాలురతో సమానులని భావం.


అజాండ : అజ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ. అండమంటే కోడిగ్రుడ్డు లాంటిది. బ్రహ్మాండమని అర్థం. The Cosmos.


అజాతి : జాతి అంటే జన్మ. జన్మలేనిది అజాతి. ఆత్మతత్త్వం. జాతి అంటే తార్కికులు చెప్పే సామాన్యం Genus. గోజాతి. అశ్వజాతి ఇలాంటిది. వ్యక్తులనేక మున్నప్పుడే జాతి చెప్పాలి. ఆత్మకు భిన్నమైన మరొక వ్యక్తే లేనప్పుడిక జాతేముంది. కనుక అది అజాతి.


అణు : సూక్ష్మమైన పంచభూతాంశం. పరమాణువని కూడా నామాంతరం. Atom. తన్మాత్రలని కూడా అంటారు వేదాంతులు. భూతమాత్రలే. Elements గాక అతిసూక్ష్మమైన పదార్థమేదైనా అణువే. Smallest Particle. అన్నిటికన్నా సూక్ష్మమైనది నిరాకారమైన ఆత్మచైతన్యం గనుక దాన్ని కూడా వేదాంతులణువని పేర్కొంటారు. ఏ షోణురాత్మా.


అణోరణీయాన్‌ : అణువుకంటే అణువైనది ఆత్మస్వరూపం. The subtlest. నిరాకారం గనుక అణువుతో కూడా పోల్చకూడదు. అణువు ఎంత సూక్ష్మమైనా నిరాకారమైనా అది మన జ్ఞానానికి విషయం Object. ఆత్మ విషయం కాదు. విషయి Subject. అందుకే దానికన్నా సూక్ష్మమని చెప్పటం.


అణువాద : పరమాణువే ప్రపంచ సృష్టికి కారణం. ఈశ్వరుడు కాదనే సిద్ధాంతం Atomic Theory. దీనికి మూలపురుషుడు కణాదుడు. వైశేషిక మతమని పేర్కొంటారు ఈ వాదాన్ని. వైశేషికులది ఆరంభవాదం. కార్యమంతకు ముందు లేదు. అది అప్పుడసత్తు. అదే కారక వ్యాపారానంతరం కార్యరూపంగా ఆరంభమయింది అని వీరి మతం. దీనినే అణువాదమనీ అసత్కార్యవాదమనీ ఆరంభ వాదమనీ అనేక సంజ్ఞలతో వ్యవహరిస్తారు.


అణిమా : అణుభావం-అణువయిపోవటం. అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి కూడా. The power of becoming very subtle. పోతే ఆత్మచైతన్యమని కూడా అర్థమే. య ఏషో -ణిమా అని శాస్త్రం. మేము వర్ణించిన అణిమ ఏదున్నదో అదే సద్రూపమైన ఆత్మచైతన్యం.


అతః : అథ అతః బ్రహ్మజిజ్ఞాసా. అతః అంటే హేత్వర్థం. ఇహపరాలు రెండూ నశించేవి గనుక అని హేతువును చెబుతుందీ శబ్దం. Because of the fuility of all matter.

Page 2

అద్వైత వేదాంత పరిభాష



అత్తా : అత్తృ అనే దాని ప్రథమైక వచనాంత రూపం. Eater తినేవాడని అక్షరార్థం. Literal meaning. అత్తాచరాచర గ్రహణాత్‌. చరాచర ప్రపంచాన్ని భక్షించేవాడు గనుక పరమాత్మకు అత్త అని పేరు. భక్షించటమంటే సంహరించటం. తన లోపలికి తీసుకొని తన స్వరూపంగా చేసుకోవటమని అర్థం. జీవుడికి కూడా అత్త అనే పేరు. పిప్పలం స్వాద్వత్తి - వీడుకూడా తాను చేసిన కర్మఫలాన్ని తాను భక్షిస్తాడు అంటే అనుభవిస్తాడు.


అతర్క్య : తర్కించరానిది. ఊహించరానిది. ఆత్మతత్త్వం. అతర్క్య మణు ప్రమాణమని శాస్త్రం.


అతంత్ర : తంత్రమంటే ఇక్కడ ఆవశ్యకమైనది Essential. అతంత్రమంటే అనావశ్యకం, అవసరం లేనిదని భావం.


అతద్గుణ సంవిజ్ఞాన : ఏది మొదట చెప్పారో అది వదిలేయకుండా దాని గుణంతో కూడా పట్టుకొంటే తద్గుణ సంవిజ్ఞానం. లంబకర్ణ అన్నప్పుడు కర్ణద్వయంతో సహా పట్టుకోవాలి మేకను. చిత్రగు అన్నప్పుడు రంగు రంగుల ఆవులను వదిలేసి వాటిని కాచే ఆలకాపరిని గ్రహించాలి. దీనికి అతద్గుణమని పేరు. ఇందులో మొదటిది విశిష్టాద్వైతానికైతే, రెండవది అద్వైతానికి సరిపోతుంది. నిర్గుణంగా గుర్తించాలి పరమాత్మనని అద్వైతుల సిద్ధాంతం.


అత్యయ : దాటిపోవటం. కడచి పోవటం. Passing.


అతీత : కడచిపోయినది. Past.


అత్యంత : అంతమంటే చివర-హద్దు. అది లేనిది అత్యంతం. Limit less End less. అపరిమితమని కూడా చెప్పవచ్చు. శాశ్వతమనీ అర్థమే.


అత్యాంతాభావ : ఒక పదార్థముండటానికి భావమని Presence లేకపోవటాని కభావమని Absence పేరు. అభావమనేది నాలుగు విధాలు. అందులో ఇది నాలుగవది. ఒక వస్తువు మూడు కాలాలలోనూ లేకుంటే దాని కత్యంతాభావమని పేరు. కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ ఇలాంటివన్నీ ఉదాహరణలు.


అతీంద్రియ: ఇంద్రియాలకు గోచరం కానిది Incomprehensible ఆత్మ స్వరూపం.


అతిగ్రహ : గ్రహమూ, అతిగ్రహమని ఇవి జంటపదాలు. గ్రహించే ఇంద్రియం గ్రహమైతే దానిచేత గ్రహించబడే విషయ మతిగ్రహం. ఉదాహరణకు చక్షుస్సు గ్రహం. దానికి గోచరించే రూపమతిగ్రహం.


అతిచార : హద్దుమీరటం. Transgression.


అతిచ్ఛంద : ఛందమంటే కామం, కోరిక. అది దాటిపోయినది అతి చ్ఛందం. నిష్కామమైన ఆత్మస్వరూపం.


అతిదేశ : ఒక దానికి చెప్పిన లక్షణం మరి ఒకదానికి కూడా వర్తిస్తుందని సూచిస్తే దాని కతిదేశమని Attribution, ఆకాశమెలా సృష్టి అయిందో అలాగే వాయువు కూడా నంటారు బాదరాయణులు. ఇలాంటి దాని కతిదేశమని పరిభాష.


అతిపాత : ఒక లక్షణం దాని పరిధి దాటి ప్రసరించటం.


అతిప్రసంగ/అతిప్రసక్తి : అతిపాతం వంటిదే. వివక్షితమైన విషయాన్నేగాక విషయాంతరాన్ని కూడా అనవసరంగా చెబుతూ బోతే దాని కతిప్రసంగమని పేరు.


అతిప్రశ్న : ప్రశ్నించే విషయం కాకున్నా చాపల్యం కొద్దీ ప్రశ్నించటం. అనుచితమైన అసందర్భమైన ప్రశ్న-గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి అలాగే ప్రశ్నించిందట.


అతిరేక/అతిరిక్త : మించిపోవటం. అదనంగా ఉండటం. అలా ఎక్కువగా అధికంగా ఉన్న భావం Additional. కారణ సత్తాకు అతిరిక్తంగా కార్యసత్తా లేదు. కనుక సచ్చిద్రూపమైన ఆత్మకన్నా అతిరిక్తంగా అనాత్మ జగత్తులేదు.


అతివర్ణాశ్రమీ : వర్ణాశ్రమాలు దాటిపోయినవాడు. వాటితో సంగంలేని సన్న్యాసి. అవధూత.


అతివాహనమ్‌ : మరణించిన తరువాత కర్మిష్ఠుని గాని ఉపాసకునిగాని ఒక లోకం నుంచి మరొక లోకానికి తీసుకుపోవటం. అలా తీసుకుపోయే దేవదూతకు అతివాహికుడని పేరు.


అతివ్యాప్తి : ఒక పదార్థానికి చెప్పిన లక్షణం దానికేగాక మరొక దానికి కూడా వర్తించటం. కొమ్ములున్న జంతువు వృషభమని చెప్పామనుకోండి. అది గేదెకు కూడా వర్తిస్తుంది.


అతివాద : అతీత్య వదనమ్‌ : ఒకదాన్ని మించి మాటాడటం. ప్రాణం వరకు చెప్పి ఆగిపోతే అది వాదం. దాన్నికూడా దాటి ఆత్మతత్త్వం దగ్గరికి వచ్చి వర్ణిస్తే అది అతివాదం.


అతిశయ : అధికము-ఎక్కువ. అదనంగా ఉండటం. కారణం కన్నా కార్యం అన్యం కాకపోయినా కార్యమనిపించుకోటానికందులో ఏదో ఒక అంశంలో అతిశయం ఉండాలంటారు. ఘటమనేది మృత్తికే అయినా గుండ్రని ఆ రూపం మృత్తికకన్నా అతిశయం.


అథ : ఇకమీదట. అథ యోగానుశాసనమ్‌. అనంతరం. అథాతోబ్రహ్మ జిజ్ఞాసా సాధన చతుష్టయ సంపాదనానంతరమే బ్రహ్మజిజ్ఞాస చేయాలని అర్థం.


అదత్క : అ+దత్క-పండ్లు లేనిది. అదత్‌+క - నమిలి వేసేది -పండ్లు లేకున్నా నమలి మ్రింగేది స్త్రీ గోప్యాంగం. అదత్కం లిందు మాభిగామ్‌ - అని ఉపనిషత్తు.


అద్వయ/అద్వైత : ద్వయం కానిది. ద్వైతం కానిది. అంటే రెండన్నదంటూ లేనిది. ఆత్మచైతన్యం. దానికంటే అదనంగా జీవుడు లేడు-జగత్తు లేదు. ఈశ్వరుడులేడు.


అద్వితీయ : అది ఏకమేవా ద్వితీయమ్‌ - ద్వితీయమైన తత్త్వమేలేదు దానికి. సజాతీయం లేదు. విజాతీయం లేదు. స్వగత భేదం కూడా లేదు చివరకు. ఇదే అద్వైతుల సిద్ధాంతం.


అదితి : కశ్యపుని భార్యలలో ఒకతి అనేది సామాన్యంగా చెప్పుకునే అర్థం. పోతే వేదాంతంలో దీనికి రెండర్థాలున్నాయి. ఒకటి దితి కానిది. దితి అంటే ఖండం. ఖండం కాక అఖండమైన భావం అదితి. బాహ్యమైన ఆకాశమైనా కావచ్చు లేదా ఆధ్యాత్మికమైన బ్రహ్మచైతన్యమైనా కావచ్చునది. పోతే అదనం చేసేది అదితి. అంటే అన్నింటినీ కబళించేది తన లోపల ఇముడ్చుకొనేదని అర్థం. ఆ అర్థంలో అదితి అంటే మాయాశక్తి. అదితి అంటే పరమాత్మ. అత్తా చరాచర గ్రహణాత్‌ - అదితి ర్దేవతా మయీ అని శాస్త్రం.


అద్రేశ్య : అదృశ్యమని అర్థం. కళ్ళకు కనపడనిది. పరమాత్మ తత్త్వం.


అదృష్ట : దృష్టం కానిది. కనపడనిది మనం చేసుకొన్న కర్మఫలం. అది మరణం వరకూ ఫలితమివ్వదు. కనపడకుండా మరణానంతరం మనతోపాటు లోకాంతరాలకు జన్మాంతరాలకు వచ్చి అక్కడ దృష్టమై మనకు ఫలితమిస్తుంది. దీనినే అపూర్వమని పేర్కొంటారు మీమాంసకులు. ఆత్మచైతన్యానికి కూడా అదృష్టమని పేరు. అదృష్టమ్‌ నహి దృశ్యతే.


అద్రోహ : ద్రోహం Harm చేయకపోవటం. దైవగుణాలలో ఇది ఒకటి.


అదోష : No fault. No problem. అదేమంత పెద్ద దోషం కాదు. ఆక్షేపించవలసిన విషయం కాదని భావం.


అధర్మ : ధర్మం కానిది. శాస్త్రం నిషేధించిన కర్మ. ధర్మానికి విరుద్ధం. దీనివల్ల ప్రత్యవాయ దోషం లేదా అధఃపతన మేర్పడుతుంది మానవుడికి.


అధరారణి : అగ్నిని తయారుచేసే నెల్లికొయ్యకు అరణి అని పేరు. అందులో పైదాని కుత్తరారణి క్రింది దాని కధరారణి అని సంజ్ఞ. రెండింటినీ కలిపి ఒరపిడి పెడితే అగ్ని ఉదయిస్తుంది. అధర అంటే క్రిందిదని పేరు.


అధః : అధస్తాత్‌ - క్రింద - Below, స ఏవాధస్తాత్‌.


అధ్యక్ష : అధి+అక్ష - పై నుంచి చూచేవాడే Supervisor అని అక్షరార్ధం. దేనితో చేయి కలపకుండా సాక్షిభూతంగా ఉన్నదని Spectator witness అర్థం. ఏదోగాదది నిరుపాధికమైన పరమాత్మ. అది కర్తగాదు భోక్తగాదు సాక్షి. మయాధ్వక్షేణ ప్రకృతి:


అధ్యవసాన / అధ్యవసాయ : నిశ్చయాత్మకమైన జ్ఞానం. ఆత్మజ్ఞాన నిష్ఠ. A strong conviction regarding the supreme self. వ్యవసాయమని కూడా దీనికే నామాంతరం. వ్యవసాయాత్మికా బుద్ధిః. ఇది శ్రవణ మననాల తరువాత కలిగే మూడవ దశ. జ్ఞాన నిష్ఠ.


అధ్యాహార : వాక్యంలో శబ్దమొకటి లోపిస్తే దానివల్ల వాక్యార్థం బాగా బోధపడకుంటే సమకూర్చుకొనే మరొక శబ్దానికి రీతిచీచీజిగి అధ్యాహారమని పేరు. పదాకాంక్షా నివర్తకః అధ్యాహారః


అధ్యాస / అధ్యారోపః : Super imposition. ఒక పదార్ధం మీద మరొక పదార్ధాన్ని తెచ్చి పడవేయటం. అందులో మొదటిది వస్తువు. Substance. రెండవది వస్తువుకాదు. దాని ఆభాస. Appearance. జలంమీద తరంగ బుద్బుదాదులు - సూర్యప్రకాశంమీద జలమూ (Mirage) ఇలాంటిదే. ప్రస్తుత మీ అనాత్మ ప్రపంచ మంతా ఆత్మచైతన్యం మీద అధ్యారోపమయిన దంటారు అద్వైతులు. ఆత్మ అధిష్ఠానమైతే Basis అనాత్మ అధ్యారోపితం. అనాత్మ ఆత్మమీదనే గాదు. మొదట ఆత్మ అనాత్మమీద అయింది. దాని కహంకారమని పేరు. దేహాత్మాభిమానమంటేఇదే. తరువాత మరలా అనాత్మ ఆత్మమీద అయింది. మమకారమని పేరు దీనికి. ఇదంతా వాస్తవంగా Actual జరగలేదు మరలా. మన భావనే Notional అంటారు అద్వైతులు.

Page 3

అద్వైత వేదాంత పరిభాష



అధ్యాత్మ/అధిభూత/అధిదైవ : మనస్సుకూ శరీరానికీ సంబంధించినది అధ్యాత్మ. బాహ్యంగా కనిపించే భౌతిక పదార్థాలకు చెందినది అధిభూత. మనకతీతమైన ప్రకృతి శక్తులకు చెందినది అధిదైవ.


అధ్యాత్మ విద్యా : కేవల చిద్రూపమైన ఆత్మకు సంబంధించినదని కూడా దీనికర్థం. విద్యా అధ్యాత్మ విద్య అంటే ఆత్మజ్ఞానం Philosophy knowledge regarding the self or ultimate reality.


అధికార/అధికృత/అధికారీ : ఒక విషయాన్ని చర్చిస్తున్న ఘట్టం. ఊళిచీరిబీ. ఒక విషయాన్ని అర్ధం చేసుకోటానికి లేదా సాధించటానికి కావలసిన యోగ్యత ్పుళిళీచీలిశిబిదీబీగి. అది రెండు భాగాలు. ఒకటి సామర్థ్యం-మరొకటి అర్థిత్వం-The equipment and inquisitiveness. మొదటిది మానవుడి శరీర నిర్మాణం. రెండవది దాని నాలంబనం చేసుకొని సాధించే ఇచ్ఛ - ప్రయత్నం. రెండూ ఒనగూడినప్పుడే ఫలసిద్ధి. ఇవి రెండూ ఉన్నవాడధికారి. competent person వాడే అధికృతుడు Admitted of the study.


అధికరణ : ఒక విషయాన్ని చర్చించే సందర్భం Discours. ఇందులో ఐదు అంశాలు తప్పక ఉండాలి. విషయం, విశయం, సంగతి, ఆక్షేపం, సమాధానం.


అధిష్ఠాన : ఆధారం, ఆస్పదం. Basis. దేనిమీద ఆరోపణ జరుగుతుందో అది. అధిష్ఠానమెప్పుడూ వస్తువే. అంటే సత్యమే. ఆరోపితమే ఆభాస. అదికూడా వస్తువుకు అన్యం కాదు. వస్తువే మరో రూపంలో భాసిస్తే దానికాభాస అని పేరు. వస్తువుగా అది సత్యం - ఆభాసగా అసత్యం.


అధిగమ/అధిగత : ఒక జ్ఞానాన్ని సంపాదించటం, Acquisition. అలా పొందబడిన జ్ఞానం.


అధ్రువ : ధ్రువమంటే ఎప్పటికీ ఉండేది ఆత్మస్వరూపం. అది కానిదంతా ఇక అధ్రువమే. Transcient.


అధోగతి : పాపాత్ములు పోయే మార్గం. రౌరవాది నరకలోకాలు - పశుపక్ష్యాది జన్మలు.


అన : కదలటం - జీవించటం. Animo. వాయువు. ప్రాణాపానాదులు ఐదూ దాని విశేషాలు.


అనన్య : అన్యం కానిది. వేరు కానిది. కారణంకంటే అనన్యం కార్యం. మృత్తికకు వేరుగా ఘట శరావాదులు లేవు. దాని కనన్యం శ్రీళిశి ఖిరితీతీలిజీలిదీశి. అలాగే ఆత్మకనన్యం అనాత్మ.


అనన్యభక్తి : అలాంటి దృష్టికే అనన్య భక్తి అని పేరు. ఇది మామూలు భక్తి కాదు. భక్తి అని పేరేగాని ఇది వాస్తవంలో జ్ఞానమే. ఇందులో సాధకుడు ఈశ్వరుణ్ణి తనకు అన్యంగా భావించడు. ఆత్మ స్వరూపంగానే భజిస్తాడు. కనుక దీనికి అనన్యభక్తి అని పేరు వచ్చింది.


అనంత : అంతం లేనిది. అంతమంటే హద్దు - విజాతీయభావ మెక్కడ ఎదురవుతుందో అక్కడ అంతమేర్పడుతుంది. పృథివికి జలం విజాతీయం. అక్కడికది అంతం. ఇలాగే అనాత్మ ప్రపంచంలో ఒక విశేషానికి మరో విశేషం విజాతీయం. కనుక అన్నీ ఒకదానికొకటి అంతమే. అన్నీ సాంతమే. Finite. అనంత Infinite మేదీలేదు. పోతే ఎక్కడికక్కడ తెగిపోక అన్ని విశేషాలను వ్యాపించినదేదో అది అనంతం. దానికే సామాన్యమని Universal పేరు. బంగారమాభరణాలలో లాగా అది అన్నింటిలోనూ వ్యాపించి ఉంటుంది. అది ఏదోగాదు. అహమహమనే ఆత్మచైతన్యం. అస్తి భాతి అనే వ్యాప్తిలేని విశేషమే Particular లేదు. కనుక పరమాత్మ అనంతం.


అనంతర : అంతరమంటే ఎడం. Distance. అంతరం లేనిది అనంతరం. ఎడబాయకుండా అంటిపట్టుకున్నది. తరువాత అని కూడా అర్థమే. అంతేకాదు. అంతరమంటే లోపలి భాగం. లోపల మాత్రమే లేనిది అనంతరం. అనంతరమంటే ఇంతకుముందుగానే జరిగిపోయినదని కూడా అర్థమే. Immediately before.


అనఘ : అఘం లేనిది. లోపం లేనిది. నిర్దోషం. బ్రహ్మతత్వం. నిర్దోషం హి సమం బ్రహ్మ.


అనల : అలమంటే పర్యాప్తమని Enough అర్థం. ఇక చాలునని భావం. అది లేనిది అనలం. దుష్పూరేణ అనలేన చ మానవుడి కామం అలాంటిది. దానికెంత ఆహుతి పడ్డా తృప్తిలేదు. అనలమది.


అనర్థ : అర్థమంటే మనం కోరేది. అలా కోరకుండా వచ్చి నెత్తిన పడేది అనర్థం Undersirable. దుఃఖం. తాపత్రయం. దానికి కారణం అవిద్యా కామకర్మలు. కనుక అసలైన అనర్థమవి మూడే. సంసారబంధాన్ని తెచ్చిపెట్టినవవే.


అన్యధా ఖ్యాతి : ఒక వస్తువు మీద మరొక రూప మారోపితమై అది ఆ రూపంలో కనబడటం. శుక్తిక రజతంలాగా కనిపిస్తే దాని కన్యధా ఖ్యాతి అని పేరు. నైయాయికులు, వైశేషికులు పేర్కొనే అధ్యాస ఇది.


అన్యధాగ్రహణ : వస్తువును వస్తువుగా కాక దానినే మరొక విధంగా దర్శించటం. వస్తువు ఆత్మస్వరూపం. అది జాగ్రత్‌ స్వప్నాలలో దానికి భిన్నమైన అనాత్మ ప్రపంచంగా భాసిస్తున్నది. దీనికే అన్యధాగ్రహణమని పేరు.


అన్వయ/అనన్వయ : ఒకటి వేరొకదానితో కలిసి ఉండట మన్వయమైతే దేనితోనూ కలవకపోవట Aloofness మనన్వయం.


