పూజ గదిలో గంట సేపు భార్య ఉంటే.. అసహనం తో ఊగి పోయే భర్తలు కూడా ఆమె పూజ గదిలో నుండి రాగానే ప్రసన్న వదనంతో చేతులు జోడించి భక్తి భావన తో తన్మయత్వం చెందుతారు...
ఇల్లాలి పూజలకు అంత పవర్ ఉంది !
నిజానికి భర్త అభ్యున్నతితో పాటు, కుటుంబంలో చీకు చింత లేకుండా "కాపాడు తండ్రి" అని భక్తి శ్రద్ధలతో పూజలు చేసే మహిళా మణులు ఉండడం వల్లే కొంత మంది భర్తలు ఎన్ని అసహజ కార్యాలు చేసిన ఆమె పూజలే అతన్ని పుణ్య కార్యాలవైపు నడిపిస్తున్నాయి!
ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటే ఇంట్లో పూజా గదిలో దీపం వెలిగించడం వల్లే!
శుచి శుభ్రత ఇంట్లో పాటించడం ఎలాగో, భక్తితో ఒక అరగంట భగన్నామస్మరణ చేయడం కూడా అందులో భాగమే!
పొద్దున లేవగానే ముఖం కడుక్కోగానే మెక్కడం కాకుండా మొక్కడం ఎలాగో పద్దతి గల ఇల్లాలు భర్తకు, పిల్లలకు నేర్పే మొదటి పాఠం!
ఎంత నాస్తికులైనా స్నానం చేయంది ఆహారం ముట్టరు...
అదేం రోగమో గానీ భార్య ఇంట్లో పూజలు చేస్తున్న పొద్దెక్కదాకా మంచం దిగని పురుష పుంగవులు పాపాల్ని ఆమె భక్తితో "మన్నించు దేవుడా" అని మొక్కుతునే భర్తకు తిట్ల సుప్రభాతం....
కోపమొస్తే రాగి చెంబు తో మొట్టికాయలు వేసే భార్యల వల్ల కూడా ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుని అల్పాహారం తీసుకునే భర్తలు కూడా ఉన్నారండొయ్!!
మనసు ప్రశాంతత కోసం చేసే పూజల్లో మొగ వారి కంటే ఆడవారిదే పై చేయి!!
ముఖులిత హస్తాలతో దేవుణ్ణి మనస్పూర్తిగా ఆరాధించే ఇల్లాలు మొదట్నుంచీ పూజలు వ్రతాలు చేయడం వల్లే... పుణ్యం కొద్దీ పురుషుడు...దానం కొద్దీ బిడ్డలు అనే సూక్తి పుట్టింది!
ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అందరి పనులు విజయవంతం అవుతాయి.
అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు.
పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు, మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి.
ఇంటి గడప కడిగి... పసుపు కుంకుమలతో అలంకరించి... అగరుబత్తి ముట్టించి... ఇల్లంతా ధూపం... నింపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మి కళ వెళ్ళి విరుస్తుంది!
ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలిని మెయింటైన్ చేసే వారి వల్ల చిన్న ఇల్లు - పెద్ద ఇల్లు కూడా కళావిహీనంగా ఉంటాయి!
భర్త కూడా భార్య తో పాటు నిష్టగా పూజలు చేస్తే ఆ ఇంట్లో సర్వ సుఖాలు వెల్లివిరుస్తాయి!!
దేవుని కరుణ చూపమనో, కృప సాధించాలనో, అనుగ్రహం పొందాలనో, కోరికలు తీర్చుకోవాలనో భగవంతుడ్ని ఆశ్రయిస్తాం...గుడికెళ్లి కొబ్బరికాయలు కొట్టి, అష్టోత్తరం చదివించి. పూజలు చేయించి ఆ కోరికలు తీరగానే లేదా తీరకుండానో దేవుణ్ణి మర్చిపోతాం...
ఏదైనా సాధించాలంటే మనిషికి ఆ పనిచేసి తీరాలి అనే పట్టుదల, ఆత్మవిశ్వాసం, తన సామర్థ్యం పై నమ్మకం, చేస్తున్న పని మీద ఇష్టం ఉండాలి.
ఆ పని పూర్తయి, ఫలితం వచ్చే వరకూ వేచిచూసే ఓపిక, మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకునే సహనశక్తి ఉండాలి...
అప్పుడే భక్తి ముక్తి వస్తుంది...
చిత్తం దేవునిపై...మనసు గుడి బయట విడిచిన చెప్పులపై ఉంటే భగవంతుడు మూడో కన్ను తెరుస్తాడు!!
పూజారి వరమివ్వడు!!
సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ దేవుడు కల్పించాడు.
పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది.
చేస్తున్నది పాపమని పెద్దలు నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి.
ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి.
ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది పురాణాలు ఇస్తున్న సారాంశం!!
భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడ్డాయి.
అవి
శ్రవణ భక్తి ,
కీర్తనా భక్తి
స్మరణ భక్తి,
పాదసేవన భక్తి,
అర్చన భక్తి,
వందన భక్తి,
దాస్య భక్తి,
సఖ్య భక్తి,
ఆత్మ నివేదన భక్తి
ఇలా మనం తొమ్మిది రకాల పూజాదులు చేస్తాం!
ప్రతి మనిషి తనకు తెలియకుండానే పై తొమ్మిది రకాల ధ్యానం లో ఉంటారట!
అందువల్లే కాబోలు భారతీయ వివాహ వ్యవస్థలో ఇంకా జీవం ఉట్టి పడుతుంది అలాగే పాపం పుణ్యం కూడా మన మనసును వెంటాడుతూనే ఉంటుంది !!
◆ ◆ ◆
- స్వస్తీ...