ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు.
ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.
వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి
తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు.
వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.
కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు.
వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు.
పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు.
చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు.
విశ్వామిత్రుడు చిన్నబోయాడు.
తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపో ఫలానికి ఒక పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు.
అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.
తపోఫలమా ?
సత్సంగాత్స ఫలమా ?
ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మవద్దకు వెళ్లారు.
ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు.
విష్ణువు.. దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు.
ఆయనేమో.. పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు.
ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు.
వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు..
సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు.
అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు.
తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.
విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపో ఫలాన్ని ధారపోస్తాను.
ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు.
అయితే భూమిలో ఏ చలనం లేదు.
అప్పుడు వశిష్ఠుడు అన్నాడు.
‘ఒక పూట సమయంతో పాటు (దైవికంగా అరగంట అనుకోవచ్చు) మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను.
ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.
వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది.
ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.
అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు.
‘మీ ఎదురుగానే రుజువైంది కదా ! ఏ తపో ఫలం గొప్పదో ? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది ?’ అని ఆదిశేషుడు అన్నాడు.
వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.
చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?!.
ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి.
ఒంటరిగా ఉన్నా అదే పని..
ఏ ఇద్దరు కలిసినా అదే తీరు..
‘చరవాణి’తోనే మాట్లాడుకుంటున్నారు.
చరవాణితోనే గడుపుతున్నారు.
దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది.
ఇక, మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?
- స్వస్తీ...