పులిహోర !! ( Tiger Rice )


ముంగిట మామిడాకులు 

వంటింట పులిహోర గుబాళింపులు చాలు . . .

 పండగో,  శుభకార్యమో ! 

వచ్చిందంటానికి గుర్తుగా. . .


శ్రావణ మాసం, ఈ రోజు తో గణపతి నవరాత్రులు అయిపోగానే దిగులు. . . 


మళ్ళీ ప్రసాదాల రూపంలో పులిహోర కోసం శరన్నవరాత్రులు దాకా ఆగాలి కదా అని !!


ఆంధ్రులు గర్వించే వంటకం పులిహోర . . .

అన్నిహక్కులూ ఆంధ్రులవే. . . 

పేటెంట్ తీసుకున్నారో ? ? లేదో ? ? తెలియదు. . .


ఇప్పుడంటే ఈ పులిహోర "వేరియెంట్స్" మార్చుకుంటూ రకరకాలుగా వచ్చాయి కానీ నా చిన్నప్పుడు రెండే రకాలు.. 


అవి నిమ్మ పులిహోర, 

చింతపండు పులిహోర. . .


చింతపండు పులిహోరతో పోలిస్తే 

నిమ్మ పులిహోర లో హడావుడి తక్కువ.


రవ్వ పులిహోర అని ఉంటుంది గానీ! 

వీటి సరసన నిలబడే స్థాయి కాదు.


 దానికి ఆదరణ కూడా తక్కువనే చెప్పాలి.


" ఏదో మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు!"


ఇక రాత్రి అన్నం మిగిలితే పొద్దున మతలబు చేసి 

నిమ్మ పులిహోరగా మార్చి 

టిఫిన్ గా పిల్లలకి పెట్టి 

చేతులు దులుపుకునే తల్లులు కోకొల్లలు. . .

అలా చేసింది వాసి, రాశి లో నాసి అనే చెప్పాలి.


అదే అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండి 

పులిహోర చేసి చూడండి.. .

ఆ మజా వేరు. . .


నిమ్మ పులిహోర లో 

ఆ పలచని పసుపు కాంతి నీరెండలా మెరిస్తూ 

లేత యవ్వన కన్య లా ఉంటే . . .

 

చింతపండు పులిహోర 

ఇంత పసుపు పట్టించి 

స్నానం చేసి గుప్త 

గాంభీర్యాన్ని పోగేసుకున్న 

పూర్ణ ముత్తయిదువులా ఉంటుంది. . .


నాకు బాగా గుర్తు. . . 

ఓ రోజు స్కూల్ నుంచి రాగానే వాకిట్లోకి 

తిరగమాత గుబాళింపు వచ్చింది.


" అమ్మ నీ చేతి తాలింపు కమ్మదనము భరత దేశమున గుమ గుమ పరిమళించె ... " 

అని కరుణశ్రీ గారి పద్యం మా అమ్మ పాడుతోంది. 


పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళితే 

అమ్మ చీర కొంగుకి పసుపు ఆంటి ఉంది. 


కొత్త చీర కొనుక్కున్నావా?? 

అని కొంగుని పట్టుకు అడిగితే 

అమ్మ నవ్వి పులిహోర చేస్తున్నా రా!! 


పసుపు చేతుల్తో చెంగు తుడిచా !! అంటింది కాబోలు !! అంది.


ఆ పసుపు కొంగునిండా తిరగమాత సువాసనే.. . 


అది మొహాన కప్పుకున్నప్పుడు 

నాకు తిరుమల శ్రీవారి మేల్ చాట్ వస్త్రం కప్పుకున్న అనుభూతి.


సాధారణంగా మిగిలిన టిఫిన్లన్నీ ఒక దారి అయితే


పులిహోర ఒకటీ వేరే. . .

ఇంట్లో వారినే కాకుండా పనిమనిషి, చాకలి వంటి వారిని కూడా 

తినే సభ్యుల్లో లెక్కచేర్చాలి. . . 