అన్వయ / వ్యతిరేక : అన్వయమంటే ఇక్కడ కారణం దాని కార్యాలన్నిటిలో కలిసి రావటమని అర్థం. అదే మరొక దాని కార్యంలో కలిసి రాదు. అలాంటప్పుడది వ్యతిరేకం. మృత్తిక ఘటంలో అన్వయిస్తుంది. పటంలో వ్యతిరేకిస్తుంది. పోతే ఆత్మచైతన్యానికి ప్రపంచమంతా కార్యజాతమే కాబట్టి అన్ని పదార్థాలలో సచ్చిద్రూపంగా అది అన్వయిస్తూనే Continue పోతుంది. ప్రతి ఒక్కటి అస్తి భాతి ఉన్నది స్ఫురిస్తున్నదనే పేర్కొంటాము. ఇదే దాని అన్వయం. పోతే కార్యపదార్థాలు మాత్రం కారణ రూపమైన సచ్చిత్తులలాగ అన్వయించలేవు. ఎక్కడికక్కడ వేరయిపోతాయి. ఘటం శరావం కాదు. శరావం కపాలం కాదు. కాని మృత్తిక ఘటాదుల నెలా వ్యాపిస్తుందో అలాగే చరాచర పదార్థాలొక దానికొకటి వ్యతిరిక్తమైనా సచ్చిత్తులన్నింటిలో అన్వితమే.


అనపాయోపజన : అపాయం లేనిది. ఉపజనం లేనిది. అపాయమంటే తొలగి పోవటం. ఉపజనమంటే క్రొత్తగా ఏర్పడటం. ఇవి రెండూ లేవంటే రాకపోకలు లేవని, ఎప్పుడూ ఉండేదని అర్థం. ఏదో గాదది. ఆత్మ స్వరూపం. అది ఒకప్పుడు రాదు. ఒకప్పుడు పోదు. నిత్య సిద్ధం.


అనపేక్షా : అపేక్ష అంటే ఒకదాని అవసరం. ఆకాంక్ష. Need. అది లేకుంటే అనపేక్ష. తనపాటికి తానుండగల స్వభావం. Selfreliance.


అనభ్యుపగమ : అభ్యుపగమ మంటే ఒప్పుదల. Consent. సమ్మతి. అలా కాకుంటే అనభ్యుపగమం. అనంగీకారం. Disagreement.


అననుమత : అనుమతం కానిది. సమ్మతం కానిది. Not approved word.


అన్న : తినబడేది. Food. అనాత్మ ప్రపంచమని లక్షణార్థం. ఇది జ్ఞానానికి గోచరిస్తుంది గనుక జ్ఞానం దాన్ని లోనికి తీసుకుంటుంది. జ్ఞేయ ప్రపంచమంతా అన్నమే. Matter. పృథివి అని కూడా అర్థం. Earth.


అన్నమయ కోశ : అన్నం తాలూకు సూక్ష్మమైన రూపం మనస్సు. దానికి సంబంధించిన కోశం అన్నమయ కోశం. ఇది శరీరంలో ఉన్న పంచకోశాలలో మొదటిది. పృథివీ తత్వం.


అన్నాద : తినేవాడు. అనాత్మ జగత్తును గ్రహించే జీవుడు లేదా ఈశ్వరుడు. ఇద్దరూ అన్నాదులే. Eaters.


అన్యోన్యాభావ : ఒక విశేషంలో మరొక విశేషం లేకపోవటం. Mutually exclusive ఘటం పటం కాదు. పటం కుడ్యం కాదని చెప్పినప్పుడు ఒక దాని స్వరూపం మరొకదానిలో లేదనిగదా అర్థం. నాలుగు అభావాలలో బిలీరీలిదీబీలి ఇది ఒక అభావం. అనాత్మ ప్రపంచమంతా మిథ్య, మాయ అని నిరూపించటానికి ఈ అభావ మొక్కటే చాలు.


అన్యోన్యాశ్రయ దోష : ఒకదానిమీద ఒకటి ఆధారపడటం.Inter dependence. అలాంటప్పుడేది ముందు, ఏది వెనుక అని చెప్పలేము. చెట్టు విత్తు సంబంధం లాంటిదిది. రెండూ సాపేక్ష Relative మయినప్పుడేదీ స్వతస్సిద్ధం కాదు. ఆభాస. మరి వస్తువేది. రెండూ కలిసి దేనిమీద ఆధారపడతాయో అది. అది స్వతస్సిద్ధమైన ఆత్మే మరేదీగాదు.

Page 4

అద్వైత వేదాంత పరిభాష



అనన్వాగత : Unaccompanied. ఏదీ వెంట రానిది. అంటుకొని రానిది. ఆత్మ స్వరూపం. అనన్వాగతః పుణ్యేన, అనన్వాగతః పాపేన. పుణ్యంగాని పాపంగాని ఏదీ దాని నంటి పట్టుకోదు సుషుప్తిలో. కనుక సుషుప్తిలోనే తెలుస్తుంది అసలైన మన ఆత్మస్వరూపం.


అనవద్య : అవద్యమంటే దోషం. లోపం. కొరత. ఏ కొరతా లేని నిర్దోషమైన దాత్మతత్త్వం. కనుక అది అనవద్యం.


అనధికార : అయోగ్యత, అనర్హత.


అనధికారీ : అయోగ్యుడు, అనర్హుడు Incompetent, not eligible.


అనవగమ : జ్ఞానంగాని, అనుభవంగాని లేకపోవటం. Incompetent, not eligible.


అనవస్థా/అనవస్థిత : నిలకడ లేకపోవటం. Instability . దానికేమిటి దానికేమిటని అడుగుతూ పోతే మందల లేకపోవటం Infinite regress. అలా నిలకడ లేనిది అనవస్థితం. అనవస్థ అనేది ఒక పెద్ద దోషం. ఇది ద్వైతంలోనే అద్వైతంలో ప్రాప్తించదు. అక్కడ రెండవది లేదు గదా. ఇక దీనికేమిటని ప్రశ్న ఏముంది.


అనవధాన : అవధానమంటే తదేక దృష్టి. Attention. అది లేకుంటే అనవధానం. పరధ్యానం. పరాకు. Absent mindedness.


అనాత్మా : ఆత్మకానిది. మన జ్ఞానమాత్మ అయితే దానికి గోచరించే సమస్తమూ అనాత్మే. Objective world. జీవ జగదీశ్వరులు మూడూ అనాత్మ క్రిందికే వస్తాయి.


అనాగత : ఇంతవరకు అనుభవానికి రానిది. ఇకమీదట చేయబడే కర్మ. ఆగామి అని కూడా అనవచ్చు. భవిష్యత్‌ కాలమని కూడా అర్థమే.


అనావరణ/అనావృత : ఆవరణమంటే కప్పటం. మరుగు పుచ్చటం. దేనిచేతా కప్పబడక నిరాఘాటంగా వ్యాపిస్తే అనావరణం. ఆత్మ ఎప్పుడూ అనావృతమే.


అనారబ్ధ : ఆరంభం కానిది. జారీకాని కర్మఫలం. జారీ అయి అనుభవానికి వస్తే అప్పుడది ఆరబ్ధమవుతుంది. అంతవరకూ అనారబ్ధమే.


అనాశక : నాశనము చేయనిది అని శబ్దార్థం. కాని అన్‌+ఆశక అని విరిచి అర్థం చెప్పుకోవలసి ఉంటుంది. ఆశకమంటే తినేది. అనాశకం తిననిది. లోపలికి తీసుకోనిదేదో అది. 'తపసా అనాశకేన' అని ఉపనిషత్తులో ప్రయోగం. తపస్సంటే భోజనం చేయకపోవటం కాదు. కామ అనశన. ఏ కోరికలూ లోపలికి తీసుకోక నిష్కామంగా ధ్యానం చేయటమని అర్థం చెప్పారు భగవత్పాదులు.


అనాహత : ఆహతమంటే రాపిడి చెంది బయటపడడం. అలా బయటపడని శబ్దానికి అనాహత శబ్దమని In audible పేరు.


అనాకుల : ఆకులం కానిది. ఆకులమంటే చలించటం. అస్తిమితం. అస్థిరం. అలాటి అస్థిరత్వం లేకుంటే అది అనాకులం. కలగాపులగానికి confusion కూడా ఆకులమని పేరు. అది లేకుండా ఎక్కడికక్కడ విశదంగా ఉంటే అదికూడా అనాకులమే.


అనాగమ : ఆగమమంటే క్రొత్తగా రావటం. అలా రాక ఎప్పుడూ ఉంటే అనాగమం. పోకుంటే అనపాయం. బ్రహ్మమనాగమం. అనపాయం వచ్చేది పోయేది కాదు. ఆగమమంటే గురుశిష్య సంప్రదాయం tradition కూడా. గురూపదేశం వల్ల శిష్యుడికి బ్రహ్మానుభవం సంక్రమిస్తే దానికి ఆగమ జ్ఞానమని పేరు. అనుభవమే ఇక్కడ ఆగమం. ఇది కేవల శాస్త్ర జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానం.


అనాగమజ్ఞ : ఆగమ జ్ఞానం లేని ఆచార్యుడు. శిష్యుడు.


అనాదర : ఆదరమంటే శ్రద్ధ కలిగి ఉండటం. అనాదరమంటే అశ్రద్ధ. నిర్లక్ష్యం. ఆదరమంటే మరొక అర్థం కూడా చెప్పవచ్చు. నొక్కి వక్కాణించడానికి ఆదరమని పేరు. Emphasis. అలా చెప్పకపోతే అది అనాదరం. అంత ముఖ్యంకాదని భావం.


అనాది : ఆది లేనిది. ఆది అంటే కారణం. దేనికి కారణం లేదో అది అనాది. కారణం లేకుంటే కార్యం కూడా కాదు. కార్య కారణాలు రెండూ లేనిది పరమాత్మ అని అర్థం. ఆయనను ఆశ్రయించి ఉన్న మాయాశక్తి కూడా అనాదే. ఆయన అంశమైన జీవుడూ అనాదే. ఆ మాటకు వస్తే ఆయన చైతన్యమే ఇలా భాసిస్తున్నది. గనుక సృష్టి అనాదే. అంతా అనాదే. అనంతమే.


అనామక మరూపకం : నామం లేనిది. రూపం లేనిది. నామమంటే మనస్సులో కలిగే వృత్తి లేదా ఆలోచన. Idea. రూపమంటే దానికి విషయమైన బాహ్యపదార్థం. Thing. ఇవి రెండూ కానిది ఆత్మచైతన్యం.


అనాశ్వాస : ఆశ్వాసమంటే విశ్వాసం లేదా నమ్మకం. అది లేకుంటే అనాశ్వాసం. అశ్రద్ధ అని అర్థం.


అనిత్య : నిత్యం కానిది. Impermanent, Transitary. అనాత్మ ప్రపంచం. అనిత్య మసుఖం లోకమని గీత.


అనిశ్చిత : ఫలానా అని తేల్చుకోలేనిది. Undetermined.


అనిర్వచనీయ/అనిర్వాచ్య : ఇదమిత్ధమని వర్ణించ నలవికానిది అనాత్మ ప్రపంచం. ఇది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. కనిపిస్తుంది కాబట్టి ఉంది. విచారిస్తే ఆత్మచైతన్యమే అలా భాసిస్తున్నది గనుక లేదు. ఇలాంటి సదసద్రూపానికే అనిర్వచనీయమని పేరు.


అనిరుక్త : నిరుక్తం కానిది. నిరుక్తమంటే నిష్కర్ష జేసి చెప్పటం. అలా కాని పదార్థం అనిరుక్తం. అమూర్తమని Unmanifest అర్థం.


అనిరూప్య : నిరూపించ శక్యం గానిది. నిరూపణమనగా ఒక ప్రమాణంచేత ఖచ్చితం చేసి చెప్పటం. అలాంటిది కాకుంటే అనిరూప్యం Indescribable.


అనిరుద్ధ : నిరుద్ధం కానిది. అడ్డం లేకుండా ప్రసరించ గలిగినది. పాంచరాత్రుల మతంలో పరమాత్మకు నాలుగు వ్యూహాలు చెప్పారు. అందులో ఇది ఒక వ్యూహం. అనిరుద్ధమనగా నిరాఘాటంగా ప్రసరించే మానవుడి మనస్సని సంకేతార్థం.


అనిలయన : నిలయనమంటే ఒక పోగైన పదార్థం. ఆశ్రయం. సంహతమని అర్థం. Formed. సంహతం కాకుంటే అది అనిలయనం. Unformed.


అనిర్జ్ఞాత : తెలియవలసినంత బాగా తెలియనిది. Not completely known.


అనిమిత్త : నిమిత్తం లేనిది. ఒకదానివల్ల ఒకటి ఏర్పడితే అది దానికి నిమిత్తం. గొడుగు నీడకు నిమిత్తం. గొడుగు ముడిస్తే నీడ తొలగిపోతుంది. అప్పుడది అనిమిత్తం.


అనియమ/అనియత : ఒక పద్ధతి అంటూ లేకపోతే అనియమం. ఒకటి ఉంటే గాని మరొకటి కుదరదనే వ్యవహారం లేకుంటే అనిమయం.Option. Nocompulsion. నియమం లేని పదార్థం అనియతం Unfixed.


అనిష్ట : ఇష్టం కానిది. దుఃఖం. ప్రతికూలం. Undesirable element . వెతకబడేది ఇష్టం అయితే మనం వెతకనిది అనిష్టం. Unsought. ఇంతేగాక శాస్త్రంలో ఇది ఒక విశిష్టమైన అర్థంలో వాడబడుతున్నది. ఇది మాకు సమ్మతం కాదని బొత్తగా సరిపడేది కాదని అర్థం.Contrary .


అనికేత : నికేతమంటే స్థానం. నిలకడ. అది లేనివాడు అనికేతుడు.Wanderer. పరివ్రాజకుడని అర్థం.


అనీశ/అనీశ్వర : ఈశ్వరుడు కాడు. అస్వతంత్రుడని అర్థం. జీవుడు అలాంటి అస్వతంత్రుడు. వీడికి తన ఉపాథులమీద గాని, బాహ్యజగత్తు మీద గాని అధికారం లేదు. అవే వీడిమీద అధికారం చెలాయిస్తున్నవి.


అనుగమ : అన్వయం. సంబంధం. కారణం దాని కార్యపదార్థాలన్నింటిలో కలిసి రావటం. వ్యాపించటం. ఎడతెగకుండా సాగిపోవటం Continuity.


అనుగత : అలా వ్యాపించేది. ఆత్మతత్వం. అనాత్మ జగత్తునంతా వ్యాపించి ఉన్నదది.


అనుత్తమ : దేనికంటే ఉత్తమం లేదో గొప్పది లేదో మించిపోదో అది అనుత్తమం. Unsurpassed. The supreme పరమాత్మ స్వరూపం.


అనుత్తర : మించిపోనిది. దాటి పోనిది.


అనుదాహరణ : ప్రస్తుతాంశానికి సరిపడని దాన్ని పేర్కొనటం. ఒక భావాన్ని వర్ణించినపుడు దాన్ని మన విషయంలో అన్వయించుకోకపోవటం Lack of application. పరోక్షంగా మాత్రమే చూచి అపరోక్షంగా తన కన్వయించుకోకపోతే అది అనుదాహరణం.


అనుకర్ష : ఒక విషయం సంపూర్ణంగా మనకర్థం కావాలంటే పై వాక్యం నుంచి ఒక పదాన్ని క్రిందికి లాగుకోవలసి ఉంటుంది. కర్షణమంటే లాగటమనే శబ్దార్ధం.


అనుక్రమ : ఒక క్రమాన్ని Order అనుసరించటం. ఏ క్రమంలో చెప్పాలో ఆ క్రమంలోనే చెప్పటం. పూర్వాపరాలు పాటిస్తూ పోవటం.


అనువృత్తి : అనుసరించి వర్తించటం. కారణ స్వరూపం దానివల్ల ఏర్పడే కార్య పదార్థాలన్నిటిలో కొనసాగటం. కలిసి రావటం Continuation. అనుగమ అనుగతి అని కూడా దీనికే పర్యాయపదాలు.

Page 5

అద్వైత వేదాంత పరిభాష



అనుసంధాన : తెగితే ముడి పెట్టుకుంటూ రావటం. కలుపుకుంటూ రావటం. అవిచ్ఛిన్నంగా పరతత్వాన్ని భావన చేయటం. Reflection without brake.


అనుగ్రహ : ప్రసాదం Grace, సాహాయ్యం, తోడ్పాటు. 'శ్రుత్యనుగృహీతః తర్కః' శ్రుతి చెప్పిన విషయానికి తోడ్పడే తర్కం.


అనుశయ : మరణించిన జీవి లోకాంతరాలలో కర్మఫలమంతా అనుభవించదు. కొంతవరకే అది అనుభవానికి వస్తుంది. కాగా కర్మఫల శేషమింకా కావలసినంత మిగిలిపోతుంది. ఆ మిగిలిన కర్మఫలమే అనుశయం. అది మరలా జన్మాంతరంలో అనుభవించవలసి వస్తుంది.


అనుశాసన : శాసించటమనే అర్థం. Instruction. అంటే ధర్మం కాని, జ్ఞానం కాని ఆచార్యుడైనవాడు తన శిష్యులకిలా నడచుకోవాలని గాని, తెలుసుకోవాలని గాని బోధించటం.


అనుష్ఠాన : ఆచరించటం, అమలు పరచటం. Practice. Implementation ఇది ధర్మ పురుషార్థంలోనే గాని మోక్షపురుషార్థానికి లేదు సరిగదా పనికి రాదంటారు అద్వైతులు. బ్రహ్మమనేది అహేయ మనుపాదేయం గనుక తయారుచేసేది కాదు. పొందేది కాదు. మహా అయితే ఉన్న దానినే మరచిపోయాము. అంచేత గుర్తు చేసుకుంటే చాలు. అనుభవానికి వస్తుంది. అది జ్ఞానమే. కర్మకాదు. కాబట్టి జ్ఞానానంతరం దాన్ని అమలుపరిచే అనుష్ఠాన మక్కరలేదు. పనికి రాదు కూడా. కారణం చేస్తే ఆత్మ అనాత్మగా మారిపోతుంది.


అనుభవ/అనుభూతి : అనుసరించి ఉండటం. Co-existence. నీవేది కోరావో దాని నంటి పట్టుకుని కూచోవటం. అది నీవై పోవటం. Total Identity of the objectwith the subject . Experience. ఆత్మానుభవమంటే అనాత్మనంతా ఆత్మ స్వరూపమని గుర్తించటం. ఇదే అనుభవం. ఇదే అనుభూతి.


అనుదర్శన : ఒక విషయాన్ని మరల మరల దర్శిస్తూ పోవటం. సిద్ధాంతీకరిస్తే సరిపోదు. ఆ తరువాత దాన్ని దర్శించగలిగి ఉండాలి. అలాటి దానికే అనుదర్శనమని పేరు.


అనుసంధాన : ఒక విషయం భావిస్తూ ఉన్నప్పుడు మధ్యలో విజాతీయ భావం రాకుండా దానినే సజాతీయంగా భావిస్తూ పోవటం. విజాతీయం వల్ల తెగిపోతే మరల ముడిపెట్టుకోవటమే అనుసంధానం.


అనుసార : అనుసరించటమని బాహ్యార్థం. సారమంటే ప్రమాణమని మరియొక అర్థం. ఆత్మదర్శనానికి ఆత్మభావనే ప్రమాణం. దానితోనే దాన్ని అనుసరించి పట్టుకోవాలి. ఆత్మప్రత్యయ సారమని మాండూక్యంలో మాట. ఆత్మ భావనే సారమనగా ఆత్మానుభవానికి ప్రమాణమట.


అనుపలబ్ధి/అనుపలంభ : ఉపలబ్ధి అంటే ప్రత్యక్షం కావటం. సాక్షాత్కరించటం. ప్రత్యక్షంగా కనపడకపోతే అది అనుపలబ్ధి. Lack of apprehension. అద్వైతులు చెప్పే ఆరు ప్రమాణాలలో ఇది అయిదవది. ఇది అభావం కాదు. అభావమంటే Absence అసలు పదార్థమే లేకపోవటం. పదార్థమున్నా కనపడకపోవటం అనుపలబ్ధి. అనుపలంభమన్నా ఇదే. Non-avilability.


అనుపపత్తి : ఉపపత్తి అంటే హేతువు. యుక్తి. Reason. అది లేకుంటే అనుపపత్తి. హేతువుకు నిలవకపోవటం.


అనుపపన్న : హేతుబద్ధం కాని వాదం. అది ఎప్పటికీ కుదరదు. చెల్లదు. ఎందుకంటే దానికి హేతువు లేదు. Un supported by reason.


అనుపాదేయ : ఉపాదేయం అంటే దగ్గరికి తీసుకోవటం. అంతకుముందు దగ్గర లేనిదైతే తీసుకోవచ్చు. ఎప్పుడూ మనదగ్గరే ఉన్న దాత్మ. అది మన స్వరూపమే. అలాంటిది ఉపాదేయమెలా అవుతుంది. కనుక ఎప్పుడూ అనుపాదేయమే Ungraspable or Unobtainable అది. ఇంతకూ అనుపాదేయమంటే ఆత్మస్వరూపమని అర్థం.


అనుబంధ చతుష్టయ : ప్రతి శాస్త్రాన్ని ఆరంభించే ముందు దానికి నాలుగు షరతులున్నాయి. 1. విషయమేమిటి? 2. అది సాధించవలసిన అధికారి ఎవడు? 3. వాడు దానినెలా సాధించాలి? దానికీ వాడికీ ఏమి సంబంధం? 4. సాధిస్తే కలిగే ప్రయోజనమేమిటి? అధికారి విషయ సంబంధ ప్రయోజనాలనే ఈ నాలుగింటికి అనుబంధ చతుష్టయమని పేరు. దీనికి జవాబు చెబితేనే అది శాస్త్రం. వేదంతానికి విషయం బ్రహ్మతత్త్వం. అది కావలసిన అధికారి జిజ్ఞాసా ముముక్షా ఉన్న మానవుడు. సంబంధం శ్రవణ మననాదులు. ప్రయోజనం మోక్షమనే ఫలానుభవం.


అనుషంగ : సంగమంటే ఒకదానిలో లగ్నం కావడం. తగులుకోవటం. అది బాగా ఏర్పడితే అనుషంగం. Indulgence . అంటుకోవటం కూడా. ఆత్మచైతన్యానికి ప్రపంచ వాసనలు అంటుకోవటం అలాంటిది.


అనుస్యూత : కుట్టిన దానికి స్యూతమని పేరు. ఐలిగీదీ అనుస్యూతంటే కుట్టివేసి నట్టొకదాని తర్వాత ఒకటి ఎడతెగకుండా కలసి రావటం continued.


అనుమత/అననుమత : ఒక వాదాన్ని సరేనని ఒప్పుకుంటే అది అను మతం. Agreed. కాదని త్రోసిపుచ్చితే అననుమతం. Refuted.


అనుమాన/అనుమితి : Inference. ప్రత్యక్షంగా కనిపించే విషయాన్ని బట్టి ప్రత్యక్షం కాని దాన్ని ఊహించటం. ధూమం కనిపిస్తుంటే అగ్ని కనిపించకపోయినా ఉందని భావిస్తే అది అనుమానం. ఇది వేదాంతులు చెప్పే రెండవ ప్రమాణం. ప్రపంచమనే కార్యాన్ని బట్టి దానికి మూలకారణం పరమాత్మ అని భావించవచ్చు. కాని అది తటస్థ లక్షణమే. స్వరూప లక్షణం కాదు. కనుక కేవల అనుమానం సరిపోదు. స్వరూపానుభవం మహర్షులది. వారి మాటలే మనకు ప్రమాణం. అదే ఉపనిషత్తు. కనుక దాని కనుగుణంగా అనుమానించి పరతత్వాన్ని నిర్ధారణ చేయాలని అద్వైతుల మాట.


