అమృతం కోసం చేస్తే
క్షీరసాగర మధనం

ముందుగా వచ్చిందట
గరళం . . .

దేవదానవుల్లో
సృష్టిస్తూ గందరగోళం . . .

నురగలు కక్కుతూ ఉప్పొంగుతున్న
హాలాహలం . . .

పదునాలుగు లోకాల్లో
కోలాహలం . . .

ఇది వినాశానికేనా . . .

సురాసురుల పంతం
సృష్టి అంతానికేనా . . .

అంతటి నారాయణుడే
అయోమయానికి గురైన వేళ

విధాత మోమునే తప్పిన కళ

ఓ వైపు పిశాచాల ఊళ . . .

ఇది విలయమే . . .

కోరి తెచ్చుకున్న ప్రళయమే . . .

సృష్టి మొత్తం
ఎవరికి మొక్కేది . . .  !

లోకానికి దిక్కేది. . ! ?

హరి సైతం హరహరా
నీవు వినా రక్షకుడెవ్వరు . . .

అన్న విపత్కర తరుణంలో

అచట మెరిసినాడంట ముక్కంటి . . .

ప్రళయకాల రుద్రుడై . . .

ఆదుకునే వీరభద్రుడై . . .

పొగలు కక్కే విషాన్ని
అనిమిషులంతా వీక్షిస్తుండగా

నిమేష మాత్రమున
పానము
చేసినాడు సాంబుడు

గంధర్వులు గానము చేస్తుండగా . . .

అలా చేసి శివయ్య
తానుగా ఆవిష్కరించాడు
ఓ పురాణం

మారుమోగే శివపురాణం !

గొంతులో దిగిన గరళం
అంతటి శివయ్యనే
చేస్తే ఉక్కిరిబిక్కిరి . . .

లోకాలు అచ్చెరువొంద
గొంతులోనే బంధించి
గళం వర్ణం మారగా . . .

నీలకంఠుడై . . .

అలాగే శివయ్య సేదదీరగా
నిదురలేని ఆ రాత్రి . . .

జగతికి అయింది శివరాత్రి . .  

ముక్కంటి మల్లె జాగరం
చేసి తరించింది ధరిత్రి . . . !

సకలచరాచరులను
కల్లోల పరచిన ఆ నిశీధిలో

ఉప్పొంగి జలధి
శివయ్య పాదాలు కడిగి..
చూస్తుండగా దేవదానవులు
చేష్టలుడిగి..
పులకించి  చేసిందట
పరమేశ్వర స్తుతి..
ఆపద్భాందవుని సన్నుతి!

అదే రాత్రి జగములు అబ్బురపడగా
జరిగిన
శివతాండవం..
శివుని వైభవం..
త్రినేత్రునికే సంభవం..
జగద్రక్షకుని పదనర్తనం
వీక్షకులకు సరికొత్త అనుభవం..
పరమేశ్వర ప్రాభవం..
కొన్ని పురాణాల మేర
లింగోద్భవం..
భక్తకోటిని మురిపించే
దివ్యాకారం సముద్భవం..!

విలయాన్ని
తప్పించిన లయం..
మురిసింది
హిమాలయం..
ఊరూరా శివాలయం..
శివనామస్తుతితో
ప్రతి ఇల్లు అయింది
దేవాలయం..
ఆ ముక్కంటి కొలువే
మన హృదయాలయం!!

 శుభాకాంక్షలతో..