లేదంటే ఆనక ఇబ్బందులు. . .


మూడు పూట్లా ఇదే తినే కడుపులు

మూడ్రోజులూ తినే గడపలు కూడా ఉన్నాయి. . .


టిఫిన్గా తిన్నదే కాక కారేజ్ బాక్స్ లోకి, 

నాన్నగారు ట్రైన్ లోకి. . . 

ఇలా అందరి మోజు తీరాలంటే 

భారీ మొత్తంలో చేయాల్సి ఉంటుంది.


పులిహోరలో 

కేవలం తిరగమాత ఉంటే అధమశ్రేణి, 

పల్లీలుంటే మధ్యమశ్రేణి, 

జీడిపప్పు ఉంటే ఉన్నత శ్రేణి

జీడిపప్పు గుళ్లు ఉంటే ఎగువ ఉన్నతశ్రేణి 

కింద ఆదాయపు పన్ను శాఖ వారు గుర్తించవచ్చు.


ఇంట్లో బాచిపీట వేసుకుని లుంగీ కట్టి 

అరిటాకులో తిన్న తృప్తి తో ఏదీ పోల్చలేము. 


ఒక పంటికింద చింతపండు లో ఊరిన పచ్చిమిర్చి, 

మరో పంటి కింద తాలింపు చేరిన ఎండుమిర్చి 

నములుతుంటే మనసు "ద్విపద" కావ్యం రాస్తున్నట్టే !!


పులిహోర అంటే పులకరించని మనసుంటుందా??

 అనుమానమే !!


రేపు పులిహోర అనగా నిద్ర పట్టని రాత్రులున్నాయి


పులిహోరలో నూనె బాగా పడాలి. . .


 చూస్తుంటే అది మెరవాలి.. .


తిన్న మన కళ్ళు అంతే మెరవాలి. . .


అలా పెద్ద బేసిన్ నిండా పులిహోర తయారు చేసి పరిస్తే చూడండీ!!!.


అసలు శ్రావణ శుక్రవారం పులిహోర బాగా కుదరటమే

 మన భక్తికి పరీక్ష అని జెప్పచ్చు.


శ్రావణం, 

దసరా రోజుల్లో ఈ పులిహోర 

నాలుగైదు గృహాల నుంచి 

ప్రసాదాల రూపంలో వస్తూ ఉంటుంది.


ఇక్కడే సాంకేతిక సమస్య నాకు!!


ఎవరిది ఏపులిహోర ?? అని గుర్తుంచుకోవడం 

వాళ్ళ బాక్స్ మళ్ళీ వాళ్ళకి అందచెయ్యడం, 

 ఇత్యాది బాధ్యతలు చాలా ఉంటాయి. . .


అలా పులిహోర తినే ప్రదేశాలు కూడా 

పులిహోర రుచికి సమన్వయమై 

ఒక్కో అనుభూతిని ప్రసాదిస్తాయి. 


ఉదాహరణకి ట్రైన్లో వింధ్య గుహల్లోనుంచి

 ఏ ఢిల్లీ నో వెళ్తు మాంచి జోరు మీదుండగా 

ఊగుతూ పులిహోర తినడం ఒక అనుభవమయితే, 


కార్తీకంలో పంచారామాల దర్శనం 

అప్పుడు మంచు పడుతుండగా

 పొలాల మధ్య ఏ చిన్న ఆలయంలోనో తినడం మరో అనుభూతి. . .


స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడి ముబ్బడిగా పెరిగే

 ఏకైక వంటకం ఇదొక్కటే అనుకుంటా!


ఇక తిరుమలలో దర్శనం అయ్యి వస్తుంటే 

ఉచిత ప్రసాదం ఏమి పెడతారో!! అని టెన్షన్. . .

లడ్డూ, పరమాన్నం అయితే . . .


పులిహోర అయితే మాత్రం! ...