అనుమేయ : అలా భావించే పదార్థం Inferred. అనుమాన ప్రమాణంతో గ్రహించి అనుభవానికి తెచ్చుకోవలసినదేదో అది అనుమేయం. Inferrable.


అనులోమ : అనుకూలమైనది. Positive. దీనికి వ్యతిరేకి ప్రతిలోమం.


అనురోధ : అనుసరించటం. దీనికి వ్యతిరేకి ప్రతిరోధ Negative. అనురోధానికి అనుగుణమని, అనురూపమని కూడా పర్యాయపదాలు.


అనువాద : Repetition. ఒక ప్రమాణం చేత సిద్ధమయిన విషయాన్నే మరొక ప్రమాణంతో చెప్పటం. మామూలుగా చెబితే అది దోషం. ఒక ప్రయోజనం కోసమైతే దోషంకాదు. గుణం. ఆ ప్రయోజనమేదో కాదు. అపవాదం. మనమంతా ఈ అనాత్మ ప్రపంచముందని చూస్తుంటే మన దృష్టి ననుసరించి ఇది సృష్టి అయిందని చెబుతుంది మొదట ఉపనిషత్తు. తరువాత కార్యం కారణం కన్నా వేరుగా లేదని చెప్పి ప్రపంచాన్ని అపవాదం చేస్తుంది. Refutation.


అనుదితానస్తమిత : ఉదితమూ కానిది అస్తమితమూ కానిది. ఉదయాస్త మయాలు లేనిదని అర్థం. జనన మరణాలు లేని పదార్థమే అలాంటిదై ఉంటుంది. జ్ఞేయ ప్రపంచంలో అలాంటిదొకటి కూడా కానరాదు. ప్రతిదానికీ రాకపోకలు ఉండి తీరవలసిందే. పోతే అలాంటి దోషాలు రెండూ లేనిది ఒకే ఒక పదార్థముంది. అదే ఆత్మ చైతన్యం. అది నిరాకారం. స్వతస్సిద్ధం. సర్వవ్యాపకం. కాబట్టి అది ఎప్పుడూ అనుదిత అనస్తమితమే.


అన్వాహార్యపచన : శరీరంలో కూడా త్రేతాగ్నులున్నాయి. గార్హపత్యం జఠరాగ్ని ఆహవనీయం ముఖంలో ఉన్న ఉష్ణగుణం. పోతే హృదయంలోని దక్షిణ ద్వారం నుంచి వ్యానమనే వాయువు బయటికి వచ్చి రక్తంలో కలిసిన అన్నరసాన్ని సర్వశరీరమూ వ్యాపింపజేస్తుంది. అది శక్తి రూపంగా సర్వత్రా ప్రసరిస్తుంది. ఆహారం పచనమైన తరువాత జరిగే వ్యవహారం గనుక దీనికీ పేరు వచ్చింది. దక్షిణాగ్ని అని దీనినే పేర్కొంటారు.


అన్యూనానతిరిక్త : తక్కువా కాదు. ఎక్కువా కాదని అర్థం. హెచ్చు తగ్గులు లౌకిక పదార్థాలకేగాని ఆత్మకు లేవు. నిరాకారం గనుక దానికి న్యూనాధిక లక్షణాలు ఉండబోవు. శాస్త్రంలో కూడా ఏదైనా ఒక సిద్ధాంతం చేస్తే అది అలాగే ఉండాలి. కనుక నిష్కర్షగా చెప్పిన మాటకు కూడా అన్యూనానతిరిక్తమని పేరు వర్తిస్తుంది.


అనురాగ/అనురక్త : రాగమంటే రంగని శబ్దార్థం. రంగు అద్దినట్టు మనసుమీద ఒక విషయం ముద్రితమైతే అలాంటి తాదాత్మ్య గుణానికి Identity with the object అనురాగమని పేరు. వల్లమాలిన అభిమానమని అర్థం. ఇట్టి అభిమానం ఉన్న మనస్తత్వం కలవాడెవడో వాడనురక్తుడు. Affected or attached. ప్రపంచ వాసనలు బాగా మనసుకు పట్టినవాడని భావం.


అనుప్రవేశ : ఒకటి ప్రవేశించిన తరువాత మరొకటి ప్రవేశిస్తే దాని కను ప్రవేశమని పేరు. మొదట ప్రపంచ సృష్టి అయిన తరువాత బ్రహ్మాండ శరీరంలో ప్రజాపతి రూపంగా పరమాత్మ ప్రవేశిస్తాడు. ఆ తరువాత పిండాండంలో జీవరూపంగా ప్రవేశం జరిగింది. 'అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య' అని ఉపనిషత్తు జీవుని ప్రవేశాన్ని పేర్కొన్నది.


అనవబోధ : అవబోధమంటే జ్ఞానం కావచ్చు. అనుభవం కావచ్చు. ఇలాటి ఆత్మానుభవం కలగకపోతే దాని కనవబోధమని పేరు. అజ్ఞానమని అర్థం.

Page 6

అద్వైత వేదాంత పరిభాష



అనవసాద : అవసాదమంటే కుంగిపోవటం, దిగబడి పోవటం Depression, ధైర్యం కోల్పోవటం. అలాంటిది లేకుండా ధైర్యం అవలంబించి ఉండగలిగితే అది అనవసాదం.


అనవసరం : అవసరమంటే ఇక్కడ Necessity అని కాదు. సందర్భమని అర్థం. Opportune moment or context. అలాంటి సందర్భమేర్పడకపోతే శాస్త్రంలో అనవసరమని పేర్కొంటారు. అప్రసక్తి అని కూడా అనవచ్చు.


అనావృత్తి : ఆవృత్తి అంటే మరణానంతరం మరలా ఈ కర్మభూమికి వచ్చి జన్మ ఎత్తటం. అజ్ఞాని అయినవాడు ఇలాగే జనన మరణాలు పొందుతుంటాడు. ఆత్మజ్ఞాని మాత్రం మరలా వచ్చే ప్రసక్తి లేదు. అతడు ముక్తుడైపోతాడు గనుక అతనికి అనావృత్తే.


అనాసక్తి/అనాసక్త : ఆసక్తి లేకుండటం. ఆసక్తి అంటే ప్రాపంచిక విషయాలలో పడిపోవడం. ప్రతి పనికీ ఫలితం ఆశించటం. ఇలాటి అభిలాష ఏ మాత్రమూ లేకుంటే దాని కనాసక్తి అని పేరు. వైరాగ్యబుద్ధి detached attitude ఇలాంటి విరక్తుడు అనాసక్తుడు.


అనభిమత : ఒక విషయంమీద అభిమానం ఏర్పడితే అది వాడికి అభిమతం. తొలగితే అనభిమతం.


అనభిభవ/అనభిభూత : అభిభవమంటే ఎదిరించటం. అడ్డగించటం. దాడి చేయటం. అలాంటి ప్రతిబంధం లేకుంటే అనభిభవం. అభిభవం లేని పదార్థం అనభిభూతం. Unattacked. Free.


అనభిసంధి : అభిసంధి అనగా ఒక విషయాన్ని ఉద్దేశించటం. దానిమీదనే దృష్టి కలిగి ఉండటం. అది లేకుంటే అనభిసంధి No intention.


అనధిగమ : ఒక గమ్యాన్ని పొందటం అధిగమమైతే పొందక పోవటం అనధిగమం Unattainment.


అనామయ : ఆమయమంటే రుగ్మత. మాలిన్యం. దోషం. Defect. ఎలాంటి దోషమూ లేకుంటే అనామయం. నిర్దోషమైన పదార్థం ఒక్క బ్రహ్మతత్వమే. కనుక అసలైన అనామయ మదే.


అనాశ్రిత : దేనినీ ఆశ్రయించక అంటిపట్టక తనపాటికి తాను బ్రతకటం. 'అనాశ్రితః కర్మఫలం' అని గీత. కర్మఫలాన్ని కోరనివాడు అనాశ్రితుడు.


అనుప్రశ్న : ఒక ప్రశ్నతో నిలవక దానికి అనుబంధంగా రెండు మూడు ప్రశ్నలు వేస్తూ పోతే అది అను ప్రశ్న. అనుప్రశ్నేన సేవయా అని గీత. గురువును శిష్యుడైనవాడు అన్ని కోణాలలో ప్రశ్నించి ఆత్మజ్ఞానాన్ని గడించాలని శాస్త్రం చెప్పేమాట.


అనుయాయి : అనుసరించి వెళ్ళేవాడు. Follower. పెద్దలు ఒక సిద్ధాంతం చేస్తే దానిని నమ్మి ఆ మార్గంలోనే పయనించేవారు అందరూ దాని అనుయాయులే.


అనువిధాన/అనువిధాయి : ఒక విషయం ఒక మార్గంలో నడుస్తుంటే దాని అడుగుజాడలలో దాని ననుసరించి పోయే మరొక విషయానికి అనువిధాయి అని పేరు.


అనిర్వేద/అనిర్విణ్ణ : నిర్వేదమంటే విసుగు చెందటం. మోక్షమార్గంలో అది ఒక పెద్ద అంతరాయం. దానివల్ల ఫలితం సిద్ధించదు. కనుక అభ్యాసి అయినవాడు నిర్వేదం చెందక సహనంతోనే ముందుకు సాగిపోవాలి. ఈ సహనానికే అనిర్వేదమని పేరు. అలాంటివాడికే అనిర్విణ్ణుడని పేరు. అనిర్విణ్ణేన చేతసా అని గీతా వచనం.


అనిర్దేశ్య : నిర్దేశించటమనగా పేర్కొనటం Mention. పేర్కొనటానికి ఏ మాత్రమూ వీలు లేనిది అనిర్దేశ్యం. Unmentionable. అది మన స్వరూపమే. మరేదీ కాదు. నామరూపాలు లేవు గనుక దానిని ఇదమిత్థమని పేర్కొనలేము.


అనింగన : ఇంగనమనగా కదలిక. చలనం. ఏ మాత్రమూ చలనంలేనిపదార్థం అనింగనం. అది బాహ్యమైన ఆకాశమైతే ఆంతరంలో చిదాకాశమైన ఆత్మతత్త్వం.


అనాభాస : ఇలాగలాగని ఏ రూపంలోనూ భాసించని పదార్థం అనాభాసం. Non apparant. విషయ రూపం కాని ఆత్మతత్వం ఎప్పుడూ అనాభాసమే. ఆభాసం దానికి విషయమైన ప్రపంచమే.


అనిర్మోక్ష : నిర్మోక్షమంటే బయటపడడం. Release. తప్పించుకోవడం. అలాంటి భాగ్యం లేకుంటే దాని కనిర్మోక్షమని పేరు. సంసారబంధ Bondage మని అర్థం.


అనుపదిష్ట : గురూపదేశం లేకుండానే ఉత్తమాధికారికి పూర్వజన్మ సుకృతం కొద్దీ బ్రహ్మానుభవం కలిగితే అలాటిదానికి అనుపదిష్టమని పేరు. ఇది ప్రహ్లాదాదుల విషయంలో మనకు కనిపిస్తుంది. 'మనుష్యాణాం సహస్రేషు' అన్నట్టు కోటికొక్కడికి పట్టే అదృష్టమది. బాహ్యప్రకృతిని చూస్తూ తద్ద్వారానే వాడు బ్రహ్మానుభవం పొందగలడు. శాస్త్రాచార్య ప్రమేయం అలాంటివాడికి అక్కరలేదు. దీనికే Intuition అని పెద్దలమాట.


అనుపహిత : ఉపాధులలో చిక్కుబడిపోయిన జ్ఞానానికి ఉపహితమని పేరు. Confined to a medium. ఉపాధుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా వ్యాపించే చైతన్యానికి అనుపహితమని పేరు.


అనృత : ఋతం కానిది. ఋతమంటే సత్యం. సత్యం కానిది అనృతం. False. Unreal అనాత్మ ప్రపంచమంతా సత్యంకాదు. సత్యమైన ఆత్మ తాలూకు ఆభాస. Appearance. కనుక దీనిపాటికిది అనృతం. ఆత్మరూపేణా సత్యం.


అనృతాభిసంధి/సంధ : అనృతమైన మీదనే అభిసంధి లేదా ఉద్దేశం Intention పెట్టుకుని ఆ భావనతోనే మరణించిన జీవి అనృతాభిసంధి. వీడికి ప్రపంచ వాసనలున్నాయి కాబట్టి పునరావృత్తి తప్పదు. దీనికి భిన్నంగా సత్యాభి సంధియై పోతే వాడు విదేహముక్తుడు.


అనేజత్‌ : ఏజత్‌ అంటే కదిలేది. చలించేది. అనేజత్‌ అంటే చలనం లేనిది. అచలమైన ఆత్మస్వరూపం. 'అనేజదేకం మనసో జవీయః' అని ఉపనిషత్తు.


అనైకాంతిక : ఐకాంతికం కానిది. ఒకే ఒక రూపంలో ఉంటే అది ఐకాంతికం. Uniform or Consistent. అలాకాక ఎప్పటికప్పుడు మారుతూ పోయేది అనైకాంతికం. Inconsistent. చరాచర ప్రపంచమంతా పరిణామశీలమే. Ever changing కనుక అనైకాంతికం.


అగ్నీషోమ : అగ్నిహోత్రుడు చంద్రుడు అని వాచ్యార్థం. కాని అగ్ని అంటే ప్రాణం. చంద్రుడంటే మనస్సు అని అంతరార్థం. మనస్సు అన్న వికారం. అన్నం ప్రాణంలో ఆహుతి అవుతుంది. అలాగే మనస్సు నిద్రావస్థలో ప్రాణంలో తలదాచు కుంటుంది. ప్రాణం మనోరూపమైన అన్నాన్ని ఆహుతి చేసుకుంటుంది కాబట్టి మనస్సు అన్నమైతే ప్రాణమన్నాదుడు అని ఉపనిషత్తులు వర్ణించాయి. పౌరాణిక వాఙ్మయంలో దీనినే శివకేశవ తత్వాలుగా కల్పించి కథలల్లుతూ వచ్చారు. విష్ణువు స్థితికర్త గనుక అన్నాత్మకమైన తత్వమైతే రుద్రుడు లయ స్వరూపుడు గనుక అన్నాదుడని మహర్షుల కల్పన. మొత్తానికి జ్ఞేయప్రపంచమే అన్నం. దాన్నిగ్రహించే ఆత్మజ్ఞానమే అన్నాదుడు. ఈ రెండింటి అంతరార్థం చెబుతూ ఉన్న సాంకేతికభాషే అగ్నీషోమం. దీని ఆంతర్యం గ్రహించి జ్ఞేయాన్నంతా ఎప్పటికప్పుడు తన జ్ఞానంలో హోమం చేసుకొని అంతా జ్ఞానస్వరూపంగా దర్శించే జీవన్ముక్తుడు చేసే యాగం అగ్నీషోమ యాగం. అంటే జీవన్ముక్తుడి జీవితమే అని భావం.


అప్‌ : జలమని అర్థం. పంచభూతాలలో పైనుంచి నాలుగవది. క్రింది నుంచి రెండవది. ఆపః అని దీని బహువచనం. ఇది ద్రవం. శుక్లస్యందన స్వభావం. కేవలం జలమనేగాక ఆపః అనేది పంచభూతాలకు కూడా ఉపలక్షణంగా Indicator చెప్పుకోవచ్చు. 'ఆపః పురుష వచసో భవంతి' అని శాస్త్రం.


అపకర్ష : ఉత్కర్షకు వ్యతిరేకి Opposite. తగ్గిపోవటం Diminution. క్రిందికి దించటమని అక్షరార్థం.


అపచయ/అపక్షయ : తగ్గిపోవటం. కృశించటం Decrease. Decay. షడ్భావ వికారాలలో ఇది ఐదవది.


అపచార : ఉపచారం కానిది. అపరాధం. మార్గం తప్పటం అని అర్థం.


అపదేశ : ఒక నెపం. ఒకమిష. Pretext. మాట సామెత. మభ్యపెట్టి చెప్పటం.


అపహతపాప్మా : పాపాలన్నీ పటాపంచలైనది. అవిద్యా కామకర్మలే పాపాలు. అవి పూర్తిగా తొలగిపోయి పరిశుద్ధమైనది ఆత్మతత్వం. కనుక అపహతపాప్మా అంటే ఆత్మస్వరూపమే.


అపమృత్యు : అకాలంగా మరణించటం. మరణానికి అకాలమంటూ లేదు. ఏదో ఒక కాలంలో జరగవలసిందే అది. అయినా అనుచిత కాలంలో జరిగితే దాని కపమృత్యువని వాడుక వచ్చింది. Inauspicious moment.


అపరస్పర : పరస్పరమనే అర్థం. Mutual. ఒకదానికొకటి కార్యకారణాలు అవుతూ దానివల్లనే ప్రపంచసృష్టి జరిగిందని నాస్తికుల సిద్ధాంతం. ప్రపంచం అపరస్పర సంభూతమని వారనేమాటను భగవద్గీత పేర్కొన్నది.

Page 7

అద్వైత వేదాంత పరిభాష



అపరోక్ష : పరోక్షమంటే కనపడనిది. ఇంద్రియ గోచరం కానిది. పరోక్షం కానిది అపరోక్షం. ప్రత్యక్షమని అర్థం. Direct experience. ఆత్మ ఎప్పుడూ మనకు పరోక్షం కాదు. అపరోక్షమే. 'యత్‌ సాక్షాదపరోక్షా దాత్మా' అని ఉపనిషత్తు. నేననే భావం నాకెప్పుడూ ప్రత్యక్షమే గదా. దానికి మరొకదాని వ్యవధానం లేదు.


అపలాప : కప్పిపుచ్చటం. సత్యాన్ని సత్యంగా కాక మరొక విధంగా భావించి ఆ రూపంలో బయటపెట్టటం.Concealling the fact.


అపవర్గ : వర్గానికి చెందనిది. వర్గమంటే ధర్మార్థకామాలు. వీటికి త్రివర్గమని పేరు. ఇవి మూడూ కలిసి ఒక ముఠా. త్రిగుణాలను దాటిపోలేనిది కనుక ఒక వర్గం పోతే ఇలాటి వర్గంలో చేరనిది, దాన్ని దాటిపోయినది ఏదో అది అపవర్గం Uncombined. అంటే మోక్షమని అర్థం.


అపవాద : అధ్యారోప అపవాద న్యాయమని ఉంది అద్వైతంలో. మొదట ఒక వస్తువుమీద మరొక వస్తువును తెచ్చిపెడితే అది అధ్యారోపం Imposition. మరలా ఆ తెచ్చిపెట్టిన దాన్ని త్రోసిపుచ్చితే అపవాదం refutation. వస్తువే అయినప్పుడు త్రోసివేయట మెలా సాధ్యం. అందుకే ఆ తెచ్చిపెట్టినది వస్తువు కాదు. ఆభాస అన్నారద్వైతులు. ఆభాస అంటే ఏదోగాదు. వస్తువే మరొక రూపంలో కనపడటం. రజ్జువు సర్పాకారంగా భాసిస్తున్నదంటే రజ్జువే అలా కన్పిస్తున్నది. అది కన్పిస్తున్నంతవరకు రజ్జువు దృగ్గోచరం కాదు. ఆరోపితం అధిష్ఠానాన్ని కప్పి పుచ్చుతుంది. కనుక దీన్ని అపవాదం చేస్తేగాని అసలైన అధిష్ఠానాన్ని చూడలేము. అపవదించటమంటే ఎక్కడికో తోసివేయటమని భావించరాదు మరలా. ఇది అదేనని తద్రూపంగానే భావించడం. దీనికే ప్రవిలాపమని Merging in the substance మరొక పేరు. పరమాత్మలో ఈ ప్రపంచమంతా అలా ప్రవిలాపనం చేయటమే అసలైన అపవాదం.


అపహ్నవ : అపలాపమనే మాటకిది పర్యాయం Synonymn. రెండింటికీ అర్థం ఒకటే.


అపహార : ప్రక్కకు తీసుకెళ్ళటం. దూరం చేయటం.


అపహృత : తొలగింపబడినది. మరుగు పడినది. 'అజ్ఞానేన అపహృతం జ్ఞానం' అని గీతా వచనం.


అపరిహార్య : పరిహరించుటకు వీలులేనిది. అనివార్యమైనది. తప్పనిసరి Unavoidable. 'తస్మా దపరిహార్యే అర్థే' తాపత్రయాన్ని ఆత్మ జ్ఞానం లేకుండా పోగొట్టుకోలేడు మానవుడు. అంతవరకు అది అపరిహార్యమే.


అపరిచ్ఛిన్న : పరిచ్ఛిన్నమంటే పరిమితమైనది. Limited. అలాటి హద్దులేవీ లేక ఆకాశంలాగా వ్యాపించినదైతే అపరిచ్ఛిన్నం. Unlimited.Endless. పరిపూర్ణమని అర్థం. ఆత్మతత్వమొక్కటే అపరిచ్ఛిన్నమైనది.


అప్యయ/అపీతి : లయమని అర్థం. కలిసిపోవటం. ఏకం కావటం. సుషుప్తిలో జీవుడు బ్రహ్మతత్వంలో చేరి ఏకమై పోతాడు. కనుకనే స్వపితి నిద్రిస్తున్నాడని పేరు వచ్చిందట. స్వం - తనలో తానే, అప్యేతి -చేరిపోతున్నాడు. కనుక స్వపితి Sleeps అని సంజ్ఞ ఏర్పడిందని వ్యాఖ్యానించారు అద్వైతులు.


అపిధాన/అపిహిత : పిధానమన్నా, అపిధానమన్నా మూత Lid. or Cover అని అర్థం. అలాంటి మూతబడిన పదార్థానికి అపహితం లేదా పిహితమని పేరు. 'హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం' అని ఈశావాస్యం వర్ణించింది. సూర్యమండలానికి దాని తేజస్సే అపిధానమై ఉపాసకునికి మార్గం స్ఫురించటం లేదట. అది తొలగించమని ఉపాసకుడు సూర్యుని ప్రార్థించటమిది.


అపర్యాప్త : తగినంత, చాలినంత అయితే పర్యాప్తం Enough or Sufficient. అలా కానిదైతే అపర్యాప్తం. Insufficient.


అపాదాన : ఒక పదార్థంలో నుంచి మరొక పదార్థం బయటికి వస్తున్నప్పుడు ఆ మొదటి పదార్థం దాని కపాదానం. The thing which some other thing emanates.Source. ఇంట్లో నుంచి మనం బయటకు వచ్చామంటే ఇల్లు మనకు అపాదానం. మాయాశక్తి ప్రపంచానికి ఇలాంటి అపాదానమే.


అపాన : శరీరంలోని ఐదు విధములైన వాయువులలో రెండవది. మొదటిది ప్రాణం. 'ప్రాగ్గమనవాన్‌ ప్రాణః' బయటికి వచ్చే నిశ్వాసం Exhalation. 'అర్వాగ్గమనవాన్‌ అపానః' లోపలికి వెళ్ళే ఉచ్ఛ్వాసం. Inhalation. ఇది శరీరం పైకి తేలిపోకుండా క్రిందికి అదిమిపట్టి నిలుపుతుంది.


