క్షణకాలంలోనే పెనుతుఫానులు పుట్టుకొస్తాయి...

ప్రతిబంధకాలు తెగిపోతాయి!!...

అంతా అయిపోతుంది...

కాలం స్తంభిస్తుంది...

శూన్యం చుట్టేస్తుంది...

అంతటా అంతరాయం ఏర్పడుతుంది!!...


మెదడులో మేకులు... 

గుండెలో బాకులు...

చూపుల్లో ఎన్నెన్నో హవభావాలు!!...

మన్ను..మిన్ను ఏకమై...

జనం మనసులో 

రణం మొదలవుతుంది!!...

అగాధాలలో చిక్కుకుంటారు...

అంతస్తులు కూలిపోతాయి...

పెరిగిన ఆస్తులు అంతమవుతాయి!!...

చిరునామాలు చిట్లిపోతాయి...

మనిషి మాయమవుతాడు!!...


విషాద ఉషోదయం

ఎన్నెన్ని సత్యాల్ని... 

ఆవిష్కరిస్తుంది!!

సమస్తం క్షణాల్లోనే...

విశ్వమంతా క్షణ కాలంలోనే... 

ఎన్నెన్నో సంఘటనలు జరిగిపోతాయి!!...

రెప్పపాటులోనే తప్పులు జరిగిపోతాయి.... 

రేపటికంటూ ఓ రూపం ఉండదు!!...


అపవాదాలెన్నో...అభియోగాలెన్నో!!

ఉద్వేగాలెన్నో...ఉద్రేకాలెన్నో!!

మానవత్వాన్ని మనసులోనే చంపేస్తారు...

వేదనలు నిండిన వాదనలు పుట్టుకొస్తాయి!!...

మనిషితో ముడివేసుకున్న 

మనసు విడిపోతుంది...

ప్రేమానుబంధాలు తెగిపోతాయి...

ప్రతి అవకాశం చేయి జారిపోతుంది!!...


సత్యం..అసత్యం,వాస్తవం..అవాస్తవం

ఎన్నెన్ని నిజాల్ని నిలుపుతాయో!!

ఒక క్షణంలోనే జరిగిపోతాయి...

నిత్యం మనిషి ఓ ముళ్ళకంచె మీద

నడుస్తాడు కళ్ళున్న కబోదిలా!!...

ఈ వ్యవస్తంతా అనంత రహస్యాలతో

ప్రయాసలతో కూడిన పరుగులే!!...

అనంతఊహల్లో కొట్టుకుపోతున్నారు..

నిప్పులగుండంలో పడిపోతున్నారు!!..

ఇప్పుడు టర్కీ అల్లాడిపోతుంది

పుడమికి కోపం వచ్చింది...


అందుకే లక్షణమైన క్షణాన్ని

ఆత్మతో అంతరాత్మతో 

విలక్షణంగా మార్చుకోవాలి!!...

ఎదుగుదలలో కొంత ఒదిగి 

ప్రయాణం చేయాలి!!... 

అకుంఠిత మనోబలానికి

అనుకున్న లక్ష్యసాధనకు

ఆత్మవిశ్వాసమే అసలైన సూత్రం!!...

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే

ఉన్నతమైన లక్షణాలు ఉండాలి!!...

అన్నిటికీ ఉక్కు సంకల్పబలమే కావాలి!!...




- స్వస్తీ...



.