కొన్ని బంధుత్వాలు పుట్టుకతో ఏర్పడతాయి. 

పుట్టగానే తల్లిదండ్రులనే బంధం కలుగుతుంది. 

ఆ ఇంట్లో వాళ్లతో రక్త సంబంధం ఏర్పడుతుంది. 

తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య ఇలాంటి బంధుత్వాలు పుట్టుకతో సహజంగా ఏర్పడతాయి.

కొన్ని బంధాలు మనిషి పెరిగి పెద్దయ్యాక ఏర్పరుచుకుంటాడు.

 స్నేహితులు, జీవిత భాగస్వామి ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. 

అయితే, ఏ బంధం ఎప్పుడు, ఎందుకు ఏర్పడుతుందో ఊహించలేం. 

ఒకసారి ముడిపడిన బంధాన్ని తుంచుకోకుండా ఉండటం మన ప్రవర్తనలోనే ఉంటుంది.

పసితనంలో అమ్మ తప్ప మరో బంధం తెలియదు. 

కాస్త పెద్దయ్యాక నాన్న, అన్నదమ్ములు అన్న స్పృహ కలిగి వారితో అనుబంధం పెరుగుతుంది. 

పెద్దయ్యే కొద్దీ సమాజంలోని రకరకాల వ్యక్తులతో బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. 

అయితే, బంధాలు ఏర్పడటం ఎంత సులభమో, వాటిని నిలుపుకోవడం అంత కష్టం. 

లౌకిక ప్రపంచంలో అందరూ తోడు కోరుకునేవారే! 

కానీ, ఒకానొక దశలో ఏ బంధం కోసం అంతగా ఎదురుచూశారో, అదే బంధాన్ని ప్రతిబంధ కంగా భావిస్తుంటారు. 

అవసరార్థం ఏర్పరుచుకున్న బంధాల్లో ఇలాంటి కప్పదాటు వైఖరులు కనిపి స్తుంటాయి. 

లౌకిక సమాజంలో ఇలాంటి ఉదంతా లు తరచుగా చూస్తూనే ఉంటాం. 

ఆస్తి కోసం సోదర బంధాన్ని వదులుకోవడా నికి సిద్ధపడతారు కొందరు. 

అదే ఆస్తిపాస్తులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని ఆప్యాయంగా పలకరించే సోదరికి కనిపించకుండా ముఖం చాటేసే వాళ్లూ ఉన్నారు.

 అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావించి పేగుబంధాన్ని మరచి వారిని వృద్ధాశ్రమాల్లో పడదోసే ప్రబుద్ధులూ కోకొల్లలు. 

ఏ బంధ మూ శాశ్వతం కాకపోవచ్చు. 

కానీ, భౌతికంగా జీవించి ఉన్నంత కాలం వాటిని కాపాడుకోవడం మానవ ధర్మం.

బంధాలను తెంచుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో వివరించే కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. 

వాలి, సుగ్రీవులు సోదరులు చిన్న అనుమానం ఇద్దరి మధ్యా ఉన్న సోదర బంధాన్ని తుంచివేసింది. 

చివరికి సుగ్రీవుడు అన్నను కోల్పోయాడు. 

రావణుడు తన తమ్ముడు విభీషణుడితో ఉన్న బంధాన్ని తెంచుకున్న తర్వాత లంకకు చేటు దాపురించింది. 

వ్యక్తిగత బంధాలను నిలుపుకోవడం ఎంత ప్రధానమో, ఇతరుల అనుబంధాలనూ గుర్తించడమూ అంతే అవసరం. 

సీతారాముల అనుబంధాన్ని చూసి ఓర్వలేక శూర్పణఖ పన్నిన కుట్ర ఆ దంపతులకు పుట్టెడు కష్టాలు తెచ్చిపెట్టింది. 

కురుక్షేత్ర సంగ్రామానికి బంధాల మధ్య పొడచూపిన వైషమ్యాలే ప్రధాన కారణాలుగా నిలిచాయి. 

పురాణాల్లో బంధాల విలువల గురించిన గాథలు ఎన్నో కనిపి స్తాయి. 

అంధులైన తల్లిదండ్రులపై శ్రవణకుమారుడి భక్తి తరతరాలకూ ఆదర్శం. 

రాముడు-సుగ్రీవుడి మధ్య ఏర్పడిన బంధం లోక కల్యాణానికి కారణమైంది.

 ‘సుగ్రీవ మైత్రి’ అని నేటికీ ఉదహరిస్తుంటారు. 

శ్రీకృష్ణుడు-కుచేలుడి బంధం స్నేహధర్మానికి చుక్కాని వంటిది.

ఇహంలో అనుబంధాలను కాదనుకొని భగవంతుడితో బంధం కొనసాగిస్తా నంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. 

సర్వసంగ పరిత్యాగి అయినా సమాజంతో, ప్రకృతితో సంబంధం కొనసాగిస్తాడు. 

తన తపస్సు సమాజానికి ఉపయోగపడాలని భావిస్తాడు.

ఆత్మీయులను తూలనాడుతూ భగవంతుడికి దండప్రమాణాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

అలాంటి వ్యక్తులతో బంధానికి భగవంతుడు అంగీకరించడు. 

సత్యం, ధర్మం పాటిస్తూ, మానవీయ సంబంధాలను గౌరవించే వ్యక్తులను భగవంతుడు తన బంధుగణంగా భావిస్తాడు. 

ఈ మార్గంలో పయనించిన ఎందరో సామాన్యులు భగవత్‌ బంధువులు అయ్యారు. 

నిష్కళంకమైన స్వామిభక్తి వానరులను శ్రీరాముడి పరివారంలో ప్రముఖులను చేసింది. 

నిర్మలమైన మనసు రేపల్లె గోపబాలురను శ్రీకృష్ణుడికి ఆత్మీయులను చేసింది. 

అందుకే, బంధాలను గౌరవిద్దాం.

భగవంతుడికి బంధువులం అవుదాం.




- స్వస్తీ...