అపాయ : విడిపోవటం. వేరయిపోవటం Separation. తొలగిపోవటమని కూడా అర్థమే.


అపేక్షా : ఒకదాని అక్కర. అవసరం. Need. ప్రతికార్యానికీ దాని కారణంతో అపేక్ష ఉంటుంది. కారణం లేకుండా కార్యమేర్పడదు. రెండూ ఒకదానికొకటి సాపేక్షం. Inter dependent.Relative. అలా కాకుంటే నిరపేక్షం. Absolute. చరాచర పదార్థాలన్నీ సాపేక్షమే. ఒక్క ఆత్మతత్వమే నిరపేక్షం. దీనికేమిటి దీనికేమిటని అడిగేందుకు అవకాశమివ్వటం కూడా అపేక్షే. అది ఉన్నంతవరకూ అనవస్థాదోషం తప్పదంటారు వేదాంతులు.


అపృథగ్భావ : పృథగ్భావమంటే వేరయిపోవటం. Separation. అలాకాక కలిసి మెలిసి ఉంటే అపృథగ్భావం. Union. కార్యకారణాలకు ఇలాంటి అవినాభావమే ఉంటుంది.


అపృథగ్దర్శీ : తన స్వరూపానికి అన్యంగా వేరుగా దేనినీ చూడని ఆత్మజ్ఞాని. అలాంటి వాడికెపుడూ అనాత్మ కనిపించదు. అంతా ఆత్మ స్వరూపంగా ఏకంగా దర్శనమిస్తుంది. దీనికే అపృథగ్దర్శనమని పేరు. అలా దర్శిస్తూ శిష్యులకు బోధించాలట ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడి దర్శనానికే ఆగమమని పేరు. ఇది శాస్త్రజ్ఞానం మాత్రమే కాదు. జ్ఞానం అనుభవానికి వచ్చినప్పుడు అది ఆగమమవుతుంది. అపృథగ్ధర్శనమన్నా, ఆగమమన్నా ఒక్కటే.


అపార : పారంలేనిది. అంతం లేనిది. Endless. ఆత్మజ్ఞానమలాంటిది.


అపూర్వ : పూర్వం కానిది. మొదట లేనిది. మొదలు లేనిదని కూడా అర్థమే. బ్రహ్మమని తాత్పర్యం. 'అపూర్వ మనపరం' అని బ్రహ్మాన్ని వర్ణించింది శాస్త్రం. అపూర్వమంటే మరొక అర్థం కూడా కద్దు. ఇప్పుడు చేసిన కర్మకు వెంటనే ఫలిత మనుభవానికి రాదు. అది లోకాంతరాలకు వెళ్ళిన తరువాతగాని అనుభవించలేడు మానవుడు. అంతవరకు నిలవ ఉంటే అలాంటి కర్మఫలానికి అపూర్వమని పేరు. లోకుల వాడుకలో ఉన్న అదృష్టమనే మాటకు కూడా ఇదే అర్థం.


అపోహ : త్రోసి పుచ్చటం. ఊహ కానిది. ఊహ అంటే ప్రోగవటం. Gather. ప్రోగవకుండా ఎక్కడికక్కడ విడిపోతే అపోహ. Scatter.


అపర : పూర్వం కానిది. వెనుక. Next Latter.


అపరబ్రహ్మ : బ్రహ్మం నిర్గుణమైతే, పరం సగుణమైతే అపరం కార్యబ్రహ్మమని శబల బ్రహ్మమని కూడా పేర్కొంటారు. దీనికే ఈశ్వరుడని God వ్యవహారం.


అపరాంతకాల : సంసారియైన జీవుడు మరణిస్తే అది అపరాంత కాలం. జీవన్ముక్తుడు పోతే అది పరాంత కాలం.


అపౌరుషేయ : పౌరుషేయమంటే పురుషుడు కల్పించినది. పురుషుడు తయారు చేయనిదైతే అపౌరుషేయం. Super human మానవ బుద్ధికి అతీతమైనదని Beyond mind అర్థం. వేదవాఙ్మయమంతా ఇలాంటి అపౌరుషేయమే నంటారు మన పెద్దలు. కానీ అది మానవ సృష్టి కాకపోయినా పరమాత్మ సృష్టి అని చెబుతారు వేదాంతులు. అది కూడా కాదంటారు మీమాంసకులు.


అపార్థ : అసలైన అర్థం కాక దానికి విరుద్ధమైన అర్థం స్ఫురిస్తే దానికి అపార్థమని పేరు. ఇలాంటి విరుద్ధమైన అర్థం చెప్పుకోకూడదు. అలా చెప్పుకునే అవకాశం రచయిత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఇది ఒక దోషం. పోతే అర్థమంటే ప్రయోజనమని కూడా అర్థమే. అప్పటికి అపార్థమంటే ప్రయోజనం లేని విషయం అని కూడా చెప్పవచ్చు.


అపద : పదం కానిది. పదమంటే స్థానం. గుర్తు. 'అపదస్య పదైషణః' అని గౌడకారిక. జీవన్ముక్తుడు సిద్ధి పొందితే అతని జాడ మనకెక్కడా గోచరం కాదు. ఆకాశంలో ఎగిరిపోయే పక్షి కాలి గుర్తులాంటిది. చూచినప్పుడే గాని తర్వాత తెలియదు. అలాంటిదే ముక్తపురుషుడి వ్యవహారం.


అపాద : ఓంకారంలో మూడు మాత్రలకు ఆత్మ తాలూకు మూడు పాదాలు అర్థమని చెప్పారు. పోతే నాలుగవ మాత్ర మాత్రకాని మాత్ర. అమాత్ర అని పేర్కొన్నారు. అది సూచించే నాలుగవ పాదం ఆత్మలో కూడా అపాదమే. మొదటి మూడు పాదాలు చేర్చే సాధనాలయితే ఇది చేరే స్థానం. చేరిన తరువాత ఇక వ్యవహారం లేదు కనుక అపాదమని పేర్కొన్నారు.


అపరమార్థ : పరమార్థమంటే వాస్తవం. వాస్తవం కానిది అపరమార్థం. అపారమార్థికమన్నా ఇదే అర్థం. వ్యావహారికంగానే చలామణి అయ్యే విషయం. పరమార్థ జ్ఞానం కలిగేవరకూ ఈ జగత్తు అపారమార్థికమే. కలిగితే ఈ వ్యవహార మంతా పరమార్థంగానే మారి అనుభవానికి వస్తుంది.


అపరిముషిత స్మృతి : జీవన్ముక్తులు రెండు జాతులు. ఒకరు ప్రారబ్ధం తీరి విదేహ ముక్తులయ్యేవారు. ఇంకొకకరు అలా వెంటనే కాక కొంతకాలం నిలిచి ఉండేవారు. పరమాత్మ వారికొక అధికారం అప్పగిస్తాడు.అది తీరేవరకువారు కొన్ని జన్మలైనా ఉండవలసిందే లేదా ఒక జన్మలోనే కొన్ని దేహాలైనా ధరిస్తూ పోవలసిందే. అలా ధరిస్తూ పోయినప్పుడు అంతకు ముందున్న వారి బ్రహ్మానుభవ స్మృతి పరిముషితంకాదు. అంటే దెబ్బ తినదు. లోపించకుండా అలాగే అపరిముషితంగా నిలిచి ఉంటుంది. దీనికే అపరిముషిత స్మృతి Un affected divine knowledge అని పేరు.

Page 8

అద్వైత వేదాంత పరిభాష



అపంచీకృత : పంచీకృతమంటే ఆకాశాది పృథివ్యంతం అయిదు భూతాలూ ఆయా పాళ్ళలో ఒకదానిలో ఒకటి చేరి స్థూల ప్రపంచంగా ఏర్పడటం. అలా ఏర్పడక పూర్వం అవన్నీ అతిసూక్ష్మంగా ఉండిపోతాయి. అపంచీకృతమంటే అలాంటి భూత సూక్ష్మాలు. దీనికే సూక్ష్మప్రపంచమని పేరు. దీని కధిష్ఠాత అయిన సమష్టి జీవుడు హిరణ్యగర్భుడు.


అపక్వ సమాధి : సమాధి దశ ఇంకా పాకానికి రాకపోతే అలాంటి యోగికి అపక్వ సమాధి అని పేరు. జ్ఞానంలో కూడా కర్మవాసనలు పక్వం కాకపోవచ్చు. అలాంటప్పుడు సమాధి సిద్ధించటం చాలా కష్టసాధ్యం. అభ్యాసం కొద్దీ కర్మ పక్వమై సమాధి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ దశ తప్పదు.


అపక్వాశయ : ఆశయమంటే కర్మాశయం. కర్మ సమూహం. ఇది మనసులో పేరుకొని ఉంటుంది. అది ప్రారబ్ధమైతే అనుభవానికి వస్తుంది. అప్పుడది పక్వం. అలాకాక ఇంకా సంచితరూపంగా నిలిచేది చాలా ఉంటుంది. అది పక్వమైతేగాని సాధకుడి ప్రయత్నం పూర్తిగా ఫలించదు. అసలు జ్ఞానంకూడా ఉదయించదు.


అపరిమేయ : పరిమాణం కలది పరిమేయం. Measurable. అలాంటిది కాకుంటే అపరిమేయం. Beyond measurement. పరమాత్మ తత్త్వం సర్వవ్యాపకం గనుక అది ఎప్పుడూ అపరిమేయమే.


అపాత్రదాన : పాత్రుడు కానివాడికి చేసే దానం. పాత్రుడంటే యోగ్యుడు. యోగ్యుడు కానివాడు అపాత్రుడు. అలాంటివాడికి జ్ఞానంగాని, ధనంగాని ఏది దానం చేసినా అది ఫలితమివ్వదు. ఇవ్వకపోగా దుష్ఫలిత మిచ్చినా ఆశ్చర్యంలేదు.


అపాకరణ : తొలగించుకోవటం. పోగొట్టుకోవటం. తీర్చుకోవటం. ఋణత్రయాన్ని తీర్చుకోటానికి ఋణాపాకరణమని పేరు.


అపాణిపాద : పాణిపాదములు రెండూ లేనివాడని అర్థం. పాణి పాదాలంటే చేతులు, కాళ్ళు ఇలాంటి అవయవాలు సాకారమైన జీవుడికి తప్ప నిరాకారమైన పరమాత్మకు లేవు. కనుక అది అపాణిపాదమని పేర్కొన్నారు. నిరవయవమని అర్థం.


అపాపవిద్ధ : పాపాలంటే అవిద్యా కామకర్మలు. అవి జీవుడికి తప్ప ఈశ్వరుడికి లేవు. అతడు పాపవిద్ధుడు కాడు. అంటే ఈ మూడు పాపములచేత దెబ్బతినడు అని భావం.


అపూర్వవిధి : శాస్త్రంలో ఒక కార్యం విధించేటప్పుడు అది అంతకుపూర్వం ఎక్కడా విధించబడినది కాగూడదు. క్రొత్తగా విధించవలసి ఉంటుంది. అప్పుడే దానికి ప్రామాణ్యం. అలాగ విధించబడిన కార్యానికి అపూర్వ విధి అని పేరు. ఆత్మ జ్ఞానమనేది ఇలాటి అపూర్వ విధి కాదు. ఆత్మస్వరూపం పూర్వమే సిద్ధమై ఉన్నది. క్రొత్తగా తయారుచేయనక్కరలేదు. తయారు చేయవలసినది పూర్వమీమాంస చెప్పే కర్మకాండ. ఇది దానికి కేవలం భిన్నమైన విషయం. కనుక క్రొత్తగా విధించనక్కర లేదు కానీ అలాటి ఆత్మతత్వం మానవుడు గుర్తించలేదు గనుక దానిని మరలా గుర్తు చేసుకోమని చెప్పటమే శాస్త్రం విధించవలసిన విషయం. కనుక దీనికి నియమవిధి అని వేదాంతులు పేరుపెట్టారు. కొంత సిద్ధమై, మరికొంత సాధించవలసి వస్తే అది నియమ విధి. పూర్తిగా సాధించవలసినదైతే అపూర్వవిధి. ఇందులో రెండవది మీమాంసకుల దర్శనమైతే, మొదటిది వేదాంతుల దృక్పథం.


అప్రకృత/అప్రస్తుత : ప్రకృతం, ప్రస్తుతమంటే అప్పటికప్పుడు ప్రారంభించినది ప్రస్తావించినది అని అర్థం. అలా కాకుంటే అప్రకృతం లేదా అప్రస్తుతం. ఇంతవరకూ ప్రస్తావన చేయని విషయం. అలాంటిది శాస్త్రంలో తటస్థపడితే అది అప్రకృతం. ఒక విషయం వర్ణిస్తూ ఉన్నప్పుడు అదే ప్రకృతంగాని దానికి అన్యమైన మరొక విషయానికి అక్కడ స్థానం లేదు. లేకున్నా పేర్కొంటే దానికి అప్రకృతమని పేరు వస్తుంది Out of context.


అప్రాకరణిక : ప్రకరణం అంటే సందర్భం. context. అసందర్భంగా మాటాడితే అది అప్రాకరణికం. సందర్భ శుద్ధి లేనిదని అర్థం.


అప్రతిగ్రహ : ప్రతిగ్రహమంటే దానం తీసుకోవటం. Receving a gift. అలాంటిదేదీ ఒక దాత దగ్గర తీసుకోకపోతే అది అప్రతిగ్రహం. ఇంద్రియ నిగ్రహానికి ఇది చాలా ముఖ్యమైన గుణం. సాధకుడైనవాడు దీనిని అలవరచుకోవటం మంచిదని యోగశాస్త్రంలో మాట. జ్ఞానికి కూడా ఇది అవసరమే. వస్తువులమీద చాపల్యం లేకపోవటం సాధనకు ఎంతో అవసరంగదా. కనుక అప్రతిగ్రహం యోగికి, జ్ఞానికి కావలసిన లక్షణమే.


అప్రజ్ఞ : ప్రజ్ఞ లేనివాడు. ప్రజ్ఞ అంటే స్ఫురణ. Awareness. సుషుప్తిలో జీవుడికి ప్రపంచం తాలూకు స్పృహ లేదు. గనుక సుషుప్తిలోని జీవుడికి అప్రజ్ఞుడని పేరు. కాని తన స్వరూపం తాలూకు స్మృతి అతనికి ఉంటుందని అద్వైతుల మాట. అది పైకి కనపడక పోవచ్చు. కాని ఉండి తీరాలి. లేకుంటే మెలకువ వచ్చిన తరువాత సుఖంగా నిద్రపోయానని, ఏదీ తెలియలేదని తన అనుభవాన్ని నలుగురికీ చెప్పలేడు. కనుక 'నా ప్రజ్ఞం' అని కూడా వర్ణించింది మాండూక్యం. అంటే ప్రజ్ఞ లేకుండా పోలేదని అర్థం. ఏ ప్రజ్ఞా! ప్రపంచ ప్రజ్ఞ కాదు. ఆత్మ ప్రజ్ఞ. ఆత్మ నిత్యసిద్ధం గనుక దాని తాలూకు ప్రజ్ఞకూడా నిత్యసిద్ధమే అయి తీరాలి. ఇది ఇందులో భావం.


అప్రచ్యుత : ప్రచ్యుత అంటే జారిపడడం. ఆత్మనిష్ఠలో ఉన్న జ్ఞాని నిరంతరమూ జారిపడకుండా జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు ఆత్మానుసంధానం చేసుకుంటూ పోవాలి. విజాతీయ భావాలు దండెత్తే అవకాశముంది కాబట్టి 'తత్వాదప్రచ్యుతో భవేత్‌' అని గౌడపాదులు సెలవిచ్చారు. తత్త్వజ్ఞానం నుంచి ఎప్పుడూ అప్రచ్యుతుడు అనగా జారిపడకుండా నిష్ఠతో ఉండాలని ఆయన ఉపదేశం.


అప్రత్యయ : ప్రత్యయమంటే జ్ఞానం. నమ్మకం. ఆత్మతాలూకు భావన. The idea of the supreme self. అలాటి విశ్వాసం లేకున్నా జ్ఞానం లేకున్నా దానికి అప్రత్యయమని పేరు. Lack of belief on knowledge.


అప్రతిష్ఠిత : ప్రతిష్ఠ లేనిది. ఒకచోట స్థిరంగా నిలిచి ఉండనిది. అస్థిరం. ఆత్మచైతన్యం ఎక్కడ ఉందని ప్రశ్న వచ్చింది ఛాందోగ్యంలో. అది ఎక్కడా లేదు. అప్రతిష్ఠిత మన్నాడు సనత్కుమారుడు. కారణం అది ఎక్కడైనా ఉండాలంటే అది ఒక ప్రదేశమై ఉండాలి. ఒక స్థానమై ఉండాలి. ఆత్మ సర్వవ్యాపకం. నిరాకారం. దానికి దేశ కాలాలు ఆధారం Base కావటానికి వీలులేదు. కనుక అది ఎప్పుడూ అప్రతిష్ఠితమే. అంటే మరి ఒకదానిమీద ఆధారపడదని అర్థం. పోతే అసలు లేనిదికాదు. తనమీదనే తాను ఆధారపడుతూ తనపాటికి తానున్నది. కనుక స్వప్రతిష్ఠితం. Self Existent. Self contained.


అప్రతిఘ/అప్రతిహత : Unobstructed. ఎదురులేని, అడ్డగించబడని, నిరాఘాటంగా ప్రసరించేదని అర్థం. జ్ఞాన మప్రతిఘం. సిద్ధపురుషుల జ్ఞానమెప్పుడూ అలాంటిదే. సిద్ధి చతుష్టయంలో ఇది ఒకటి.


అప్రతిపత్తి : ప్రతిపత్తి లేకపోవటం.Inapprehension. స్ఫురించకపోవటం. ఏదీ స్ఫురించకపోవటం. అసలు విషయాన్ని గుర్తించలేక మౌనం వహించటం. ఆత్మ విషయంలో ఫలానా అని గుర్తించటం అసంభవం. గుర్తిస్తే అది మనకు విషయమయ్యే ప్రమాదముంది. అప్రతిపత్తే దాని ప్రతిపత్తి.


అప్రతిపక్ష : విరుద్ధమైన పక్షం ప్రతిపక్షం. Opposition. అలాంటి ప్రతిపక్షం లేకపోతే అప్రతిపక్షం A tenet without opposition.


అప్రతిరోధ : ప్రతిరోధమంటే ప్రతిబంధం. ప్రతిబంధం లేనిది అప్రతిరోధం. Without any obstruction.


అప్రతిబంధ : ప్రతిబంధం లేకపోవటం. అడ్డు లేకపోవటం.


అప్రతిషేధ : ఒకదానిని కాదని నిషేధించటం. Negation. నిషేధించబడిన విషయం కాకుంటే అది అప్రతిషేధం.


అప్రతియోగి : ప్రతియోగి కానిది. అనుయోగి అని అర్థం. అంటే ఒక విషయాన్ని తనదిగా భావించేది. అభావ ప్రతియోగి అంటే దేనికి మనం అభావం చెబుతున్నామో అలాంటి అభావం కలిగిన పదార్థం అని భావం. A thing to which belongs the absence. అభావాన్ని కలిగినది అని అర్థం.


అప్రమాణ : ప్రమాణం అంటే Proof. ప్రమాణం లేని పదార్థం అప్రమాణం. Unproved thing. ఏ ప్రమాణానికీ గోచరించకపోతే అది వాస్తవమని చెప్పలేము. ఏదో ఒక ప్రమాణానికి ఈ ప్రపంచమంతా గోచరించి తీరవలసిందే. చివరకు ప్రత్యక్షానుమానాలు కూడా శ్రుతిప్రమాణం దగ్గర వీగిపోతాయి. కాబట్టి తాత్కాలికంగా ప్రపంచం ప్రమాణ సిద్ధమైనా పరమార్థంలో అప్రమాణమే. పోతే ఆత్మ ప్రమాణానికి విషయం కాకపోయినా ప్రమాణాదులన్నీ దానిలోనుంచే ప్రసరిస్తున్నాయి. అది వీటికి పూర్వమే అహం అనే రూపంలో సిద్ధమై ఉన్నది. కనుక అప్రమాణమైనా అదే ప్రమాణమన్నిటికీ.

Page 9

అద్వైత వేదాంత పరిభాష



అప్రమేయ : ప్రమాణానికి విషయమైతే అది ప్రమేయం. To be known. ఆత్మ విషయం కాదు. విషయి. కనుక అది అప్రమేయం. Beyond all instruments of knowledge. జ్ఞానంచేత కొలిచేది కాదది. కొలత కతీతమైన జ్ఞాన స్వరూపమే అది. కనుక ఎప్పుడూ అది అప్రమేయమే.


అప్రమాద / అప్రమత్త : ప్రమాదమంటే పరాకు. Lack of attention. వాస్తవాన్ని గుర్తించకపోవటం. ఆత్మ ఒక్కటే వాస్తవమైన తత్వం. దానిని ఉన్నదున్నట్టు గుర్తించక పోవటమే ప్రమాదం. అలాంటి ప్రమాదానికి గురియైనవాడు ప్రమత్తుడు. ఇలాంటి ప్రమాదం లేకపోవటం అప్రమాదం. అంటే ఆత్మ విషయంలో జాగరూకత, సరియైన అవగాహన. అలాంటి అవగాహన నిత్యమూ ఉన్నవాడెవడో వాడు అప్రమత్తుడు. అనగా తన స్వరూపాన్ని తాను నిరంతరమూ గుర్తిస్తూ పోయే జ్ఞాని.


అప్రమిత : ప్రమాణానికి గురియైనది ప్రమితం.Cognised. ప్రమితం కాకపోతే అప్రమితం. Not known. Not cognised. అలాంటి పదార్థం ఉన్నదనిగాని, లేదని గాని చెప్పలేము. ఏదో ఒక విషయం ప్రమితమైనప్పుడే మరొకదాన్ని అప్రమితమని కొట్టివేయవచ్చు. ప్రమితమైనది లేకుండా ప్రతి ఒక్కటీ అప్రమితమని చెప్పరాదు. ప్రమితమనేది ఎప్పుడూ మన స్వరూపమే. కనుక దానిని ఆలంబనం చేసుకుని మిగతా ప్రపంచం తాత్కాలికంగా ప్రమితమైనా అది అవాస్తవమే అని సిద్ధాంతం చేస్తారు అద్వైతులు.


అప్రతిబోధ : ప్రతిబోధం లేకపోవటం. ప్రతిబోధమంటే స్ఫురణ. జ్ఞానోదయం. ఇది ఒక మెరపులాగ సాధకుడి మనస్సులో తళుక్కుమని మెరవవలసి ఉంది. అది కలగనంత వరకు శ్రవణ, మననాదులకు సార్థక్యం లేదు. మనస్సులో కలిగే ప్రతి ఆలోచనకూ ప్రతిబోధమని పేరు. ప్రతి ఆలోచనా ఒక విశేషమే. అది నిర్వికల్పమైన మన జ్ఞానంలోనుంచే ఉదయిస్తుంది. దానిని ఆధారం చేసుకొని దాని మూలస్థానాన్ని అన్వేషించి పట్టుకోవటం సులభమన్నారు.


