ఈ రోజుల్లో ప్రజానీకం రెండు పక్షాల మధ్య చిక్కుకొని తపిస్తున్నారు. 

ఒక ప్రక్క శాస్త్ర పక్షం వహించి మన జీవితం శాస్త్ర సమ్మతంగానే వుండాలనే వారు. 

శాస్త్రాలనే మార్చి సంఘ సంస్కరణ చేయాలని వారు రెండవ పక్షం. 

ఈ కాలపు చదువులవల్ల అందరికీ సంఘ సంస్కారామంటే ఒక మోజు ఏర్పడివుంది. 

చదువులిట్లా ఉన్నా, చాలామంది అనుచానంగా వస్తున్న ఆచారాలను ఇంచుమించు పాటిస్తూ వస్తున్నారనే చెప్పాలి. 

మనం ఇంకా పూర్తిగా శాస్త్ర వాసనలు వదులుకోలేదు. 

ఆ వాసనలు సమూహాల్లోనూ, మన అనుదిన చర్యలలోనూ కనబడుతూనే ఉన్నాయి. 


ఈ పురాతన ఆచారాలు ఒకవంక, ఈ కాలపు నాగరికత ఒక వంక మనుష్యులను లాగుతున్నాయి. 

ఈ కాలపు నాగరికత పరిపూర్ణంగా సమ్మతంగా ఉందా అంటే అదీలేదు. 

ఏదో ఒక సంతృప్తి మానవాళిని వెంటాడుతూనే ఉంది. 

పూర్వకాలంలో అనుభవించిన సుఖశాంతులు ఈ కాలంలో లేవని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారు. 


ఈ కాలంలో ధనం జాస్తిగానే చెలామణి అవుతున్నా దానితో బాటు దరిద్రమూ పెనవేసుకునే ఉన్నది. 

అంతా సుభిక్షంగా ఉంది. 

అవసరానికి మించి ధాన్యము పండుతున్నది అని చెప్పుకుంటున్నా, ఎక్కడ చూసినా దిగులు మాత్రం పోవడం లేదు. 

ముందుండిన పూరి గుడిసెలు ఇప్పుడు భవనాలు అయినవి. ఏవో నాలుగు పాత్రలు, ఒక చాప, ఒక పెట్టె, నాలుగు బట్టలు - ఇవీ ఆ కాలంలో ఉండిన ఆస్తిపాస్తులు. 

ఇప్పుడు ఎన్నో వస్తువులున్నా కాని జీవితం సాగడం లేదు. ఇవన్నీ నాగరికత తెచ్చిపెట్టిన సంపదయే.

 కాని ఆనాటి శాంతి మాత్రం ఎక్కడా కనబడడం లేదు. 


పాత ఆచారాల త్రోవలో సుఖంగా ఉందామన్న కోరిక ఉంది. కానీ, నాగరికతను, సంఘ సంస్కారాన్ని వదులుకోవడానికి చాలినంత మనోధర్యం లేదు. 

ఏ వంకపోదామా అని సంశయంలో నట్టాడు మనుష్యుల జీవన విధానం శాస్త్ర విషయాలలో పట్టింపు కొంచము కొంచము సడలుతూ వచ్చిందంటే కడపట, లౌకిక సౌకర్యములను మాత్రం వదిలిపెట్టలేని స్థితి వచ్చి తీరుతుంది“ 


ధర్మ శాస్త్రాలను ఋషులు ఏర్పరిచారు. ఈ కాలంలో తమరు ఋషితుల్యులుగా వున్నారు. కాలానుసారము, శాస్త్రములను మీరు మార్చుకోండి” అని కొందరు సదుద్దేశంతోనా వద్దకు వచ్చి చెప్పడం కద్దు. 

పొలంలో కలుపు తీసినట్లు, కొంత సంఘ సంస్కరణకు ఆస్కారముందని వీరందరూ భావిస్తున్నారు. 

ఇప్పుడు నేను వీరి మాటలు విని, కొన్ని ఆచారాలను కలుపు మొక్కలని పీకి పారేవేస్తే, కొంత కాలానికి ఏవి కలుపు మొక్కలు, ఏవి పైరు, అని తెలియని వ్యవస్థ ఏర్పడి మూలనాశనానికి దారి తీయగలదు. 


ఋషులు ఏర్పరిచిన విధానము, వారి అభిప్రాయానుసారం కాదు. 

ఏ కాలానికీ మర్పులేని ఈశ్వరాజ్ఞననుసరించే వారు వేద విధులను ఏర్పరిచారు. 

అందుచేతనే మనం వీనిని అనుసరిస్తున్నాం. వానిని రక్షణ చేయడమే నా బాధ్యత కాని వానిని మార్చుటకు నాకే విధమైన అధికారము లేదు. శాస్త్ర ప్రకారము ఈ కాలములో నడచుకోవడం సాధ్యం కాదని మనం అనుకోరాదు. 

వ్యాపార వేగంలో వర్ధిల్లిన ఈ కాలపు నాగరికతను వదిలిపెట్టి, మన అవసరాలను తగ్గించుకుంటే, మనం మూలమూలలకు ధనార్జన కోసం పరుగిడవలసిన అవసరముండదు. 


