పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి

 

              ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం  2.27 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. 


ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం

దీనిని మిగులు తగులు అని అంటారు.


పెద్దగా కంగారు పడవలసిన పని లేదు.  

సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది.


అంటే దీపావళిని  ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి.


అదేవిధంగా పౌర్ణమి కూడా రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే.


ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి.


మరో ముఖ్య విషయం ఏమిటంటే... కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను.


ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా లక్ష్మివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది..


ఆ విధంగా పౌర్ణమి తిధితో, కృత్తిక నక్షత్రం, శుక్రవారం  తెల్లవారుజామున 4.29 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది.


కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 18వ తేదీన లక్ష్మీవారం రాత్రి  మాత్రమే జరుపుకుని తీరాలి.


మరుసటి రోజు అంటే శుక్రవారం రాత్రికి  జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు కృష్ణపక్షం వచ్చేస్తుంది.


కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే.


ఉపవాస నియమం ఉన్న, ఉండాలనుకునే వారు

 మాత్రం 18వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు.


ఉపవాస నియమం లేని వారు

దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 18వ తేదీ రాత్రి లేదా 19వ తేదీ ఉదయం 4.30 గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు.


19వ తేదీ శుక్రవారం కూడాను మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది.


కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 19వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...


అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. 

పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి..

18వ తేదీ లక్ష్మి వారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు.

పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు.

మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. 

తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే. 

నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు.


సర్వే జనాః సుజనోభవంతు

సర్వే సుజనాః సుఖినోభవంతు

ధన్యవాదములు...



- స్వస్తీ...


.