ప్రతిబోధ విదితం : అలాగ ప్రతి బుద్ధి ప్రత్యయాన్ని ఆధారం చేసుకొని సాధకుడైనవాడు దాని అధిష్ఠానమైన తన స్వరూపాన్ని పట్టుకోగలిగితే అది వాడికి విదితమవుతుంది. ఇదే ప్రతిబోధ విదితమనే మాటకర్థం.


అప్రకాశ : ప్రకాశించడమంటే స్ఫురించడం. వెలుతురని గాదు అర్థం. బయట పడి కనిపించడం. ప్రతి ఒక్కటీ లోకంలో మన ఇంద్రియాలకు అలాగే కనిపిస్తున్నది. స్ఫురిస్తున్నది. అలా స్ఫురింపజేసే వెలుగు గాని వెలుగొకటి మన లోపలే ఉంది. అదే ఆత్మచైతన్య ప్రకాశం. దానిని ప్రకాశింపజేసే పదార్థం మరొకటి లేదు. కనుక అది గుప్తంగానే ఉండిపోయింది. గుప్తమైనా తనలో తాను ప్రకాశిస్తూనే ఉంటుంది. కనుక బాహ్యపదార్థాలలాగ మరొక ప్రకాశం మీద ఆధారపడకపోవటం మూలాన అప్రకాశమైనా తనపాటికి తాను స్వయంప్రకాశం గనుక ప్రకాశమే. అది కాని ప్రపంచమే అప్రకాశం.


అప్రాకృత : ప్రకృతి సంబంధమైనది ప్రాకృతం. త్రిగుణాత్మకమైన ప్రపంచమంతా ప్రాకృతమే. భౌతికమే. పోతే అభౌతికమైన పదార్థం ఆత్మతత్వం. అది త్రిగుణాలకు అతీతం గనుక ప్రాకృతం కాదు. అప్రాకృతం. Not Physical but meta Physical.


అప్రాప్త/ప్రతిషేధ : తటస్థ పడ్డది ప్రాప్తం. పడకుంటే అప్రాప్తం. శాస్త్రంలో ఒక సందర్భం తటస్థపడి దాన్ని కాదని చెప్పవలసి వస్తే ప్రాప్త ప్రతిషేధమని దానికి పేరు. అలా తటస్థపడకపోయినా దాన్ని నిషేధించటం పనికిరాదు. నిషేధించటానికి అక్కడ విషయం లేదు. అది అప్రాప్తమే గాని ప్రాప్తం కాదు కదా. అలాంటప్పుడు నిషేధించే అవకాశమెక్కడిది.


అప్రాణ : 'అప్రాణః అమనాః' అని పరమాత్మను వర్ణించింది ఉపనిషత్తు. ప్రాణమంటే క్రియాశక్తి. మనస్సంటే విశేష జ్ఞానం. ఇవి రెండూ పరమాత్మకు లేవు. అది చలనాత్మకం కాదు గనుక అప్రాణం. విశేష జ్ఞానం కాదు గనుక అమనస్కం.


అప్రత్యాఖ్యేయ : ప్రత్యాఖ్యేయం కానిది. ప్రత్యాఖ్యేయమంటే త్రోసివేయవలసినది. ఆత్మ అనాత్మలాగ త్రోసివేసే పదార్థం కాదు. నేను నేననే భావమే కదా ఆత్మ. మరి దేనినైనా త్రోసివేయవచ్చునేగాని నేననే భావాన్ని త్రోసిపుచ్చటం సాధ్యంకాదు. త్రోసివేసే వ్యక్తి ఆ నేనే. కనుక అది ఎప్పుడూ అప్రత్యాఖ్యేయమే. అంటే అహేయమే.Irrefutable.


అప్రత్యక్ష : ఇంద్రియాలకు గోచరిస్తే ప్రత్యక్షం. ఇంద్రియాలతోపాటు మనస్సుకు కూడా అతీతమైతే అది అప్రత్యక్షం. Unperceivable. Inconceivable. పరోక్షమని అర్థం. Absent.  ఆత్మ ఏ ప్రమాణానికీ గోచరంకాదు. ఆత్మప్రమాణానికే గోచరించ వలసి వుంటుంది. కనుక మిగతా పదార్థాలలాగా ప్రత్యక్షమయ్యేది కాదని దీనిభావం.


అప్రతీకార : ఒకరు చేసిన దానికి బదులు చేయలేకపోవటం Without reaction or retaliation.


అప్రదేశ : ఒక ప్రదేశమంటూ లేనిది. ఏ ప్రదేశంలోనూ ఇమడనిది. Nonspacial Beyond space. ఆత్మ సర్వవ్యాపకం గనుక అది ఒకానొక ప్రదేశంలో ఉందని చెప్పటం హాస్యాస్పదం. అది ఎప్పుడూ దేశానికీ, కాలానికీ అతీతమైన తత్వం.


అప్రవిభక్త దేశకాల : దేశకాలాలు రెండూ ప్రవిభక్తం కాని అనగా వేరుగాలేని పదార్థాలేవో అవి అప్రవిభక్త దేశకాలాలు. ఆ పదార్థాలు ఒకటి ఆత్మచైతన్యం మరొకటి అనాత్మ ప్రపంచం. ప్రపంచంలో చరాచర పదార్థాలు ఏవి చూసినా ప్రతి ఒక్కదానిలో అస్తీ భాతీ అనే ఆత్మ స్వరూపమూ నామారూపాలనే అనాత్మ స్వరూపమూ రెండూ కలిసి ఉన్నాయి. ఒకటి లేని మరొకటి కానరాదు. సత్‌ చిత్‌లున్న చోటనే నామ రూపాలున్నవి. అవి ఉన్న కాలంలోనే ఇవీ ఉన్నవి. ఒక దానిని విడిచి మరొకటి విభక్తంగా లేవు. కనుక దీనిని బట్టే నామరూపాత్మకమైన ప్రపంచం సచ్చిదాత్మకమైన చైతన్యం కంటే వేరుగా లేదని చెప్పవచ్చు.


అప్రసక్త : ప్రస్తకం కానిది. ఒకదాని సాంగత్యం లేనిది. ఆత్మచైతన్యం. అంతేకాదు, ఏ విషయంలోనూ లగ్నంకాని మనస్సయితే అలాంటి మనస్సు కూడా అప్రసక్తమే. సందర్భానికి సరిపడనిది కూడా అప్రసక్తమే.


అప్రాసంగిక : ఒక ప్రధాన విషయం చెబుతూ ఉన్నప్పుడు మధ్యలో ప్రసంగవశాత్తు మరొక విషయం చెప్పవలసి వస్తే అది ప్రాసంగికం. అలా కానిది అప్రాసంగికం. అంటే మనం చెప్పుకునే ప్రధాన విషయమని అర్థం.


అప్రవృత్త : Un commenced. Un proceeded. ఇంకా ప్రవృత్తం కానిది. ఆరంభం కానిది. ఏ పనీ పెట్టుకొననిది. అన్ని కర్మల నుంచి వైదొలగినదని కూడా అర్థమే. ఒక విషయంలో ఇంకా ప్రవేశించకపోతే చెప్పవలసినదింకా పేర్కొనకపోతే ఆ శాస్త్రం అప్రవృత్తం.


అపృష్ట : పృష్టం కానిది. Unquestioned. ఇంకా ప్రశ్నించబడనిది. 'నాపృష్టః కస్యచిత్‌ బ్రూయాత్‌.' ప్రశ్న వేయకుండా ఎవరికీ ఏదీ చెప్పకూడదన్నారు. ముఖ్యంగా పరమార్థ విషయంలో ఈ సూత్రం పాటించవలసి ఉంది.


అప్రధా : ప్రధ అంటే బయటపడడం. కనిపించడం. అది లేకుంటే అప్రధ. Not present. Not exposed.


అప్రధాన : ప్రధానం కానిది. ప్రధానమంటే Main ముఖ్యమైనది. అంత ముఖ్యం కాకపోతే అది అప్రధానం. Subsidiary. అంగమని శేషమని గూడా దీనికి పేరు. Accessory.


అప్రబోధ : ప్రబోధం లేకపోవటం. అజ్ఞానం. ఆత్మజ్ఞాన రాహిత్యం.


అఫల : ఫలమంటే ప్రయోజనం. ఏ ప్రయోజనమూ లేని దానికి అఫలమని పేరు. 'ఫలవత్‌ సన్నిధౌ అఫలం తదంగం' అని ఒక న్యాయమున్నది. తనపాటికి తనకు ఏ ప్రయోజనం లేకపోయినా ప్రయోజనం ఉన్న ఒక విషయం చెప్పినప్పుడు దాని సన్నిధిలో ఇది కూడా చేర్చి చెబితే దాని ప్రయోజనమే దీనికీ సిద్ధిస్తుందని, అప్పుడిది అఫలం కాదు సఫలమేనని పెద్దల మాట.


అఫలాకాంక్షీ : కర్మ చేసేటప్పుడు ముఖ్యంగా శాస్త్ర విహితమైన కర్మలు ఆచరించేటప్పుడు దాని ఫలితం మీద కాంక్ష లేదా కోరిక లేకుండా తనకది విధియని నిష్కామంగా ఆచరించటం.


అభయ : 'అభయం సత్వసంశుద్ధిః' దైవగుణాలలో ఇది మొదటిది. సాధన మార్గంలో భయమనేది పనికిరాదు. నిస్సంకోచంగా ముందుకు ధైర్యంతో సాగిపోవాలి. అప్పుడే అది గమ్యం చేరుస్తుంది. అభయమంటే బ్రహ్మతత్వం కూడా. ద్వితీయమైన పదార్థమే లేనిది గనుక అది ఎప్పుడూ అభయమే. భయరహితమే.


అభవ : భవమంటే సంసారం. భవమంటే జన్మ. దీని ఊసు లేనిదేదో అది అభవం. జన్మరాహిత్యం అని అర్థం.


అపునరావృత్తి : పునరావృత్తి అంటే మరలా జన్మించటం. Re-birth. అది లేని దశ అపునరావృత్తి. బ్రహ్మ సాయుజ్యం లేదా మోక్షమని అర్థం.


అబాధ/అబాధిత : బాధ అంటే వేదాంతంలో Contradiction  కొట్టివేయటం అని అర్థం. ఒక సిద్ధాంతం చేసినప్పుడు దానికి ఇలాటి ప్రతిబంధకమేదీ ఉండకూడదు. ఉంటే అది బాధితమవుతుంది.Contradicted . సత్యమెపుడూ అబాధితమై ఉండాలి. ఆత్మచైతన్యమొక్కటే సత్యం. దానికి అనాత్మ ప్రపంచంవల్ల బాధలేదు. అనగా అనాత్మ ఆత్మను కాదని కానీ, లేదని కానీ కొట్టివేయలేదు. మీదు మిక్కిలి ఆత్మజ్ఞానంవల్లనే సమస్త ప్రపంచమూ కొట్టుపడుతున్నది. కనుక ప్రపంచమే బాధితం. సత్యస్వరూపమైన ఆత్మ ఎప్పుడూ అబాధితమే. బాధ అనేది తర్కశాస్త్రంలో చెప్పిన అయిదు హేత్వాభాసలలో ఒకటి కూడా. హేత్వాభాస అంటే ఓబిజిజిబిబీగి. చెప్పిన లక్షణానికి దెబ్బ తగలకూడదు.

Page 10

అద్వైత వేదాంత పరిభాష



అబోధ/అబుద్ధ : బోధ అంటే జ్ఞానం. ముఖ్యంగా ఆత్మజ్ఞానం. అది లేకుంటే అబోధ. అజ్ఞానమని అర్థం. అలాంటి అజ్ఞానికి అబుద్ధుడని పేరు.


అభాన : భానమంటే ప్రకాశించటం. కనపడడం. ఉన్నట్టు స్ఫురించటం. అలాంటి స్ఫురణ లేకుంటే అది అభానం. ప్రపంచమంతా భాతి. స్ఫురిస్తున్నది మనకు. ఇందులో స్ఫురించే పదార్థం స్ఫురణ లేకుంటే నిలవలేదు. అప్పుడది అభానమై పోతుంది. దానికి స్ఫురణను సమకూరుస్తున్నది ఆత్మచైతన్యమే. అది ఎప్పుడూ భానమే కానీ అభానం కాదు.


అభావ : భావమంటే ఉండటం. ఉనికి. స్థితి. దానికి వ్యతిరేకి అభావం.Negation or absence. పదార్థాలు భావ పదార్థాలని Present, అభావ పదార్థాలని రెండు విధాలు. భావపదార్థాలు ఆరయితే అభావ పదార్థాలు నాలుగని పేర్కొన్నారు తార్కికులు. ఈ అభావం మరలా నాలుగు విధాలు. ఒకటి ప్రాగభావం. రెండు ప్రధ్వంసాభావం. మూడు అన్యోన్యాభావం. నాలుగు అత్యంతా భావం. ఇవి నాలుగూ లేనిది ఒక్క ఆత్మతత్వమే. మిగతా అనాత్మ ప్రపంచమంతా ఈ నాలుగింటికి గురికావలసిందే. కనుక భావాభావాలు రెండూ చివరకు అభావమే.


అభ్యాగమ : ప్రాప్తించటం. వచ్చి పడటం. ఎదురుకావటం. చేయనిది వచ్చి పడితే అది అకృతాభ్యాగమం. ఇది హేతువాదానికి నిలవదు. కనుక ప్రతి కార్యానికీ అంతకుముందు కారణమనేది ఉండి తీరాలంటారు.


అభావనా : భావించకపోవటం. ముఖ్యంగా ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోవటం. Not idea about the reality. ఇందులో శ్రవణం వల్ల ఈ అభావనా అనే దోషాన్ని పోగొట్టుకోవాలి సాధకుడు. శ్రవణం ఆత్మ స్వరూపాన్ని మనస్సుకు తెస్తుంది గనుక అభావన భావనగా మారే అవకాశం ఉంది.


అభ్యాస : సాధనమార్గంలో రెండే ఉన్నాయి సూత్రాలు. మొదటిది అభ్యాసం రెండవది వైరాగ్యం. ''అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే'' అని గీత. పదే పదే శ్రవణ మననాదులు సాగిస్తూ పోవటమే అభ్యాస అనే మాట కర్థం. Repetition of the idea of the supreme self or spiritual practice. మాటిమాటికీ అభ్యసిస్తూ పోవటంవల్ల ఆత్మజ్ఞానం బలపడే అవకాశం ఎంతైనా ఉంటుంది.


అభ్యుపగమవాద : అంగీకరించటం. సమ్మతించటం. To concede. ఒక సిద్ధాంతం తనకు ఇష్టమై దానిని అనుమతించినా అభ్యుపగమమే లేక పూర్తిగా తనకు విరుద్ధమైనా ఎదుటి వానిని కాదనలేక తాత్కాలికంగా సమ్మతించినా అభ్యుపగమమే. అలా సమ్మతించి చివరకు తగిన హేతువులు చూపి దానిని ఖండిస్తాడు సిద్ధాంతి. దీనికి అభ్యుపగమ వాదమని పేరు.


అభిమాన/అభిమత : తాదాత్మ్య బుద్ధి. Total Identity. ఒక పదార్థంతో పూర్తిగా మమేకమై పోవటం. శరీరంతో ప్రతి మానవుడూ అలాగే ఏకమై పోయాడు. అది మన జ్ఞానానికి గోచరించే విషయమైనా తన స్వరూపంగానే భావించి దానితో వ్యవహరిస్తున్నాడు. దీనికి దేహాత్మాభిమానమని పేరు. Identifying ourselves with our bodies.ఇలా మనం దేనిని అభిమానిస్తామో దానికి అభిమతమని పేరు. శరీరం మన అభిమానానికి విషయం గాబట్టి ఇది అభిమతం మనకు.


అభిజ్ఞాన : గుర్తించటం. మరుగుపడిన తన ఆత్మతత్వాన్ని మరలా మానవుడు శ్రవణ మననాదులతో గుర్తించగలగడం. అలా గుర్తు చేసుకున్నవాడు అభిజ్ఞుడు.


అభివ్యంజన : అభివ్యక్తం చేయటం. బయట పెట్టడం. స్పష్టం చేయటం.


అభివ్యక్త : అలా వ్యక్తం చేయబడ్డ ప్రపంచం. సూక్ష్మంగా ఉన్న అనాత్మ ప్రపంచాన్ని పరమాత్మ తనలోనుంచే స్థూలరూపంగా సృష్టించాడు గనుక స్థూలమైన ఈ ప్రపంచమంతా అభివ్యక్తమైందని చెబుతారు శాస్త్రజ్ఞులు. Manifest. ఇది వాస్తవంగా వ్యక్తమైనది కాదు. అవ్యక్తమే మరొక రూపంలో వ్యక్తమైనది గనుక దానికిది అన్యంకాదు. దాని ఆభాసే నంటారు అద్వైతులు.


అభివ్యాప్తి/అభివ్యాపక : సర్వత్రా వ్యాపించడం. దేశ కాలాలన్నీ వ్యాపించిన పదార్థం ఒక పరమాత్మే. కనుక దానికి అభివ్యాపకమని పేరు. ఇది ప్రతిపదార్థం లోపలా, వెలపలా, మధ్యలోనూ జరిగిన వ్యాప్తి గనుక అభివ్యాప్తి అయింది. అంతర్‌ వ్యాప్తి, బహిర్‌ వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ఈ మూడు విధాలుగా ఎప్పుడు వ్యాపించాడో అప్పుడు అభివ్యాపకమైన పరమాత్మ తప్ప అభివ్యాప్తమైన ప్రపంచమే అసత్కల్పమని సిద్ధాంతం చేయవలసి వస్తున్నది. ఇదే అద్వైత సిద్ధాంతం.


అభినివేశ : ఒక విషయంలో బాగా ప్రవేశించటం. నిమగ్నమై పోవటం. Indulgence. యోగశాస్త్రంలో చెప్పిన ఐదు క్లేశాలలో ఇది ఆఖరి క్లేశం. అవిద్యతో ప్రారంభమై అభినివేశంతో ముగిసింది మన సంసార యాత్ర. అవిద్య ఆత్మను గుర్తు చేయక అనాత్మను చూపితే ఆ అనాత్మనే ఆత్మగా భావించి తన్నిమిత్తంగా సంసార క్లేశాలన్నీ అనుభవానికి తెస్తున్నది ఈ అభినివేశం. కనుక అన్నిటికన్నా ప్రమాదకరమైనదిది. ఇది పోవాలంటే మొదట అవిద్యకు జవాబు చెప్పాలి. దానికి జవాబు బ్రహ్మవిద్య తప్ప మరొకటి లేదు.


అభిధాన/అభిధేయ : ఒక అర్థాన్ని చెప్పే శబ్దం అభిధానం. పేర్కొనటమని అర్థం. Connotation. శబ్దాలన్నీ అభిధానమైతే వాటి అర్థాలు అభిధేయం. సాధారణంగా అభిధానం ముఖ్యార్థాన్నే చెబుతుంది. ఘటమన్నప్పుడు కుండ అనే అర్థమే స్ఫురిస్తుంది. అలా కాక శరీరమని అర్థం చెప్పామనుకోండి. అది అభిధావృత్తి Primary Sense గాదు. లక్షణావృత్తి Secondary Sense అని పేర్కొంటారు శాస్త్రజ్ఞులు. ఆత్మ అభిధేయం కాదు. ఆత్మ అనే శబ్దం కూడా దాన్ని చెప్పటం లేదు. చెబితే శబ్దం వాచకం, అర్థం వాచ్యమవుతుంది. ఆత్మ దేనికీ విషయం కాదు గనుక అవాచ్యం అనభిధేయం Not to be mentioned. కనుక దాన్ని లక్ష్యార్థంగానే భావన చేయాలి. అంటే శబ్దాకార అర్థాకార వృత్తిని verbal వదిలేసి ఆత్మాకారంగానే దర్శించాలని తాత్పర్యం.


అభిధ్యాన : ఒక విషయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఏకధారగా దానిమీద మనస్సు నిలపటం (meditation). ధ్యానమన్నా ఇదే. 'ప్రత్యయైక తానతా ధ్యానం' అన్నాడు పతంజలి.


అభిప్రాయ : ఒక విషయాన్ని ఉద్దేశించడం Intention aim


అభిప్రేత : దేన్ని ఉద్దేశిస్తామో ఆ విషయం Intended


అభిభవ : ఉద్భవ అనే మాటకు జత మాట. ఉద్భవమంటే పైకి రావటం. అభిభవమంటే అణగద్రొక్కటం, ఎదిరించటం overwhelm dominate.


అభిసంధి/అభిసంధా : ఒక లక్ష్యంమీద దృష్టి పెట్టటం. ఒక విషయాన్ని మనస్సులో ఉంచుకొని దానినే నిత్యమూ భావిస్తూ పోవటం. అది సత్యమైతే సత్యాభి సంధి. అనృతమైతే అనృతాభి సంధి. మరణ కాలంలో బ్రహ్మతత్వం మీద మనస్సు పెట్టుకొని వెళితే బ్రహ్మసాయుజ్యమే లభిస్తుందని అనృతమైన సంసార విషయాలమీద పెట్టుకొనిపోతే మరలా సంసార బంధం తప్పదని ఛాందోగ్యంలో సెలవిచ్చినమాట.


అభియోగ : ఒకరిమీద ఉన్నది, లేనిది కల్పించి చాడి చెప్పటం, అభాండం వేయటం. అది నిరూపించుకొనే బాధ్యత అభియుక్తుడికి తప్పదు. alleged.


అభ్యధిక : అధికమనే అర్థం. అదనంగా చెప్పుకోవలసినది additional point ఉన్న దానికి తోడు అది కూడా కలిస్తే దానికి బలమెక్కువ. అసలు విషయం కాక మరొక అప్రస్తుత విషయం చెప్పినా దానికి అభ్యధికమనే పేరు.


అభ్యంతర : అంతరమంటే లోపల. అభ్యంతరమన్నా లోపలి భాగమనే అర్థం. Inside internal.


అభ్యుపాయ : ఉపాయమనే అర్థంలోనే వస్తుంది. means. సాధనమని అర్థం.


అభ్యుచ్చయ : ఉచ్చయమన్నా ఇదే అర్థం. ఒకదానికి మరొకదాని అవసరం ఏర్పడ్డప్పుడు రెండూ కలిపి చెప్పడం. జ్ఞానానికి కర్మతో అవసరం ఉంటే దానికి ఉచ్చయమని, సముచ్చయమని కూడ పేరు. అభ్యుచ్చయమంటే అదనంగా ప్రస్తుతాంశానికి చేర్చి చెప్పుకొనే విషయం.


అభ్యుదయ : ఉదయించటం, పైకి రావటం, ఇంతేగాక ధర్మపురుషార్థం చక్కగా పాటిస్తే మరణానంతరం ఆయా లోకాలకు పోయి అక్కడగాని తరువాత జన్మ ఎత్తి ఆ జన్మలలో గాని అనుభవించే భోగభాగ్యాలు, సుఖశాంతులు వీటికి అభ్యుదయమని పేరు. prosperity. ధర్మపురుషార్థానికి ఫలితం ఇంతకన్నా మరేదీ లేదు.