ధనార్జన అనే అశాంతి తొలగిపోతే భగవత్స్మరణకు కావలసినంత అవకాశం ఉంటుంది. 

జీవితంలో నెమ్మది, తృప్తి, సౌఖ్యం తాముగా వస్తాయి.


కర్మానుష్టానాలకు పెద్దగా ద్రవ్యవసరం లేదు. పూజలు ఆడంబరంగా చేయవలసిన అవసరం లేదు. 

నాలుగు తులసి దళాలు, నాలుగు బిల్వపత్రములు ఉంటే చాలు. 

పూజ విధివిధానంగా జరిగిపోతుంది. 

మనకోసం వండుకున్న అన్నమే నైవేద్యానికి చాలు. వివాహమూ, శాస్త్రానుష్టానమే కదా? దానికి ఎంత విరివిగా ఖర్చు చేయాల్సిన వస్తున్నదని అడగవచ్చును. 

కాని ఇప్పుడు వివాహాలలో చేసే ఆడంబరాలు శాస్త్రాలు చెప్పినవి కావు. అన్నిటికి మించి ఖర్చు - వరదక్షిణ ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు. వరదక్షాణ అడగడం అశాస్త్రీయమే, శాస్త్రానుష్టానాలకు ద్రవ్యం అవసరం అయ్యుంటే, శాస్త్రం ఒక్క ధనికులే అనుసరించగలరు. 

మన శాస్త్రకర్తల ఉద్దేశం అది కాదు. శాస్త్రానుష్టానాలు బీదవారు, ధనికులు అని కాక, సర్వులకూ క్షేమం కలగాలని నిర్దేశించబడినవి. 


ధర్మార్ధ కామమోక్షములనేవి చతుర్విధ పురుషార్థములు. ఈ పురుషార్థములలో మనం కామ (కోరికలు) పురుషార్థానికే ప్రాముఖ్యం ఇస్తున్నాం.

 దీనిని మనం మార్చుకొని తగినంత కాలము ధర్మ పురుషార్థానికై వెచ్చించాలి. 

సామాన్య జీవనమునకు మనం అలవాటు పడితే పదార్థలాభం కోసం పరుగులిడవలసిన అవసరం లేదు. అప్పుడు ధర్మాచరణ వలన్ కలిగే అనంత సౌఖ్యానికి మనందరమూ భాగస్వాములగుటకు వీలౌతుంది.


ఒక విధంగా చూస్తే మన మతానికి ఇట్టి శోచనీయ స్థితి కలుగడానికి పాశ్చాత్యులు ఈ దేశంలో ప్రవేశపెట్టిన విద్యావిధానమే కారణం అనాలి. 

ఇతర దేశాలలో వారి వారి విద్యా విధానానికి, వారి వారి మతాలకూ భేదాభిప్రాయాలు లేవు. మన దేశంలో అట్లుకాక, విద్యా విధానాలలో మత ప్రసక్తే లేకపోయింది. 

జీవనోపాయం కోసం పాశ్చాత్యులు ప్రారంభించిన విద్యా విధానమే మన ప్రజలు పాటించవలసి వచ్చింది. 

ఆ కారణంగా శైశవావస్థలోనే విద్యార్థులకు తమ తమ మతాచారముల పరిజ్ఞానం కలిగే అవకాశం లేకపోయింది. శాస్త్రముల ఉద్దేశమేమిటో తెలియకపోవటం చేత సంఘాన్ని సంస్కరించాలన్న ఉబలాటం ఎక్కువ శాస్త్ర విధానాలను వారి వారి చిత్తానుసారం మార్చడానికి ప్రయత్నించసాగారు. 


మన ఆచారాలు మూఢనమ్మకలాను వర్ధిల్లచేసేటట్టుగా వున్నాయన్న అభిప్రాయం బాల్యంలోనే వారికి ఏర్పడసాగింది. ఆస్తిక్యం లోపించింది. 

ఇట్టి సందర్బంలో వీరికి మన మతానుష్టానాలపై శ్రద్ధా గౌరవం ఎట్లా కలిగించేది? అందుచేత పెద్దలయిన వారు వారి సంతతికి చిన్నతనంలోనే ఆస్తిక్యం కలిగేటట్లు, మన శాస్త్రాలలో విశ్వాసం ఉదయించేటట్లూ చేయడానికి పూనుకోవాలి. 


అతీంద్రియ విజ్ఞాన సంపన్నులైన మన ఋషులు, ప్రత్యక్షానుభవ పూర్వకంగా ప్రసాదించిన గ్రంధములు మన ఆత్మక్షేమార్థం కోసం ఉద్దేశించినవన్న జ్ఞానం మనం మన పిల్లలకు కలుగజేయాలి. 

ఈ గ్రంధాలు ఇహలోక సౌఖ్యము, సామాజిక ప్రయోజనమూ, కలుగజేయగలవన్న విశ్వాసం వారిలో కలిగించాలి. 


అప్పుడే ప్రజలలో మత విశ్వాసం ప్రబలి సనాతన మతాన్ని సదాచారాలను అనుష్టించగల అవకాశం ఏర్పడగలదు.





- స్వస్తీ...


.