 ఆ దొన్నె ఏమూలకి ? 

దొన్నె సైజ్ పెంచరు సరికదా !! రెండో దొన్నె ఇవ్వరు. . .


దద్ధోజనం, 

కట్టెపొంగలి 

లాంటివి దొన్నెల్లో పెట్టినా, 

పులిహోరకు మాత్రం దొన్నె బదులు గిన్నె ఇవ్వాలి అని నా అభిప్రాయం. . .

ఇక ఖాళీ అయిన గంగాళాల గోడలకు అతుక్కుపోయిన జీడిపప్పులు వేలాడే చంద్రవంకల్లా అగుపిస్తుంటే.. .

 అన్ని జీడిపప్పులు వృథాయేనా !! అని బాధ.


ఏది ఏమైనా అరసవిల్లి నుంచి అయినవిల్లి వరకు అన్ని పులిహోరలూ ఒక ఎత్తైతే తిరుమల పులిహోర మరో ఎత్తు. . . 

నేతి పులిహోర బహుశా నాకు తెలిసి చేసే ఆలయం 


తిరుమలే అనుకుంటా !!


ఆ రుచి అందరకూ నచ్ఛకపోవచ్చు. . .

ఆ మిరియాలు, ఘాటైన ఆవ ముఖ్యంగా ఆంధ్రులకు!!


కవిత్వాన్ని ఎందరు ఆస్వాదించగలరు ?? 

దాని విలువదానిదే !! 

అలాగే తిరుమల పులిహోర కూడా.

అసలు స్వామి వారికి నచ్చింది అండీ. . . అది చాలు!!


ఇంతకీ పులిహోర, 

భోజనమా!! 

ఫలహారమా!! అన్నది 

నన్ను చాలా కాలం గా వేధిస్తున్న ప్రశ్న??


కొందరు పరగడుపున ఇంత పెరుగేసి కలిపి భోజనంలాగా స్వీకరించి 


ఇక ఆరోజుకి ఇంకేమీ ముట్టని వారుంటారు.. .

 అదేమిటంటే!! 

పులిహోర, పెరుగు కలయిక మామూలనుకుంటున్నారా?? 


రెండు అగ్రరాజ్యాల భేటీ ... మోదీజీ, బైడెన్ కలయిక లాంటిది.. 

కడుపులో దండిగా పడుంటుంది అంటారు. . .


కొందరు మా ఇంట్లో ఉదయం పులిహోర టిఫిన్ అంటూండగా


మరికొందరు ఇవ్వాళ ఉపవాసం, 

ఫలహారం మాత్రమే అని "పులిహోర తప్ప" అని షరతు పెడతారు. . .

అంటే పులిహోర ప్రభావం చూడండి!! ... 


కొందరి దృష్టిలో ఫలహారం 

మరికొందరి దృష్టిలో అది భోజన సమానం. . .


ఇడ్లీ/ దోసెలకు కానీ పూరీ/వడ మరే ఇతర టిఫిన్ కానీ పులిహోరకి లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు. . .


నాకు తెలిసి మిగిలిన టిఫిన్స్ మాట ఎలా ఉన్నా 

పులిహోర మాత్రం స్నానం చేసి కలిపే మహిళలే ఇప్పటికీ మెజారిటీ. .  .


అలాగే అది సాధారణ టిఫిన్ గా తీసుకొచ్చినప్పటికీ

 అప్రయత్నంగా కళ్లకద్దుకొని తినడం సహజ ప్రవృత్తి. . .

అంటే ఆ పులిహోర పట్ల ఏదో తెలియని ఒక

"అసంకల్పిత పవిత్ర భావన" అలా పురిగొల్పుతుందేమో!!


అందుకే నేను

" అన్నం పర బ్రహ్మమయితే "

పులిహోర  " ఇహ బ్రహ్మం " అంటాను.!!





-  స్వస్తీ. . . 



.