అభ్యుత్థాన : ఎదురువెళ్ళడం, ఎదుర్కొనటం. సగౌరవంగా పెద్దలను ఆహ్వానించి వారి యోగక్షేమాలు విచారించటం.

Page 11

అద్వైత వేదాంత పరిభాష



అభ్యర్హిత : పూజితమైనది Respectable, ప్రధానమైనది Important, అభ్యర్హితం ప్రథమం అని శాస్త్రజ్ఞుల మాట. రెండు విషయాలలో ఏది ప్రధానమో, ప్రశస్తమో దాన్నే మొదట వర్ణించి చెప్పాలట. Preference.


అభ్యుపగమ : అంగీకరించడం. సమ్మతించటం, మనఃపూర్వకంగా కాదు. తాత్కాలికంగా ప్రతివాది వాదం ఒకవేళ మేము ఒప్పుకున్నా అది చెల్లదనే సందర్భంలో వస్తుందీమాట. Suppose we expect your position it is only hypotheitical.


అభ్యుపపత్తి : పొందటం. అందుకోవటం. ప్రాప్తి. Approach.


అభూత : అసలే లేనిది. అంతవరకు పుట్టనిది, తయారు కానిది Unborn nonexistent.


అభూతార్థ : లేని విషయాన్ని కల్పించి చెప్పటం. అభూత కల్పన అన్నా ఇదే. అసత్యమని అర్థం. ఎప్పుడూ జరగనిది. Fact కాదు. Fiction or false.


అభౌతిక : భౌతికం కానిది. beyond matter metaphysical. ప్రకృతికి అతీతమైన తత్త్వం. spiritual fact.


అభౌమ : భూమితో సంబంధంలేనిది. ప్రాపంచికంగా కానిది. ప్రపంచాతీతమైన విషయం. దివ్యమైనదని divine అర్థం.


అభూతపూర్వ : ఇంతకుపూర్వ మెప్పుడూ లేనిది, జరగనిది. unpresidented.


అభేద : భేదం లేనిది. భేదమనేది difference or division మూడు విధాలు. 1. సజాతీయం - ఒక వృక్షానికి మిగతా వృక్షజాతి. 2. విజాతీయం - వృక్షజాతికి మిగతా లోకంలో ఉండే పదార్థాలన్ని 3. స్వగతం - ఆ వృక్షంలోనే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు లాంటివి ఈ మూడు భేదాలు చరచర పదార్థాలన్నింటికీ సహజంగా ఉండి తీరుతాయి. ఒక బ్రహ్మత్వానికి మాత్రమే ఇలాంటి భేదాలనేవి కానరావు. చైతన్యరూపేణా దానికి, జీవుడికి భేదంలేదు. అస్తిత్త్వ రూపేణా జగత్తుతో భేదంలేదు. నిరాకారం కనుక తనలో తనకు భేదంలేదు. కనుక మూడు భేదాలకు అతీతమైన పరమాత్మ కేవలం అభేద స్వరూపం.


అభేదవాదం : ఇలాంటి అభేదాన్ని పరమార్థంగా బోధించే సిద్ధాంతం. అద్వైత వాదమన్నా ఇదే. జీవజగదీశ్వర భేదాలు ఏవీ చెప్పదు అద్వైతం.


అమత : మతమంటే మనస్సుతో ఆలోచించేది. thoughtమనస్సుకు గోచరించేదంతా మతమే. ఆలోచనకు అతీతమైనదేదో అది అమతం. నామరూపాలు ఉన్న పదార్థం మాత్రమే ఆలోచనకు వస్తుంది. మనస్సుకు గోచరిస్తుంది. దానికి అతీతమైనది పరమాత్మ తత్త్వం. మనస్సుకు వచ్చే ప్రసక్తిలేదు. కనుక అమతమంటే అసలైన అర్థం ఆత్మచైతన్యం.


అమనాః : మనస్సు కానిది. మనస్సుకు అతీతమైనది beyond mind పరమాత్మ.


అమనస్కయోగ : మనస్సుకు అతీతమైన దశనందుకొనే మార్గం. జ్ఞానయోగమనే అర్థం. ఇందులో ప్రాపంచికమైన మనోవృత్తులు లయమై వాటి స్థానంలో కేవలం ఆత్మాకార వృత్తి మాత్రమే మిగిలిపోతుంది.


అమల : మలమంటే మాలిన్యం. impurity నామరూపాద్యుపాధులే మాలిన్యం. దాని స్పర్శ లేకుంటే అమలం. అది ఆత్మస్వరూపం.


అమృత : మృతమంటే నశించినది. నాశమనేదే లేకుంటే అది అమృతం. మరణం లేనిదని అర్థం. ప్రపంచమంతా ఎప్పటికప్పుడు మారిపోతున్నది కనుక మృతమైతే ఇలాంటి మార్పు నిరాకారమైన ఆత్మకులేదు. కనుక ఆత్మే అమృతం.


అమృతత్వ : మృతత్వం కానిది. మృతత్వం సంసార బంధమైతే అది కాని అమృతత్వం కేవలం మోక్షమే immortality. ''పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి'' అని పురుషసూక్తం. మూడు వంతులు అమృతం ఒక వంతు మృతమని అర్థం వస్తున్నది. పరమాత్మలో మృతమైన భాగం ఉందనే భ్రాంతి ఏర్పడవచ్చు. ఇక్కడ మృతమనేది ఆ అమృతం తాలూకు ఆభాసేగాని appearance వాస్తవం కాదు గనుక మృతత్వదోషం దానికి ప్రాప్తించదు.


అమర్త్య : మర్త్యమంటే మరణించేది. మార్పు చెందేది. మర్త్యం కానిది అమర్త్య. immortal ఎప్పటికీ ఒకే రూపంలో ఉండే కూటస్థ సత్యం. Immutable.


అమర : మరమటే మరణం. మరణం లేనిది అమరం. అవినాశి. Imperishable.  ఆత్మ చైతన్యమని అర్థం.


అమిత : మితం కానిది. మితమంటే ఒక పరిమాణానికి గురి అయినది. measurable. పరిమాణానికి అతీతమైనది అమితం. immesurable.  అనంతమైనది ఆత్మచైతన్యం. కనుక ఆత్మే అమితం.


అమృదిత కషాయ : కషాయమంటే దుష్కర్మ వల్ల ఏర్పడ్డ మనోమాలిన్యం. అది జ్ఞానోదయమైతే కాని మృదితం కాదు. అంటే మర్ధించబడదు. ప్రక్షాళనమై పోదు. ఆత్మజ్ఞానానికి నోచుకోనంతవరకు అది అమృదితమే. నారద మహర్షి ఎన్నో విద్యలలో ఆరితేరాడు. అవన్నీ ఆయనకు మనశ్శాంతి నీయలేదు. చివరకు సనత్కుమారుడి వల్ల బ్రహ్మోపదేశమయిన తరువాతనే ఆయన కషాయం మృదితమై నిర్మలమైన జ్ఞానం ఆయనకు ఉదయించినది. అని ఉపనిషద్‌ వాక్యం.


అముత్ర : ఇహం కానిది. పరం ఈ లోకానికి సంబంధించినది. ఐహికమైతే పరలోకానికి చెందినది. అముత్ర లేదా అముష్మికం.


ఇహాముత్ర ఫలభోగ : ఇహానికి పరానికి సంబంధించిన కర్మఫలాన్ని అనుభవించటం. కర్మ చేసుకొనే కొద్దీ ఫలానుభవం ఇహపరాలలో తప్పనిసరి. ఆధ్యాత్మిక సాధనలో ఇది వాంఛనీయం కాదు. కనుక దీనిఎడల సాధకుడైన వాడు విరక్తి చెందవలసి ఉంది. ఇలాంటి విరాగం సాధన చతుష్టయంలో ఒకానొకటి.


అమూల : మూలమంటే ప్రమాణం. authority source. అలాంటిదేది లేని గ్రంథానికి గాని శాస్త్రజ్ఞుడి మాటకు గాని ప్రామాణ్యం ఏర్పడదు.


అమూర్త : మూర్తం అంటే ఒక ఆకారం ధరించినది formed. అలాంటి ఆకారం ఏదీ లేక నిరాకారమైన తత్త్వమైతే అమూర్తం. Unformed intangible. ఇంద్రియ విషయం కానిది అమూర్తం. చైతన్యమెప్పుడూ నిరాకారం కనుక అది అమూర్తమే. మన స్వరూపమే కనుక అమూర్తమైనా మనకది స్వానుభవమే. మరొక అర్థమేమనగా ప్రకృతి కమూర్తమని, దాని పరిణామమైన ప్రపంచానికి మూర్తమని వ్యవహారం. ప్రాణం మనస్సు కమూర్తమైతే ఇంద్రియ అవయవ ఆత్మకమైన స్థూలశరీరం మూర్తం కిందికి వస్తుంది.


అమేయ : మేయమంటే ఒకప్రమాణంచేత కొలవబడేది measured. దానికి వ్యతిరిక్తమైనది అమేయం. కొలతకు అందనిది. అప్రమేయమని కూడా దీనిని పేర్కొంటారు.


అమోహ : మోహమంటే అజ్ఞానం. దానికి భిన్నమైన ఆత్మజ్ఞానం అమోహం. without illusion.  ఆత్మచైతన్యమని అర్థం.


అమోఘ : మోఘమంటే వ్యర్థం futile. అలాకానిది అమోఘం. సార్థకమని అర్థం. fruitful ప్రయోజనకరమైనది.


అమాత్ర : మాత్ర అంటే కొలత measurement. కొలత లేనిది అమాత్ర. ఓంకారంలోని నాలుగు మాత్రలలో ఇది నాల్గవది. ఇది అమాత్ర అయినప్పుడు ఇది సూచించే ఆత్మతత్వంలో కూడా నాల్గవ పాదం అపాదమే అవుతుంది. ఇది మాత్ర కాదు, అది పాదం కాదు. కనుక చెప్పేది, చెప్పబడేది రెండూ ఏకమై అదే మన స్వరూపంగా అనుభవానికి వస్తుందని మాండూక్యం మనకు చేసే బోధ.


అమానవ : మరణానంతరం ఉపాసకుడు సూక్ష్మశరీరంలో కూర్చుని లోకాంతరాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. కర్మవశాత్తూ చేసే ప్రయాణం కనుక అక్కడ బుద్ధి పనిచేయదు. కనుక మానవుడు కాని మానవాతీతమైన ఒక దేవతామూర్తి అతనిని చేయి పట్టుకొని ఆయా మజిలీలు దాటించి తీసుకుపోతాడని శాస్త్రవచనం. అమానవుడంటే అలాంటి దేవదూత divine body.


అమానిత్వ : అభిమానం కలవాడు మాని. దేహాదులమీదకాని, వస్తువాహనాల మీదగాని అలాంటి అభిమానం తొలగించుకోగలిగితే ఆ గుణానికి అమానిత్వమని పేరు. అంతేకాక నా అంతవాడు లేడని అహంకరించటం కూడా మానిత్వమే. self complacency. అలాంటి దోషం కూడ తొలగిపోతే అమానిత్వం. ఇది జ్ఞానికి ఉండవలసిన దైవగుణాలలో మొదటిది. 'అమానిత్వ మదంభిత్వ'మని గీతా వచనం.


అమూఢ : మూఢుడు కానివాడు. ఆత్మజ్ఞాని realised soul.


అయుతసిద్ధ : ద్రవ్యగుణాదుల కున్న అవినాభావ inseperable సంబంధం. ఒకటి నశించేవరకు మరొకటి దాన్ని అంటిపట్టుకొని ఉంటే అది అయుతసిద్ధ మన్నారు. ద్రవ్యమున్నంతవరకు దాని గుణం దాని క్రియ దానితోనే అవినాభూతంగా inseperable ఉంటుంది. దీనినే సమవాయ సంబంధమంటారు తార్కికులు. తాదాత్మ్య సంబంధమంటారు total identity వేదాంతులు.


అయుక్త : యుక్తం కానిది. హేతువుకు నిలవనిది unresonable. యుక్తి యుక్తం కానిదని అర్థం. మితిమీరినది ఏకాగ్రత లేనిదని కూడా అర్థమే.


అయోగ్య : యోగ్యమంటే అర్హం. ఉచితం. అన్ని విధాల తగినది. అలాంటిది కాకపోతే అయోగ్యం. చెల్లనిదని అర్థం.

Page 12

అద్వైత వేదాంత పరిభాష



అయుగపత్‌ : యుగపత్‌ అంటే ఒకేమారు simultaneous. అలా కాక క్రమంగా చెప్పవలసి వస్తే అది అయుగపత్‌ sequent.


అయౌగపద్య : క్రమంగా ఏర్పడటం sequency.


అయాచిత : కోరబడినది యాచితం. కోరకుండా దానిపాటికది లభిస్తే అయాచితం. ఇలాంటి అన్నపానాదులతోనే జీవయాత్ర సాగించాలి సాధకుడు.


అయత్నసిద్ధ : ఏ ప్రయత్నం లేకుండా ఏర్పడినది. అద్వైత సాధన అలాంటిది. అనులోమంగా సాధించవలసినదేదీ లేదు. కేవలం గుర్తు చేసుకోవటమే. క్రియారూపం కాదది. భావనారూపం.


అరా ఇవ : ఒక చక్రంలో ఇరుసునుంచి పరిధి వరకు ప్రసరించే ఆకులకు అర అని పేరు. అవి ఎంత దూరం వెళ్ళినా ఇరుసులోనే చేరి ఉంటాయి. అదే వాటికి ఆధారం. మూలస్థానం. అలాగే శరీర వ్యాపారాలన్నీ ప్రాణశక్తిలోనే ఇమిడి ఉంటాయి. ప్రాణమే వాటికి ఆధారం. ఆ ప్రాణానికి మరలా ఆధారం ఆహమనే స్ఫురణతో కూడిన ఆత్మస్వరూపమే.


అరతి : రతి అంటే ఆసక్తి. అభిలాష. అలాంటి ఆసక్తి లేకపోవడం అరతి. వైరాగ్యమని అర్థం.dischthment.


అరస : రసమనేది పంచభూతాలలో జలానికున్న గుణం. ఆత్మచైతన్యం అభౌతికం గనుక శబ్దస్పర్శాదులైన గుణాలేవీ దానిని అంటవు. అది అశబ్దం. అస్పర్శం. అరూపం. అరసం.


అరణి : నిప్పు చేసే పరికరాలు. ఒకటి ఉత్తరారణి. చకిముకి రాళ్ళలో పైరాయి మరొకటి అధరారణి క్రింది రాయి. ఈ రెండూ వరపిడి పెడితే నిప్పు పుడుతుంది.


అర్ణ : వర్ణం, అక్షరం letter syllable అని అర్థం. నవార్ణ మంత్రమని ఒక మంత్రముంది. దానిలో తొమ్మిది అక్షరాలు ఉంటాయి. కనుక నవార్ణమని పేరు వచ్చింది దానికి.


అర్థ : శబ్దార్థాలలో రెండవది. చెప్పేది శబ్దం. చెప్పబడేది అర్థం. ఒక పదమొక అర్థాన్ని చెబితే అది పదార్థం. thing and the sound వీటికి పదపదార్థాలని పేరు. మార్జాలమనే మాట శబ్దమైతే sound అది పేర్కొనే జంతువు అర్థం. sense or meaning.అర్ధించబడేదేదో అది అర్థం. ఒక శబ్దం ద్వారా ఏది అర్ధిస్తామో కోరుతామో అది. ఇంతే గాక మానవుడు తన జీవితానికి గమ్యంగా ఏది కోరుకుంటాడో అది కూడా అర్థమే. దీనినే పురుషార్థమని the aim of human life పేర్కొంటారు. ధర్మార్ధకామ మోక్షాలనే నాలుగూ పురుషార్థాలే. అర్థమంటే ప్రయోజనమని కూడా ఒక అర్థం utility. అది ఉంటే ఏ విషయమైనా సార్థకం purposfull. లేకుంటే నిరర్ధకం meaningless useless.


అర్థవాద : 'విధిశేషః అర్ధవాదః' ఒక విషయాన్ని శాస్త్రం విధిస్తూ దానిమీద ప్రరోచన కలిగించటానికి ఒక మాట చెబుతుంది. అది స్తుతి కావచ్చు, నిందకావచ్చు. పరకృతి కావచ్చు. పురాకల్పం కావచ్చు. అంటే దాని గుణాలు ప్రశంసించటం ఒకటి. ఛీ అది మంచిది కాదని త్రోసిపుచ్చటం ఒకటి. పదిమంది ఇది చేసి బాగుపడ్డారని కథ చెప్పటం ఒకటి. ఎప్పటి నుంచో ఉన్నదే అని కల్పించటం ఒకటి. వీటివల్ల అది తప్పకుండా చేసి ఫలితం పొందాలనే ధృఢమైన సంకల్పమేర్పడుతుంది. సాధకుడికి అన్ని విధాలుగా చెప్పటంలో అదే తాత్పర్యం. అంచేత అర్థవాదమంతా నిజం కాదు. నిజాన్ని బయటపెట్టే ఒక పెద్ద సంకేతం. symbal, symbolism or allegorical statement. అది సత్యం కాదు కల్పన. కల్పన అయినా అకల్పితమైన సత్యాన్ని బయటపెట్టి మన దృష్టిని దానివైపు త్రిప్పటానికెంతో తోడ్పడుతుంది. కనుక వాంఛనీయం. మన వాఙ్మయమంతా ఇలాంటి అర్థవాదమే. అసలు భౌతిక ప్రపంచమే ఒక అర్థవాదమంటారు అద్వైతులు.


అర్థక్రియాకారి : అర్థమంటే ఇక్కడ ప్రయోజనం. purpose utility. దానికోసం ఏర్పడిన క్రియ అర్థక్రియ. అది సాధించేవాడు క్రియాకారి. అంటే ఏదో ఒక ఫలితాన్ని సాధించటానికి తోడ్పడాలి. ఏది చెప్పినా దానికేదో ఒక ప్రయోజనముండాలి. అలా కాకపోతే నిష్ప్రయోజన మౌతుందది. అలాంటి దానికి అస్తిత్వం లేదు. ప్రామాణ్యం authority లేదు.


అర్థాపత్తి : ఒక విషయం పైకి చెబుతున్నప్పుడు మరొక విషయం లోపలి నుంచి తొంగి చూడటం అర్థాపత్తి. ఆపత్తి అంటే ప్రాప్తించటం. 'దేవదత్తః పీవరః దివానభుంక్తే', దేవదత్తుడు బలంగా ఉన్నాడు కాని పగలు మాత్రం భోజనం చేయడట. భోజనం చేయకపోతే అంత బలంగా ఎలా ఉండగలిగాడు. తప్పక చేయాలి. ఎప్పుడు? పగలు కాదంటున్నాడు. కాబట్టి రాత్రి కాలం చేస్తూ ఉండాలి వాడు. అయితే ఆ మాట లేదక్కడ. లేకున్నా బలంగా ఉండటమనే విషయం సమర్థించటం కోసమా అర్థం అపన్నం కాక తప్పదు. దీనికే అర్థాపత్తి implication అని పేరు. ఇది ఆరు ప్రమాణాలలో ఒకటి. విశేషరూపంగా మన జ్ఞానమూ, మనం చూచే జ్ఞేయమూ పని చేస్తున్నాయిప్పుడు. ఇది ఉంటే గాని అది లేదు. అది ఉంటే గాని ఇది లేదు. మరెలాగ? వీటి రెంటికీ విలక్షణమైన చైతన్యమనే అధిష్ఠానమొకటి ఉండాలని దీన్నిబట్టే అర్థమౌతుంది. ఇదే అద్వైతుల అర్థాపత్తి అనుకోవచ్చు.


అరిషడ్వర్గ : షడ్వర్గమంటే ఆరింటి సమూహం. ఈ ఆరూ ఒకదానికొకటి అనుకూలమైనా మానవుడికి ప్రతికూలం నుక అరులు అంటే శత్రువులే. ఆరుగురు శత్రువులున్నారు మన శరీరంలో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే ఈ ఆరు భావాలే మన శరీరంలో దాగిఉన్న అంతశ్శత్రువులు. శరీరమంటే స్థూలం కాదు. సూక్ష్మశరీరమైన మనస్సు అని అర్థం. ఈ అరిషడ్వర్గం మనస్సుకు పట్టిన వ్యాధి. దీన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించినవాడే గొప్ప సాధకుడు.


అరిష్ట : రిష్టమంటే భగ్నం. అరిష్టమంటే భగ్నం కానిది. చెక్కుచెదరనిది broken. శుభమని అర్థం. రిష్టమంటే అశుభమని కూడా అర్థమున్నది. అశుభంకానిది అరిష్టం. అంటే శుభమని మరలా అర్థం వస్తున్నది.


అరిష్టనేమి : నేమి అంటే చక్రం. భగ్నం కాకుండా దెబ్బ తినకుండా చక్కగా తిరిగే చక్రం. లాక్షణికమైన అర్థంలో ప్రాణశక్తి. చక్రాకారంగా అది సంచరిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ విచ్ఛిన్నంకాదు, అందుకే ఉచ్ఛ్వాసనిశ్శ్వాస రూపంగా నడుస్తున్న ప్రాణవాయువే. అరిష్టనేమి. 'స్వస్తినః స్తార్ష్యః అరిష్టనేమిః' అనే శాంతి వాక్యంలో తార్యుడంటే గరుత్మంతుడు. రెండు రెక్కలున్నవాడు. ఉచ్వాస నిశ్వాసాలే ఆ రెక్కలు అవి కల ప్రాణవాయువే గరుత్మంతుడని అంతరార్థం.


అరూప : రూపంలేనిది without form నిరాకారమైన ఆత్మతత్త్వమని అర్థం.


అర్ధజరతీయ : అర్ధమంటే సగం జరతీ అంటే ముసలితనం కలిగిన వ్యక్తి. సగం తలనరసి సగం నరవని వ్యక్తి ఎవడో అలాంటి వాడికి అర్థజరతీయుడనిపేరు. ఇది వాచ్యార్థమైతే దీనికి లక్ష్యార్థం వేరే ఉంది. కొంత అటు కొంత ఇటు వాదిస్తే అది పూర్తిగా దేన్నీ సాధించదు. అలాంటి వాదానికి అర్థజరతీయమని పేరు పెట్టారు.


అర్థార్థిభావ : అనుకూలమైనది అర్థం. దాన్ని కోరే వ్యక్తి అర్థి. ఇరువురికీ ఉన్న సంబంధం అర్థార్థిభావం. మోక్షమర్థమైతే ముముక్షువైనవాడు అర్థి. సాధనచేసి పొందగలిగితే అదే జీవిత పరమార్థం.


అర్థానర్థౌ : అనుకూల ప్రతికూలాలైన భావాలు. వీటికే ద్వంద్వాలని పేరు. సంసారమంతా ద్వంద్వమయమే. దీనిని తప్పించుకొని బయట పడడమే మానవుడి కర్తవ్యం.


