‘ఏదీ మన చేతిలో లేదు.
మనం సంకల్పించవలసిన పని కూడా లేదు.
జరగవలసింది జరుగుతుంది.
మనం నిమిత్తమాత్రులం, అంతా విధి లిఖితం, అన్ని పనులూ ఆ భగవంతుడి చేతిలోనే ఉంటాయి.
ఆయన అనుకోకపోతే ఏవీ కావు’ ఇలా భావించేవారు లోకంలో చాలామంది ఉంటారు.
సంకల్పం లేకపోతే అనుకున్నది జరుగుతుందా?
దానంతట అదే జరుగుతుందా?
జడ చేతన జ్ఞానం లేకపోవడం వల్లే మనిషికి ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి.
నిజానికి ఈ సృష్టి విచిత్రమైంది.
మనం చేసే కర్మ వైచిత్రి వల్ల, దానికి అనుగుణంగా సృష్టి రచన జరిగినట్లు కనిపిస్తుంది.
సృష్టి తర్వాత ప్రళయం.
ప్రళయం తర్వాత సృష్టి.
ఇలా ఏర్పడటానికి కారణం ఎవరు? సృష్టికి, ప్రళయానికి మధ్య లోకస్థితి ఒకటుంది.
దానికి కారణం ఎవరు?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవలసి ఉన్నది.
‘పూర్ణమదః పూర్ణమిదమ్, పూర్ణాత్ పూర్ణముదచ్యతే’ అని ఉపనిషత్ వాక్యం.
‘పూర్ణ పురుషుడైన పరమాత్మ ఈ పూర్ణసృష్టి ఏర్పాటుచేశాడు’ అని దాని అర్థం.
అలాంటప్పుడు, ఈ సృష్టి దానంతట అదే ఏర్పడింది అనే అభిప్రాయం ఎలా కలుగుతుంది?
ఎవరి ప్రమేయం లేకుండా ఒక రాయి శిల్పం అవుతుందా?
ఒక మట్టిముద్ద కుండగా మారుతుందా?
ఎవరైనా రాతిని శిల్పంగా మార్చాలి.
మట్టిని కుండగా చేయాలి.
చేయకపోతే ఏ మార్పూ ఉండదు.
మరి చేయడానికి ముందు సంకల్పం చేసుకోవాలి.
ఆ సంకల్పమే మనతో ఆయా పనులను చేయిస్తుంది.
పరమాత్మ సంకల్పించడం వల్లే ప్రపంచం ఏర్పడిందని యజుర్వేదం చెబుతున్నది.
‘పరమాత్మ పూర్వ సృష్టుల మాదిరిగానే జీవుల ప్రయోజనం కోసం, ఆయా పదార్థాలను సృష్టి చేశాడు.
అందుకుగాను, అతను మొదటగా సంకల్పించాడు’- అని ఈశావాస్య ఉపనిషత్తు స్పష్టం చేసింది.
లోకాలను సృజించాలని పరమాత్మ అనుకున్నాడు కాబట్టే, వాటిని చక్కగా సృష్టించాడని తెలుస్తుంది.
ఈ సృష్టి స్థితి లయలకు వెనుక పరమాత్మ ఉన్నాడనే విశ్వాసం లేనివారు - ప్రపంచం దానంతట అదే ఏర్పడిందనే అభిప్రాయంతో ఉంటారు.
కానీ, జడం ఎప్పుడూ చేతన పదార్థంగా పనిచేయదు.
ఏ వస్తువును తయారు చేయాలన్నా, మన అవసరం ఎలా ఉంటుందో, అలాగే ఈ సృష్టి రచనకు పరమాత్మ అవసరం ఉంది.
పరమాత్మ కూడా ఇది చేయాలని సంకల్పిస్తే అది నామరూపాలను ధరిస్తుంది.
పరమాత్మ ‘సత్’ స్వరూపుడే కాదు, ‘చిత్’ స్వరూపుడు కూడా.
తన జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని నిర్మించాడు.
పరమాత్మ అనుకున్నట్లే జరుగుతుంది.
అందుకు కారణం ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కావడమే.
ఆయన అంతా తెలిసినవాడు.
ఎప్పుడు ఎవరి మనసులో ఎలాంటి భావాలు ఉద్భవిస్తాయో వాటిని కూడా గ్రహించగల ప్రజ్ఞాశాలి.
అందుకే ఆయనను ‘మనీషి’ అని అభివర్ణించింది వేదం.
మరి మనుషులమైన మనం ఏదైనా చేయాలని అనుకున్నదే నెరవేరనప్పుడు, అనుకోనిది ఎలా సఫలమవుతుంది?
పరమాత్మ అనుకుంటే అన్నీ జరిగాయి!
మనం అనుకోనప్పుడు ఏదైనా జరుగుతుందని భావించడానికి వీలు లేదు.
పరమాత్మ అనుకున్నట్లే మనం కూడా అనుకోవాలి.
సంకల్పించుకోవాలి.
అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.
‘తన్మేమనః శివసంకల్పమస్తు’ అంటుంది వేదం.
పరమాత్మవన్నీ శుభ సంకల్పాలే.
అలాంటి సంకల్పాలే మనమూ కలిగి ఉన్నప్పుడు, అనుకున్నవన్నీ సఫలమవుతాయి.
అంతే కానీ, మనమేదీ అనుకోకుండా ఉంటే ఏదీ నెరవేరదు.
మనం చేసేపని విజయవంతం కావాలంటే మొదట శుద్ధమైన మనసుతో సంకల్పించాలి.
తర్వాత ఇంద్రియాలను సంకల్పానికి అనుగుణంగా సమాయత్తం చేయాలి.
ఏకాగ్రత, లక్ష్యశుద్ధి కలిగి ఉండాలి.
శతకకారుడు వేమన చెప్పినట్లు సాధకులం కావాలి.
‘అభ్యాసం కూసువిద్య’ అనే మాటలోని అభ్యాసానికి కార్యనిర్వహణ అని అర్థం.
ఫలం.. పనిమీద ఆధారపడి ఉంది.
పని, కర్తవ్యాన్ని బట్టి ఉంటుంది.
కర్తవ్యం కర్తను బట్టి ఉంటుంది.
కర్త సంకల్పించినప్పుడే ఏదైనా జరుగుతుంది. సంకల్పించకుండా (అనుకోకుండా) ఉంటే జీవితం అంధకారమవుతుంది.
- స్వస్తీ...