అర్థాంతర : ప్రస్తుత విషయం కాక దీనికన్యమైన విషయం. ఒక శబ్దానికి ఒక అర్థం మాత్రమేగాక దానికి మరొక అర్థం కూడా చెప్పగలిగితే అర్థాంతరం.


అర్థక్రమ : శబ్దాన్ని మాత్రమే గాక అర్థాన్నిబట్టి కూడా క్రమం మార్చి చెప్పటానికి అర్థక్రమమని పేరు. 'చేలాజిన కుశోత్తరం' అనే గీతా వాక్యంలో కుశ అజిన చేలములనే క్రమంలో అర్థం చెప్పవలసి ఉంటుంది. శబ్దక్రమంలో చెప్పరాదు.


అర్థప్రాప్త : అన్న మాటను బట్టే ఒకరు చెప్పకుండానే అర్థం తెలిసిపోతే అది అర్థప్రాప్తం. Understood.


అర్భకౌకః : అర్భకమంటే చిన్నది, అల్పమని అర్థం. ఓకస్‌ అంటే స్థానం. చాలా పరిమితమైన ప్రదేశమని అర్థం. మానవుడి హృదయం. పరిమితమైన ఆ ఉపాధిలోనే పరమాత్మ అభివ్యక్తమైనాడు గనుక తద్ద్వారానే సాధకుడు గ్రహించవలసి ఉంది.


అయన : పొందటం. ప్రాప్తి Approach. జీవుడికి కలిగే బ్రహ్మ ప్రాప్తి లేదా సాయుజ్యం. జ్ఞానం తప్ప దానికి వేరే సాధనం లేదు. నాన్యః పంథా విద్యతే అయనాయ.


అర్చిరాదిమార్గ : ధూమమార్గానికి వ్యతిరిక్తమైనది. కర్మిష్ఠులు మరణానంతరం ధూమమార్గంలో పితృలోకానికి వెళితే ఉపాసకులు అర్చిరాది మార్గంలో దేవలోకాలకు వెళుతారట. అర్చిస్సు అంటే అగ్నిజ్వాల. అది దారి చూపుతుంటే పయనిస్తారు గనుక దానికా పేరు వచ్చింది. దేవయానమని భావం.


అర్చావతార : పాంచరాత్రులు చెప్పే నాలుగు భగవత్‌ వ్యూహాలలో ఇది నాలుగవది. భగవానుడు వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలలో కనిపించకుండా భక్తులకు దూరమైన విగ్రహరూపంగా బయటపడి సర్వత్రా సాక్షాత్కరిస్తూనే ఉంటాడు. భయంలేదు. భక్తుడు సులభంగా దర్శించవచ్చు. అర్చించవచ్చు. ఇదే అర్చావతారం.

Page 13

అద్వైత వేదాంత పరిభాష



అర్జున : తెల్లనిదని శబ్దార్థం. శుద్ధమైన మనస్సుకు ఇది సంకేతం. 'ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే' అని గీత చెప్పిన మాట. అన్ని హృదయాలలో సమానంగా ఉన్నా అర్జునమైన అనగా శుద్ధమైన మనస్సుకే అది భాసిస్తుందని ఇందులో అంతరార్థం.


అలక్షణ : లక్షణం లేదా నిర్వచనం చెప్పటానికి వీలులేనిది. ఏ గుణమూ లేని పదార్థం. బ్రహ్మతత్త్వం.


అలాతశాంతి : అలాతమంటే కొరవి. అది త్రిప్పుతూపోతే మండలాకారంగా తిరుగుతుంది. నిలువుగా ఆడిస్తే రేఖాకారం. సగం తిప్పితే అర్ధచంద్రాకారం. ఇప్పుడీ ఆకారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కొరవిలోనుంచే. ఏమైపోతాయి చివరకు? కొరవిలోనే. అలాగే పరస్పర విరుద్ధ మతాలన్నీ అద్వైతంలోనుంచే వచ్చి అద్వైతంలోనే సమసిపోతాయి. దానికేదీ విరుద్ధంకాదు. అవి తమలో తాము విరుద్ధమైనా దాని కవిరుద్ధమే. అక్కడ అన్నీ శాంతించవలసిందే అని తాత్పర్యం. గౌడపాదులవారి మాండూక్యకారికా గ్రంథంలో ఇది నాల్గవ ప్రకరణం. ఇలాటి సమన్వయమే మనమక్కడ చూడగలం.


అలింగ : లింగమంటే చిహ్నం. గుర్తు. Token Indication. అది లేకుంటే అలింగం. ఒక భావాన్ని గుర్తించటానికి ఆధారం లేకపోవటం. బ్రహ్మతత్త్వం అలాంటిది. సన్యాసంలో ఇది ఒక తెగ. కాషాయ కమండల్వాది చిహ్నాలేవీ లేని పరమార్థ సన్యాసం. అనుమాన ప్రమాణంలో హేతువు చూపకుండా చేసిన ప్రతిజ్ఞ కూడా అలింగమే. లింగమంటే హేతువని అర్థం. అగ్నికి ధూమం లింగం.


అవక్రచేతాః : వక్రంగాని జ్ఞానం. సంపూర్ణమైన జ్ఞానమని అర్థం. అది ఏదో కాదు. పరమాత్మ స్వరూపం. అది సర్వవ్యాపకం. పరిపూర్ణం గనుక పరిమితత్వమనే దోషం లేదు దానికి.


అవకాశ : ఒక సిద్ధాంతం ప్రవర్తించటానికి ఒక మాట చెప్పటానికి వీలుపడటం scope. అలాగే ఆకాశానికి కూడా అవకాశమని పేరు. ఖాళీ అని అర్థం.


అవగమ/అవగతి : గ్రహించటం. తెలుసుకోవటం. జ్ఞానం. జ్ఞానమేగాక అనుభవమని కూడా Realisation అర్థముంది. ప్రత్యక్షావగమమని గీతా ప్రయోగం. బ్రహ్మావగతి అంటే బ్రహ్మానుభవం. ఇది ఆత్మస్వరూపమే గనుక సాక్షాత్తుగానే అనుభవానికి వస్తుందని పెద్దల హామీ.


అవచ్ఛేద : ఒకచోటికి తెగిపోవటం. పరిచ్ఛిన్నం లేదా పరిమితం కావటం Limitation. ఇది ఇంత అని పరిగణించటం.


అవతార : క్రిందికి దిగిరావటమని అర్థం. అవరోహణమని కూడా అనవచ్చు. descent. భగవత్‌ చైతన్యం ఆయా రూపాలలో అప్పుడప్పుడు వచ్చి సాక్షాత్కరించటం అని భావం. అంతేగాక ఒకవిషయంలో ప్రవేశించటం కూడా అవతారం లేదా అవతారిక Introduction.


అవధాన : Attention. concentration.ఒకదానిమీద దృష్టి పెట్టటం. జాగ్రత్త వహించటం.


అవధారణ : Only. అదేకాని మరొకటి కాదని నిర్థారణ చేయటం. Determination. ఈ అర్థంలో ప్రయోగించేదే ఏవ అనే శబ్దం. 'ఆత్మైవనాన్యత్‌.' ఆత్మే మరేదీ లేదు. ఇది ఇలాగే, ఇంతే అని నిష్కర్ష చేసే మాట ఇది.


అవధి : పర్యంతం. Boundary. Limit. కొస, చివర, మరణావధి. మరణం వరకు 'ఆ బ్రహ్మ భవనాత్‌' అన్నప్పుడు ఆ అనే మాట అవధిని చూపుతుంది. బ్రహ్మలోకం వరకూ అని అర్థం.


అవదాత : తెల్లనిది. స్వచ్ఛమైనది. అంతేకాదు. నిర్దుష్టమని కూడా అర్థమే.


అవదాన : యజ్ఞంలో మేధ్యమైన పశువును చంపి దాని శరీరంలోని భాగాలను ఒకక్రమంలో బయట పెట్టటం.


అవరోధ : ప్రతిబంధం Obstruction. ప్రతిరోధమని కూడా దీనికి పర్యాయమే.


అవభాస : వస్తువు మరొక రూపంలో కనపడటం. Appearance. రజ్జు సర్ప దృష్టాంతంలో రజ్జువే సర్పరూపంలో భాసిస్తున్నది. సర్పమక్కడ అవభాస. లేదా ఆభాస. పరమాత్మ ప్రపంచంగా కనపడటం కూడా ఇలాంటివే.


అవశేష/అవశిష్ట : మిగిలిపోవటం. అన్నీ బాధితమైపోగా చివరకేది మిగిలి ఉంటుందో Residue. అది అవశిష్టం. అబాధితమైన ఆత్మస్వరూపమే అది.


అవయవ : శరీరంలో భాగం. కరచరణాదులు Limbs.. కేవలం భాగమని కూడా Part అర్థమే. సమష్టిలో whole దాని వ్యష్టి part  కి అవయవమని పేరు. తర్కంలో పంచావయవ వాక్యమని ఉంది. sylogism అని పాశ్చాత్య తర్కంలోమాట. ఇందులో ఐదు అవయవాలు లేదా భాగాలు ఉంటాయి. 1. ప్రతిజ్ఞ 2. హేతువు 3. దృష్టాంతం 4. ఉపనయం 5. నిగమనం. హేతువాదమంతా ఈ రూపంగానే సాగిపోవాలని తార్కికుల ఆదేశం. Argumentation.


అవలంబ/అవష్టంభ : ఒక ఆధారం.  prop. support. Base.


అవసర : అవకాశం Occasion. తగిన సమయం. సందర్భం context అని అర్థం.


అవసాన : చివరి దశ. అంతం. ఒకచోట ఆగిపోవటం. జీవితంలో వార్థక్యం తరువాత వచ్చే ఆఖరి దశ.


అవస్థా/అవస్థాన : నిలిచిపోవటం. నిలకడ చెందటం. settlement. కదలకుండా ఉండటం స్థిరత్వమని కూడా అర్థమే.


అవస్థాత్రయ : ప్రతిదినమూ మన మనుభవించే జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు మూడూ అవస్థలే. దశలే. దీనికే అవస్థాత్రయమని పేరు.


అవాంతర వాక్య : ఒక పెద్ద వాక్యంలో చేరిపోయినది. మధ్యలో వచ్చే చిన్న వాక్యం. subsidiary. ఉపనిషత్తులో ఉపదేశించే వాక్యాలు రెండు విధాలు. 1. మహావాక్యం. తత్వమసి మొదలైనవి. జీవబ్రహ్మ ఐక్యాన్ని చెప్పే వాక్యాలన్నీ మహావాక్యాలు. పోతే అలాంటి వాక్యార్థాన్ని ఒక్కసారిగా గుర్తించలేని మధ్యమ మందాధికారులకు తత్‌, త్వమ్‌, అసి అనే పదార్థాల జ్ఞానం ముందుగా ఏర్పడవలసిన అవసరముంది. ఖండరూపమైన ఈ పదార్థ జ్ఞానమే అఖండ రూపమైన మహా వాక్యార్థానికి దారి తీస్తుంది. సృష్టి స్థితి లయాది వర్ణన జీవుని ప్రవేశ వర్ణన ఇలాంటి పదార్థ బోధే. ఇది సవికల్పమైన Analysis అర్థాన్ని చెబితే వాక్యార్థం నిర్వికల్పమైన synthesis అర్థాన్ని మనకు బోధిస్తుంది.


అవాఙ్మానసగోచర : వాక్కుకు, మనసుకు కూడా గోచరించనిది. అందరానిది. నిరాకారమైన సర్వవ్యాపకమైన ఆత్మతత్వం.


అవాచ్య : వాచ్యంకానిది. చెప్పటానికి శక్యం కానిది. ఆత్మతత్వం. అది సాక్షాత్తుగా ఫలానా అని చెప్పలేము. పరోక్షంగా సూచించవలసిందే. అనగా లక్ష్యమని అర్థం.


అవాక్యార్థ : పదార్థ వాక్యార్థాల జ్ఞానం కేవలం పరోక్షమే. అపరోక్షం కాదు. అందులో శబ్దాకార వృత్తి ఇంకా మిగిలి ఉంటుంది. అది కూడా దాటి బ్రహ్మాకార వృత్తి మాత్రమే ఉండిపోవాలి. అప్పుడే దానికి పరోక్షత్వం తొలగిపోయి అపరోక్ష మవుతుంది. అదే అనుభవం. ఇందులో శబ్ధార్థాల తాలూకు ఆలోచన ఉండదు. కేవలం ఆత్మ జ్ఞానమే అది. దీనికే అవాక్యార్థమని పేరు.


అవిషయ : జ్ఞానానికి విషయం కానిది. గోచరం కానిది. విషయం కాకపోతే దానికి విషయి అని పేరు. అది ఒక్క ఆత్మచైతన్యమే. అది ఎప్పుడూ జ్ఞానస్వరూపమే కనుక విషయియే కాని విషయం కాదు. అవిషయమే Subject.


అవిగీత : విగీతం కానిది. విగీతమంటే పరస్పర విరుద్ధం. అలాకాక అవిరుద్ధమైతే అవిగీతం. metaphorical.


అశనాయా : ఆహారానికి అశనమని పేరు. అది జీర్ణమైన తరువాత ద్రవంగా మార్చి రక్తంలో చేరుస్తుంది. ప్రాణశక్తి. అశనాన్ని నయనం చేస్తుంది కనుక అశనాయ అని పేరు వచ్చింది. నయమైన తరువాత మరలా ఆకలి ఏర్పడుతుంది కనుక అశనాయా అంటే ఆకలి అని అర్థం.


అవాచ్యార్థ : వాచ్యార్థం కానిది. సూటిగా గాక చాటుమాటుగా సూచించ వలసినది. లక్ష్యార్థమని metaphorical భావం.


అవ్యయ : వ్యయమంటే ఖర్చు. మార్పు. మార్పులేని పదార్థమేదో అది అవ్యయం. భగవత్‌తత్త్వం నామరూపాత్మకం కాదు కనుక దానికెలాంటి మార్పులేదు. కూటస్థ సత్యం. eternal truth.


అవ్యభిచార : వ్యభిచారమనగా తప్పిపోవటం, చలించటం, మారటం. ప్రాపంచికమైన ప్రతి పదార్థమూ చలిస్తూ పోయేదే. Mutable. అచలమైన దేదీ లేదు. అది ఒక ఆత్మతత్త్వమే. కనుక అది ఒక్కటే అవ్యభిచారి. ఏకరూపంగా ఎప్పుడూ స్థిరంగా ఉండేదని భావం.

Page 14

అద్వైత వేదాంత పరిభాష



అవికార/అవికృత : వికారమంటే మార్పు. వికారంలేని ఆత్మచైతన్యమే సరాసరి వచ్చి మానవ హృదయంలో ప్రవేశించిందని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి జీవసృష్టి వికృతం కాదు. అవికృతం. పోతే ప్రపంచ సృష్టి మాత్రం వికృతమే. అంటే చైతన్యం గుప్తమై నామరూపాలుగా మారి కనిపిస్తున్నది అని అర్థం.


అవితథ : వితథమంటే వ్యర్థం. వ్యర్థం కానిది అవితథం. సార్థకమని భావం. purposeful అనృతానికి కూడా వితథమని పేరు. పోతే వితథం కానిది సత్యం గనుక సత్య మవితథం.


అవిద్యా : విద్య కానిది. విద్య అంటే జ్ఞానం. ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం. లేదా ఆత్మజ్ఞానం. అది కాదంటే అర్థం అజ్ఞానమని. మనకున్న జ్ఞానమంతా విశేష జ్ఞానమే. ఇది సమస్యకు పరిష్కారం కాదు. కనుక దీనికి విద్య అని, జ్ఞానమని పేరు పెట్టలేదు వేదాంతులు. వారు దీనిని అవిద్య అనే పేర్కొన్నారు. వేదవాఙ్మయం మొదలు ఇప్పటి భౌతిక విద్యలవరకు అంతా అవిద్యే. Nescience. 'విద్యతే అస్తి.' ఏది ఉందో అది 'న విద్యతే నాస్తి' ఏది లేదో అది. అప్పటికి అవిద్య అంటే అభావం Absence. దేని అభావం ఉన్నట్టు ఏది కనిపిస్తున్నదో దాని అభావం. అదే ఈ ప్రపంచం. ఇది ప్రతీతి సిద్ధమేగానీ వస్తు సిద్ధం కాదంటారు అద్వైతులు. ఆత్మజ్ఞానం ఎప్పుడూ ఉంది. అయినా మనకది లేనట్టు తోస్తున్నది. ఇదే అవిద్య. పరమాత్మ కిది విద్య. జీవాత్మకు అవిద్య.


అవిద్యాకామకర్మ : అవిద్య అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం. దానివల్ల అనాత్మ ప్రపంచమొకటి కనిపిస్తూ ఉండటంచేత మానవుడికి ఈ ప్రపంచంమీద కామమేర్పడుతుంది. కామ్యమైన వస్తువును పొందడానికి కర్మ చేయవలసి వస్తుంది. కర్మ ఫలాన్ని అందిస్తుంది. ఇదే సంసార బంధం. కనుక బంధానికి కారణభూతమైన అనర్థాలివి మూడు. వీటికే వేదాంతులు పాపాలని, పాతకాలని పేరు పెట్టారు. 'సర్వపాపేభ్యో మోక్షయిష్యామి' అని గీతావచనం. పాపమంటే పడగొట్టేదని అర్థం. ఇందులో అవిద్యే కారణ శరీరం. కామం సూక్ష్మశరీరం. కర్మ స్థూల శరీరం. శరీర త్రయం కూడా వీటివల్లనే సంక్రమించింది. ఇవి మూడూ తొలగిపోతే కాని మోక్షప్రాప్తి లేదు మానవుడికి.


అవినాభావ : వినాభావమంటే వేరుగా ఉండటం. separation. వేరుగా కాక రెండు భావాలు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉంటే అవినాభావం Inseparability. కార్యకారణాలకు ఉండే సంబంధం ఇలాంటిదే. మృత్తికా ఘటాదులన్నీ దీనికి ఉదాహరణలే.


అవిభక్త : విభక్తం కానిది. Undividedt. నామరూపాలకూ, పరమాత్మకూ రెండింటికీ విభాగం లేదు. రెండూ అవిభక్త దేశకాలాలంటారు భగవత్పాదులు. సర్వత్రా సచ్చిత్తులు వ్యాపించే ఉన్నాయి. ప్రతి నామమూ, రూపమూ సచ్చిన్మయమే. ఒకదానికొకటి దూరంగా లేవు. దూరమైతే నామరూపాల కస్తిత్వం లేదు.


అవిరోధ : విరోధం లేకపోవటం. Disagreement. తేడాగాని, పేచీగాని లేకుండా రెండూ సమన్వయమైతే అది అవిరోధం. శుద్ధచైతన్యానికి ఈ ప్రపంచంతో గానీ, జీవులతోగానీ వైరుధ్యం ఏ మాత్రమూ లేదు. అధిష్ఠాన రూపంగా అది సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు విరోధానికి అవకాశమేముంది? బ్రహ్మసూత్రాలలో అవిరోధ పాదమని ఒక అధ్యాయముంది. అద్వైతానికి మిగతా మతాలేవీ విరుద్ధం కావు. అవి నదులైతే ఇది సముద్రం. అన్నీ ఇందులో సమసి పోవలసిందే అని బాదరాయణుల మాట. అంతేగాక కార్యరూపంగా కనపడే సృష్టి అంతా మూలకారణమైన పరమాత్మకంటే విరుద్ధం కాదు. అవిరుద్ధమే అని నిరూపించారు.


అవివేక/అవివిక్త : రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి పెనవేసుకోవటం. వేరుగా ఉన్నప్పటికీ ఏకరూపంగా కలిసిపోవటం. పాలలో నీరు కలిసి ఉన్నా అవి రెండూ పరస్పర భిన్నమైన పదార్థాలే. అయినా అభిన్నంగా కనబడుతుంటాయి. వేరు గావనే భావం మన కేర్పడుతుంటుంది. ఇదే అవివేకం. ఇలాగే పరమాత్మ, ప్రపంచం రెండూ ఏకమైపోయి ఏది సచ్చిద్రూపమైన భగవత్తత్వమో ఈ నామ రూపాలలో నుంచి వేరు చేయలేక భ్రమపడుతున్నాము. ఇదే మానవుడి అవివేకం.


అవిశేష/అవిశిష్ట : విశేషమంటే తేడా. Difference. తేడా చూడకపోతే అవిశేషం. ఒక్కటేనని అర్థం. విశేషమంటే గుణం కూడా. Quality Attribute. గుణమేదీ లేకపోతే అవిశేషం. Substance without property.  విశేషమంటే ఫలానా అని వ్యష్టిగా particular చూడటం. అలాకాక సమష్టిగా general చూస్తే అది అవిశేషం. సామాన్యం. విశేషమంటే విభాగం. వేరనే భావం. అలా కాకుంటే అవిశేషం. ఏకత్వం అని అర్థం. అలాంటి పదార్థం ఏదో అది అవిశిష్టం. సామాన్య రూపమైన ఆత్మతత్వం.


అవేక్షణ : క్రిందికి చూడటమని శబ్దార్థం. బాగా లోతుకు దిగి చూడటమని భావార్థం. 'జ్ఞానం సమ్యగవేక్షణం' అని పెద్దల మాట. Knowledge is right vision.


అవ్యక్త/అవ్యాకృత : వ్యక్తం కానిది. బయటపడి కనపడనిది. Unformed. Abstract. వ్యాకృతం కానిది. విస్తరించబడనిది. ప్రపంచానికీ పరమాత్మకూ నడుమనున్న ప్రకృతి లేదా మాయాశక్తి. ఇది పరమాత్మ శక్తే గనుక నిరాకారం. స్వతహాగా వ్యక్తం కాదు. అవ్యక్తం. వ్యాకృతం కాదు. అవ్యాకృతం. Unformed. Abstract. అదే పరమాత్మ ఇచ్ఛను బట్టి నామరూపాత్మకంగా పరిణమిస్తే ఈ ప్రపంచం. పరమాత్మను ప్రపంచంగా చూపేది ఈ అవ్యక్తమైన మూలప్రకృతే. Premordial matter. Cosmic Power. సాంఖ్యులు దీనికి ప్రధానమని పేరు పెట్టారు. వారు ఇదే స్వతంత్రమైన పదార్థమంటారు. కానీ అద్వైతులిది అంగీకరించరు. ఇది స్వతంత్రం కాదు. ఈశ్వర ప్రకృతే. ఆయన నాశ్రయించిన శక్తేనని సిద్ధాంతం చేశారు.


అవ్యవహిత : వ్యవహితమంటే ఒక పదార్థానికి దూరమైపోవటం. మధ్యలో ఏదైనా అడ్డు తగిలినప్పుడే అది జరుగుతుంది. దానికే ఉపాధి అని పేరు. Medium లోకంలోని పదార్థాలన్నీ ఒకదానికొకటి అడ్డు తగిలేవే. వ్యవహితమే. కాని పరమాత్మ సర్వవ్యాపకం గనుక అది ఎప్పుడూ అవ్యవహితం.


అవ్యవస్థిత : వ్యవస్థితమంటే వ్యభిచరించకుండా స్థిరంగా ఉన్నది. Stable అలా స్థిరంగా లేక ఎప్పటికప్పుడు చలిస్తూ పోతే అవ్యవస్థితం. నిలకడ లేనిది.


అవ్యాజ : వ్యాజమంటే నెపం. ఒక నిమిత్తం. అది లేకుంటే అవ్యాజం. సహజమని అర్థం. Natural.


అవ్యాప్తి : తర్కంలో ఇది ఒక దోషం. చెప్పిన లక్షణం అన్నిచోట్లా వర్తించక కొన్నిచోట్ల మాత్రమే వర్తించటం. వేదాంతంలో అవ్యాప్తి అంటే సర్వత్రా వ్యాపించక ఎక్కడికక్కడ ఆగిపోవటం. సత్‌చిత్తులు అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నాయి. కానీ నామరూపాలు ఎక్కడికక్కడే తెగిపోతుంటాయి. కనుక వాటికి వ్యాప్తి లేదు. వ్యాప్యమే.


అశబ్ద : శబ్దం కానిది. శబ్దాని కతీతమైనది. అంటే మాటల కందనిది. పరమాత్మ స్వరూపం. శబ్దమంటే శబ్ద ప్రమాణం. శాస్త్రం. అశబ్దమంటే శాస్త్ర ప్రమాణానికి విరుద్ధమైన సిద్ధాంతం.


అశ్వత్థ : రావిచెట్టు. లాక్షణికంగా సంసారం. శ్వః అంటే రేపు. స్థ అంటే ఉండటం. రేపటికి కూడా ఉండనిది. అంత క్షణభంగురమీ సంసారమని భావం.


అశివ : శివమంటే సత్యమైనది. హితమైనది. ఆత్మస్వరూపం. దానికి భిన్నంగా చూచేదంతా అశివమే. అంటే అనర్థదాయకం. అదే ఈ సంసారం.


అశరీర : శరీరం లేనిది. ఉన్నా దానితో సంసర్గం లేనిది. శరీరమే నేననే అభిమానం లేనిది. ఆత్మచైతన్యం. అది అశరీరం. మోక్షమని అర్థం. జీవన్ముక్తుడు కూడా శరీరాన్ని తానుగా భావించడు. గనుక వాడూ అశరీరుడే. ముక్తుడే.


అశుద్ధ : శుద్ధం కానిది. మలినమైనదని అర్థం. ఉపాధులే అశుద్ధి. గుణాలే అశుద్ధి. ఇలాటి ఉపాధులు లేని నిర్గుణమాత్మతత్త్వం. అదే శుద్ధం. గుణాత్మకమైన ఈ ప్రపంచమంతా అశుద్ధమే.


అశాంత : ఏ వికల్పాలు ఉన్నా ఆ మనస్సు శాంతమైనది కాదు. ఆయా వృత్తులు లేనప్పుడే శాంతం. వృత్తులు పోయినా వాసనలుంటాయి సుషుప్తిలో. అవికూడా పోనంతవరకూ సాధకుడి మనస్సు అశాంతమే.


అశోచ్య : ఆత్మరూపంగా చూస్తే ప్రపంచంలో ఏదీ శోచ్యంకాదు. అంటే శోకించవలసిన పనిలేదు. అంతా అశోచ్యమే.


అష్టమూర్తి : ఎనిమిది మూర్తులు లేదా రూపాలు ధరించిన వాడని అర్థం. దక్షిణామూర్తి అయిన పరమాత్మ కష్టమూర్తి అని పేరు. ఆ ఎనిమిదీ పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ప్రపంచమంతా అష్టమూర్త్త్యాత్మకమే. ఈ మూర్తులు ప్రపంచానివి కావు. పరమాత్మవి. అమూర్తమైన పరతత్త్వమే మూర్తమై ప్రపంచంగా భాసిస్తున్నదని గదా సిద్ధాంతం.


అష్టాంగయోగ : ఎనిమిది అంగములతో, భూమికలతో కూడిన సమాధి యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధులు. ఈ ఎనిమిదింటికీ అష్టాంగములని పేరు. ఇందులో మొదటి ఐదు బహిరంగ యోగం. మిగతా మూడు అంతరంగ యోగమని పతంజలి చెప్పినమాట.

Page 15

అద్వైత వేదాంత పరిభాష



అసంశయ : సందేహం లేనిది. నిశ్చయం. శ్రవణానంతరం ఆత్మవిషయంలో దానికీ ప్రపంచానికీ సంబంధమేమిటని ఎన్నో సందేహాలు ఏర్పడవచ్చు. మననంతో అవి నివృత్తి కావలసి ఉంది. తరువాతనే నిశ్చయాత్మకమైన జ్ఞానం కలుగుతుంది. Conviction. అప్పటికీ మరణ సమయంలో తరువాత ఏమై పోతామో అనే సందేహం ఏర్పడవచ్చు. అదికూడా అక్కర లేదన్నాడు గీతాచార్యుడు. మరుజన్మలో ఈ కృషి తప్పక ఫలిస్తుందని హామీ ఇచ్చారు. కనుక సాధన మార్గంలో సంశయం గర్భశత్రువు. అది ఆత్మజ్ఞానంతోనే సమసిపోవాలి. 'ఛిద్యంతే సర్వసంశయాః' అన్ని సంశయాలూ అసంశయమైన జ్ఞానంగా అనుభవానికి వస్తాయి.


అసంసారి : త్రిగుణాత్మకమైన సంసారంతో సంబంధంలేని సిద్ధపురుషుడు లేదా జీవన్ముక్తుడు. పరమాత్మ నిత్య ముక్తుడు కనుక ఎప్పుడూ సంసారం లేదాయనకు. అసంసారియే.


అసక్త : సంసార బంధంలో సక్తుడు గానివాడు. చిక్కుపడని వాడు tached person Liberated soul.


అసంగత : సంగతం కానిది. సంబంధం లేనిది. Unconnected. హేతువుకు నిలవనిది. Incoherent.

అసంహత : సంహతం గానిది. సంహతమంటే పోగైన పదార్థం. పోగైతే దానికి నామరూపాలేర్పడతాయి. పోగు కాకపోతే అది నిరాకారం. Unconstituted. కేవల చైతన్య స్వరూపం. అదే ఆత్మ. పోతే అది కాని అనాత్మ ప్రపంచమంతా సంహతమే. Formed సంహతమెప్పుడూ అసంహతం కోసమే Unformed ఉంటుంది. దానినే మనకు సూచిస్తుంటుంది.Indicator. అందుకే అన్మాత ద్వారా ఆత్మను పట్టుకోవాలని చెప్పటం.


అసత్‌/అసత్య : సత్‌ అంటే ఉన్నది. అసత్‌ అంటే లేనిది. అసత్యమన్నా ఇదే అర్థం. ఆత్మ సత్యమైన పదార్థం. Real. ఎందుకంటే అది స్వతః ప్రమాణం. మిగతా ప్రపంచమంతా, తద్రూపమంతా తద్రూపంగా చూస్తే సత్యం. చూడకపోతే అసత్యం.Unreal.


అసంభవ : ఏది ప్రమాణానికి నిలుస్తుందో అది సంభవం. Possible. ఏది నిలవదో అది అసంభవం. Impossible. Untenable.


అసంభావనా : సంభవం కాదేమోనని సందేహించటం. అభావనా, అసంభావనా, విపరీతభావనా అని మూడున్నాయి భావనలు. అందులో రెండవది. అసలు గుర్తించకపోవటం మొదటిది. గుర్తించినా నిలుస్తుందా లేదా అని సందేహించటం రెండవది. అది ఒకలాగా ఉంటే మరొకలాగా చూడటం మూడవది. ఆత్మ విషయంలో ఇవి మూడూ కలుగుతాయి మానవుడికి. మూడింటికీ శ్రవణ, మనన, నిది, ధ్యాసలనేవి క్రమంగా పరిష్కారాలు.


అసాధారణ : ఒకే లక్షణం రెండింటికీ వర్తిస్తే అది సాధారణం. Common అలా వర్తించక దేనిపాటికది అయితే అసాధారణం. చైతన్య మాత్మకు అసాధారణం. Unique అది అనాత్మకు లేదు. అనాత్మకు నామరూపాలు అసాధారణం. అవి చైతన్యానికి లేవు.


అసిద్ధ : ఏదో ఒక ప్రమాణానికి విషయమైతే అది సిద్ధం. ఏ ప్రమాణానికీ గోచరించకపోతే అసిద్ధం Untenable.


అస్తి : ఉన్నది అని అర్థం. అస్తి భాతి అనేవి రెండూ ఆత్మ లక్షణాలు. అది ఉన్నది ఉన్నట్టు స్ఫురిస్తున్నదని అర్థం. ప్రతి ఒక్కటీ లోకంలో ఉందంటాము. ఉందని భావిస్తాము. అంచేత అస్తి భాతి అవి రెండూ సర్వవ్యాపకాలు. అవే ఆత్మస్వరూపం.


అస్తిత్వ : ఉనికి. ఉండటం. Existance. Presence.


అస్థాన : స్థానం కానిది.Out of place. సందర్భం లేనిది Out of context.


అస్పర్శయోగ : దేనితోనూ స్పర్శ అనగా సంబంధం లేనిది. ఆత్మస్వరూపం. దాన్ని గూర్చిన అనుసంధానం అస్పర్శయోగం. మామూలు పాతంజల యోగం లాంటిది కాదిది. ఇందులో ధ్యాత ధ్యేయం ధ్యానమనే త్రిపుటి లేదు. మూడూ కలిసి ఆత్మ స్వరూపమే. కనుక ఏదీ దానినంటదు. అది అస్పర్శమే.


అస్మితా : దేహాదులను నేను అని ఉపాధులతో తాదాత్మ్యం చెందటం. పతంజలి చెప్పిన ఐదు క్లేశాలలో ఇది రెండవది. అవిద్యా, అస్మితా, రాగ, ద్వేష, అభినివేశాలని అవి ఐదు. ఒకదానికొకటి హేతు హేతుమద్భావం చెంది ఇవి ఐదూ మానవుణ్ణి కట్టివేసే పాశాలై కూచున్నాయి.


అస్మత్‌ ప్రత్యయ : నేను అనే ప్రజ్ఞ. భావన. చిత్తవృత్తి Idea of myself. ఆత్మ ఎప్పుడూ ఇలాంటి ప్రత్యయానికే గోచరిస్తుంది. ఆత్మాకార వృత్తియని దీనికి నామాంతరం.


అస్వస్థ : 'స్వస్మిన్‌ తిష్ఠతి ఇతి స్వస్థః' తనలో తాను నిలకడగా ఉంటే స్వస్థ. Self contained. అలా కాకుంటే అస్వస్థ. మనం మన ఆత్మస్వరూపంలోనే లేమిప్పుడు. అనాత్మ జగత్తులో తొంగిచూచి అదే నేనని ఎక్కడికక్కడ తాదాత్మ్యం Identity చెందుతున్నాము కనుక అందరమూ అస్వస్థులమే. మనకున్న ఈ అభిమానమే అస్వస్థత.


అసుర సంపత్‌ : సాధకునికి పనికిరాని గుణాలివి. సాధన మార్గంలో అసుర సంపద మనకడ్డు తగులుతుంది. అనాత్మ తాలూకు గుణాలే అసుర గుణాలు. అవి ఎంత పోగైనా మర్గానికి అంతరాయమే. దీనికి బదులు దైవ సంపద పోగు చేసుకుంటే ముందుకు సాగిపోగలం.


అసుర్య : అసురలకు సంబంధించిన అంధకార బంధురమైన లోకాలు ఇవి. ఆత్మ జ్ఞానం లేని కర్మిష్ఠులు, పామరులు చివరకు పోయి చేరే స్థానాలని ఈశావాస్యం చెప్పిన మాట.


అహమ్‌/అహంకార : అహమంటే నేను అని శబ్దార్థం. అలా భావించటమే అహంకారం. నావి అనే దేహాది ఉపాధులతో కలవకుండా భావించగలిగితే ఇది ఆత్మస్వరూపమే. అలాకాక సోపాధికమైతే ఇదే అనాత్మలాగా మారిపోతుంది. కర్తృరూపమైనది అహంకారమైతే సాక్షిరూపమైన చైతన్యమాత్మ. అహంకారానికే కర్తాత్మ అని పేరుపెట్టారు వేదాంతులు. ఇది చిదాభాసుడే గాని కేవల చిద్రూపం కాదు. అంటే జీవుడని అర్థం. ఇలాంటి జీవుడే అసలైన ఆత్మ అని భ్రమించారు పూర్వమీమాంసకులు.


అహంబ్రహ్మాస్మి : ఇది నాలుగు మహావాక్యాలలో చివరిది. తత్త్వమసి ఉపదేశ వాక్యమైతే ఇది అనుభవ వాక్యం. ఈ జీవుడే బ్రహ్మమని దీని అర్థం. జీవుడు బ్రహ్మమైతే బ్రహ్మానికున్న పరిపూర్ణత వీడి కేర్పడుతుంది. అలాగే మరలా బ్రహ్మ అహమస్మి అని అర్థం చెప్పుకోవలసి ఉంది. దీనికి వ్యతిహారమని పేరు. అలా చెప్పుకుంటే జీవునికున్న అపరోక్షత్వం బ్రహ్మానికి సంక్రమిస్తుంది. అప్పుడు పరిపూర్ణ అపరోక్ష బ్రహ్మాత్మానుభవం ఏర్పడుతుంది సాధకుడికి.

Page 16

అద్వైత వేదాంత పరిభాష



అహంగ్రహోపాసన : గ్రహమంటే పట్టుకోవటం. బ్రహ్మస్వరూపాన్ని సత్యజ్ఞాన ఆనందాలనే గుణాలతో చేర్చి అదే నేనని ధ్యానిస్తూ పోవటానికే అహంగ్రహోపాసన అని పేరు.


అహినిర్ల్వయనీ : అహి అంటే సర్పం. నిర్ల్వయనీ అంటే కుబుసం. పాము కుబుసం విడిచిన తరువాత అది తానుగా భావించదు. అలాగే కుబుసం లాంటి శరీరమనే ఉపాధిని దూరం చేసుకొని దాన్ని తన స్వరూపంగా భావించడు జీవన్ముక్తుడు. కనిపిస్తున్నా అది తన ఆభాసే గాని తన స్వరూపం కాదతనికి. ఇది దీని అంతరార్థం.


అహేయ : హేయం కానిది. వదలుకో లేనిది. ఆత్మతత్త్వం. అది మన స్వరూపమే కనుక వదలుకున్నా వదలిపోయే ప్రశ్నలేదు.


అహైతుక : ఏ హేతువూ లేనిది. ప్రపంచానికి పరమాత్మగానీ మరొకటిగానీ కారణం గాదని వాదిస్తారు నాస్తికులు. వారి దృష్టిలో కనిపించే కార్యం తప్ప మూలకారణం లేదు. కనుకనే వారి వాదానికి అహైతుకమని పేరు వచ్చింది.


అక్ష : ఇంద్రియం.Organs. చక్షురాదులైన జ్ఞానేంద్రియాలైనా కావచ్చు పాణిపాదాదులైన కర్మేంద్రియాలైనా కావచ్చు.


అక్షజ : ఇంద్రియ జన్యమైన జ్ఞానం.


అక్షర : క్షరం కానిది. నశించనిది. శాశ్వతమైన Eternal. పరమాత్మ, మాయాశక్తి కూడా అక్షరమే.


అక్షయ : క్షీణించనిది. జ్ఞానోదయమయ్యేవరకూ కర్మ అక్షయమే. అయిన తరువాత జ్ఞానం కూడా అక్షయమే.


అక్షమ : క్షమ అంటే సమర్థం.Capable. Efficient. అక్షమమంటే అసమర్థం. అశక్తం. Incapable.


అక్షిపురుష విద్యా : విద్య అంటే ఇక్కడ ఉపాసన. ఉపనిషత్తులలో ఇలాంటి విద్యలు ఎన్నో వస్తాయి. అందులో ఇది ఒకటి. మానవుడి దక్షిణాక్షిలో పరమాత్మ చైతన్యం బాగా అభివ్యక్తమై కనిపిస్తుందట. ఆ ఉపాధిలో తన స్వరూపాన్ని దర్శిస్తూ తదాకారమైన చిత్తవృత్తితో ధ్యానిస్తూ పోతే తదనుగుణమైన ఫలితం సాధకుడికి లభిస్తుంది. దీనికి అక్షిపురుష విద్య అని పేరు.


అంక : గుర్తు. చిహ్నం. ముద్ర. ప్రాపంచికమైన వాసనలన్నీ అంకములే. సుషుప్తిలో కూడా ఇలాంటి వాసనాంకితమైన మనస్సుతోనే జీవుడు పరమాత్మతో ఏకమవుతున్నాడు. కనుకనే మరలా ఆ వాసనలతోనే తిరిగి వస్తున్నాడు. సుషుప్తిలో ఎలాగో రేపు మరణంలో కూడా ఈ వాసనాంకితమైన మనసు తొలగిపోదు. ఆత్మజ్ఞాన ముదయించినప్పుడే దాని నివృత్తి.


అంగ : శరీరం. అవయవం. సమష్టిలో ఒక భాగం. వ్యష్టి Part.


అంగిరస్‌ : అంగములన్నింటి తాలూకు రసం. సారభూతమైనది. ప్రాణశక్తి అని అర్థం.


అంగాంగిభావ : సమష్టికి వ్యష్టికి ఉన్న పరస్పర సంబంధం Inter relation between whole and its parts. ప్రధాన మంగి అయితే అప్రధానం దానికంగం.


అంజన : అంటటం. ఏదీ అంటనిదైతే అది నిరంజన. ఆత్మ స్వరూపమని అర్థం.


అండ : గ్రుడ్డు.Oval shape. గ్రుడ్డులాంటివి మూడున్నాయి. ఒకటి పిండాండం. ఈ శరీరం. రెండు అండాండం. దీనిచుట్టూ ఉన్న భూగోళం లాంటిది. మూడు బ్రహ్మాండం Macro cosm. ఆకాశం అని అర్థం. ఇవి మూడే చైతన్యానికి ఉపాధులు. Covers. వీటికి లోబడ్డవాడు జీవుడు. పైబడ్డవాడు ఈశ్వరుడు.


అండజ : గ్రుడ్డు నుంచి జన్మించేవి - పక్షులు, సరీసృపాలు.


అంత : కొస, హద్దు ఉరిళీరిశి. జూదీఖి. విజాతీయ భావమెక్కడ ఏర్పడుతుందో అది సజాతీయాని కంతం. సజాతీయ విజాతీయాలు రెండూ లేని దాత్మతత్త్వం. కనుక అది ఎప్పుడూ అనంతమే.


అంతర/అంతరా : లోపల అని అర్థం. Interior. ఎడమని కూడా అర్థమే. 'తే యదంతరా తద్బ్రహ్మ.'


అంతరాళ : రెండు పదార్థాలకు మధ్యనున్న ఖాళీ ప్రదేశం.


అంతఃకరణ/అంతరింద్రియ : Inner organ.  మనస్సు. అంతరంగమన్నా మనస్సే.


అంతరంగ : మనస్సని ఒక అర్థం. మనలోపల మాత్రమే చేసే సాధన కూడా అంతరంగమే. దీనికి బాహ్యంగా జరిగేది బహిరంగ సాధన.


అంతరిత : ఒక భావానికి మరొకటి అడ్డు తగిలితే అది మరుగు పడటం. విజాతీయ వృత్తులు మనసులో ప్రవేశిస్తే సజాతీయమైన బ్రహ్మాకార వృత్తి దానిచేత అంతరితమవుతుంది. eclipsed.


అంతర్యామి : పిండాండంలోనూ, బ్రహ్మాండంలోనూ సర్వత్రా ప్రవేశించి లోపల చోటు చేసుకుని వాటిని అన్నింటిని తన అదుపులో పెట్టుకునే ఈశ్వర చైతన్యం. 'యః పృథివ్యాం తిష్ఠన్‌' అని ఇలా ఎంతో దూరం వర్ణించింది బృహదారణ్యకం. దానికి అంతర్యామి బ్రాహ్మణమని పేరు. The inner controller of all the material world including our bodies and minds. ఈశ్వరుడే అంతర్యామి అంటే.


అంత్యం ప్రమాణం : చివరి ప్రమాణం. Final Proof. బ్రహ్మాకార వృత్తి. దానికి బాధకమైన వృత్తి మరొకటి లేదు గనుక అది అంత్యమైనది.


అంతకాల : అవసాన సమయం. ఆ లోపలే మానవుడు జ్ఞానసాధనకు ఉపక్రమించాలి. ఆ సమయంలో కృషి చేసే అవకాశం లేదు. అంతకు ముందు నుంచి చేసిన సాధన అప్పుడే పరిపాకానికి వస్తుంది. 'అంతకాలేపి మామేవ స్మరన్‌' అని గీతా వచనం.


అంతేవాసి : దగ్గర కూర్చునే వాడని అర్థం. శిష్యులు పూర్వం అరణ్యాలలో ఆచార్యుల దగ్గరగా కూర్చుని బ్రహ్మవిద్యను అభ్యసించేవారట. ఉపనిషత్తనే మాట అలాగే ఏర్పడింది. అతిరహస్యం గనుక దగ్గర కూర్చుని గ్రహించవలసిన కర్తవ్యముంది. అంతేవాసి అంటే అలాంటి రహస్యోపదేశం అందుకునే శిష్య పరమాణువు.


అంధం తమః : కటిక చీకటి అని అర్థం. అలాంటి రౌరవాది నరక లోకాలకు అంధం తమః అని నామకరణం. అజ్ఞానమే నరకమని లక్ష్యార్థం.


అంధ పరంపరాన్యాయ : ఒక గ్రుడ్డివాడిని పట్టుకుని మరొక గ్రుడ్డివాడు ప్రయాణం చేయటం. అలాచేస్తే ఎవడికీ దారి కనపడక ఇద్దరూ నూతిలోనో, గోతిలోనో పడతారు గాని గమ్యం చేరలేరు. కనుక జీవిత గమ్యం చేర్చలేని వితండ వాదాల కన్నిటికీ ఈ సామెత వర్తిస్తుంది.


అంధగజ దృష్టాంత : గ్రుడ్డివాళ్ళు ఏనుగును చూచి వచ్చిన వ్యవహారం. ఎక్కడికక్కడే చూచి అది గజమని భావించినట్టే పరమాత్మను నామరూపాల పరిధికి దించి ఎక్కడికక్కడే పరిమితం చేసి చూచే దృష్టి ఇలాంటిదని, అది సమగ్రం కాదని అద్వైతుల వేళాకోళం.


అంశ : భాగం. తునక అని అర్థం. 'మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః' అని గీత. పరమాత్మ అంశమే జీవాత్మ. ఇది వాస్తవమైన భాగమని ద్వైతులు. వాస్తవం కాదు ఆభాస అని అద్వైతులు అంటారు.


అంశాంశిభావ : అంశానికి అంశికి ఉన్న సంబంధం. జీవజగత్తులు అంశమని ఈశ్వరుడు అంశి అని వైష్ణవుల సిద్ధాంతం. ఇది మాయామయమని అద్వైతుల రాద్ధాంతం.










.....